మా నవ రాత్రి యాత్ర -3
అలహా బాద్ విశేషాలు
క్రీ పూ.644లో చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ హర్ష చక్రవర్తి పరిపాలనాకాలం లో ప్రయాగ సందర్శించాడు .ప్రయాగ లో ఉన్న రెండు నదుల మధ్య ప్రదేశం నాలుగు మైళ్ళ పరిధిలో వ్యాపించి ఉందన్నాడు .నగరం లో రెండు మతాలున్నాయని ,అనేక దేవాలయాలు చంపక్ వాటిక లో పెద్ద స్తూపం ఉందని ,దాన్ని అశోకుడు నిర్మించాడని తెలియ బరచాడు .మానవ జన్మ చరితార్ధత ప్రయాగ లోనే సాధ్యమని ఇక్కడ మరణిస్తే పునర్జన్మ ఉండదనే విశ్వాసం ఉందని రాశాడు .1575లో అక్బర్ నదీ ప్రయాణం చేసి ప్రయాగ చేరాడు .అప్పుడే ప్రయాగకు ‘’అలహా బాద్ ‘’అనే కొత్త పేరు అక్బర్ పెట్టాడు .తన కొత్త మతం ‘’దీన్ ఇలాహి ‘’ఇక్కడే పుట్టింది .కనుక అలహా బాద్ పేరు సార్ధక నామ మయింది . అందుకే హిందీలో ‘’ఇలహా బాద్ ‘’అని రాస్తారు . మొగలాయీ సామ్రాజ్య విచ్చిన్నం తో మరాఠా రాజులు దీన్ని స్వాధీన పరచుకొని ‘’అవధ వంశ ‘’పాలన సాగించారు లక్నో రాజ్యం ఏర్పరచారు .కాని అవధ లో అలహా బాద్ భాగం గానే ఉండేది .లక్నో నవాబులు అవధ కీర్తిని పెంచలేక పోయారు .చివరికి 1801బ్రిటిష్ వారి వశమయింది .ఆంగ్లేయులు ‘’ఆగ్రా అవద్ సంయుక్త రాష్ట్రాలు ‘’పేర కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశారు .దీనికి అలహా బాద్ రాజధాని .
బ్రిటిష్ వారిని దేశం నుంచి సాగనంపటానికిస్వతంత్ర సంగ్రామం లో అలహా బాద్ ముఖ్య కేంద్రమే అయింది .1857మొదటి స్వాతంత్ర సమరం లో అలహాబాద్ ప్రధాన పాత్ర పోషించింది .అనేక స్వతంత్ర యోధులకు ఆవాస భూమి అయింది .చాలా తిరుగు బాట్లు ఇక్కడే పురుడు పోసుకోన్నాయి .కాంగ్రెస్ పార్టీ ప్రాభవం లోకి వచ్చినప్పుడు ఎన్నో కాంగ్రెస్ మహా సభలు అలహా బాద్ లోనే జరిగాయి .గొప్ప యాత్రీక కేంద్రమే కాక అలహా బాద్ రాజకీయ పోరాట యాత్రిక కేంద్రమూ అయింది .దీనికి ఉదాహరణలే ‘’ఆనంద భవనం ‘’,ఆల్ఫ్రెడ్ పార్కులు .స్వాతంత్ర సాధన తరువాత కూడా అలహా బాద్ ప్రాముఖ్యత తగ్గ లేదు .కారణం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ ఇక్కడి పూల్ పూర్ లోక్ సభా నియోజక వర్గం నుంచే ఎన్నికయ్యాడు .భరద్వాజ ఆశ్రమానికి సమీపం లో ఉన్న ఆనంద భవన్ ఉంది .నెహ్రు తర్వాతా లాల్ బహదూర్ శాస్త్రి అలహా బాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచే గెలిఛి ప్రధాని అయ్యారు. తరువాత ఇందిరా గాంధి ,రాజీవ్ ,వి.పి సింగ్ ,ఇక్కడి నుంచే ఎన్నికై ప్రదానులయ్యారు .రాజకీయాలతో బాటు అనేక కార్యక్రమాలకు అలహా బాద్ కేంద్రం గా ఉంది గొప్ప. విద్య కేంద్రం గా గుర్తింపు పొందింది .ఫిరాఖ్ గోరఖ్ పూరి, హరి వంశ రాయ్ బచన్ ,మహాదేవ వర్మ రాం కుమార్ వర్మా సచ్చిదానంద హీరానంద వాత్సాయన్ (ఆగే) ఉపేంద్ర నాద్(అశ్క్) ,భగవతీ చరణ్ వర్మా ,ఉపేంద్ర నాద సూర్య కాంత త్రిపాఠీ(నిరాలా ) వంటి కవులు పండితులు తమ సాహితీ విహార భూమి గా అలహా బాద్ నే ఎంచుకొన్నారు .
