సాగు నీటికి, త్రాగునీటికి చెరువులు, కుంటలు త్రవ్వించి, వాగులకు అడ్డుకట్టలు వేయించి, కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడిన విశాల మానవతావాది నాగమ్మ. ఆమె శైవ మతస్థురాలైనా విశాల దృక్పథంతో పల్నాడులో అనేక వైష్ణవ దేవాలయాలను అభివృద్ధి పరచి తన మదిలో వున్న మత సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన కార్యశీలి. పల్నాటి యుద్ధానంతరం విరాగిగా తన జన్మస్థలమైన కరీంనగర్ జిల్లాలోని ఆర్వేల్లి గ్రామం వెళ్ళిపోతూ తన సంపదనంతా పేద ప్రజలకు పంచిపెట్టిన దానశీలి నాగమ్మ.
పల్నాటి రచయితల సంఘం అధ్యక్షులు వై.హెచ్.కె. మోహనరావు రచించిన ‘నాయకురాలు నాగమ్మ’ పుస్తకం తెలుగు సాహితీప్రియుల మన్ననలు అందుకుంటున్నందుకు రచయితకు అభినందనలు. ఇదే విషయం గురించి మోహనరావు విశ్లేషణ ‘నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణ’ వ్యాసం (ఏప్రిల్14, ఆంధ్రజ్యోతి) రచయితలను, విమర్శకారులను ఆకర్షించింది.
రచయిత తన పుస్తకంలో ‘నాయకురాలు నాగమ్మ’ను గురించి మరుగున పడిన ఎన్నో వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. నాగమ్మ మహామంత్రిణి గురించి ఎందరో కవులు, రచయితలు పక్షపాత ధోరణిని తమ రచనల్లో ప్రతిబింబించారు. వాస్తవ విషయాలను వెలుగులోకి తేకపోగా ఆమె చరిత్రను వక్రీకరించినట్లుగా తెలుస్తున్నది. చరిత్ర గతులను సవరించిన కొందరు రచయితలు నాగమ్మ పట్ల వివక్షా పూరిత వైఖరిని అవలంభించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. వారు ఒక పక్షం వైపు వొరిగి రచనలు సాగించి, మహా నాయకురాలి చరిత్రకు అన్యాయం చేసినట్లు తెలుస్తున్నది. మోహనరావు అభిప్రాయాలు సహేతుక నిదర్శనాలుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నాగమ్మ పలనాటి వీర వనితగా, శాంతి కాముక మూర్తిగా, మతసామరస్య ధీశాలిగా, బహుభాషా నిష్ణాతురాలిగా, సంగీత ప్రావీణ్యురాలిగా, మంచి పరిపాలనాదక్షురాలిగా చరిత్ర పుటల్లో నిలిచింది. మధ్యయుగంలో స్త్రీ వంటింటికే పరిమితమైన కాలంలో, స్వచ్ఛంగానే సహగమనం పాటిస్తున్న రోజుల్లో 12వ శతాబ్దంలోనే, ఎటువంటి రాజకీయ రాచరిక వారసత్వం లేని సాధారణ మహిళ, వైధవ్య జీవితం, కుటుంబ సభ్యులనందరినీ కోల్పోయిన ఆ ధీరవనిత, విశాల దృక్కోణం, కృషి, పట్టుదలతో, ప్రజలకు అత్యంత చేరువైంది. నలగామరాజు పాలనలో మంత్రి పదవి పొంది, రాజ ఖజానాను దోచుకున్న గజదొంగలను బంధించి రాజ సంపదనంతా తిరిగి ఆస్థాన ధనాగారానికి చేర్చిన శౌర్యమంతురాలు. తన సమర్థ పాలనతో ప్రజలకు చేరువై అభిమాన నాయకిగా వారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. సాగునీటికి, త్రాగునీటికి చెరువులు, కుంటలు త్రవ్వించి, వాగులకు అడ్డుకట్టలు వేయించి, కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడిన విశాల మానవతావాదిగా చరిత్ర పుటల్లో నిలిచింది. ఆమె శైవ మతస్థురాలైనా విశాల దృక్పథంతో పల్నాడులో అనేక వైష్ణవ దేవాలయాలను అభివృద్ధి పరచి తన మదిలో వున్న మత సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన కార్యశీలి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పల్నాటి చరిత్రలో అసాధారణ స్థానానికి చేరిన ఆమె వ్యక్తిత్వం చెరిగిపోని చారిత్రక చిహ్నం. ఆమె ఇల్లు ఆకలిగొన్న వారికి ఒక అక్షయ పాత్రగా వుండేదట. పల్నాటి యుద్ధానంతరం విరాగిగా తన జన్మస్థలమైన కరీంనగర్ జిల్లాలోని ఆర్వేల్లి గ్రామం వెళ్ళిపోతూ తన సంపదనంతా పేద ప్రజలకు పంచిపెట్టిన దానశీలి నాగమ్మ.
