సాంకేతిక భాషా కవిత్వాలు- ముకుంద రామారావు
ఏ భాష అయినా, ఆ భాష తెలియని వారికి సంకేత భాషే. ఆయా భాషల్లో మునిగి తేలే వారు, వైజ్ఞానిక భాషలతో సహా అందులో దేనినైనా కవిత్వ రూపంలో చెప్పగలిగే నేర్పు అలవరచుకోవచ్చు. అయితే అవి కొన్ని ప్రయోగాలకో, టెక్నిక్లకో పరిమతమయితే, మరికొన్ని వాటిని తమ హృదయ భాషగా కవిత్వం చేసినవారు, చేస్తున్నవారూ ఉన్నారు. అది కవిత్వ వృక్షాన్ని దశదిశలా విస్తరిస్తూనే ఉంది. దాని నీడల్లో కాసేపైనా ఆశ్చర్యంగా ఆనందంగా ఎవరైనా విశ్రమించొచ్చు.
దేనినైనా కవిత్వం చేయగలిగితే, దానిని అర్థం చేసుకోగలిగితే, భాష ఏదైతే ఏమిటి? ఏ ఒకరికి అర్థం అయినా, వారికి తెలిసిన మరో భాషలో అది పంచుకునేందుకు తప్పకుండా పనికొస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటే, మనకు తెలియని ఆ మూల కవి ఉన్నా లేకపోయినా, ఆ కవిత్వం ఎక్కడోచోట విస్తరిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కవిత్వం ఆదిమకాలం నుంచీ, ఆకాశంలో పక్షుల్లా ఎల్లలు లేకుండా అందుకే విహరించ గలుగుతోంది. కవిత్వం ఒక సాహిత్య కళ. భాష అందులోని రసాన్ని గ్రహించడానికి పనికొస్తోంది. గూడార్థాలు చెప్పినట్లుండే కవితలు, కవి కూడా ఊహించని విధంగా, పాఠకులకు అనేకరకాలుగా అర్థమవుతూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక భాషా కవిత్వాలు ముఖ్యంగా గణితం, కంప్యూటర్ భాషలు సైతం కవిత్వంలో పలవరిస్తున్నాయి.
గణితమే కవిత్వం కాకపోయినా, రాతలో కవిత్వం వచ్చిన దగ్గరనుంచీ, గణితం ఏదో ఒక విధంగా కవిత్వానికి పనికొస్తూనే ఉంది. ఏవో కొన్ని అనుసరించాల్సిన నియమాలుగా, అవి అనేక కవిత్వాలకు దిశానిర్దేశాలు చేస్తున్న సంగతి తెలియనిది కాదు. విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ తల్లిలాంటి గణితం, అనాదిగా కవిత్వానికి పనికొస్తోంది. యతులు, ప్రాసలు, పంక్తులు, చందస్సు, అక్షర సంఖ్యలు, నిర్మాణాలు వగైరా తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ ఏదో ఒక రూపంలో కవిత్వాన్ని నడిపిస్తూనే ఉన్నాయి. అన్ని కట్టుబాట్లనీ తెంచుకున్న వచన కవిత్వానికి సైతం, లఘు కవితలనో, దీర్ఘ కవితలనో, ఏకాక్షర కవితలనో ఉన్నవీ లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ, గణిత భాషలోనూ ప్రముఖ కవులు ఆడెన్, విస్లావా సింబోర్స్కా, నెరూడా లాంటి వారు సైతం కవిత్వం రాయడం విశేషం. దానిని గణిత కవిత్వం అని ముద్ర వేసినవారూ ఉన్నారు. కొన్ని కవితల్లో గణితాన్ని ఏదో రూపంలో వాడుకున్నా, కవిత్వమే గణితం కాదు. అవి బహుశా గణితశాస్త్రజ్ఞుల్ని కవిత్వ శక్తికి, కవిత్వ సౌందర్యానికి కట్టిపడేసే కవిత్వ అనువాదాలు.
