‘’పూర్వాంగ్ల’’కవుల ముచ్చట్లు -1
ఈ రచన కు నేపధ్యం
నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ,విశాఖ లో ఉన్న వారి బావ గారు డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారితో ఫోన్ లో మాట్లాడుతుండగా ‘’లైవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’పుస్తకం విషయం వచ్చి వెంటనే ఆ పుస్తకం దుర్గా ప్రసాద్ గారు చదవాలిసిందే అని నిర్ణయించి, ఆ వెంటనే ఆర్డర్ ఇచ్చి, యాభై అయిదేళ్ళ క్రితం ప్రచురించ బడిన ఆ పుస్తకాన్ని ఆన్ లైన్ లో ‘’మూడు డాలర్లకు’’ కొని ,’’పద్దెనిమిది డాలర్లు’’ షిప్పింగ్ చార్జీ చెల్లించి, నాకు పంపుతున్నట్లు తెలియజేశారు .అది నాకు ఏప్రిల్ 25నచేరింది .ఇంత అభిమానం తో పంపిన పుస్తకాన్ని వెంటనే చదవాలని పించి మొదలెట్టేశాను .అప్పటికే ఆయన పంపిన పుస్తకం ఒకటి ఇంకా చదవటం మొదలెట్టలేదు .ఇంకో పుస్తకాన్నికూడా అప్పటికే పంపే ఏర్పాటూ చేశారు .ఈ మధ్య మిత్రులు సన్నిహితులూ పంపిన పుస్తకాలు నా కోసం బీరువాలో ఎదురు చూస్తూనే ఉన్నాయి ..
కాని ఈ పుస్తకాన్ని దాదాపు నాన్ స్టాప్ గా చదువుతూ ఆయనకు ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్ తెలుపుతూ దీన్ని ఆధారం గా ‘’ పూర్వాం గ్లకవుల ముచ్చట్లు ‘’రాయాలని పిస్తోందని మెయిల్ రాశాను .ఆయన వెంటనే మెయిల్ చదివి ‘’శుభస్య శీఘ్రం’’ అన్నారు. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కు సద్యో స్పందన తెలుపుతూనే ఉన్నారు అనారోగ్యం లో ఉండి కూడా .ఈకవుల గురించి అందరికి వీలైనంత త్వరలో తెలియ జేయమని ఒక రకం గా’’ హుకుం ‘’లాంటి అభ్యర్ధన చేశారు నాకు. నేను ‘’చూద్దాం ‘’అంటున్నా .ఇప్పటికి నేను 720పేజీల పుస్తకం లో చదివింది కేవలం 300.పేజీలు మాత్రమె. కాని దానిపై ఒక ఫాసినేషన్ కలిగింది .ఇవాళ అక్షయ తృతీయ .ఇప్పుడే ఇంటి దగ్గర తెలిసిన వారి కుమారుని ఉపనయనానికి ఆహ్వానిస్తే వెళ్లి, అక్షతలేసి వచ్చి ఈ రోజు మంచిదే కనుక మొదలెడదాం అనుకోని రాయటం ప్రారంభించాను .ఈ పుస్తక రచయిత ‘’లూయీస్ అంటర్ మేయర్ ‘’.చాలా చక్కగా పుస్తకాన్ని రాశాడు .తనకు ముందు రాసిన వారిని ఉదాహరిస్తూ తన భావాలను తెలుపుకొంటూ ,ఏ కవినీ తెలిగ్గ్గా తీసుకోకుండా దాదాపు వెయ్యేళ్ళ ఇంగ్లాండ్, అమెరికా సాహిత్యం లోని కవుల విశేషాలు ,కవితా రీతులు ,అన్నీ వివరించాడు .చాలా బాగా చదివిస్తోంది నన్ను ఈ పుస్తకం .ఇందులో నాకు అర్ధమైనదీ ,నాకు తెలిసిందీ ,అవసరమైనదీ ,కవిత్వపు పోకడలు, వారి జీవితాలలో వెలుగు నీడలు, ఉత్తాన పతనాలు ,విశ్రుమ్ఖలత ‘’,కేరే ఝాట్ తత్త్వం ‘’,మంచి చెప్పినా దిగజారిన వైనం ,కోలుకోలేని స్థితి అన్నీ రాయటానికి ప్రయత్నం చేస్తున్నా .నాకు ప్రేరణ నిచ్చి నాతో పుస్తకం చదివించి దీనిపై స్పందించి రాస్తే అందరికీ విషయాలు అందుతాయని ప్రోత్సహించిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ఈ ధారావాహిక ను ,ఏ ప్రతిఫలాపెక్షా లేకుండా ,నా అభి భిమానానికి నిదర్శనం గా అంకితమిస్తున్నాను .ఇదీ ఈ రచనకు నేపధ్యం .