ఆమె అనన్య సామాన్యమైన సుగుణాలు, ధర్మనిరతి, మానవీయ విలువలు కలిగిన మానవతామూర్తి. నాగమ్మను గురించి రాసిన కవులు ఆమె ఉత్తమ నాయకత్వ లక్షణాలను, సత్‌శీల జీవితం, నిండైన మానవత్వ వ్యక్తిత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేక, నాయకురాలి ప్రామాణిక అంశాలను వదలివేసి ఆమే పల్నాటి యుద్ధానికి కారకురాలిగా చిత్రించటం మన దురదృష్టం. నాయకురాలి సుగుణశీలమైన వ్యక్తిత్వం, శాంతికాముక స్వభావం అనేక మంది రచనలలో వక్రభాష్యానికి లోనయ్యాయని మహాకవి శ్రీనాథుని ప్రామాణిక రచన ‘పలనాటి వీరచరిత్ర’ లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే వెల్లడవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. చాలామంది రచయితలు నాగమ్మనే నేరస్థురాలిగా చిత్రీకరిస్తూ వచ్చారు. శ్రీనాథుని రచనలోని అంశాలను మరుగున వేస్తూ నాయకురాలి గురించి వంకర భాష్యాలు చెబుతూ వచ్చారు. మోహనరావు అభిప్రాయ పడినట్లుగా ఆనాటి పలనాటి చరిత్రను రాసిన వారిలో నలుగురైదుగురు మినహా మిగిలిన వారందరూ మూల ప్రామాణిక గాథను దోవ తప్పించిన వారే అన్నది అక్షర సత్యం. అనేక మంది నాయకురాలిని యుద్ధ పిపాసిలా, కపటిలా, కుట్రదారుగా, దోషిగా, నేరస్థురాలిగా నిరూపించటానికి పలు కట్టుకథలు సృష్టించారు. బ్రహ్మనాయుని, బాలచంద్రుని తప్పిదాలన్నింటినీ నాయకురాలికి ఆపాదించి ఆమెను చారిత్రక యవనికపై ముద్దాయిగా నిలిపారు. పల్నాటి యుద్ధానికి నాయకురాలు నాగమ్మే కారణం అని సుమారు ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం చేస్తూనే ఉన్నారు. పల్నాటి రక్తపాతానికి నాగమ్మ యుద్ధకాంక్షే కారణమని, అనేక రచనల్లో చూపించబడుతున్నది.
పల్నాటి చరిత్రను గురించి ఎందరో కవులు ఎన్నో విషయాలు రాశారు. అక్కిరాజు ఉమాకాంతుడు ‘పల్నాటి వీరచరిత్ర’లో పల్నాటి యుద్ధానికి నాగమ్మే కారకురాలు అని, అతి పరాక్రమ శాలి అయిన ఈమె చేతిలో నలగామ రాజు కీలుబొమ్మ అని రాశారు. ఇది సత్యదూరమైన నింద. పల్నాటి యుద్ధానికి అనేక కారణాలు వున్నాయని ‘హైహయ రాజు’ల పాలనలో ‘పల్నాటి చరిత్ర’ అనే పుస్తకాన్ని రచించిన దాచేపల్లి వాస్తవ్యులు డా. వాచస్పృతి అభిప్రాయపడ్డారు.
