ముద్దు నరసింహం అనంతరం ఆయన ‘హితసూచని’ సంఘసంస్కర్తలకు చాలా ఉపయోగపడింది. ఇది అచ్చయ్యేనాటికి “వీరేశలింగంగారు సుమారు పద్నాలుగు సంవత్సరాల బాలుడు. ‘హితసూచని’ చదివి ఆయన ప్రభావితు లయ్యారు. హితసూచని వెలువడిన సంవత్సరం తర్వాత పుట్టిన గిడుగు రామమూర్తిగారు తన వ్యావహారిక భాషోద్యమానికి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు.
మంత్రాలకు చింతకాయలు రాలవు. జాతరలూ ఉత్సవాలూ రోగాలను తగ్గించలేవు. తలక్రిందులగా తపస్సు చేసినా ఏ లోహాన్నీ బంగారంగా మార్చలేం. మరణించిన వారు పిశాచాలుగానో, రాక్షసులుగానో మారరు. ఒక జ్యోతిష్కుడు చెప్పినదానికీ మరో జ్యోతిష్కుడు చెప్పినదానికీ పొంతన ఉండదు. ఆడపిల్లలకు యుక్తవయసు వచ్చాక వాళ్ళ ఇష్టంతోనే పెళ్ళిచేయాలి.
‘ఈ మాటల్లో విశేషం ఏముంది? ఈ రోజుల్లో కొంచెం హేతుబద్ధంగా ఆలోచించే వారెవరైనా ఇలాగే మాట్లాడుతారు.’ అనిపిస్తోంది కదూ! కానీ ఈ అభిప్రాయాలు ఈనాటివి కాదు. నూటయాభై ఏళ్ళ క్రితం నాటి ‘హితసూచని’ అనే పుస్తకంలోవి. రచయిత సామినేని ముద్దునరసింహం. ఇది 1862లో ప్రచురితమైంది. చిత్రం ఏమిటంటే ఈయన నాస్తికుడు కాదు. కానీ ఎంతో హేతువాద దృష్టికలవాడు. 1792(?)లో రాజమండ్రిలో పుట్టారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో పాండిత్యం సంపాదించారు. పుట్టిన ఊళ్లోనే ఫస్ట్‌క్లాస్ ఆక్టింగ్ డిస్ట్రిక్ మునసబుగా ఉద్యోగం చేశారు. ఇంగ్లీషు వారితో స్నేహం చేసి తర్కబద్ధమైన ఆలోచనలతో తన భావాలకు పదును పెట్టుకున్నారు. ఆ ఫలితమే ఈ హితసూచని. దీన్ని వచనంలో రాశారు. మనం వచన గ్రంథం అంటాం కానీ ఈయన వాక్య గ్రంథం అన్నారు. ‘వాడుక భాషలో వాక్య గ్రంథాలకు బహుశా ఈయన ఆద్యుడు’ అని ఆరుద్ర తమ ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో అన్నారు. మనం వ్యాసాలు అంటాం. ఈయన ‘ప్రమేయాలు’ అన్నారు. మొత్తం ఎనిమిది ప్రమేయాలు ‘హితసూచని’లో ఉన్నాయి.
పీఠికను చదివితే ఈయన భాష విషయంలో కూడా సంస్కరణ భావాలు గలవాడే అనిపిస్తుంది. రచనా వ్యాసంగం సజావుగా జరగాలంటే భాషానియమాలు లక్షణ గ్రంథాలలో ఉన్నట్టుకాక సాధ్యమైనంత సరళంగా ఉండాలని చెప్పి, అర్థానుస్వారం గురించీ శకటరేఫ గురించీ ప్రస్తావించారు. ఉదాహరణకు ‘వాడు’ అనే పదానికి అరసున్న చేరితే (వాఁడు) అతను అనీ, చేరకపోతే కళావిహీనమవడం అని అర్థం. అలాగే వీడు అనే పదానికి అరసున్న చేరితే ఇతను అనీ, చేరకపోతే విడిచిపెట్టు, పట్టణం వంటి అర్థాలున్నాయి. ఈయన ఏమంటారంటే ‘వాడుకలో చాలా పదాలు అర్థానుస్వారం లేకుండానే ఉన్నాయి. కాబట్టి తానుకూడా అలాగే రాశానన్నారు. అలాగే కొన్ని పదాలలో శకటరేఫ రాయాలని లక్షణ గ్రంథాలలో ఉందికానీ అటువంటి పదాలలో రేఫను చేర్చినా శకటరేఫను చేర్చినా అర్థము ఒకటి ఐయుంటుంది కనుకనున్ను’ అటువంటివన్నీ రేఫతోనే రాశానన్నారు. గ్రామ్యభాషను ‘–వాక్యరచనలో నంగీకరించ తగినదిగా భావిస్తున్నా’నన్నారు.
