బీసీలు, ఎస్సీలు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు.

బీసీలు, ఎస్సీలు అధికారంలోకి
ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నాయి. సీమాంధ్రలో తెలుగుదేశం నాయకుడు చం ద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రను రూపొందిస్తే, తెలంగాణలో టీఆర్ ఎస్ నాయకుడు బంగారు తెలంగాణను నిర్మిస్తానంటున్నాడు. వీటి అర్థమేంటి అనేది ప్రజలకు మాత్రం అర్థమైత లేదు. దేశచరిత్రలో గుప్త యుగాన్ని బ్రాహ్మణీయ చరిత్రకారులు ‘స్వర్ణ యుగం’ అని పిలిచారు. ఆ స్వర్ణయుగంలో నిజానికి జరిగిందేమిటో తెలుసా? వర్ణ వ్యవస్థను పటిష్ఠం చేసి కుల వ్యవస్థను ఇప్పుడున్న రూపంలో తీర్చిదిద్దారు! గుప్తులు వైశ్యులు కనుక వారికి జంజాలు వేసి వ్యాపారం చేసుకునే హక్కుతో పాటు రాజ్యమేలే హక్కు కల్పించబడింది. హిందూ జీవన విధానంలో చనిపోయిన వ్యక్తుల పార్థివ దేహాలు అంటరానివిగా ప్రకటించారు. దీనితో ఇప్పుడు మనం వాడుకలో చూస్తున్న ‘సూదకం’ ఉనికిలోకి వచ్చింది. మృత దేహాలను పరిశోధించి శరీర నిర్మాణాన్ని ఆవిష్కరించే విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ఆగిపోయింది. మూఢనమ్మకాలను విపరీతంగా పెంచారు. మానవ అంటరానితనాన్ని ఆకాశానికి ఎత్తారు. క్షత్రియులను మూడోస్థానంలోకి నెట్టి బ్రాహ్మణులు, వైశ్యులు ఇచ్చిపుచ్చుకునే కులాలుగా మారింది గుప్తుల స్వర్ణయుగంలోనే!
నేను గతంలో చెప్పినట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండు అగ్రకుల ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో ఒక అగ్రకుల ప్రాంతీయ పార్టీ తిష్ఠ వేశాయి. తెలంగాణలో తెలుగుదేశం బీసీల పార్టీగా అవతరిస్తుందని టీడీపీ చెబుతోంది. వాస్తవంగా ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణకు మేమే వారసులమంటున్న టీఆర్ఎస్ బంగారు తెలంగాణ స్వరూపాన్ని ముందు చూద్దాం. ఈ రాష్ట్ర ంలో అతి దయనీయ జీవితాన్ని గడుపుతున్న ప్రజలు గ్రామ, పట్టణ స్థాయి ఆదివాసులు, దళితులు, బీసీలుగా విభజింపబడి వున్నారు. ఇక్కడి ముస్లిం మైనార్టీలు, క్రైస్తవులు ఇక్కడి ఎస్సీ, బీసీలకు ఇటు, అటుగా ఉన్నారు. వీరిలో అత్యధికులు శ్రమ జీవులు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది. ప్రత్యేక రాష్ట్రమొస్తే తమ పరిస్థితి మెరుగుపడుతుందని, పిల్లల భవిష్యత్తూ విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగుపడుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ఈ వర్గాల్లోని చదువుకున్నవారు, మేధావులు, రాజకీయనాయకులు ఇంత కాలంగా రెడ్డి, వెలమల చేతుల్లో ఉన్న అధికారం తమకు బదలాయించబడుతుందని ఒక బలమైన ఆశపెట్టుకొని ఉద్యమాల్లో తిరిగారు. ఈ విధంగా కుల పర అధికార బదలాయింపుతో ఏం ప్రయోజనం, బంగారు తెలంగాణ ఎవరు రూపొందించగలుగుతారనేది ముఖ్యం అనే మేధావులు, వ్యక్తులు లేకపోలేదు.
