మా నవ రాత్రి యాత్ర-5
కాశీ యాత్ర
12వ తేదీ శనివారం ఉదయమే లేచి కరివెన వారి సత్రం రూముల్లో నే స్నానాలు పూర్తీ చేసుకొని బయటికి వచ్చాం .ప్రక్కనే ఒక దక్షిణాది హోటల్ ఉంటె అక్కడే ఇడ్లీ ,అట్టు తిని కాఫీ తాగాం .అక్కడి నుండి రిక్షాలో బయల్దేరి శ్రీ విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి చేరాం .అమ్మవారిని దర్శించాం .మా అమ్మాయి వంద రూపాయలు పూజారికిచ్చి పూజా సామగ్రి గాజులు పసుపు కుంకుమ జాకేట్టు ప్రసాదం గా తీసుకోంది .విశాలాక్షి గుడి అనగానే రెండేళ్ళ కితం మా బావ మరిది కుటుంబం తో విశ్వనాధ దేవాలయం నుండి రాత్రి వేళ బయల్దేరి దగ్గర లోనే ఉన్న విశాలాక్షి మందిరానికి రావటానికి దారి తెలీక బురదలో, రొచ్చులో, ఆవుల మధ్య, వాటి పేడల మధ్య,ఇరుకు సందు గొందులు, తిరిగి గంటపైగా నడిచి ,కరెంటు పోయి, చీకటి రాత్రి ఎట్టకేలకు అమ్మవారి గుడికి చేరిన సంఘటన గుర్తుకొచ్చింది .దశాశ్వమేద ఘాట్ ఒడ్డునే విశాలాక్షి ఆలయం ఉంది .కాశీ విశాలాక్షీ దేవి గా భక్తుల పాలిటి కొంగు బంగారం గా అమ్మ వారు కాశీలో కొలువై ఉంది .అమ్మ వారి దర్శనం సకల పుణ్య ఫలదం అని అందరి విశ్వాసం .దివ్యం గా దర్శనం పొంది ఆనందించాము .
గుడికి దగ్గరలోనే చేనేత వస్త్రాలయం ఉంటె మా వాళ్ళు అందులో దూరి మూడు వందల రూపాయల చీరే రెండువందల ఇరవై కి బేరమాడి పది హీను చీరలు వివిధ రంగుల్లో కొన్నారు. అందులో జాకెట్ పీస్ కూడా ఉండతం విశేషం .అక్కడి నుంచి నడిచి దగ్గరలోనే ఉన్న శ్రీ విశ్వేశ్వర మహా జ్యోతిర్లింగా దర్శనం రెండవ సారి చేశాం .విశాలాక్షి గుడి నుండి విశ్వనాధ గుడికి రెండో నంబర్ గేటు ద్వారా వెళ్ళాలి .గేటు నంబరు తెలీకుండానే సెక్యూరిటీ అంతా పూర్తీ చేయించుకొని మా అమ్మాయిని రమణ ను అక్కడే ఉంచి మా దంపతులం లోపలి వెళ్లి తనివార విశ్వేశ్వర దర్శనం చేసి అభిషేకం చేసి ,అన్నపూర్ణ అమ్మవారి దర్శనమూ చేసి సెక్యూరిటీ నుండి బయట పడ్డాం .బయటికొచ్చి చూస్తె మా వాళ్ళిద్దరూ కనిపించలేదు .కంగారు పడ్డాం .అటూ ఇటూ అరగంట తిరిగి పోలీసుల ను అడిగి రెండో నంబర్ గేటు దగ్గరకు చేరుకొన్నాం .అక్కడే ఉన్నాడు మా రమణ .మా అమ్మాయి కని పించలేదు .ఏమయిందని అడిగితె మీ కోసమే వెళ్ళింది అన్నాడు .ఫోన్ తీసుకెళ్ల లేదన్నాడు. నాకు ‘’ఎక్కడో కాలింది ‘’.అరిచాను .సరే వాడినీ, వెళ్లి దర్శనం చేసుకు రమ్మన్నాం .వెళ్లి అన్నా చెల్లీ ఒక పావు గంటలో వచ్చారు ..జనం విపరీతం గా ఉన్నారు క్యూలో ఉన్న భక్తులకు ఇక్కడ కాశీలో ఏ దేవుడు ఉన్నాడో ఎవరిని దర్శించటానికి వచ్చారో కూడా తెలియదు అని వారిని మాట్లాడిస్తే అర్ధమైంది .వివరం గా నేనే చెప్పాను .గ్రూపులను వెంట బెట్టుకొని దర్శనం చేయించే వారుంటారు వారేమీ వీరికి వివరం గా చెప్పక పోవటం తో వచ్చిన చిక్కు ఇది అని అర్ధ మయింది .అంతా హడావిడే సందడే .ఏ గేటులో నుంచి లోపలి వేడుతున్నామో గ్రహించి వెళ్ళక పోవటం తో వచ్చిన తిప్పలు ఇవి అందుకని గుడికి వెళ్ళే వారందినీ హెచ్చరించి చెప్పాం .
