మా నవ రాత్రి యాత్ర -4 కాశీ సందర్శనం

మా నవ రాత్రి యాత్ర -4

 

కాశీ సందర్శనం

11ఏప్రిల్ శుక్రవారం ఉదయం అలహాబాద్ లో లోకమాన్య ఎక్స్ ప్రెస్  ను నాలుగు గంటలకు ఎక్కాం .అది మూడు గంటలు ప్రయాణం చేసి వారణాసి కి ఉదయం ఏడింటికి చేరింది .’’అఖిల భారతీయ కరివేన నిత్యాన్న దాన సత్రం ‘’లో ఫోన్ పై రెండు రూములు ముందుగానే మా అబ్బాయి శర్మ బుక్ చేశాడు .నేరుగా స్టేషన్ నుండి ఆటో లో కరివేన సత్రం చేరాం.

ఇది మానస సరోవర్ ఘాట్ దగ్గర ఉంటుంది. దీని దగ్గరే నారద ఘాట్ ,ఆంధ్రాశ్రమం ఉంటాయి .కింద రూములు రెండు ఇచ్చారు .ఎసి లేక పోయినా చల్లగా ఉంది .భోజనం కూడా ఇక్కడే కనుక హాయిగా ఉంటుంది . స్నానాలకు కావలసిన బట్టలు విడిగా   సంచీలలో సర్దుకొని నారద ఘాట్ మీదుగా కేదార్ ఘాట్ నుంచి బోటులో మనిషికి వంద రానూ పోనూ కు ఇచ్చి నీటి ప్రవాహం ఉన్న చోటకు చేరాం .అక్కడే అందరూ స్నానాలు చేస్తున్నారు .బోటు దిగి స్నానాలు నేను మంత్రం చెబుతూ చేయించాను .గంగమ్మకు మా వాళ్ళు హారతి ఇచ్చారు .మళ్ళీ బోటు ఎక్కి కేదార్ ఘాట్ చేరాం .అక్కడ మెట్లు చాలా ‘’స్టేప్’’ గా ఉంటాయి .ప్రభావతికి కష్టమే అయినా ఎక్కింది మాతో బాటు .అప్పటికే సూర్యుడు మండి పోతున్నాడు .చెప్పులు తీస్తే కాళ్లు కాలి పోతున్నాయి .కేదారేశ్వర దర్శనం చేశాం .ఆలయం వెనక భాగం వైపుకు చేరాం .అక్కడ మంచి కాఫీ తాగాం .అక్కడినుంచి ఆటో లో శ్రీ విశ్వనాదాలయానికి చేరాం .మేము చేరే సరికి పదకొండు దాటింది అభిషేక సమయం .కనుక గంట సేపు క్యూ ఆపేశారు .పన్నెండు పావుకు దర్శనం మొదలైంది .పావు గంటలో ఆలయం లోకి చేరుకొన్నాం. తనివి తీరా కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లిన్గాన్ని స్పృశించి పరవశించి క్షీరం తో అభిషేకం చేశాము .ఉత్తర దేశం లో శివుడికి ఉమ్మెత్త పువ్వులు తో దండ వేస్తారు .తనువూ చరితార్ధమైంది .ఇది అయిదవ సారి కాశీ రావటం .రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు బయటి నుండే దర్శించాల్సి వచ్చింది .స్వామి దర్శనం తర్వాత అన్నపూర్ణా దేవి దర్శనం చేసుకోన్నాం