ఇక వ్యాసాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు చూద్దాం! మొదటిది ‘విద్యాప్రమేయం’. ఇందులో ‘విద్యలు సమస్త ప్రయోజనములకు ఆవశ్యకమైయున్నవి’. సంగీతానికి సంబంధించినవి తప్ప మిగిలిన గ్రంథాలన్నీ వచన రూపంలో ఉంటే బావుంటుంది. ఛందోబద్ధంగా రచించేటప్పుడు కవిదృష్టి ఛందస్సు కూర్చుకోవడం మీదే ఉంటుంది కాబట్టి అతను తన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తం చెయ్యలేడు. ‘శాస్త్ర గ్రంథాలన్నీ సులభంగా బోధపడేలా దేశభాషలలో వచనంలో రాయించి ప్రచురించాలి’ అన్నారు. ఈయన ‘1853లో సూచించిన పద్ధతిని తెలుగు అకాడమీ చేపట్టటానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింద’ని ఆరుద్ర అన్నారు.
రెండోది ‘వైద్యప్రమేయం’. ఇందులో ఈయన చెప్పిన విషయాలు ఈనాడు కూడా పనికొచ్చేవే. ‘శాస్త్రవిహీనుడైన వైద్యుడు రోగిపాలిటి యమదూతతో సమానం’ అన్నారు. ఇది సార్వకాలిక సత్యం. అంతేకాదు చాలామంది వైద్యులకు అధ్యయనం కొరవడుతోంది. వారు సిఫారసు చేసే ఔషధగుణ దోషాల పట్ల వారికే అవగాహన ఉండటం లేదు. ‘రసవిషాదుల వైద్యముకంటె మూలికా వైద్యం శ్రేష్ఠం’ అన్నారు.
మూడోది ‘సువర్ణ ప్రమేయం’. లోహాలను బంగారంగా మార్చడంపై విమర్శ ఇందులో ఉంది. శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన లేక రాత్రికి రాత్రే అడ్డగోలుగా ధనవంతులైపోవాలనే దురాశాపరుల కోసం పుట్టినదే ఇతర లోహాలను బంగారంగా మార్చే విద్య. దీన్నే ‘రసవాదం’ అంటారు. ఈనాడు కూడా బంగారానికి మెరుగు పెడతామనీ, ఇతర లోహాలను బంగారంగా మారుస్తామనీ శాంతులనీ దుష్టగ్రహాలనీ కాకమ్మకబుర్లు చెప్పి మోసం చేసేవారి గురించి రోజూ వార్తల్లో చూస్తున్నాం. “ఒకసారి తాకించిన వెంటనే ఎలాంటి లోహాన్నైనా సువర్ణంగా మార్చే మణిని ‘స్పర్శమణి’ అంటార”ని సి.పి.బ్రౌన్ తన నిఘంటువులో చెప్పారు. గురజాడ అప్పారావు గారి కాలంలో కూడా ఇలాంటి మోసాలున్నాయేమో! కన్యాశుల్కంలో బైరాగి ‘తులం రాగి తెచ్చుకో. బంగారం చేసియిస్తాం–‘ అంటాడు దుకాణదారుడితో. ఇలాంటి వాటిని ముద్దు నరసింహంగారు ఆనాడే ఖండించారు. ‘బుద్ధిమంతులైనవారు బాగా యోచిస్తే మరియొక లోహమును బంగారముగా చెయ్యడము అసాధ్యమని తెలియదగియున్నది’. ‘అసలు లోహములలో నొకదాన్ని మరియొకటిగా చేయడమెవరికిన్ని సాధ్యమైన పనికాదు.’ అలా సాధ్యమైతే ‘ఒక ధాన్యమును మరియొక ధాన్యముగా గాని ఒక జంతువును మరియొక జంతువుగా గాని మనుష్యుడు చెయ్యవచ్చును. ఈలాగున ఏమానవుడూ చెయ్యలేడు.’ స్పర్శవేది ఇనుమును బంగారంగా మారుస్తుందని నమ్మకం ఉంది. కానీ ‘స్పర్శవేది అనే వస్తువును ఇహలోకమందు చూసినవారెవరూ ఉన్నట్టు తెలియడము లేదు.’ అన్నారు.
