మా నవరాత్రి యాత్ర -15
ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర దర్శనం
ఖజురహో నుండి ఏప్రిల్ పదమూడ వ తేదీ ఆదివారం సాయంత్రం బయల్దేరి నిజాముద్దీన్ ,ఇండోర్ ఎక్స్ప్రెస్ లను ఎక్కి ఝాన్సి ద్వారా ఉజ్జైన్ కు 14సోమవారం మధ్యాహ్నం పదకొండుగంటలకు చేరాం .రైల్వే రిటైరింగ్ రూమ్ లు రెండు మా అబ్బాయి శర్మ ముందే బుక్ చేశాడు .కనుక తొమ్మిదో నంబర్ ప్లాట్ ఫాం నుండి తోపుడు బండి వాడి సాయంతో ఒకటో నంబర్ ప్లాట్ ఫాం దగ్గరున్న రిటైరింగ్ రూమ్ లకు చేరుకొన్నాం. ఇక్కడ పాస్ పోర్ట్ ఐడెంటిటి చూపించాలంటే చూపించాను .సామాన్లు రూమ్ లోకి చేర్చి హాయిగావేడినీళ్ళ స్నానాలు చేశాము.రెండు ఏ.సి లున్నాయి .విశాలమైణ డీలక్స్ రూములు .అద్దె అయిదు వందలే .ఉన్నదేదో తిని విశ్రాంతి తీసుకొన్నాం .విజ్జి ,రమణ కిందికి వెళ్లి అన్నం ,పెరుగు కొనుక్కోచ్చారు .పెరుగులో అన్నం కలిపి తిన్నాం .దాదాపు మూడు రోజుల నుండి తిండి లేనే లేదు .హార్లిక్స్ బిస్కేట్లే నాకు ఆహారం .ఏదీ తినాలని పించలేదు .మా అమ్మాయి నా విషయం లోను వాళ్ళ మ్మ విషయం లోను శ్రద్ధ తీసుకొని గ్లాసులకు గ్లాసులు మజ్జిగ ఆరగా ఆరగా ఇచ్చి తాగిస్తూ నీరసాన్ని తగ్గించింది .మెడికల్ షాప్ కు వెళ్లి మా ఇద్దరికీ కాప్సిల్లు టాబ్లెట్లు తినే ముందు ఒకటి తిన్న తర్వాత ఒకటి వేసి మింగించింది .రాత్రికి కొంత ఉపశమనం కలిగింది .
సోమవారం ఉజ్జయినిలో ఉన్నాం కనుక జ్యోతిర్లింగం అయిన శ్రీ మహా కాళేశ్వర దర్శనం చేసి తరించాలను కొన్నాం .సాయంకాలం మళ్ళీ స్నానాలు చేసి చేతిలో ఏమీ లేకుండా రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న’’ మహాకాళ్’’దర్శనానికి ఆటోలో వెళ్లాం .ఇక్కడ అందరూ మహాకాల్ టెంపుల్ అంటారు. అక్కడ పెద్దగా క్యూ లేదు .మేము టికెట్ కొని వెళ్ళే మార్గం లో వెడుతుంటే మా ముగ్గుర్ని పంపి మా అమ్మాయిని గేట్ దగ్గర ఆపి టికెట్ కొనమన్నారు .అప్పటికే మేము ఆలయ ప్రవేశం చేశాం .ఏమనుకొన్నారో ఏమో మా అమ్మాయికి మాత్రమె టికెట్ డబ్బు 150రూపాయలు తీసుకొని లోపలి పంపారు .లోపల జనం బాగానే చేరారు .దర్శనం మహా దివ్యం గా జరిగింది .ఎన్నాళ్ళ కలో ఇప్పటికి తీరింది .ఆరున్నర నుంచి ఏడింటి వరకు హారతి జరిగింది .శంఖాలు దమురుక నాదాలు తప్పెట్లు తాళాలతో అపర కైలాసమే అని పించింది .ఒకాయన తప్పెట మోగిస్తూ విపరీతం గా తన్మయం లో ఊగి పోయాడు .ఎప్పుడో కాశీ లో శ్రీ విశ్వేశ్వరాలయం లో ఈ అనుభూతిని పొందాం. మళ్ళీ ఇక్కడ లభించింది .అందరం పరమ సంతోష పడ్డాం .జన్మ కో శివరాత్రి అని పించింది .జీవితం ధన్యమని భావించాము .ఈతన్మయత్వం లో శివ స్తోత్రాలే మర్చిపోయానని పించింది .అంతటి ఆనంద స్థితి అది .ఆలయం ఏర్పాట్లు బాగా ఉన్నాయి .ఎక్కడా అసౌకర్యం కని పించలేదు నెమ్మది గా బయటికి వచ్చాం .అక్కడే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దర్శించాం .మంగళ వారం మా స్వామి దర్శనం లభించతమూ పరమానందమే ఆలయం బయట హోటల్ లో మా అమ్మాయి పెరుగు ,అన్నం తీసుకొన్నది .మళ్ళీ ఆటోలో రూములకు చేరుకొన్నాం .