విచిత్రమేమంటే 66 ఏళ్లు ఈ ప్రాంత అధికారాన్ని రెడ్డి, వెలమల చేతుల్లో పెట్టిన కాంగ్రెస్ తనను తాను కొంత మార్చుకుంది. ఒక బీసీ నాయకుడిని పీసీసీ ప్రెసిడెంట్‌ను చేసింది. ఒక ఎస్సీ నాయకుడిని ప్రచార కమిటీ అధ్యక్షుణ్ణి చేసింది. ఈ శక్తులు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. అయితే ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు. బంగారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ ఉద్యమంలో దండుకున్న డబ్బుతో ఇక్కడి ఆడోళ్లను మొగాళ్ళను బంగారు గొలుసులేసి తిప్పుతారా? కుటుంబం, కులం మొత్తంగా బొడ్డూడని ప్రత్యేక రాష్ట్రంపై పెత్తనానికి దిగి, ఈ కుటుంబ తాబేదారు జేఏసీని పెట్టుకొని అది ఈ పార్టీని ఉద్యమ పార్టీ అని కితాబు లిస్తుంటే తెలంగాణ, జనం పిచ్చివాళ్ళలా చూస్తారనుకుంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్‌ను వెనుకేసుకు రావడమంటే తెలంగాణలో అగ్రకుల ఆధిపత్యాన్ని కొనసాగించాలని జేఏసీలోని మూకలు భావించడమే. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానంటున్న చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రాన్ని ఆరెస్సెస్‌కు ఒప్పజెప్పే ఒక ప్రమాదకర నిర్ణయం తీసుకున్నాడు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేస్తే దేశరక్షణ పదిలంగా ఉంటుందని పిచ్చివాళ్ళను నమ్మించాలి గానీ మనల్ని ఎలా నమ్మిస్తాడు? తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని కాషాయదళమయం చేశాడు. అటు ఛత్తీస్‌గఢ్ నుంచి, ఇటు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్దఎత్తున ఆరెస్సెస్, భజరంగ్ దళ్ శక్తులు గ్రామాల్లోకి వ్యాపిస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలలో టీఆర్ఎస్, రాజకీయ జేఏసీ పేరుతో భూస్వామ్య శక్తులు గ్రామాలు చేరితే వారికి తోడు ఇప్పుడు సంఘ్ పరివార్ శక్తులు చేరుతున్నాయి.
తెలంగాణలో ఉద్యమం… ఉద్యమం.. అని కాళ్ళకు గజ్జెలు కట్టి ఎగిరిన మావోయిస్టులు, విప్లవకారులు ఎన్నికల రంగం రాగానే కనుమరుగయ్యారు. రాజకీయ రంగస్థలాన్ని కేసీఆర్‌కు, అగ్రకుల ఆధిపత్య శక్తులకు ఒప్పజెప్పారు. తెలంగాణ కావాలని కోరుకుంటే సరిపోదు. ఇక్కడ వెలమ, రెడ్డి భూస్వాములను ఎట్లా అదుపులో పెట్టాల్నో ఆలోచించకుండా చిన్న రాష్ట్రమని చిందులేస్తే ప్రజలు మళ్ళీ బానిసత్వంలోకి నెట్టబడుతారు. తెలంగాణ రాగానే కేసీఆర్ గొడుగుకింద ఎమ్మెల్యేలూ, మంత్రులు అవుదామనుకున్న మాజీ నక్సలైట్లు టికెట్ ఇవ్వకపోతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ టికెట్ దొరికినోళ్ళు దొరకు సలాం కొట్టి పోటీలో ఉన్నారు. ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్న దేశంలో విప్లవశక్తుల్ని ప్రజాస్వామ్య శక్తులుగా మలచలేకపోయినపుడు భూస్వామ్య వర్గం కొత్త రంగులు పులుముకొని మళ్ళీ పెత్తనం చేస్తుంది. కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే ఇక్కడోళ్ళు, చంద్రబాబు స్వర్ణాంధ్ర అంటే అక్కడోళ్ళు జబ్బలు చరుచుకుంటే ఇంతవరకు జరిగిన అభివృద్ధి వెనక్కిపోతుంది. వీళ్ళంతా మంత్రగాళ్ళా అన్నీ ఆకాశంనుంచి కిందికి దించడానికి? కేసీఆర్ అన్నీ అరచేతి నుంచి తీసి ఇస్తామంటే ఇక్కడెట్లా నమ్ముతారు? అక్కడ చంద్రబాబు సింగపూర్, దుబాయిల గురించి మాట్లాడితే అక్కడెట్లా నమ్ముతారు? వీళ్ళ మాయమాటలకొక హద్దు ఉండాలి కదా? ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్న శక్తులూ వీరిని అదుపుచేయాలి కదా? జాతీయ కాంగ్రెస్ బీజేపీకి దాసోహం అని తెలంగాణ ఇచ్చిందనే స్థితి రాకుండా చూసుకోవల్సి వుంటుంది. బీజేపీ ఎటువంటి పార్టీయో ఢిల్లీపెద్దలకు తెలువదా? రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తెల్లారి నుంచే అందరూ అబద్ధాలాడడం మొదలైంది. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసుకునే ప్రక్రియలోకి ఆ పార్టీ స్వయంగాపోతే మునిగిన నావ మీద మూడురాళ్ళు ఎక్కువ పడేసినట్టు జేఏసీలల్లోని దందానాయకులు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా పవిత్రులని ఒక కొత్త సిద్ధాంతం అల్లుతున్నారు. ప్రాంతీయ ఉద్యమాల్లో అందరితో పాటు గుండాలు, రౌడీలు, పోలీసు ఏజెంట్లు, డబ్బువసూలుదార్లు, పాఠాలు అసలే చెప్పని పంతుళ్లు, భూదందాల వాళ్ళు అందరుంటారు. ప్రాం తీయ ఉద్యమాలకు సిద్ధాంత భూమిక, నిర్మాణాత్మకత, ఆచరణ చిత్తశుద్ధి అనే నియమాలు ఉండవు. జై తెలంగాణ అనో, జై సమైక్యాంధ్ర అనో రోజూ రోడ్లమీద తిరిగినోళ్ళు పెద్ద ఉద్యమకారుల్లా చెలామణీ అవుతారు. ఈ రకమైన ఉద్యమ గుండాగిరిని ఇక అన్ని రకాల శక్తులు ఆపెయ్యాలి. తెలంగాణ రావడానికి ఎవరు కారకులనే సమస్యను పూర్తిగా పక్కకు పెట్టాలి. ఏ సామాజిక శక్తులు ఇక్కడ అభివృద్ధి చెం దాలి, ఏ సామాజిక శక్తులు అధికారంలోకి రావాలి, సంక్షేమ రాజ్యం ఎలా నడవాలి… ఇవి కీలకమైనవి. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలనే అంశంపై గ్రామాల నుంచి సోనియా గాంధీ వరకు ఒక కామన్ అవగాహన ఏర్పడింది. సామాజిక తెలంగాణ నిర్మాణానికి శత్రువు టీఆర్ఎస్; బీజేపీతో పొత్తుపెట్టుకొని టీడీపీ కూడా ఈ ప్రాంత ముస్లింలకు క్రైస్తవులకు ప్రమాదం తలపెట్టే పార్టీగా మారుతుంది. టీడీపీ ఈ ఉచ్చులో ఇరుక్కుంటుందని ఎవరూ ఊహించలేదు.
ఈ స్థితిలో దళిత బహుజన యువత, ప్రజాస్వామిక శక్తులు ఒక కొత్త కర్తవ్యాన్ని రెండురాష్ట్రాల్లో పోషించాల్సిన అవసరముంది. బోగస్ బంగారం, స్వర్ణాంధ్ర వాగ్దానాలను పక్కనపెట్టి అణచివేయబడ్డ శక్తుల అభివృద్ధి, విద్యారంగంలో కీలకమైన మార్పులు, ప్రజాస్వామిక సంస్థల్ని నడుపగలిగే రాజకీయ శక్తుల్ని బలపర్చాలి. తెలంగాణలో ఎంఐఎం ఒక రాజకీయ మార్పును సమాజం ముందుకు తెచ్చింది. ఆ పార్టీలో దళిత, వెనుకబడిన శక్తులను చేర్చుకొని టిక్కెట్లు ఇచ్చింది. ఇది మైనార్టీల ఆత్మరక్షణకు, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో మార్పుకు దోహదపడే చర్చ. మరో పక్క ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ చాలా చోట్ల పోటీచేస్తుంది. ఈ శక్తుల్ని బలపర్చాల్సిన అవసరం దళిత, బహుజన యువత మీద ఉంది. ఈ ప్రాంతంలోని విప్లవ శక్తులు తమ ఉనికిని కోల్పోవటమే కాక, కనీస సిద్ధాంత పట్టును కూడా కోల్పోయాయి. మావోయిస్టు నాయకుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు స్వయంగా ఒక ప్రకటన ఇవ్వడం మంచిదే. కానీ ప్రకటన సిద్ధాంతాన్ని చెప్పదు. ఛత్తీస్‌గఢ్‌లో చేసిన తప్పు, తెలంగాణలో చేసి బీజేపీనో, టీఆర్ఎస్‌నో పెంచితే చరిత్ర వాళ్ళను క్షమించదు. దేశంలోనే కమ్యూనిస్టులు కనుమరుగయ్యే దశ వస్తుంది. ఇది కూడా ప్రమాదమే. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. నరేంద్ర మోదీ ఒక వ్యక్తి కాడు, రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాడు. వారి వెనుక భిన్న రకాల శక్తులు పనిచేస్తున్నాయి. దేశ భవిష్యత్ కోసం, శాంతి భద్రతల కోసం ఈ రెండు రాజకీయశక్తుల్ని సుదీర్ఘ దృష్టితో అంచనా వెయ్యాలి. ఇప్పటికైనా టీడీపీ శక్తులు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి సహకరించకుండా ఉంటే దేశానికి మేలు జరుగుతుంది. టీఆర్ఎస్‌ను ఉద్యమ పార్టీగా చూడకుండా ఒక ఫ్యూడల్ కుటుంబ పార్టీగా చూసి యువత నిర్ణయాలు తీసుకోవాలి. ఇటు తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్‌ను మతోన్మాద శక్తుల నుంచి కాపాడాలి.
– కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త