సాహిత్య నోబెల్ ప్రైజ్ గ్రహీత ,లాటిన్ అమెరికా రచయిత స్వర్గీయ మార్క్వెజ్ -వి చంద్ర శేఖర రావు –

‘ఎలిజీగానే గుర్తు చేసుకుంటాను’ – డాక్టర్ వి. చంద్రశేఖరరావు

మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్ర లోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imagination ను నమ్మినవాడు. మన లోపల దాగిన సత్యాన్ని వెలికి తీయడానికి, ఒక charm ను, magic చేసే proseను కనిపెట్టాడు. త్రోసుకొచ్చే మరణపు రాత్రుల్ని ఆపివేసే, వెలుగుల కిరణాల, ఎగిరే పక్షుల రెక్కల, శక్తిని తన పాత్రలకు ఇచ్చిన కథా/ నవలా మాంత్రికుడు మార్క్వెజ్.

లిజీగానే మొదలుపెడతాను. పాతికేళ్ళనాడు, మద్రాసు మౌంట్‌రోడ్ పేవ్‌మెంటు పైన దొరికిన న్యూయార్కర్ మ్యాగజైన్‌లో మొదటిసారి మార్క్వెజ్ కథ చదివి విస్తుపోయాను. కథలో ఒక్కసారిగా, అంత Twist, అంత dark humour చదివి, కథలు ఇట్లా కూడా రాయొచ్చా అని అబ్బురపడ్డాను. ‘One hundred years of solitude’ నవల్ని దాదాపు నెలపాటు చదివాను. ఒక ‘Collective Dream’లోకి నేను మేలు కొన్నాను. మామూలు వాక్యం, క్రమంగా ఒక ‘మెటాఫర్’గా మారటం నేను చూశాను. కథలోని ఒక దృశ్యం ఒక ‘మిత్’లా రూపాంతరం చెందటం చూశాను. రియాలిటీ, ఒక్కసారిగా ఇమాజినరీ రియాలిటీలోకి చొచ్చుకుపోవటం చూశాను. ఆ అనుభవం, మళ్ళీ పుట్టటం లాంటి ఒక అనుభవం.
డోస్టవిస్కీ, టాల్‌స్టాయ్, చెహోవ్‌లను ఆరాధించిన తరం నాది. మార్క్వెజ్ మోళీ కట్టిన మాంత్రికుడిలా నన్ను వశపరచుకున్నాడు.
ఇక ఆయన కథలు, ఒక్కో కథ ఒక సర్రియల్ అనుభవం. మార్మిక స్వప్నం. ఉన్న స్థితి నుంచి పారానార్మల్ స్థితికి తరలిపోవటం. ఒక కొత్త కథా రూపం. కొత్త నెరేటివ్, కొత్త టోపోగ్రఫీ, కొత్త ఉద్వేగం. నేనో సరికొత్త మానవుడిగా మారిపోవటం.

‘పారిస్ రివ్యూ’లో మార్క్వెజ్ ఇంటర్వ్యూ ఒక ఆశ్చర్యం. ‘కాఫ్కా’ ఆయన inspiration అంటాడు. జేమ్స్ జాయిస్, బోర్జస్, ఆశ్చర్యంగా హెమింగ్వే కూడా తనని Influence చేశారని చెబుతారు. ఆ ఇంటర్య్వూని తెలుగులో అనువాదం చెయ్యాలనే కోరిక అట్లాగే మిగిలి ఉంది. ‘Living to tell the tale’ అనే ఆయన ఆత్మకథాత్మక జ్ఞాపకాల పుస్తకం, ఒక అద్భుతం. ఆయన జ్ఞాపకాల ఛాయల్లో, ఆయన రచనల జాడలన్నీ కనబడటం. నేనెంతో ఇష్టపడే మిత్రుడొకడు నా ఇంటికి వచ్చాడు. నా పర్సనల్ లైబ్రరీని పరిశీలిస్తూ, ‘గోర్కీ ఎక్కడ? డోస్టవిస్కీ పుస్తకాలేవీ, ‘రాదుగ’ వాళ్ళ రష్యన్ సాహిత్యమంతా ఏది?’ అంటూ విసుగు ప్రకటించాడు. మార్క్వెజ్‌ని ఆయన మొదటిసారి చూడ టం. ‘ఈ పుస్తకాలా’ అంటూ గాఢంగానిట్టూర్చి; ‘పర్సనల్ లైబ్రరీ మనమేమిటో చెబుతుంది. మన అభిరుచులు, ఆదర్శాలు, మన ఇష్టాలు, ఆశలూ; మన లైబ్రరీ అంటే మన లోపలి వ్యక్తిని ఆదర్శీకరించుకోవటమే’ అని క్లాసు తీశాడు. ఆ మిత్రుడు సంవత్సరం క్రితం మార్క్వెజ్‌ని చదివి, ఇన్నాళ్ళు ఆయన్ను చదవకపోవటం ఒకలోటే, అంటూ Confess చేసుకున్నారు. ఒక యువకవి మార్క్వెజ్‌ని చదివాక, తన అనుభవాన్ని ఇట్లా ఉత్తరం రాశాడు.