జియోఫీ చాసర్
ఆంగ్ల కవిత్వానికి జనకుడు ,ఆ కవిత్వానికి యువ రాజు చాసర్ .మానవ జీవిత హాస్య స్పోరక జీవితానికి అద్దం పట్టాడు. చాసర్ మహాకవికి ముందు ఆంగ్ల సాహిత్యం లో ‘’మానవుడుకి’’ స్థానమే లేదు .ఆయన రాసిన ‘’కాంటర్ బరీ కధలు ‘’లో మనిషి పురుడు పోసుకొన్నాడు .మనవ సహజ మైన అన్ని ఎమోషన్లను ఆవిష్కరించాడు .మనుషుల గొప్పదనం ,తప్పొప్పులు, సహజ విధానం, జీవితం సాహిత్యం లో మొదటి సారిగా చాసర్ వలననే స్థానం పొందాయి .మనుషులలోని వైవిధ్యాన్ని గొప్పగా ప్రదర్శించాడు .చాసర్ కు ముందెవరూ ఇంతటి సునిసిత పరిశీలన చేయలేదు. అ తర్వాతా ఎవరో కొద్ది మంది కవులు మాత్రమె ఆ మార్గం లో కదిలారు .ప్రేమ, శృంగారం వాటిలోని అతి ,ని చక్కగా పాత్రల ద్వారా చిత్రీకరించాడు .ఆరు వందల ఏళ్ళు అయినా ఆ పాత్రలు జీవం తో తోణికిస లాడుతున్నాయి .చాసర్ కు మనుషుల బాహ్య అంతరంగాలు క్షుణ్ణం గా తెలుసు .అందుకే అతన్ని’’ ఉత్ప్రేకం’’ అంటే కేటలిస్ట్ అన్నారు .అంతకు ముందున్న వందేళ్ళ సాహిత్యాన్ని అర్ధం చేసుకొన్నాడు చాసర్ .
జీవిత విశేషాలు
ఒక రకం గా చాసర్ విప్లవమే లేవదీశాడు సాహిత్యం లో .కొత్త విధానాలు ,కొత్త ఆలోచనలు కొత్త సాంఘిక ప్రమాణాలు అన్ని రంగాల్లోనూ వచ్చాయి .మనుషులు మాట్లాడే సాధారణ భాష కూడా మార్పు చెందింది .ఆంగ్ల సాహిత్యం సరళం అయింది .సజీవ భాషకు చోటు కలిగింది .నిజాన్ని నమ్మే స్తితిని కవిత్వం లో చాసర్ కల్పించాడు .1340లో ఇంగ్లాండ్ లో చాసర్ పుట్టాడు .వీరి కుటుంబం ఫ్రెంచ్ షూ మేకర్ కుటుంబం .అందుకే వీరికి చాసర్ పేరు వచ్చింది .కాని చాసర్ తండ్రీ, తాత రొట్టల పరిశ్రమ నడిపిన వారు .సెయింట్ మార్టిన్ లో ఉండేవారు .తండ్రి రాజుకు డిప్యూటీ బట్లర్ గా ఉన్నాడు .తల్లి కూడా అక్కడే పని చేసేది .ఆమె బంధువు రాయల్ మింట్ లో ఉద్యోగి మొత్తం మీద చాసర్ ది మధ్యతరగతి కుటుంబం .చాసర్ కు చిన్నప్పుడే ఖగోళ శాస్త్రం పై మక్కువ కలిగింది .ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు ఇంగ్లాండ్ లో ‘’బుబోనిక్ ప్లేగు ‘’వ్యాధి ప్రబలి మూడో వంతు జనం చని పోయారు. దీన్నే ‘’బ్లాక్ డెత్ ‘’అంటారు . చాసర్ కుటుంబం లండన్ వదిలి ‘’సౌత్ అంప్ టన్’’చేరింది .రెండేళ్ళ తర్వాత లండకు తిరిగి వచ్చేశారు .దచేస్ కోర్టు లో ఉద్యోగంవచ్చింది .కాండిల్స్ మోయటం ,అతిధులకు దీపాలు చూపించటం ,ఉత్సవాలలో గాయకులకు సదుపాయాలూ చూడటం చేసే పనిఅది .