సంగమ క్షేత్రం ఒడ్డున అక్బర్ కట్టించిన పెద్ద కోట ఉంది .ఇప్పుడు సైన్యం అధీనం లో ఉంది .కోట లో అక్బర్ స్థంభం ఉంది .లోపల ‘’పాతాళ పురి ‘’అనే ఆలయం ఉన్నది అక్కడ అక్షయ వట వృక్షం చూదాల్సినది .దాని వ్రేళ్ళు చాలా లోతులో ఉంటాయి చూడటానికి అనుమతించరు .సరస్వతి ఘాట్ యమునా నది ఒడ్డున ఉంటుంది .సాయం సంధ్యలో దీని దర్శనం మనోహరం .ఇక్కడే ఉన్న పురాతాన ‘’మన్ కామేశ్వర దేవాలయం ‘’దర్శించాలి .ఈ స్వామిని అర్చిస్తే మనసులోని కోరికలు తీరుతాయని విశ్వాసం .చంద్ర శేఖర ఆజాద్ పార్క్ ఆ త్యాగ ధనుడి పేరు మీద నెలకొల్పారు ఇక్కడే ఆయన బ్రిటిష్ తుపాకీ దెబ్బలకు అసువులర్పించి వీర మరణం పొందాడు .స్మ్రుతి చిహ్నం యేర్పరచారు .
భరద్వాజ ఆశ్రమం
త్రేతాయుగం లో శ్రీరాముడు ,భరతుడు భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించి మహర్షి ఆశీస్సులు పొందారు .ఈ ఆశ్రమం లో అనేక మంది మునులు శిష్యులు ఉంది ఆయన ఆతిధ్యాన్ని పొందారు ఇక్కడ ఉన్నత విద్యా కేంద్రాన్ని ఏర్పరచాలని ప్రభుత్వం ఆలోచన లో ఉంది .గంగా నది ఒడ్డున ‘’శివ కూటి ‘’దేవాలయం ఉన్నది. నారాయణి ఆశ్రమమూ చూడ దగినదే .గంగ ఒడ్డున ఝూన్సి అనే ప్రదేశం ఉంది ఇదే పూర్వపు ‘’ప్రతిష్టాన పురం ‘’.ఇక్కడ అనేక ప్రాచీన ఆలయాలున్నాయి .శివాలయం, హంసాలయం ‘’సముద్ర కూపం’’ ఇక్కడే ఉన్నాయి .శ్రుంగ వేర పురం ఇక్కడే ఉంది.ఇదే గుహుడి రాజ దాని . ఇక్కడే ఋష్య శ్రుంగా మహర్షి ఉండేవారు .ఆయన సమాధి కూడా చూడచ్చు .మహా భారత కాలం లోని లక్క ఇల్లు అనే లాక్షా గృహం ఇక్కడి త్రవ్వకాలలో బయట పడింది .ఇది అలహాబాద్ కు యాభై కిలో మీటర్ల దూరం లో ఉంది .
స్వరాజ్య భవనం
1899లో మోతీలాల్ నెహ్రు దీన్ని కొన్నాడు .అభివృద్ధి చేసి ‘’ఆనంద భవన్ ‘’అని పేరు పెట్టాడు .1927లో నెహ్రు కుటుంబం ఇక్కడ స్తిర పడింది .ఇది స్వతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్ర పోషించింది .మోతీలాల్ ఇక్కడే కోర్టులో వకీలుగా ఉన్నాడు. తర్వాతా జవహర్ ఉన్నాడు .మ్యూజియం ఉంది అనేక ప్రముఖులు ఇక్కడే సమావేశమై నిర్ణయాలు తీసుకొనే వారు .ఆనంద భవన్ కు జవహర్ లాల్ 1926లో సంకుస్తాపన చేశాడు .ఇందిరా గాంధి ఈ బృహత్తర భవన సముదాయాన్ని1970లో జాతికి అంకితం చేసింది .అలహా బాద్ కోర్టు చూడ తగినది .