ఇలా మహా పవిత్ర సోమవారం ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర సన్నిధిలో గడిపాం .రాత్రి పెందరాళేపడుకోన్నాం .
ఉజ్జయిని లో స్పెషల్ ‘’భస్మ హారతి ‘’ దీన్ని తెల్లవారుజ్హామున నాలుగింటి నుండి ఆరువరకు జరుపుతారు .దీనిని దర్శించాలంటే వారం పది రోజుల ముందే ‘’ఆన్ లైన్ లో రిజర్వ్ ‘’చేయించుకోవాలి .మా పక్కింటి మేష్టారు వాళ్ళు వెళ్లి వచ్చారుకనుక విషయం తెలిసి మా అబ్బాయి శర్మ తో మా నలుగురికి ఆన్ లైన్ భస్మ హారతి దర్శనానికి 15ఉదయానికి బుక్ చేయించాం .దీనికి రుసుమేమేమీ లేదు .పాస్ పోర్ట్ ఆధారం గా ఫోటో ఐడెంటిటి ఉంటుంది .దాన్ని సబ్మిట్ చేసి నెట్ ద్వారా బుక్ చేయాలి ఆ తంటాలేవో మా శర్మే మాకోసం పడ్డాడు .వాళ్ళ అనుమతిని ప్రింట్ అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోన్నాం .
15వ తేదీ మంగళ వారం తెల్ల వారు జామున రెండున్నరకే లేచాం .స్నానాలు చేశాం . మగవాళ్ళు పంచ ఉత్తరీయాలతో ,ఆడవాళ్ళు చీర జాకెట్ లతో నే దర్శించాలి .భస్మ హారతి సమయం లో ఆడవారు నెత్తిమీద ముసుగు తప్పక ధరించాలి .ముసుగు లేకుండా భస్మ హారతి చూడరాదని నియమం .అలానే తయారై బయల్దేరి ఆటోలో పావుతక్కువ నాలుగుకు చేరాం .మెటల్ డిటెక్టర్ సాయం తో తనిఖీ చేసి ఆన్ లైన్ రిజర్వేషన్ కాగితాలతో మనుషులను గుర్తించి లోపలి అనుమతించారు .జనం బాగానే ఉన్నారు .నాలుగు గంటల నుండి మనం వెంట తీసుకొని వెళ్ళిన చెంబు తో దేవాలయం లో రెడీ గా ఉన్న నీటిని నింపుకొని లైన్ లో నిలబడాలి .క్యూప్రారంభం అయింది. అందరూ ఒక్కొక్కరుగా గర్భాలయం ప్రవేశించి శ్రీ మహాకాలేశ్వార్ జ్యోతిర్లిన్గాన్ని తనివి తీరా స్పర్శించి తెచ్చిన నీటిని అభిషేకం చేయాలి అలానే మేమూ చేశాం .ఇదో దివ్యానుభూతి .ఇది అయ్యేసరికి నాలుగు ఇరవై అయింది .అప్పుడు ముందున్న ఖాళీ ప్రదేశం లో వరుసలలో కూర్చున్నాం .వెనక మెట్ల వరుసలో కొందరు కూర్చున్నారు .భక్తుల అభిషేకం తరువాత ఆలయ పూజారులు అభిషేకం చేయటం మొదలు పెట్టారు .నమకం విని పించింది కాని చమకం వినిపించలేదను కొన్నాను .క్షీరం ,పండ్ల రసం పెరుగు నేయి మొదలైన వాటితో జ్యోతిర్లిన్గానికి అభిషేకం చేసి చివరికి జలాభిషేకం చేశారు ఇవన్నీ క్లోజేడ్ సర్క్యూట్ టి వి లలో కూడా చూసే ఏర్పాటు చేశారు .