.ఆన్నపూర్నాలయం లో ప్రసాదం గా ‘’బియ్యం ‘’కొద్దిగా ఇస్తారు .వాటిని ఇంటికి వచ్చి మన బియ్యం లో కలుపు కొని పరవాన్నం వండుకొని నైవేద్యం పెట్టటం సంప్రదాయం .అమ్మ వారి కుంకుమ కూడా తెచ్చుకోవాలి .ఆలయానికి ముందే సెక్యూరిటీ చెక్ ఉంటుంది .బాగులను అనుమతించరు .కెమెరా, సెల్ ఫోన్ కూడా తీసుకు వెళ్ళ రాదు .అందుకని ముందు మేమిద్దరం వెళ్లాం రమణ ,విజ్జి సామాను కాపలా కాశారు .మేము వచ్చిన తర్వాతా వాళ్ళిద్దరూ వెళ్లి దర్శనం చేసుకొచ్చారు .నిన్న ఏకాదశి నాడు త్రివేణీ స్నానం ఇవాళ శుక్రవారం నాడు అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వనాధ దర్శనం .అనుకోకుండా భలే గా కుదిరి అదిరిందను కొన్నాం .అందరికి ఏంతో సంతృప్తి గా ఉంది .అంతా అయి బయటికి వచ్చేసరికి ఒంటి గంట దాటింది .ఇక విశాలాక్షీ దేవి ని చూడటానికి సమయం చాలదని రిక్షాలలో బయల్దేరి కరివేన వారి సత్రానికి చేరుకొన్నాం . కరివేన వారి నిత్యాన్న దాన సత్రం అప్పటికే ఒక బాచ్ భోజనాలు అయి పోయాయి .ఇక్కడ భోజనం చేయాలంటే ఉదయం పది గంటల లోపు చెప్పి రాయిన్చుకోవాలి. గోత్రనామం చెప్పాలి. ఎందరు వచ్చి భోజనం చేస్తారో రాయించాలి .మేము ఉదయమే ఆ పని చేసే వెళ్లాం .కింద కూర్చో బెట్టి విస్తళ్లలో వడ్డిస్తారు .కూచోలేని వారికోసం రెండు టేబుళ్లున్నాయి .వాటిపై  పై కుర్చీలలో కూర్చుని భోజనం చేయచ్చు .మా శ్రీమతి అలాగే చేసింది .మేము ముగ్గురం కిందే కూర్చున్నాం .చొక్కా బనీను విప్పేసి మగవాళ్ళు భోజనానికి కూర్చో వాలి .ఇది ఖచ్చితం గా అందరూ పాటిస్తారు .రెండు  కూరలు , పప్పు, పచ్చడి, పులుసు  మజ్జిగ నెయ్యి లతో చాలా ఆప్యాయం గా భోజనం వడ్డించి మారు అడిగి మరీ వడ్డించి సంతృప్తి గా తినేట్లు చేయటం వీరి ప్రత్యేకత .ఎవరూ విసుక్కోరు ,కసుక్కోరు సేవా భావం అంకిత భావాలతో వడ్డిస్తారు .చల్లని మంచి నీరు పోస్తారు .అందరం భోజనానికి ముందు ఒకాయన చెప్పే అన్నపూర్ణ మంత్రం చెప్పి భోజనం చేయాలి .భోజనాంతరం అందరి చేత ‘’అన్నదాతా !సుఖీభవ “’అని పిస్తారు .అందరం చాలా సంతృప్తి గా భోజనాలు ముగించాము .వడ్డన ఆడవాళ్లే చేస్తారు ,పదార్ధాలన్నీ రుచికరం గా మళ్ళీ మళ్ళీ అడిగి వేయిన్చుకోనేట్లున్నాయి .ఇందులో కొందరు సేవా భావం తో చేస్తే కొందరు జీతాలకు పని చేస్తారు .మంచి వంట శాలా ఇద్దరు వంట మేస్త్ర్రీలు ఉంటారు .ఎక్కడో కర్నూలు జిల్లా కరివేన గ్రామం లో శ్రీశైలం వెళ్ళే బ్రాహ్మణ యాత్రికులకు భోజనసదుపాయం