అలహా బాద్ విశ్వ విద్యాలయం
దేశీయ య విశ్వ విద్యాలయాలలో అలహా బాద్ యూని వర్సిటీ ఒక ప్రత్యెక గుర్తింపు పొందింది ‘’.తూర్పు దేశ ఆక్స్ ఫర్ద్ యూని వర్సిటి “’అని పేరు పొందింది .1887లో దీన్ని ఆల్ఫ్రెడ్ లాయల్ ప్రేరణ వలన స్థాపించారు .ప్రముఖ బ్రిటిష్ ఆర్కి టెక్ట్ ఎమర్సన్ దీన్ని డిజైన్ చేశాడు ఇక్కడే పూర్వ భరద్వాజ ఆశ్రమం ఉండేది .ఈ యూని వర్సిటి ని .1873లో లార్డ్ నార్త్ బ్రూక్ ప్రారంభించాడు .దీని విద్యార్ధులు చాలా మంది స్వాతంత్ర సమరం లో పోరాడి చరిత్ర సృష్టించారు .అందులో ప్రముఖులు యెన్ డి తివారి ,హేమవటీ నందన్ బహుగుణ వంటివారున్నారు .
అలహా బాద్ కు అరవై కిలో మీటర్లలో కౌశాంబి ఉంది బుద్ధుడి కాలం లో పదహారు జిల్లాలకు ముఖ్య కేంద్రం యమునా ఒడ్డున ఉన్నది .బౌద్ద, జైన మతాలూ విస్తరించిన ప్రదేశం .ఉదయనుడు గొప్ప పరిపాలనా సమర్ధుడని పించుకొన్నాడు త్రావ్వకాలలో అశోక స్థంభం ,మౌర్య సామ్రాజ్య నివాస గృహాలు ,గోశింఠ రామ నివాసం ,ఒక రాజ భవన ము వంటి అయిదు పెద్ద చిహ్నాలు బయట పడ్డాయి .కౌశాంబి ఇటుక లతో గృహ నిర్మాణాలు చేసుకొనే వారు .దిగంబర జైన దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది
అలహా బాద్ కు డెబ్భై కిలో మీటర్ల లో ‘’కారా ‘’అనే చోటు మౌర్య సామ్రాజ్య కాలం లో ప్రసిద్ధి చెందింది మౌర్యుల ప్రాంతీయ రాజ దాని గా ఉండేది .ఇక్కడ ఇప్పుడు ‘’మాతా సీతలా దేవి ‘’ఆలయం ప్రసిద్ధమైనది .ఈమెనే ‘’కారా దేవి’’ అంటారు .అందుకే కరా అనే పేరు వచ్చింది .ప్రముఖ కవి మాలుక్ దాస్ సమాధి ఇక్కడే ఉన్నది .సంగమ క్షేత్రానికి అరిల్ అనే ఈ నాటి ప్రదేశం ‘’అలార్క పురి ‘’గా ప్రసిద్ద్ధం కాశీ రాజు అలర్కుడు బ్రాహ్మణుల కోసం నేత్రాలను దానం చేశాడు .అందుకే ఆ పేరొచ్చింది .వల్లభా చార్య మతానికి పట్టుగొమ్మ గా ఉండేది .బుద్ధుడికి మహా వీరుడికి సమకాలికుడైన ఉదయనుడు పాలించిన ప్రాంతం అలహా బాడ్ కు ఇరవై అయిదు కిలోమీటర్ల లో ఉంది .విత్మే పట్టణ అనే వారు .అలహా బాద్ కు ఇరవై కిలో మీటర్లలో ‘’గర్హా ‘’అనే ప్రదేశం లో కోట ఉండేది .త్రవ్వకాలలో అనేక దేవతలవిగ్రహాలు ,గుప్తులకాలం నాటి గ్రంధాలు బయట పడ్డాయి గుప్త రాజులు అనేక బంగారు నాణాలు బ్రాహ్మణులకు ఇక్కడ దానం చేశారని తెలుస్తోంది .విష్ణు మూర్తి దశావతారాల తో ఒక దేవాలయం ఉందిక్కడ .
ప్రయాగ లో గంగా నది యమునా నది తో కలిసి నిండు గా ఉంటుంది .గంగ నీటి మట్టం పెరుగుతున్దిక్కడ .కాశీ వైపుకు ప్రయాణించి అక్కడ కూడా భారీ జల రాశితో కళ కళ లాడుతుంది .యమునోత్రి లో పుట్టిన యమునా నది మధుర చేరి శ్రీ కృష్ణుని మురళీ గానం తో పులకరించి ఆగ్రా లో తాజమహాల్ కు స్నానం చేయించి ప్రయాగ లో గంగలో కలిసి పోతుంది .కనిపించకుండా పోతుంది అదే అంతర్వాహిని సరస్వతి నది .