గణితం కొన్ని కవిత్వ ఆకారాల్ని నిర్ణయిస్తుండడం మనకు తెలుసు. ఉదాహరణకి త్రిభుజ కవితల్లో – ఒక అక్షరం మొదటి పంక్తి అయితే, తరువాతి పంక్తుల్లో ఒక్కొక్క అక్షరం పెరుగుతూ పోవడం, చతురస్ర కవితల్లో – మొదటి పంక్తిలోని అక్షరాలు ఎన్నుంటే, అన్ని పంక్తులు ఆ కవితలో ఉండటం, ఇవే కాక కవిత్వంలో ప్రాచీన సాహిత్యంలోని ప్రతీకల్ని వాడుకుంటున్నట్టు, గణితంలోని పారిభాషిక పదాల్ని వాడుకోవడం కొన్ని కవితల్లో చూడొచ్చు. ఆర్కిమెడెస్ (క్రీ.పూ.287-212) కవిత్వ రూపంలో రాసిన పశువుల సమస్యకు పరిష్కారం గణితంలో అంథోర్ 1880లో మాత్రమే మొట్టమొదట కనుక్కోగలిగాడు. అలా కవిత్వం మూలంగా గణితం, గణితం మూలంగా కవిత్వం ప్రభావితమైనవి సాహిత్యంలో అనేకం మనకు తారసపడతాయి.
ఆవిష్కరణకు గణితం పనికొస్తే, కవిత్వం సృజనకు పనికొస్తోంది. ప్రసిద్ధ కవి మలార్మే చెప్పినట్టు కవిత్వం గణితంలా ఆలోచనలతోనే కాదు, పదాలతో తయారవుతుంది. కానీ ఈ రెండూ ఊహ ఆధారితాలే. ప్రేరణ రెండింటికీ అవసరమే. బౌద్ధికకల్పన రెంటినీ నడిపిస్తుంది. గణితంలోని సూత్రాలని, పారిభాషిక పదాలని వాడి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కవులు, ప్రసిద్ధ కవితలు రాసినవి అనేకం ఉన్నాయి. వీరిలో కవులైన గణిత శాస్త్రజ్ఞులతో పాటు, గణితం తెలిసి, ఒక సంఘటనకో, జీవితానికో అన్వయించి రాసి, రాస్తున్న కవులూ ఉన్నారు. అందరినీ అన్నింటినీ పేర్కొనడం ఈ వ్యాసంలో సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణగా కొన్నింటినైనా మనం చూడొచ్చు. గణితం కవిత్వం రెండింటిలోనూ ప్రావీణ్యుడు నికొనార్ పారా (ఈ ఏడాది సెప్టెంబరులో నూరేళ్లు నిండుతున్న చిలీ దేశపు కవి, నెరూడా సమకాలికుడు) గణితంలో అడుగుతున్న ఈ ప్రశ్నలు చూడండి.
ఆలోచనలు
పాస్కల్ తనను తానే అడిగాడు/ ఏమిటి?/ మనిషి?/ ఒక సంఖ్య ఘాతాంకపు శూన్యాంశమా/ పూర్ణంతో పోల్చి చూస్తే శూన్యమా/ శూన్యంతో పోల్చి చూస్తే పూర్ణమా/ జనన మరణం కూడిక-/ శబ్దనిశ్శబ్దాల గుణకారమా/ సమస్తం శూన్యాల/ అంకమధ్యమమా
కావ్యాల్ని పండితులు మన దేశంలో మొదట్లో ప్రాకృతంలో రాసినా, శాతవాహనుల కాలం నుంచీ సంస్కృతానికి ప్రాముఖ్యం పెరిగింది. సంస్కృతం శాస్త్రీయమైనది కూడా కావడంతో విజ్ఞాన శాస్త్రాలు, సంస్కరణలు సైతం ఆ భాషలో, అదే కావ్య పద్ధతిలో హాయిగా రాయగలిగారు. 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ మహాభారతాన్ని తెలుగులో అనువదించాక, తెలుగులో అనువాదాల పట్ల శ్రద్ధ పెరిగింది. విజ్ఞాన శాస్త్రాలు సైతం తెలుగులో అనువదించాలన్న ఆలోచనకు నాందిగా, మొట్టమొదట పావులూరి మల్లన (1070-1130) అనువాదం చేసిన సారసంగ్రహ గణితం వచ్చింది. తెలుగులో వచ్చిన గణితగ్రంథం కావ్య పద్ధతిలో అదే మొదటిది. ఈ గ్రంథం జైన పండితుడు, మహావీర (814-880) రచించిన గణితసార సంగ్రహానికి స్వేచ్ఛానువాదం. ప్రపంచ దేశాలన్నింటిలో విజ్ఞాన శాస్త్రాల్ని సైతం కావ్య పద్ధతుల్లో అత్యద్భుతంగా గ్రంథస్థం చేయగలిగినది అప్పట్లో ఎక్కువగా భారతదేశమే.