నాలుగోది జంతుసంజ్ఞా ప్రమేయం. పూర్వం కొంతమందికి పశుపక్ష్యాదుల భాషను అర్థం చేసుకునే శక్తి ఉండేదనే కథలను ఇందులో ఖండించారు. ‘కొన్ని జంతువులకు వాటి జాతి సహజములైన ధ్వనులు చెయ్యడమునకే తప్ప వాగింద్రియ సామర్థ్యం లేదు’ అంటూ ధర్మరాజు అశ్వమేధయాగం చేసేటప్పుడు ఒక ముంగిస మా ట్లాడినట్టు ఉన్న కథా, కైకతండ్రి అయిన కేకయరాజు చీమల సంభాషణ విన్నాడని చెప్పుకుంటున్న కథా ఎంతమాత్రం వాస్తవాలు కాదన్నారు. పూర్వకాలంలో ఇలాంటివి జరిగాయని అం టారు గానీ ‘ప్రపంచమర్యాదకు విరుద్ధములైన ధర్మములు ఏయుగమందున్ను జరిగినట్టు చెప్పడమునకు సబబులేదు’ అన్నారు.
ఐదవది ‘రక్ష : ప్రమేయం’. అంటే రాక్షసుల గురించీ, పిశాచాల గురించీ ఇది వివరిస్తుంది. ఇందులో ‘చనిపోయిన మనుష్యులు కొందరు రాక్షసులున్ను – పిశ్చాములున్ను- భూతములున్న, దయ్యములున్నుఐ- పూర్వ స్వరూపములతోనే కొందరికి కనబడడమున్ను- వారిని గూర్చి మాటలు చెప్పడమున్ను – కద్దని చాలామంది నమ్ముతున్నారు. -ఈ నమ్మకము నిజమైన ఆధారము గలదికాదు’ అన్నారు. చనిపోయి దయ్యాలుగా మారినవారు పెట్టెల్లో బట్టలు కాల్చేయడం, ఇళ్ళమీద రాళ్ళేయడం, అతిబరువైన వస్తువులను సునాయాసంగా ఎత్తగలగడం వంటివి సత్యం కాదన్నారు.
ఆరోది ‘మంత్ర ప్రమేయం’. మంత్రాలకు అద్భుత శక్తులు ఉన్నాయని నమ్మే అజ్ఞానులు ముద్దునరసింహం గారి కాలంలోనే కాదు ఈనాడు కూడా ఉన్నారు. వారి గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించారు. ఒక దేవత పేరు మంత్రంగా చేసుకుని, ఆ దేవత పేరు జపిస్తే ఆ దేవత కరుణించి వారి కోర్కెలు తీరుస్తుందని నమ్మేవారున్నారనీ ‘యేదేవతయొక్క నామమైనా ఏమనిషి ఐనా ఎంతకాలం జపించినప్పటికిన్నీ- ఆ దేవత ఆ మనిషికి స్వాధీనమైయుండడమున్ను సంభవించదు’ అన్నారు. ఒకవేళ అలా మంత్రసిద్ధి కలిగితే ‘వారు భూమండలమంతా ఏలే అధికారమునే కోరవచ్చును, వారి విరోధులను సాధించవచ్చును’ అంటారు. ‘అసలు మంత్రాలు ఫలించినట్టు ఎక్కడా ఆధారాలు లేవు’ అన్నారు.
ఏడోది ‘పరోక్షాది జ్ఞానప్రమేయం.’ ఇందులోని అంశం దివ్యదృష్టి. “గ్రంథములయందు చెప్పబడియుండటమే కానీ అటువ ంటి దృష్టిగల మనుష్యులు ఎక్కడా ఉన్నట్టు కనుపడడములేదు. దేవతోపాసన చేసేవారికి ముందుజరగబోయే సంగతులు ఎలా తెలుస్తాయి?’ అని ప్రశ్నిస్తారు. జాతక గ్రంథాలు అనేకం ఉన్నాయి. ఒకదానికీ మరోదానికీ సంబంధం ఉండదు. ‘ఒక జ్యోతిష్కుని యూహకు మరియొక జ్యోతిష్కుని యూహభేదించే యుండునుగాని సరిగా యుండనేరదు’ కాబట్టి అవి నమ్మదగినవి కావన్నారు.