వందేళ్ళ క్రితం ప్రారంభించిన సత్రం ఇవాళ కాశీ  శ్రీశైలం ,షిర్డీ భద్రాచలం మొదలైన ప్రదేశాలకు  విస్తరించి ఉచితాన్న దానం చేసి ఏంతో సేవ చేస్తున్నారు .కరివేన వారి వారి ఉదాత్త ఆశయానికి ఇది మచ్చుతునక .. భోజనం చేసిన వారినెవరినీ రూపాయి కూడా అడగక పోవటం ఇక్కడి విశేషం .భోజనం చేసిన వారు ఏంతోకొంత తమ సంతృప్తికోసం డబ్బు విరాళం గా ఇస్తారు .దానికి రసీదు ఇచ్చేస్తారు .ప్రతి రూపాయి జమ అవుతుంది .ఆడిట్ జామా ఖర్చులు పర్యవేక్షణ నిఘా అన్నీ పకడ్బందీ గా ఉంటాయి .అందుకే అపారమైన నమ్మకం తో డబ్బు చెల్లిస్తారు .పాతిక వేలు చెల్లిస్తే నిత్యాన్న దానం చేస్తారు అట్లా దీనికి గ్రేడులుంటాయి .ఆ డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ లో ఉంచి వడ్డీ మీద కార్య క్రమం నిర్వాహిస్తారు .నేను మా నాన్న గారి తిది ‘’కార్తీక శుద్ధ ఏకాదశి ‘’నాడు అన్నదానానికి నిరుడే మా ఇంట్లో అద్దె కుంటున్న కృష్ణ మూర్తి మేస్టార్ గారి కుటుంబం ఇక్కడికి వస్తే 2050రూపాయలు ఇచ్చి పంపి కట్టించాను కాశీ లో .మా అమ్మ గారికి ,మా నాయనమ్మ గారి తిధులకు ‘’ఫాల్గుణ శుక్ల పాడ్యమి’’ మరియు ‘’ఆశ్వయుజ శుక్ల అష్టమి’’ (దుర్గాష్టమి )లకు శ్రీశైలం లో ఒక్కొక్కరికి 2050రూపాయల చొప్పున కట్టాను .మా అన్నగారు స్వర్గీయ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ గారి తిది ‘’ఫాల్గుణ శుద్ధ సప్తమి ‘’కి గాను మా అన్న గారబ్బాయి రామనాధ బాబు నాకు ఇచ్చి పంపిన డబ్బు 2050రూపాయలు చెల్లించి రసీదు తీసుకొన్నాను .కంప్యూటర్ రసీదు,డిపాజిట్  సర్టిఫికేట్ ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇచ్చారు . మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడుఛి కోమలి సాంబా వధాని ల ‘’మేరేజ్ డే ‘’సందర్భం గా జూన్ 18న అన్నదానం చేయించమని 1750రూపాయలు చెల్లించి రసీదు తీసుకొన్నది. అలాగే అమెరికా లో ఉంటున్న మా అమ్మాయి స్నేహితురాలు ఛి సౌ మాధవి  భర్త ఛి సుధీంద్ర లు ఇచ్చి పంపిన 1750రూపాయలను వారి కోరిక మేరకు ‘’కార్తీక పౌర్ణమి ‘’నాడు అన్నదానం చేయటానికి మ అమ్మాయి కట్టి రసీదు పొందింది .మనం రాయించిన తేదీకి ఆ పని చేస్తున్నట్లు కార్డు రాసి పోస్ట్ చేయటమూ వీరి ప్రత్యేకతే .ఇలా రోజూ ఏంతోమంది డబ్బులు చెల్లించి నిత్యాన్న దానానికి ప్రోత్సహిస్తూ ఉంటారు .ఏ మహాను భావుడు తన చల్లని చేతులతో ఈ సత్రాన్ని స్తాపించాడో ఆ మహనీయునికి అందరూ క్రుత్జంత చెప్పుకోవాలి .ఈ ధనాన్ని ఆశించి వారెవ్వరూ ఈ సత్రం పెట్టలేదు యాత్రకు వచ్చిన వారికి భోజనం ఇబ్బంది కలుగ కుండా చేయాలన్న ఉన్నత ఆదర్శమే ఇంత గా విస్థ రించింది .వందేళ్ళకు పైగా కరివేన వారి సత్రాలు యాత్రికులకు భోజన వసతి కలిపించి సేవ చేస్తున్నాయి .వారి ఉదార  హృదయానికి నమశ్శతాలు. .

