మా నవ రాత్రి యాత్ర-17 ఓంకారేశ్వర యాత్ర

మా నవ రాత్రి యాత్ర-17

ఓంకారేశ్వర యాత్ర

ఏప్రిల్ 15మంగళ వారం తెల్లవారు జామున శ్రీ మహాకాకేశ్వర భస్మహారతి కార్యక్రమం లో పాల్గొని ఎనిమిది గంటలకు ఇండికా కారు లో మేము నలుగురం ఎక్కి ఓంకారేశ్వర దర్శనానికి బయల్దేరాం .ఇండోర్ మీదుగా వింధ్య పర్వతాల గుండా ప్రయాణం .శ్రీశైలం వెళ్ళే మార్గం లా అని పిస్తుంది .ఉజ్జైన్ కు సుమారు యాభై కిలో మీటర్ల దూరం లో ఇండోర్ ఉంది.ఇది ఒకప్పటి సంస్థానం .రైల్వే కూడలి .మాల్వా పీఠ భూమి భాగం .దాదాపు ఒక గంట ప్రయాణం తర్వాతా రోడ్డు పక్క దాభా దగ్గర ఆగాం .నాకేమీ తినాలని పించేలేదు .నేను మా ఆవిడ సగం కాఫీ తాగాం .రమణ చపాతీ తిన్నాడు .మా ఇద్దరికీ దారిలో మజ్జిగా బిస్కెట్లు స్ప్రైట్ మాత్రమె ఆహారం .ఉదయం పదిన్నరకు అంటే రెండున్నర గంటల ప్రయాణం తర్వాత నర్మదా నదీ తీరం నర్మదా ఆనకట్ట దగ్గరకు చేరాం .ఓంకార్ కు పన్నెండు కిలో మీటర్ల దూరం లో ‘’ఓంకారేశ్వర్ రోడ్ ‘’రైల్వే స్టేషన్ ఉంది .అక్కడినుంచి ఇక్కడికి యాత్రికులు ఆటోలో చేరుకొంటారు .మధ్యాహ్నం పన్నెండున్నరకు దేవాలయాలు మూసేస్తారని మా కారు డ్రైవర్ సోనీ చెప్పాడు .అక్కడ పడవ వాళ్ళు వచ్చి మూగుతారు .ఒక పడవను రానూ పోనూ మనిషికి వంద రూపాయలకు మాట్లాడుకొన్నాం .

నది గట్టు ఎత్తుగా ఉంటుంది. స్తీప్ గా జారుతూ దిగి నర్మదా నది ఒడ్డుకు చేరాం .ప్రవాహం బాగా ఉంది .డాం కు దగ్గరలో నర్మదా ,కవేరియా రేవా నదులు సంగమిస్తాయి .అందుకే దీన్ని త్రివేణీ అంటారు   .బోటు వాడు ముందుగా అవతలి తీరం దగ్గరకు స్నానాల రేవు దగ్గరకు చేర్చి స్నానం చేసి ఓంకారేశ్వర దర్శనం చేసి మున్దూన్న రేవు దగ్గర నున్చోమన్నాడు .మధ్యలో మాలో మేము ‘’డిషుం డిషుం’’ మాటామాటా అనుకోవటం మూతులు బిగేసుకోవటం ఒక పావుగంట డ్రామా సాగింది .మా అమ్మాయికి నేను కేక లేసానని కోపమూ వచ్చింది .స్నానానికి నేను కాళ్ళ డ్రాయరు ,తువ్వాల తీసుకొని దిగాను. మా ఆవిడా నాతో దిగింది .చల్లగా నర్మదా జలం సేద దీరేల ఉన్నది .ఇదే మొదటి సారి నర్మదా నదిని దర్శించటం స్నానించటం . పది నిమిషాలు హాయిగా స్నానం చేశాం .స్నానమంత్రం నేనే చెప్పాను .ఫోటోలు ఒక్కొక్కటి పది రూపాయలిచ్చి ఇన్స్టంట్ ఫోట్లు స్నాన ఘట్టం లో తీయిన్చుకోన్నాం .మా అబ్బాయి రమణ తో కూడా మంత్రం చెప్పి స్నానం చేయించాను .మా అమ్మాయి ‘’షటించి’’ స్నానానికి దిగ లేదు .మేము నర్మదా నీళ్ళు దానిపై చిలకరించి స్నానం చేసిన ఫలితం కలిగించాము .బట్టలు మార్చుకోన్నాం .ఇక్కడ నది రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది .మేము స్నానం చేసిన తీరం లో మెట్లు ఎక్కి పైకి వెడితే ‘’ఓంకారేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది .దీనికి ఎదురుగుండా ఉన్న రేవు దగ్గర ‘’మమలేశ్వరాలయం ఉంది .ఈ రెండిటిని ఇక్కడ జ్యోతిర్లిన్గాలనే అంటారు .