పందొమ్మిదేళ్ళ వయసులో యుద్ధ సైనికుడయ్యాడు .అప్పుడు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో వందేళ్ళ యుద్ధం ప్రారంభించింది .యుద్ధ ఖైదీ అయ్యాడు చాసర్ .పదహారు పౌండుల ‘’రాన్సం’’ తో బయటపడ్డాడు .దీన్ని రాజు గారి వార్డ్ రోబ్ చెల్లించాడు .ఇంగ్లాండ్ చేరుకోగానే రాజ కుటుంబం లో సభ్యుడైనాడు .తర్వాత’’వాలెట్’’గా ప్రోమోషన్ పొందాడు .ఇప్పుడు రాజు అతన్ని ‘’అవర్ డియర్ వాలెట్ ‘’అనిగౌరవం గా పిలిచేవాడు .ముప్ఫై ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొన్నాడు .భార్య రాణీ గారి ఆంతరంగిక సఖి .తర్వాత రెండు పెళ్ళిళ్ళు చేసుకొన్నాడు .చాసర్ కాలం నాటి మగాళ్ళంతా ‘’హేన్ పెక్కేడ్ హస్బండ్స్ ‘’అనే పేరు .భార్య చేతిలో పరాభవం హింసా దెబ్బలు తినటం ఆ నాడు మామూలే .చాసర్ దృష్టిలో’’ పెళ్లి ,ప్రేమ ఒకే మంచం మీద వికసిస్తాయి’’ ఈ భావాలను ‘’డి నైట్స్ టెల్ ,డి ఫ్రాన్క్లిన్ టెల్ లలో స్పష్టం చేశాడు .భార్యలు ఆనాడు భార్తల్ని అన్ని రకాల వేదనలకూ గురి చేసేవారు .అణగి ఉండేవారే కాదు .నిజాయితీ కాని భర్త పై గౌరవం కాని ఉండేవికావు .మోసమే పరమావధి గా జీవించారు .ఈ పాత్రలన్నీ చాసర్ కవిత్వం లో జీవించాయి .ముప్ఫై వ ఏటా చాసర్ రాజు గారి వ్యాపారాలను బాగా నిర్వహించి నేర్పు చూపాడు .రాజు దీనికి బహుమానం గా జేనోవా కు పంపాడు .ఇటలి లోని ఫ్లారెన్స్ నగరాన్ని చూసి ముచ్చట పడ్డాడు .అక్కడి సంస్కృతీ ఆకర్షించింది .ఇటలీ వెళ్ళేదాకా చాసర్ లో గొప్ప కవి ఉన్నాడు అన్న సంగతి స్నేహితులకే తెలియలేదు .