మేము రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు తెల్ల ‘’పైజమా లాల్చీ ‘’మొదటి సారిగా ఇక్కడే కొన్నాను .అంతకు మున్దేప్పుదేప్పుడూ వీటిని ధరించలేదు .వేసుకోవటం మొదలెట్టిన తర్వాత బానే ఉందని పించింది .అప్పుడు జత నూట యాభై కే కొన్నాం. ఇప్పుడు చూస్తె మూదొందలకు పైగా చెప్పాడు .ఒక హోల్ సెల్ షాప్ మీద పడి ఒక జత తెల్లవి పట్టు ది ఒకటి కొన్నాను .మా రమణా కొనుక్కున్నాడు. మా మనవళ్ళు సంకల్ప్ ,భువన హర్ష చరణ్ లకు కూడా తెల్ల పైజమా లాల్చీలుమా అమ్మాయి కొన్నది .రమణ మా అమ్మాయి పిల్లలు శ్రీ కెత్ ,ఆశుతోష్, పీయూష్ లకుకుట్టిన పట్టు పంచెలు కొన్నాడు. వాడూ పట్టు బట్టలు కొనుక్కున్నాడు .మా ఆవిడా రెందొందలకు నేత చీర కొన్నది .మా అమ్మాయి మా అల్లుడికీ తెల్ల పైజమా లాల్చీ కొంది .మాశ్రీ సువర్చలన్జనేయ స్వామి వారలకు పట్ట్టు బట్టలు కొన్నాం .
మౌంట్ సోమా ‘’మా ‘’మా అమ్మాయిని వాళ్ళ ఆయనగారికి అంటే ప్రసాదావధాని గారికి కుట్టిన పట్టు పంచెలు కొనమంటే రెండు జతలు కొన్నది .మంచి రంగువే దొరికాయి .నిన్నటి నుంచి మా అమ్మాయి స్పటిక శివ లింగాలు కొందామని ప్రయత్నిస్తే ఇవాళ ఒక చోట దొరికాయి .శివలింగం ,పాను వట్టం ఉన్నవి రెండు ,మధ్యరకం వి కొన్నది .అభిషేకం చేసే స్టాండ్ పై నీటి ధారా పాత్ర ఉన్నదిఒకటిఉన్న లింగం పెద్దది కొన్నది .’వీటి ఖరీదు రెండు వందల యాభై ఒక్కొక్కటి .’సో మా మా ‘’గారి కోసం దర్భ చాపల సెట్ నాలుగు చాపల సెట్ ఎనభై రూపాయలకు కొన్నది .ఇక్కడా దర్భ చాపలు అని అడిగితె యెవరిఏ తెలీదు .’’కుశాసన్ ‘’అని అడగాలని ఒక సాధువు చెప్పాడు .దేవుడి ఫోటోలు,ప్రసాదాలు కొన్నాం .పైజమా షాపు వాడు మంచి టీ తెప్పించి ఇప్పించాడు .