కనుక ఏదీ మిస్ అయ్యం అయ్యాం అని పించదు .ఆ తర్వాత లింగానికి అలంకరణ చేస్తారు .మూతి పెదవులు కన్నులు ముక్కు చెవులు అన్నిటిని గంధం తో తీర్చి దిద్ది పరమ వైభవం గా శివలింగాన్ని మానవాకృతి ముఖం గా మారుస్తారు .భక్తులు తెచ్చిన ప్రసాదాలు వస్త్రాలు వరుసగా తీసుకొని స్వామి ముందు ఉంచి మళ్ళీ ఎవరివి వారికి అందజేయటం ప్రత్యేకం గా కని పించింది .స్త్రీ వాలంటీర్లు కూడా చాలా శ్రద్ధ గా విధులు నిర్వహించటం బాగుంది .
ఇదంతా అయిన తర్వాత ఒక తెల్ల గుడ్డలో స్మశానం నుంచి తెచ్చిన ‘’చితా భస్మాన్ని’’ మూట గా కట్టి జ్యోతిర్లింగం పై వరుసగా చల్లి అభిషేకం చేయటమే భస్మ హారతి .ఒక పది నిమిషాలు. లింగం పాన వట్టం మీద ఒక్క సెంటి మీటరు కూడా వదల కుండా భస్మం తో అభిషేకిస్తారు. ఇదీ ఉజ్జయిని ప్రత్యేకత .భస్మాభిషేకం తరువాత స్వామికి నూతన వస్త్రాలను సమర్పించి అలంకారం గా ఉంచుతారు .తరువాత వివిధ దీపాలతో వివిధ భంగిమల తో అనేక రకాలుగా హారతినిస్తారు. ఈ హారతికి పావు గంట పడుతుంది .చూసి తీరాల్సిందే ఇది .ఇదొక మహా విభూతి అని పించింది .ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఈ దివ్య దర్శనం అనిపిస్తుంది .ఈ జన్మకు ఇది చాలు అని సంతృప్తి కలుగుతుంది ,కలిగింది .నేను మనసులో ‘’మిధున పతయే నమః మిధున పతాన్తికాయనమః ఊర్ధ్వాయనమః ఊర్ధ్వ లింగాయనమః ‘’అను కొంటూ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా చూసి తరించాను .
మా శర్మ ఉజ్జైన్ నుండి రెండువందల కిలో మీటర్లకు పైగా ఉన్న నర్మదానదీ తీరం లోని ఓంకార జ్యోతిర్లింగా క్షేత్ర దర్శానికి ఇండికా కార్ బుక్ చేశాడు .డ్రైవర్ కు ఫోన్ చేసి ఉదయం ఎనిమిదింటికి స్టేషన్ దగ్గరకు రమ్మని చెప్పాం .ఆలయం నుండి బయటికి వచ్చి కాఫీ తాగాం .ప్రసాదాలు కొన్నాం .ఆటోలో రూమ్స్ కు చేరాం .డ్రైవర్ కోసం ఎదురు చూస్తూన్నాం .ఎనిమిదింటికి డ్రైవర్ వచ్చి ఫోన్ చేశాడు .అందరం బయల్దేరి ఇండికా కారు లో ఎక్కి కూర్చున్నాం .ఇక ఓంకారేశ్వర్ కు బయల్దేరాం .ఆ యాత్రవిశేషాలు తరువాత తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-14-ఉయ్యూరు