లండన్ లో’’ కంప్ట్రోలర్ ఆఫ్ ది కస్టమ్స్ ‘’అధికారి అయ్యాడు చాసర్ .మంచి ఇల్లు గొప్ప జీతం ఉన్నత జీవితం అనుభవించాడు .తాను చదివిన ఖగోళ ,జ్యోతిష ,రసవాద ,వైద్య ,భౌతిక శాస్త్ర ,మత ,సాహిత్య విషయాలన్నిటిని కవితల రూపం లో రాశాడు .దేనినీ వదల కుండా తను పొందిన అనుభవాలను ఆనందాన్ని అను భూతిని కవితా బద్ధం చేశాడు .సంభాషణల్లో నెమ్మది వాడినని తాను ఆరడుల లావుపాటి వాడిననిచెప్పుకొన్నాడు .చాసర్ మరణం తరువాత కాని అయన చిత్ర పటాలు ఎవరూఅంతకు ముందు ఊహించి చిత్రించలేదు .రాజుకు రాణికి అధికారులకు చాసర్ తన కవిత్వాన్ని చదివి వినిపించే వాడు .ఇదొక సంప్రదాయం గా తర్వాత మారింది .ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్ దేశాల మధ్య ఒడంబడిక కుదరటానికి రాజు తరఫున కృషి చేశాడు .ఇటలీ లోని మిలాన్ కు ‘’మిలిటరీ ఫైనాన్షియల్ మిషన్ ‘’కు నాయకత్వం వహించాడు . ఇటలీని ఒప్పించి ఇంగ్లాండ్ కు ఆర్ధిక సాయం చేసేట్లు కృషి చేశాడు .
ఇటలీకి వెళ్ళే ముందే ‘’రోమాన్స్ ఆఫ్ ది రోజ్ ‘’అనువాదాన్ని పూర్తీ చేశాడు .ఇది ఆ కాలం లో విపరీతం గా ప్రాచుర్యం పొందింది .’’ఇంగ్లాండ్ దేశపుమొదటి నవల ‘’గా గుర్తింప బడిన ‘’troilus and criseyde’’రాశాడు .47వ ఏట కంట్రోలర్ ఉద్యోగం వదిలేశాడు లేక తప్పించేశారు .ఇప్పుడు స్వేచ్చాజీవి కనుక కవిత్వం పై ద్రుష్టి సారించాడు .అప్పటికే మొదలు పెట్టిన ;;కాంటర్ బారీ టేల్స్ ‘’ఇంకా పూర్తీ కాలేదు .సుమారు పన్నెండేళ్ళు దాన్ని కస్టపడి రాసి పూర్తీ చేశాడు .రాజు గారి వెస్ట్ మినిస్టర్ పనిలో గుమాస్తా గా ఉద్యోగం వచ్చింది .పనులను సూపర్ వైజ్ చేయటమే .ఉచిత ఇల్లు ,మంచి జీతం పొందాడు .భార్య చని పోయింది .పని మనిషిని చేరదీశాడని పుకార్లు .ప్రభుత్వ సొమ్ము ‘’నొక్కేశాడు ‘’అని అభియోగాలు. కాని పూర్తీ విచారణలో రుజువు కాలేదు .సోమర్సెట్ లో డిప్యూటీ ఫారేస్టర్ గా ఉద్యోగం ఇచ్చారు .అప్పు ఎగ కొట్టాడని నేరారోపణా .రాజు అడ్డుపడి శిక్ష తప్పించాడు .అరవై ఏళ్ళ వయసులో పెన్షన్ ను రెట్టింపు చేశారు .వెస్ట్ మినిస్టర్ దగ్గర ఒక తోటలో ఉన్న ఇంటికోసం యాభై మూడేళ్ళ లీజ్ పై సంతకం చేశాడు .ఆ ఇంటిలో చేరి ఆనందాన్నిఅనుభవించకుండా సంపాదించిన డబ్బు ను అనుభ వించ కుండా చాసర్ 1400లో అక్టోబర్ 25 న ఇహలోక యాత్ర చాలించాడు .నవెస్ట్ మినిస్టర్ నివాసి కనుక ‘’ఆబ్బే ‘’లో ఖననం చేశారు .అప్పటినుంచే వెస్ట్ మినిస్టర్ ఆబ్బే ను ‘’పోయేట్స్ కార్నర్ ‘’అనే పేరుతో పిలవటం ప్రారంభించారు . ఆ నాటి నుంచి ప్రతి గోప్పకవినీ అక్కడే ఖననం చేస్తూ గౌరవిస్తున్నారు .చాసర్ బోణీ బానే ఉంది .
చాసర్ కవిత్వం లోని మేలిమిని తర్వాతా తెలుసుకొందాం –
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-5-14-ఉయ్యూరు