ప్రయాగ ఒడ్డున ఉన్న బడే ఆంజనేయ స్వామి దేవాలయంవరదలలో మునిగి పోతుంది .ఈ శయన ఆన్జనేయుడిని త్రవ్వి తీసి వేరే చోట ప్రతిష్టించాలని చాల సార్లు ప్రయత్నించారు .త్రవ్విన కొద్దీ భూమి లోకి దిగి పోతుంది కాని బయటకు రావటం లేదు. అందుకని ఆ ప్రయత్నాన్ని విరమించుకొన్నారు .ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద తటాకం ఉండేది అని తెలుస్తోంది .
ఇటీవల నాలుగు అంతస్తుల విమాన మండపాన్ని కట్టారు ఆలయం ఎత్తుట నలభై మీటర్లు .ప్రాతి అంతస్తు లో ఒక్కో దేవతాలయం ఉంది ఒకప్పుడిది శివా లయం .కుమార భట్టు ,జగద్గురు శంకరాచార్య ,కామాక్షి దేవి ,తిరుపతి బాలాజీ యోగ శాస్త్ర లింగ విగ్రహాలున్నాయి. ఆలయ గోడలపై రామాయణ చిత్రాలు ముచ్చట గొలుపుతాయి .ద్రవిడ సంప్రదాయం లో మలచిన ఆలయం ఇది .
దారా గంజ్ లో నాగ పూర్ కు చెందినా భోంస్లే మహారాష్ట్ర రాజులు ‘’ పాముల రాజు వాసుకి కి ‘’నాగ వాసు ‘’దేవాలయం నిర్మించారు ఇది గంగ ఒడ్డునే ఉంది .నాగ పంచమి రోజు వేలాది యాత్రికులు సందర్శించి తరిస్తారు .కోటలో’’సరస్వతి బావి ‘’ఉంది దీని నుంచే అంతర్వాహిని గా సరస్వతి నది ప్రవిహిస్తుందని భావిస్తారు .
అక్షయ వట వృక్షం పై ప్రళయ కాలం లో శ్రీ మహా విష్ణువు శయనిస్తాడని పురాణ కధనం .హుయాన్ సాంగ్ కూడా దీని గొప్పతనాన్ని వర్ణించాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాచీన వ్రుక్షాలలో అక్షయ వటం ఒకటి .దారాగంజ్ గ మహల్లా దగ్గర ‘’వేణీ మాధవ మందిరం ఉంది’’ .ఇది అతి ప్రాచీనాలయం ఇది శ్రీ మహా విష్ణు దేవాలయం .దారా గంజ్ లో తెలుగు పురోహిట్లు హరి జగన్నాధ శాస్త్రి గారున్దేవారు .ఆయన మరణం తర్వాత కుమారులు నిర్వహిస్తున్నారు చక్కని తెలుగు మాట్లాడుతారు భోజన వసతి కలిగిస్తారు ఉండటానికి రూములూ ఉంటాయి
షేర్షా సూరి రోడ్డు లో అలోపీ దేవి ఆలయం ఉంది ఇది శక్తి క్షేత్రం .దేవి అలోప్ శాంకరి అంటారు .నవ రాత్రుఅలలో గొప్ప ఉత్సవం జరుగుతుంది .ఇక్కడ మ్మ వారెవరూ ఉండరు .ఒకచిన్న కొయ్య ఉయ్యాల పై నుండి వేలాడుతూ ఉంటుంది అదే అమ్మ వారు .
తెహసీల్ హాన్దియా అనే ప్రదేశం లహా బాద్ కు నలభై కిలో మీటర్ల లో ఉంది ఇక్కడే మహా భారత కాలం నాటి లక్క ఇల్లు ఉంది .పాండవులను మట్టు పెట్టటానికి కౌరవులు నిర్మించిన లాక్షా గృహం ఇదే .విదురుని సలహా తో పాండవులు బతికి బయట పడ్డారు .త్రవ్వకాలలో అనేక దేవతా విగ్రహాలు ,నాణాలు దొరికాయి తక్షశిలా కౌశాంబి ల సమకాలీన నగరం గా భావించారు చరిత్ర కారులు .అలహా బాద్ కు పది కిలో మీటర్ల్ లో జైత్వార్ దేహ్ లో పాండవులు కొద్దికాలం ఉన్న ప్రదేశం ఉంది ఇక్కడి దేవాలయం మహా మండలేశ్వర నాధ శివాలయం పంచ క్రోషి పరిక్రమ యాత్ర ‘’ఇక్కడి తో పూర్తీ అవుతుంది .ఇక్కడే భీముడు హిడింబా సురుడిని వధింఛి అతని సోదరి హిడింబ ను వివాహం చేసుకొని ఘటోత్కచునికి జన్మ నిచ్చాడు. భీముడే ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని కధనం .
ఇంతటి తో అలహా బాద్ విశేషాలు సంపూర్ణం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-14-ఉయ్యూరు