షాపింగ్ అంతా అయేసరికి ఒంటి గంట దాటింది .బయటికి వచ్చి రిక్షాలు ఒక్కొక్కటి నలభై రూపాయలకు మాట్లాడి కరివేన సత్రం చేరాం .సామానంతా రూముల్లో పడేసి రమణ ఆకలిగా లేదంటే మేము ముగ్గురం సత్రానికి భోజనానికి వెళ్లాం .అప్పటికే రెండు బాచీలు భోజనం చేశారు .మా అమ్మాయి కింద కూర్చుంటే మేమిద్దరం టేబుళ్ళ వద్ద కుర్చీలలో కూర్చున్నాం భోజనానికి .లుంగీ తువ్వాల తో నేను వచ్చాను .పప్పు ,బంగాళా దుంప వేపుడు వంకాయ కూర ,దోసకాయ చట్నీ ,పరవాన్నం ,బజ్జీ సాంబారు మజ్జిగ లతో బహు కమ్మని భోజనం పెట్టారు .అడిగి అడిగి వాళ్ళూ కావాల్సినవి అడిగి మేమూ కడుపు నిండా తిని ‘’బ్రేవ్ మని త్రేంచాం’’.అన్నదాతా సుఖీ భావ ‘’భోజన దాతలకు కృతజ్ఞత చెప్పాం భోజనానికి ముందు అన్నపూర్ణా దేవిని స్తుతిన్చాం .
రూము రెంటు యెంత అని అడిగితె గదికి మూడొందలు అని చెప్పారు .రెండు రూములకు రెండు రోజులకు పన్నెండు వందలు చెల్లించి రసీదు తీసుకొన్నాను. నిన్నా ఈ రోజు భోజనాలు చేసినందుకు సత్రానికి డొనేషన్ గా అయిదు వందలు ఇచ్చాను. రసీదు ఇచ్చారు .నాలుగింటికి రూములు ఖాళీ చేస్తామని చెప్పి గదులకు చేరాం .ఈ సారి ‘’కరెంటు కోత’’ పెద్దగా లేదని పించింది .రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు కనీసం నాలుగైదు గంటలు పగలూ రాత్రి కరెంట్ కట్ చేశాడు .ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డాం .ఎన్నికల రోజులు కనక జాగ్రత్త పడ్డారేమో? మూడున్నర దాకా విశ్రాంతి తీసుకొన్నాం సామాను అంతా సర్ది రెడీ గా ఉంచుకోన్నాం .తొమ్మిది నెలలు బ్రాహ్మణ సేవ చేయాలనే తలంపుతో రామయ్య అనే ఒక గోల్లాయన కరీం నగర్ నుంచి వచ్చి ఇక్కడ సేవకుడిగా సత్రం లో సేవ చేస్తున్నాడు .భోజనం టిఫిన్లు వసతి ఉచితం అని చెప్పాడు .మా సామాను ఆటో వరకు తీసుకు రావటానికి మాకు సహాయం చేశాడు .రమణ ఆయన జేబులో కొంత డబ్బు పెట్టాడు ..ఇక్కడే ‘’సైకిల్ స్వామి ‘’ఆశ్రమం ఉంది .సరాసరి వెడితే శ్రీ విశ్వ నాద గల్లీ చేరుతుంది దారికోసం కంగారు పడక్కర లేదు నడిచి తిన్నగా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించ వచ్చు .ఆటోకురెండు వందలు ఇచ్చివారణాసి స్టేషన్ కు చేరుకొన్నాం .అయిదుముప్పావుకు ‘’ఖజురహో ‘’వెళ్ళే బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్ ఎక్కాం . అది వారణాసి నుంచే బయల్దేరే లింక్ ఎక్స్ప్రెస్ .అనేక స్టేషన్లలో బోగీలు తగిలించుకొంటూ వదిలిన్చుకొంటూ ,చివరికి యిదే యిదే అయిదు బోగీలతో అందులో ఒకే ఒక ఏ సి బోగీతో మర్నాడు అంటే పదమూడు ఆదివారం ఉదయం అయిదున్నరకు ఖజురహో చేరాము .ఆ విశేషాలు ఈ సారి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-14-ఉయ్యూరు