‘ఉదయం వైపు ఎగరడానికి రెక్కలేవో విచ్చుకున్నాయి
కాంతి సముద్రం వైపు, నా శరీరం ప్రయాణిస్తున్నట్లు
నేనో మెలాంకలీగా, పాటగా, పక్షిగా మారిపోయినట్లు’
ఒక ఎలిజీగానే మార్క్వెజ్‌ని గుర్తుచేసుకుంటాను. తన సాహిత్యమంతా ‘beautiful labyrinth of human experience’ చెప్పుకుంటాడు ఆయన. నా రచనల్లోని మిరాకిల్స్ అన్నీ, నా ఇమాజినేషన్ నుంచే పుట్టాయి అంటాడు. కథలో, నవలలో, మన మరో జీవితం కదా; అవి కలల్లాగా మన జీవితాల్లోని సంక్లిష్టతని, వర్ణమిశ్రమాన్ని తెలియజేయాలి కదా;
“Where races condemned to one hundred years of solitude, will have, at last and forever, a second opportunity on earth”
అంటాడు మార్క్వెజ్, తన నోబుల్ బహుమతి స్వీకరణ ప్రసంగంలో. ‘one hundered years of solitude’ లోని, ఒక దృశం : జోస్ అర్కాడియో బోండియా, ‘మెకాండో’ సమాజపు నాయకుడు, తన సమూహాన్ని (ప్రపంచం తెలియని) ఆ అజ్ఞాత భూమి నుంచి మరో ప్రాంతానికి తరలించాలని, ప్రయత్నిస్తాడు. సమస్తం ధ్వంసం కాబోతుందని అతనికి తెలుసు. తన జాతిని కాపాడుకోవాలని; అయితే ఎవరూ అతనితో రారు. ఆఖరికి ఆయన కుటుంబం కూడా. అతని భార్య(ఉర్సుల)తో, ‘మరణం ఇంకా రాలేదు కదా, ఇదే సమయం. ఇదేం మన సొంత భూమి కాదు చనిపోయి భూస్థాపితం అయినాక ఇది మన భూమి అవుతుంది. ఇప్పటికి అపరిచిత భూమే’ అంటాడు. ‘ఇదంతా నా చావు కోసమే అయితే, మీ అందరి కోసం, నేను ఇక్కడే చచ్చిపోతాను’ అంటుంది ఉర్సుల.

భూములన్నీ అపరిచిత భూములౌతున్న సందర్భం, ‘మెకాండో’ లాంటి ఒక ప్రాంతంలా ప్రపంచమంతా మారుతున్న వేళ; మనందరం జోస్ అర్కాడియో బోండియా, వారసులం అయినవేళ, మార్క్వెజ్ భవిష్యత్ దర్శనాన్ని చేసిన రచయితగా, ఆయన రచనలు ఎపిక్‌లుగా మారటంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎలిజీలో మార్క్వెజ్ కథా మాంత్రికుణ్ణి గుర్తుచేసుకుంటాను. అటు ఫెడరల్ కాస్ట్రో, ఇటు బిల్ క్లింటన్ ఇద్దరూ అతని అభిమానులే. బైబిల్ తరువాత తను ఇష్టపడే పుస్తకం మార్క్వెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కలరా’ అంటాడు ఒక అమెరికన్ రచయిత. మార్క్వెజ్ రాసింది కొత్త ప్రపంచమే కాదు, మనం జీవిస్తున్న ఇవాళ్టి ప్రపంచమే అంటాడు సాల్మన్ రష్దీ.

‘Living to tell the tale’ నుంచి ఒక జ్ఞాపకం : మార్క్వెజ్ తాతకో వర్క్ షాపు ఉండేది. వర్క్‌షాపు గోడలన్నిటినీ తెల్లరంగుతో అలంకరిస్తాడు ఆయన. తన మనుమడిలో ఆ తెలుపు వర్ణం, సరికొత్త స్వప్నాల్ని, అద్భుతమైన ఊహల్ని మొలకెత్తించాలని, ఆయన కోరిక. నానమ్మ Fortune Teller; సాధారణదృశ్యాల్ని, అసాధారణ అనుభవాలుగా మార్చటం ఎట్లాగో తెలియజేసేది. ‘చూడు, చూడు, తోటల్లోని మల్లెల పరిమళం, మనపై దాడిచేస్తున్నట్లుగా ఉంది కదూ; కనపడని ఆత్మల దాడి అట్లాగే ఉంటుంది’ అనేది.