Secretary- ABBKN Satram
67/87, Lakshmi Madhava Nilayam,
Fort, Kurnool – 518001
Andhra Pradesh
India
Phone: +91-8518-241175

 

కాశీ నగర సందర్శనం భోజనం చేసి మా రూముల్లోకి చేరి విశ్రాంతి తీసుకొన్నాం .సాయంత్రం నాలుగింటికి బయల్దేరి ఆటో లో మనిషికి వంద రూపాయలిచ్చి నగర సందర్శన కు బయల్దేరాం .తులసీ మానస మందిర్ చూశాం ఇదే బిర్లా మందిరం ఇక్కడే తులసీ దాసు రామ చరిత మానస్  మార్బుల్ గోడల పై శిలా ఫలకాలకలపై  రాయబడి ఉంటుంది రెండు అంతస్తుల భవనం తులసీ దాసు గారి విగ్రహం మెట్ల ప్రక్కగా ఉంటుంది. ఆయన చేతిలో తులసీ రామాయణం ఉండిద పాడుతున్నట్లు రికార్డు విని పించి ఆయనే పాడుతున్నాడా అనే అనుభూతి కలిగించడం ఇక్కడి విశేషం .తరువాత శక్తి పీఠం దుర్గా దేవి ఆలయం ,సంకట మోచన హనుమాన్ దేవాలయం ,మ్యూజియం అందులో అనేక శిలాలు చిత్రాలు ఆయుధాలు ,పక్షులు జంతువులే కాక గాంధీ గారికి విడిగా ఒక మ్యూజియం ఉన్నాయి .అన్నీ తిరిగి చూశాం ఫోటోలు తీసుకోవటానికి పాతిక రూపాయలు చెల్లించి రసీదు తీసుకొన్నాం .ఎంట్రన్స్ ఫీజు మనిషికి అయిదు రూపాయలే .చాలా బాగా ఉంది. చూడాల్సిన మ్యూజియమే .ఇన్ని సార్లు వచ్చినా చూడటం కుదరనే లేదు. గాంధీ గారి అపురూప ఫోటోలున్నాయి దేన్నీ వదల కుండా ఫోటోలలో బంధించాను . పార్కు చూశాం .గవ్వల గౌరిదేవాలయం దర్శించాం  ఈమె విశ్వనాధుని సోదరి .గవ్వలు కొని ఆమె కు సమర్పించాలి .’’గవ్వలు నీకు కాశీయాత్ర ఫలం నాకు ‘’అని పూజారి చెప్పిస్తాడు .

ఇక్కడ కోతుల బెడద బాగా ఎక్కువ సంకట మోచన్ దగ్గరా అంతే అక్కడ ప్రసాదాలు కొని నైవేద్యం పెట్టించి తెచ్చుకొంటారు .ఇవన్నీ తిరిగి చూసి సాయంత్రం ఆరున్నరకు గంగా హారతి చూడాలనుకోన్నాం .కాని ఏడున్నర అయి పోయింది .మా అమ్మాయి గంగ హారతి మిస్ అయినందుకు మమ్మల్ని దేప్పుతూనే ఉంది .చివరగా శ్రీ కాలభైరవ దర్శనం చేశాం అక్కడే మా ఆవిడ తప్పి పోయి పావుగంట మమ్మల్ని తిప్పలు పెట్టి మా అమ్మాయి తిరిగి గుడిలో ఉంటె తీసుకొచ్చింది .ఒక సిల్క్ సారీ షాప్ లో మా అమ్మాయి చీర కొనుక్కోంది .అక్కడి నుండి సరాసరి ఆటోలో కరివేన సత్రం చేరాం .రాత్రి పూట భోజనాలు ఉండవు .టిఫిన్ మాత్రమె .మా నలుగురికి పిండి ఉప్మా టిఫిన్ నాలుగు పాకెట్లు కట్టి ఇచ్చి మజ్జిగ కూడా పాక్ చేసి ఇచ్చారు .రూము కు తెచ్చు కొని తిని పడుకోన్నాం .రేపు మళ్ళీ విశ్వనాధ విశాలాక్షీ అన్న పూర్నా దర్శనం చేయాలి . సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-4-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నవ రాత్రి యాత్ర and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.