స్నాన ఘట్టం నుండి నెమ్మదిగా ఎత్తైన మెట్లు సుమారు ఎనభై ఎక్కితే కాని ఓంకారేశ్వర దర్శనం లభించదు .మాకు ఇబ్బంది లేదుకాని మా ఆవిడకు మెట్లు ఎక్కటం కష్టమే .అలాగే ఓపికగా నెమ్మదిగా మెట్లు ఎక్కి రాగలిగింది. క్షేత్ర మహాత్మ్యమే.  లేక పోతే మూడు రోజులుగా కడుపులో ఏదీ ఘన పదార్ధం పడకుండా ఇంత ఓపిక యెట్లా వస్తుంది?రెండు కొండల మధ్య బ్రిడ్జ్ లు కట్టారు .నడిచి అలానూ వెళ్ళ వచ్చు .పడవ ప్రయాణాన్నే మేము ఎంనుకోన్నాం .

శ్రీ గోవింద భగవత్ పాదుల వారి నివాసం

తీరం నుండి ఇరవై మెట్లు ఎక్కగానే కుడి వైపున ఒక గుహ ఉంటుంది .ఇక్కడీకే  శ్రీ శంకర భాగవత్పాదులనే ఆదిశంకరాచార్యుల వారు కేరళ నుండి చిన్నతనం లోనే తల్లి ఆర్యామ్బచేత సన్యాస దీక్షకు ఒప్పించి ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ తగిన గురువు ను వెదుక్కుంటూ ఈ నర్మదా తీరం లోని ఓంకార క్షేత్రానికి చేరుకొన్నారు .గోవింద భగవత్ పాదుల వారు అప్పుడు ఈ ప్రాంతం మహా విద్వాంసులుగా బ్రహ్మ సూత్రా ,వేదం శాస్త్ర అధ్యాపకులుగా చిర కీర్తి నార్జించి ఉన్నారు .శంకరాచార్య గురువు గారిని చేరి అనుమతి తో ఇక్కడే వారి ఆశ్రమం లో ఉన్నారు .ఒకరోజు అర్ధ రాత్రి నర్మదా నదికి విపరీతం గా వరదలు వచ్చి ఆశ్రమం లోకి ఉద్ధృతం గా ప్రవేశించ బోతోంది .గురువు గారు గాఢ నిద్రలో ఉన్నారు .భగవత్ పాదులు అపాయం గ్రహించి నర్మదా నది పై ఆశువుగా స్తోత్రసం చెప్పి ఆమె ను అనుగ్రహించి ఉద్ద్రుతాన్ని తగ్గించుకోమని ప్రార్ధించారు .శాంతించిన నర్మదామాత దిశ మార్చుకొని వెళ్లి పోయింది .ఉదయం లేచి గురువు గారు గోవింద భగవత్ పాదులు ప్రమాద విషయాన్ని శంకరుల  నివారణా రహస్యాన్ని గ్రహించారు .