మార్క్వెజ్ బాల్యమంతా ‘అరకటకా’ అనే మారుమూల పట్టణంలో గడిచింది. తుఫానులు, ఉప్పెనలు, భీకరమైన కరువు, ముంచెత్తే వరదలు; బనానా – ఫీవర్, ప్లేగు; బహుశా అరకటకా జ్ఞాపకాల్లో, లోలోపల దాగి, మెకాండో అనే ప్రదేశంగా (Hundred years of solitude) రూపుదిద్దుకొని ఉంటుంది. ‘మెకాండో’ వాస్తవం, స్వప్నం రెండూ కలసిపోయి, ఒకానొక మర్మదేశంలా; బహుశా ఆనాటి లాటిన్ అమెరికా దేశాల స్థితిని ‘మెటా ఫర్’గా చూపించాడు మార్క్వెజ్. సామాజిక సూత్రాలు పనికిరాని కాలంలో, నమ్ముకున్న ఉద్యమాలు తెరలు దించేసిన కాలంలో, నాయకులంతా విదూషకుల్లా, శకారుల్లా మారిన కాలంలో; మార్క్వెజ్ సాహిత్యం ఎంత relevence అర్థమవుతుంది.

మార్క్వెజ్ భాష ప్రత్యేకమైంది. తన కాలపు స్వప్నాల్నీ ఫాంటసీలను నిక్షిప్తం చేసుకున్న భాష అది. తట్టుకోలేని బీభత్సం, మరణం, వందలాది నియంతల ఉద్భవం, అంతర్యుద్ధాలు, వాటిని చెప్పడానికి తన భాషకు సర్రియల్ టచ్ ఇచ్చాడు మార్క్వెజ్. మామూలు వచన మే, హఠాత్తుగా వందలాది ఇమేజస్‌లా మారుతుంది. భాషకు ఐంద్ర జాలిక శక్తులు వస్తాయి. ఒక Poetic Process వస్తుంది. సమాజంలోని Obsessions, Distrubences నెరేటివ్‌లోకి ప్రవేశిస్తాయి. Dark humour, Fantasy కథా నిర్మాణంలోకి ప్రవేశిస్తాయి. మార్క్వెజ్ కథలు ఒక Evocation (సంరావించటం) లా అనిపిస్తాయి. పాఠకుడిలో ఒక Illusion లాంటిది నిర్మితమవుతుంది. వచనం, ఒక Visual imaginationను కలిగిస్తుంది.

అయితే ఈ చర్య బౌద్ధిక స్థాయిలో జరుగుతుంది. ఒకానొక ఉద్వేగాన్ని, నెరేటివ్‌లో ప్రవేశపెట్టే ప్రయత్నంలో,visual imagination, ఒక ‘సర్రియల్ ఎటాక్’లా మారిపోతుంది. విశాలమైన రెక్కలున్న మనిషి, మన పెరట్లో జారిపడతాడు. అతనితో మనం, మన పిల్లలు మామూలుగానే సంభాషిస్తుంటాము. అతనికొక దుఃఖం, కథ; పిల్లి లోపల నివశించే ఆడమనిషి కథ చెబుతాడు. చనిపోయిన పొరుగింటి పిల్ల శరీరం, శవపేటికలో, రోజురోజుకీ అట్లా పెరుగుతూనే ఉంటుంది.
జర్నలిస్టుగా పనిచేసిన మార్క్వెజ్, తన కథా భాషలో ఫాల్కనర్, జాయిస్‌ల వచనాల్లో కనబడే రిధమ్‌ని, కాఫ్కా నుంచి మెటాఫోరికల్ స్పర్శను, బోర్జస్‌లా కలల్లాంటి ఇమేజిరీని, అన్నింటినీ కలగలపిన తనదైన భాషను సృష్టించుకున్నారు. ఆయన కథా భాష నిండా నిశ్శబ్ద మాంత్రికత ఉంటుంది.

లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా, ప్రేమ పైన గొప్ప వ్యాఖ్యానం. ప్రేమ గురించిన ఒక మెడిటేషన్. spiritual history of human sexuality
అది. the autumn of patriarch ఒక epic, లాటిన్. అమెరికా రాజకీయ చరిత్ర ; తనకాలపు నియంతలందరి పోలికలతో ఒక పాత్రలా రూపొందిన నవల.
మార్క్వెజ్, తన రచనల్లో కాలం, జ్ఞాపకం మానవుని కలలు, ఆశలు, వాటిని నిరూపించడానికి ప్రయత్నించారు. ఆయన రచనలు మనతో సంభాషిస్తాయి. అవి మనపై ‘mild sorcery’లా పనిచేస్తాయి. మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్రలోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imaginationను నమ్మినవాడు. మన లోపల దాగిన సత్యాన్ని వెలికి తీయడానికి, ఒక charmను, magic చేసే prose కనిపెట్టాడు. త్రోసుకొచ్చే మరణపు రాత్రుల్ని ఆపివేసే, వెలుగుల కిరణాల, ఎగిరే పక్షుల రెక్కల, శక్తిని తన పాత్రలకు ఇచ్చిన కథా/ నవలా మాంత్రికుడు మార్క్వెజ్. ఆయనకు వీడ్కోలు.
– డాక్టర్ వి. చంద్రశేఖరరావు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.