గణిత పారిభాషిక సిద్ధాంతాల్ని, పదాల్ని వాడి, ఇతర దేశాలంత కాకపోయినా తెలుగులో కూడా కవిత్వం వచ్చింది. అది ఆకట్టుకోగలిగినా, ఆదరణకు నోచుకోక, ఆ తరువాత అటువంటి కవిత్వం అంతగా రాలేదు. మచ్చుకి ఆరుద్ర రాసిన త్వమేవాహం (నువ్వే నేను) కావ్యంలోని పెద్దముల్లు కవితలో, గణితశాస్త్రంలోని పైథాగరస్ సిద్ధాంతాన్ని అద్భుతంగా వాడుకున్నారు. ఈ కావ్యంలో గడియారం కాలానికి సంకేతం, గడియారంలో చిన్నముల్లు (గంటలు) పెట్టుబడిదార్ల వర్గానికి, పెద్దముల్లు (నిముషాలు) మధ్యతరగతి వర్గానికి, సెకండ్ల ముల్లు శ్రామిక వర్గానికి ప్రతీకలు. ఈ ప్రతీకలతో తనకున్న విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకుని పైథాగరస్ సిద్ధాంతాన్ని, సామ్యవాదానికి అన్వయిస్తూ రాసిన ఆ ప్రసిద్ధ కవిత, స్థూలంగా ఇది-
దత్తాంశాలను పరిశీలించండి/ చిన్న చిన్న చీమలు వగైరా- అడుగుభుజం/ ఉత్పత్తిచేసే ఆహారంమీద ఆధారపడ్డవారు- లంబం/ ఈ భుజాల పరస్పర సంఘర్షణల ఫలితం/ ఈ భుజాల కర్ణం మీది చతురస్రం/ ఈ చతురశ్రపు వైశాల్యం ఇజిక్వల్టూ/ రెండు విభిన్న భుజాలపైగల చతురశ్రాలలోని తమిస్రం
లంబకోణ త్రిభుజం ్abcలో-
భుజంb – అడుగు భుజం (ఈ భుజం మీది చతురశ్రం శ్రామికవర్గం – దాని వైశాల్యం : b2)
భుజంa – లంబం (ఈ భుజం మీది చతురశ్రం బూర్జువా వర్గం – దాని వైశాల్యం : a2)
భుజం c – కర్ణం (ఈ భుజం మీది చతురశ్రం నూతన వ్యవస్థ – దాని వైశాల్యం : c2)
పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంa2+b2 = c2 (పై కవితలో ఇదే ఆరుద్ర చెప్పింది కూడా)
ఇంతకీ ఈ పైథాగరస్ క్రీ.పూ. (570-495) ప్రాంతం వాడు. అంతకు పూర్వమే క్రీ.పూ. 2000 నాటికి బౌధాయనుడు ఇదే సూత్రాన్ని నిర్వచించి రుజువు చేసాడు. అందుకే ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని బౌద్షాయన సిద్ధాంతంగా మార్చాలన్న చర్చ జరుగుతోంది. అది వేరే విషయం.
తెలుగులో ఇలా కవితలు రాసిన వారిలో ముఖ్యులు – ఆరుద్ర, పఠాబి (గణితంలో ఆవిష్కరణలకు వీరు చివరవరకూ శ్రమించారు), బైరాగి, తిలక్, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ మొదలైన వారెందరో ఉన్నారు. అటువంటి కవితలన్నింటినీ ఏర్చికూర్చి ఒక సంకలనంగా ఎవరైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుండును, అందులో ఇతర దేశాల కవుల గణిత కవిత్వ అనువాదాల్ని చేరిస్తే, భావి తరాల వారికి మన తెలుగు కవులు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదని, ప్రపంచ కవులెవ్వరికీ తీసిపోని వైవిధ్యభరితమైన కవిత్వాన్ని వారు తెలుగు భాషకు అందించారని తెలుసుకునేందుకు ఎంతగానో అది పనికొస్తుంది.