తాను ఎదురు చూస్తున శిష్యుడు శ్రీ శంకరులే అని గ్రహించి దీక్షనిచ్చి శిష్యునిగా స్వీకరించి విద్య నేర్పి బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయించారు .ఇక్కడ గుహలో ‘’’శ్రీ గోవింద భగవత్ పాదుల చిన్న విగ్రం శ్రీశంకరచార్యుల  విగ్రహాలు ఉండి చరిత్రకు సాక్షీ భూతం గా నిలుస్తున్నాయి .ఈ  ఫిబ్రవరి లో ఆదిశంకరుల జన్మస్థలం కేరళ లోని ‘’కాలడి’’ ని దర్శించటం ,ఇప్పుడు ఆయన దేశ సంచారం చేసి తగిన గురువు శ్రీ గోవింద భగవత్ పాడుల వద్ద శిష్యులై సన్యాస దీక్ష పొంది  విద్య నేర్చి గ్రంధ రచనకు శ్రీకారం చుట్టిన చరిత్ర సృష్టించినప్రదేశం ఓంకార క్షేత్ర దర్శనం చేయటం మా పూర్వ జన్మ సుకృతం .జన్మ చరితార్ధం .భక్తీ ప్రపత్తులతో ఆ గురుశిష్యులకు ప్రణమిల్లి మెల్లగా మెట్లెక్కి ఓంకారేశ్వర సన్నిధానం చేరుకొన్నాం .గుడి చిన్నది మార్గమూ ఇరుకు .దీనికి తోడూ’’ పండాల’’  ‘’దందా’’ .పైనుంచి చూస్తె శోభాయమానమైన ప్రదేశం ళా అని పిస్తుంది .ఓంకారేశ్వరుడినే ‘’అమరేశ్వరుడు ‘’అని కూడా అంటారు .ఈ జ్యోతిర్లిన్గాన్ని స్ప్రుశిన్చాటానికి ,అభిషేకం చేయటానికి వీలు లేకుండా గ్లాసు చేంబర్ ఉంటుంది .ప్రక్కనే ఉన్న మరో లింగానికే అభిషేకం పూజా .ఇది స్పర్శనీయం .మా అమ్మాయి కూడా లోపలి వచ్చి మా ముగ్గురితో బాటు దర్శనం చేసుకొన్నది .మా రమణను ఒక ‘’పండా.’’పట్టుకొని పూజ అంటూ వెంబడి పడ్డాడు. వాడు మేము ఒద్దని చెప్పినా ఆలయం బయట హాలులో కూర్చో బెట్టి ‘’భుషం భుషం ‘’అంటూ చెప్పిన మంత్రాలే చెప్పి మాతో కూర్చోబెట్టి కలశ ఆవాహన చేసి పూజ లాగా ఏదో చేసి ‘’రెండు వందలు ‘’మా వాడి దగ్గర నొక్కేశాడు .సరే అనుకొన్నాం .అమ్మవారి దర్శనమూ చేసి మెట్లు దిగి మళ్ళీ రేవు దగ్గరకు చేరంగానే పడవ వాడు రెడీ గా ఉన్నాడు .