శ్రీనాథుని ప్రామాణిక రచన పలనాటి వీరచరిత్రలోని నాగమ్మ పాత్రకు వక్రభాష్యం చెప్పారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి లాంటివారు కూడా తమ రచనల్లో సత్యదూరమైన సంగతులనే పొందుపరిచారు. అక్కిరాజు, త్రిపురనేని, పింగళి, ముదిగొండ, గుర్రం ఇంకా కొందరు కవులు నాయకురాలినే దుష్టురాలిగా చిత్రీకరించారు. అమెరికాకు చెందిన చరిత్ర పరిశోధకుడు G.H. ROGHAIR పల్నాటి ప్రాంతంతో పాటు, పలనాటి చరిత్రకు ఆనవాళ్ళు దొరికే ఇతర ప్రాంతాలు తిరిగి తన గ్రంథం THE EPIC OF PALNADUలో, కారంపూడి రణభూమికి తన సేనావాహినితో చేరుకున్న నాగమ్మ భవిష్యత్తును ఆలోచించి సుహృద్భావ ఆలోచన చేసి సంధి రాయబారం చేసి, ‘సంధి ఒడంబడికకు’ శ్రీకారం చుట్టిందని శ్రీనాథ మహాకవి విరచిత ‘పలనాటి వీరచరిత్ర’లోని బాలచంద్ర యుద్ధ ఘట్టం స్పష్టం చేసిందని విశదీకరించారు. పలనాటి చరిత్ర ఆవిష్కరించడానికి ప్రయత్నించిన అనేక మంది రచయితలు ప్రమాణాలను పాటించకుండా, నిజాలను గౌరవించకుండా నాయకురాలి వ్యక్తిత్వాన్ని కించపరచడానికే ప్రయత్నించినట్లుగా స్పష్టం అవుతున్నది.
పలనాటి సీమకే చెందిన (పిడుగురాళ్ళ), పలనాటి రచయితల సంఘం అధ్యక్షులు వై.హెచ్.కె. మోహనరావు చారిత్రక సత్యాన్వేషకులు. పల్నాటి పరిసర ప్రాంతాలన్నీ తిరిగి, అచ్చటి ప్రజలతో మమేకమై, ఆయా గ్రామ చరిత్రల అన్వేషణలో నిత్యం గడిపే అవగాహన వున్న వ్యక్తి. ఆయన రచించిన నాయకురాలు నాగమ్మ పుస్తకం రాబోయే తరాలకు మార్గదర్శకంగా వుంటుందనటంలో ఎలాంటి సందేహం వుండకూడదు. చారిత్రక పరిశోధనలో ఎవరికి లభించిన విషయాలను వారు వక్రీకరించకుండా భావితరం వారికి భద్రపరచవలసిన అవసరాన్ని, మోహనరావు తన పుస్తకం ‘నాయకురాలు నాగమ్మ’లోనే కాక ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడిన విశ్లేషణాత్మక వ్యాసంలో నిర్మొహమాటంగా విశదపరచారు. ఈ చారిత్రక సత్యగాథలో గత పరిశోధకులు స్వీకరించని అంశాలు, వెలుగులోకి రాని విషయాలను తన పుస్తకంలో స్పష్టం చేశారు మోహనరావు. పలనాటి వీరచరిత్రను గురించి వక్రీకరించిన రాతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడి, చారిత్రక గ్రంథాలను అనువుగా మలుచుకుని రాశారే తప్ప మోహనరావు లాగా నిజాన్ని నిర్ధారణ చేయలేదన్నది జగమెరిగిన సత్యమే.
ఇకనైనా నాయకురాలి వ్యక్తిత్వాన్ని ఆమె నీతిమంతమైన జీవన గమనాన్ని, అజేయమైన ఆమె ధీరత్వాన్ని తెలుగువారు నిజాయితీగా అర్థం చేసుకోవాలనే అభిప్రాయంతో వున్న మోహనరావు గారి ఆవేదనలో మనం పాలు పంచుకుందాం. ఇక ముందైనా ఆ ధీరవనిత, నాయకురాలు నాగమ్మ చరిత్రను వక్రీకరించకుండా వుండాలని మనసారా కోరుకుందాం.
– కొసరాజు వెంకటేశ్వరరావు
పురాతత్వవేత్త