అలాగే కంప్యూటర్ నిర్దేశక భాషలైన c, c++, HTML, SQL, Objective C, Applescript, Java లాంటి భాషల్లో ఇటీవల కవిత్వం రాస్తున్నారు. దానిని వారు ఇౌCode Poems- సాంకేతిక భాషా కవితలు అని పిలుచుకుంటున్నారు. ఇక్కడ ఛిౌఛ్ఛీ అంటే కంప్యూటర్కు సూచించే భాష, లేదా కంప్యూటర్ అర్థం చేసుకోగలిగే భాష. ఆ భాషకు అనేక నియమాలు (syntax), అర్థాలు (semantics) ఉంటాయి. క్లుప్తత కూడా పనికొచ్చే అంశమే. అవి సామాన్య పాఠకునికి సైతం అర్థం కావాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎక్కువగా ఆ రంగంలో ఉన్న వారికే అవి అర్థమవుతాయి, ఆనందపరుస్తాయి. రాతలో ఆయా భాషల వాడుకతో రాసినవి మాత్రమే కాదు, కంప్యూటర్ దానిని ఏ దోషాలూ లేకుండా స్వీకరించేట్టు చేయగలగడం కూడా దానిని రాసేవారు పాటించాల్సిన ముఖ్యమైన నియమం. కంప్యూటర్ భాషల్ని, నియమాల్ని అతిక్రమించకుండా – ప్రేమ, ద్వేషం, వార్త, మతం, శాస్త్రం, జీవితం, మరణం లాంటి అంశాలని స్పృశిస్తూ కవిత్వం ఉండేట్టు చేయగలగడం ఆ రంగాల్లో వారికి ఒక కొత్త మనోవినోదాన్ని కలిగిస్తోంది.
ఉదాహరణకి c++ భాషలో Daniel Bezera రాసిన అందరికీ అర్థమయ్యే ఈ చిన్ని కవితను చూడొచ్చు. వాటిల్లో వాడిన class, void main(), throw వగైరా పారిభాషిక పదాలు, కంప్యూటర్ జరపవలసిన వరుస వివరాల్ని తెలిపే love(ప్రేమ) అన్న ఒక చిన్న ప్రోగ్రాం (ప్రణాళిక). అయితే code poemsని, కంప్యూటర్ స్వీకరించి ఫలితాన్ని ఇచ్చే ప్రణాళిక మాత్రం కాదు. కేవలం ఆయా భాషల్లో నియమాల్లో రాసి చదువుకునేందుకు పనికొస్తున్న ప్రక్రియ. ఎవరు రాశారో, ఎందుకు రాశారో, ఏ భాషలో రాశారో కూడా ఇతరుల ఉపయోగార్థం అందులో పొందపురచడం కూడా చూడొచ్చు. ఈ ప్రక్రియ బ్రిటన్లో మొదలై క్రమక్రమంగా కంప్యూటర్ భాషలు తెలిసిన వారిలో ఎక్కువగా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కవితల్ని, ఆ కోడ్ రూపంలోనే కంప్యూటరే చదివి వినిపించే విధానాన్ని రూపొందించుకున్నారు. code poems కవితల పోటీలు కూడా అనేక చోట్ల జరుగుతున్నాయి. కొన్నాళ్లకు ఈ code poems సామాన్య పాఠకులు అర్థం చేసుకోగలిగే భాషలో కవిత్వ రూపంలో కంప్యూటరే చదివి వినపించ గలిగే స్థాయికి తీసుకుపోయే ప్రయత్నంలో కంప్యూటర్ నిపుణులైన కవిత్వ ప్రేమికులు ఉన్నారు. అంటే ఎవరికి తెలిసిన కంప్యూటర్ భాషలో వారు రాసి, మనకు తెలిసిన భాషలో కంప్యూటర్ మనకు వినిపించడం.
స్పర్శించని ప్రేమ
class love();/ void main()/ (/ throw love();/ )/ Daniel Bezeraa/ //c++
2000 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో కంప్యూటర్లో అప్పటివరకూ కొనసాగిన రెండంకెల సంవత్సరం, ఇకమీదట సున్నాగా మారి, అనేక అనర్థాలకు దారితీస్తుందన్న భయోత్పాతాన్ని కలిగించింది. ఈ పరిణామంపై ఇతర భాషలతో పాటు తెలుగులో కూడా ్Y2K పేరు మీద అనేక కవితలొచ్చాయి.
ఏ భాష అయినా, ఆ భాష తెలియని వారికి సంకేత భాషే. ఆయా భాషల్లో మునిగి తేలే వారు, వైజ్ఞానిక భాషలతో సహా అందులో దేనినైనా కవిత్వ రూపంలో చెప్పగలిగే నేర్పు అలవరచుకోవచ్చు. అయితే అవి కొన్ని ప్రయోగాలకో, టెక్నిక్లకో పరిమతమయితే, మరికొన్ని వాటిని తమ హృదయ భాషగా కవిత్వం చేసినవారు, చేస్తున్నవారూ ఉన్నారు. అది కవిత్వ వృక్షాన్ని దశదిశలా విస్తరిస్తూనే ఉంది. దాని నీడల్లో కాసేపైనా ఆశ్చర్యంగా ఆనందంగా ఎవరైనా విశ్రమించొచ్చు.
– ముకుంద రామారావు