బోటు ఎక్కి నెమ్మదిగా అవతలి ఒడ్డున ఉన్న శ్రీ మమలేశ్వరజ్యోతిర్లింగ దేవాలయానికి చేరుకొన్నాం .గట్టుకు దగ్గరే పెద్దగా మెట్లు ఎక్కక్కర లేదు .రద్దీ లేదు హాయిగా విశ్రాంతిగా శ్రీ మామలేశ్వర జ్యోతిర్లింగా దర్శనం చేశాం .దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర  దాటింది .అక్కడే బయట బత్తాయి రసం తాగి సేద దీరాం .ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుగులో డివిడి ఉజ్జైన్ పై డివిడి రెండూ కలిపి వంద రూపాయలకు కొన్నాం .ప్రసాదాలు తీసుకొన్నాం .ఆలయం బయట ఇద్దరు కుర్రాళ్ళు మొలతాడు లాంటి దారాలతో మనం ఏ పేరు చెబితే ఆపేరు తో’’ బ్రెస్ లెట్’’ తయారు చేస్తున్నారు . మా అబ్బాయి అమ్మాయి చూశారు ఆ ఆర్ట్ ముచ్చటగా ఉంది .మా మనవాళ్ళు మనవ రాళ్ళు అందరికీ తలోటి ఆర్డర్ ఇచ్చి అల్లించారు .రమణ వాడి విలేకరి మిత్రుల పేర ఆర్డర్ ఇచ్చి అల్లించాడు .ఒక్కో దాని ఖరీదు పది రూపాయలే  అల్లిక  మహా తమాషా గా ఉంది .దారం ఖరీదు కూడా రాదు ఆ రేట్ కి .వాళ్ళ నైపుణ్యానికి వేల కట్టలేము .

రెండుకొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలు ఆకాశం నుండి చూస్తె ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు .ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం రాయబడి ఉంటుంది .

ఉమా మహేశ్వర పురం

సుమారు రెండున్నరకు మళ్ళీ కారులో బయల్దేరాం .నాలుగు గంటలకు ‘’ఉమామహేశ్వరం ‘’అనే గ్రామం చేరాం .ఇది నర్మదా  నది ఒడ్డున ఉంది .ఇక్కడే హోల్కార్ రాజులు నదీ తీరాన బ్రహ్మాండమైన కోట కట్టుకొన్నారు ఉమామహేశ్వర దేవాలయం నిర్మించారు .పాటిస్ట మైన భద్రత కలిగించారు .శ్రీరామ మందిరమూ శ్రీ హనుమ విగ్రహమూ ఉంది .మెట్లు దిగి ఇవన్నీ చూశాము  ముగ్గురం.మా ఆవిడా కారులోనే కూర్చుంది .హోల్కరు  రాణి అహల్యా బాయి నిలు వెత్తు కాంశ్య  విగ్రహం కోట బయట ఉంది .ఆమె చేతిలో భక్తీ ప్రపత్తులతో పట్టుకొన్న శివ లింగం ఉంటుంది .

అహల్యా బాయి భర్త ,మామ గారు నిరంతరం యుద్ధాలలో మునిగి ,రాజ్య విస్తరణ కోసం పోరాడుతూ ఉండేవారు .అహల్యా బాయి కోటను సంరక్షిస్తూ ప్రజల ఆలనా పాలనా చూసేది .కాశీ నుంచి రామేశ్వరం దాకా ఆమె అనేక దేవాలయాలకు ఎన్నో సేవలందించింది ,యాత్రికులకు సౌకర్యాలు కలిగించింది .అన్నసత్రాలు ఎర్పరచింది. ఆమె కీర్తి చిరస్థాయి గా ఉండిపోయింది .మంచి డిప్లమాట్ గా పేరు పొందింది .భర్త రాజా కుమ్భేర్ హోల్కార్  యుద్ధం లో 1754లో మరణించాడు.పన్నెండేళ్ళ  తర్వాత మామగారు  మల్హర్ రావు హోల్కార్ మరణించాడు .ఏడాది తర్వాత ‘’మాల్వా ‘’సామ్రాజ్యానికి రాణి గా పట్టాభిషిక్తురాలైంది .’’ధగ్గుల ‘’దోపిడీ నుంచి రాజ్యాన్ని కాపాడింది .తుక్కోజి రావు హోల్కార్ ను ముఖ్య సేనాని గా నియమించి స్వయం గా యుద్ధానికి దిగింది .