చివరిది ‘వివాహ ప్రమేయం’. నాటి బాల్యవివాహాలను ఇందులో ఖండించారు. ‘వివాహము కాకమునుపే చిన్నది రజస్వలయైన పక్షంలో తల్లిదండ్రులు, తోడబుట్టినవారు ఆ చిన్నదానితో నదీగర్భమందు ప్రవేశించవలసినదని ఒక పురుషుడు నిర్ణయించినాడు.’ ‘అది నిరర్ధకమైనది’. ‘చిన్నది వ్యక్తురాలైన మీద వివాహము చెయ్యడమే మిక్కిలి నాయమైయున్నది’ అని చెప్పడమే కాకుండా కన్యాశుల్కం, బాలవితంతువుల సమస్యలకు మూలం బాల్యవివాహాలే అన్నారు. అంతేకాదు ‘తమ పిల్లలకు జీవనాధారమయ్యే సంపదలను వివాహ వేడుకల కోసం తల్లిదండ్రులు ఖర్చుచెయ్యకూడదు’ అని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళు వధూవరుల పరస్పరాంగీకారంతో జరగడం లేదని అందుకు సాక్ష్యంగా పెళ్ళిమంత్రాలను ఉదాహరించారు. ‘మదర్ధం కన్యాం వృణీధ్వం’ (నన్ను మోహించినటువంటి ఫలానా పురుషుణ్ణి నాకొరకు కోరవలసినది) అనే మంత్రం చిన్నదానితో చెప్పిస్తున్నారు. వరుడితో ‘మదర్ధం కన్యాం వృణీధ్వం’ (నాకొరకు కన్యను వరించవలసినది) అనే మంత్రం చెప్పిస్తున్నారు. ఈ మం త్రాలు ‘తల్లిదండ్రులచేత ఏర్పాటు చేయబడ్డ వధూవరుల గురించి ఏర్పాటు చేయబడినవి’ అన్నారు.
ముద్దు నరసింహం అనంతరం ఆయన ‘హితసూచని’ సంఘసంస్కర్తలకు చాలా ఉపయోగపడింది. ఇది అచ్చయ్యేనాటికి “వీరేశలింగంగారు సుమారు పద్నాలుగు సంవత్సరాల బాలుడు. ‘హితసూచని’ చదివి ఆయన ప్రభావితులయ్యారు. వీరేశలింగంగారి సంతకంతో ఉన్న హితసూచని పుస్తకం వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారి దగ్గర ఉంద”ని ఆరుద్ర తెలిపారు. హితసూచని వెలువడిన సంవత్సరం తర్వాత పుట్టిన గిడుగు రామమూర్తిగారు తన వ్యావహారిక భాషోద్యమానికి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అందుకే “వ్యావహారిక భాష ప్రయోజనాన్ని గుర్తించి ఆ వాదాన్ని ప్రారంభించినవాడు. అంతేకాదు సంఘసంస్కారము, వితంతు వివాహము, బ్రహ్మసమాజము ద్వారా బంగాళాదేశం నుంచి ఆంధ్ర దేశంలోకి దిగుమతి కావడం కాదు. అంతకు పూర్వమే మన తెలుగు వాడొకడు ఈ ఉద్యమాన్ని తలపెట్టి ప్రచారం చేసినవాడున్నాడు అని రుజువు చేయడానికి ఈ ‘హితసూచని’ ఆధారం” అన్నారు ఆరుద్ర. ముద్దు నరసింహం గారు రాసిన పుస్తకం ఇదొక్కటే. ఇది తళుకుబెళుకుల గాజురాయికాదు. ‘నిక్కమైన మంచినీలం’. సంస్కరణాభిలాషులంతా తప్పక చదవాల్సిన మంచి పుస్తకం ‘హితసూచని’. ఈ పుస్తకంలో ‘ఉమేదువారీ’ ‘మశ్చాలీ’ వంటి ఆనాటి ఉద్యోగాలకు సంబంధించిన పదాలు, ‘అదాత్తు’ ‘సోలుపులు’ వంటి అచ్చతెలుగు పదాలు, ‘చాపాఖానా’ ‘హల్కా’ వంటి ఉర్దూ పదాలు ముద్దు నరసింహం చాలా ఉపయోగించారు. ఈనాడవి కనిపించవు. వినిపించవు.
– డా. పి.యస్. ప్రకాశరావు