రాణీ అహల్యా బాయి దేశం లో ఎన్నో దేవాలయాలను నిర్మించింది. అన్నసత్రాలను ఏర్పరచింది .గుజరాత్ లోని ద్వారకలో ,ఉత్తర ప్రదేశ్లోని కాశీ లో ,ఉజ్జైన్ లో నాసిక్ లో  గయా లో ,వైద్య నాద లలో ధర్మ శాలలను నిర్మించి సేవలందించింది  గుజరాత్ లోని జ్యోతిర్లింగా క్షేత్మ్త్రమైన సోమనాద్ లో సోమనాదాలయం ధ్వంసం కాగా దగ్గరుండి కొత్త ఆలయాన్ని నిర్మించిన మహా భక్తురాలు రాణి అహల్యా బాయ్ .దాదాపు వంద క్షేత్రాలలో అహల్యా బాయి దేవాలయలు ధర్మశాలలు నిర్మించి చరిత్ర సృష్టించింది .హోల్కార్ రాజ వంశీకులు ప్రజాధనాన్ని తమ స్వంత ఖర్చుల కోసం విని యోగించుకొని త్యాగ దనులు .వారి స్వంత డబ్బునే తమకోసమైనా దేవాలయ ధర్మ శాలల నిర్మాణ నిర్వహణల కైనా ఖర్చు చేసిన గొప్ప రాజ వంశం హోల్కారులది .రాణి అహల్యా బాయి కి సంవత్సరానికి ఆకాలం లోనే పదహారు కోట్ల స్వంత ఆదాయం వచ్చేది. దానినే ఖర్చు చేసేది. ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేదికాదు.35 ఏళ్ళు రాజ్య పాలన చేసి 1795ఆగస్ట్ పదమూడున రాణి అహల్యాబాయి స్వర్గాస్తురాలైంది .ఇంతటి మహనీయురాలు తిరుగాడిన నేల పై మేమూ తిరిగామనే గర్వం కలిగింది .రాజ దర్బారు రాజ మందిరాలు అన్నీ పకడ్బందీ గా ఉన్నాయి .ప్రభుత్వం ఉమా మహేశ్వరం ను జాతీయ స్మారక చిహ్నం గా చేసి సైనిక కాపలా పెట్టి సంరక్షిస్తున్నారు .

మళ్ళీ బయల్దేరాం .మా అమ్మాయి కోట దగ్గర ఒక అమ్మాయి అమ్మిన ‘’శివ లింగం ఆకారం ‘’ఉన్నదీ ‘’శివ పార్వతుల’’ ఆకారం లో ఉన్నదీ అయిన రెండు రుద్రాక్షలను ఇరవై రూపాయలిచ్చి కొన్నది .దారిలో నర్మదా నది నుండి ఇండోర్ కు నీటి సప్ప్లైని కొండలమీదనుంచి పెద్ద పెద్ద వేడల్పు గొట్టాలతో సరఫరా చేసే వాటర్ స్కీం క ని పించింది .ఇండోర్ మీదుగా ఉజ్జైన్ కు రాత్రి ఎనిమిదింటికి చేరాం .మళ్ళీ మూడో సారి శ్రీ మహా కాలేశ్వర దర్శనం చేద్దామంటే మా వాళ్ళు ‘’రాలేము బాబోయ్’’ అన్నారు  నేనుమాత్రం  వెంటనే స్నానం చేసి బయటికొచ్చి ఆటోలో రాత్రి తొమ్మిదింటికి బయల్దేరి శ్రీ కాలేశ్వర జ్యోతిర్లిన్గాన్ని మూడవ సారి మహా ఆనందం గా స్పర్శించి దర్శించి తరించాను .ఈ జన్మకు ఈ అనుభవం చాలు అని పించింది .జనం పెద్దగా లేరు హాయిగా. దర్శనం అయింది .కాళికా ఆలయం చూడాలంటే ఆటోలో వెళ్లాలని చెప్పారు. తిరిగి రూమ్ కు చేరి మజ్జిగ తాగి బిస్కెట్ తిని హాయిగా పడుకోన్నాం. తెల్ల వారు జామున మూడున్నరకు కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయ వాడ కు బయల్దేరి వెళ్ళాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నవ రాత్రి యాత్ర and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.