శబ్ద క్రీడలు- డా. అద్దంకి శ్రీనివాస్
‘సాంకేతిక భాషా కవిత్వాలు’ అనే శీర్షికన (ఏప్రిల్ 28, ఆంధ్రజ్యోతి) ముకుంద రామారావు రాసిన వ్యాసం కొత్తగా ఉంది. విశ్వకవులకు ధీటుగా ప్రాచీనకాలంలోనే గణితాన్ని ఆధారంగా చేసుకొని కవిత్వంలో అద్భుతాలు సృష్టించారు మన కవులు. అందులోనూ ఛందస్సులో. గణితశాస్త్ర గ్రంథాలు అటుంచి, కావ్యాలలోనూ కూడికలతో తీసివేతలతో శబ్దాలను పదునుగా ఉపయోగించి శబ్దక్రీడలాడుకొన్నారు. ముకుంద రామారావు ఆధునిక కవిత్వం నుంచి ఉదాహరించారు. అంతకు ముందే పద్యాలలో గణితాన్ని ఎంత సమర్థవంతంగా కవులు వాడుకున్నారో చూడండి.
భంభు గదే నఖవ్రజ, మిభంబు గదే గమనోన్నతుల్
ద్విరేభంబు గదే కచాళి, కరభంబు గదే తొడ, బాగు హేమకుం
భంబు గదే కుచంబులు, నభంబుగదే యల కౌను, దర్పణా
భంబు గదే ముఖం, బతిశుభంబు గదే తగు రీతి నాతికిన్
– ముకుంద విలాసం – కాణాదం పెద్దన సోమయాజి 17 శ.
నాయిక గోళ్లు నక్షత్రాలు (భంబు), నడకలు నేడుగు (ఇ+భంబు) నడకలు. కొప్పు తుమ్మెదల గుంపు (ద్విరే+భంబు) .. ఇలా అక్షరాలను చేర్చుకొంటూ పోవాలి. దీనికి వ్యతిరేకంగా అక్షరాలను తీసివేస్తూ సాగిన పద్యం చూడండి.
ఘన కబరీ కుచాకృతులు కంధరమై ధరమై రమైక్యమై
చను మది కంఠ వక్త్రములు సాదరమౌ దరమౌ రమౌకమౌ
దినుసుగ వాక్ స్మితాంగములు తేనెలతో నెలతో లతోక్తితో
నెనయగు నాభి జంఘగతి హేమకరిన్ మకరిన్ కరిన్నగున్
– యామినీ పూర్ణతిలకా విలాసము – చెళ్ళపిళ్ళ నరసకవి
కంధరమై.. ధరమై.. రమై
సాదరమౌ.. దరమౌ… రమౌ
తేనెలతో.. నెలతో.. లతో
హేమకరిన్… మకరిన్.. కరిన్. ఇదీ వరుస.
ఇక అల్జీబ్రాలా గుండెకు గాబ్రాపుట్టించే ఫజిల్ ఈ పద్యం. పగలకొట్టి చూడండి.
భము నఖంబున కోడి విముఖమై నిర్వికారిత నాదిగా మధ్యగతికినోడి
వినతమై ముఖకలాన్వితమయి గతికోడి, వికలతం గరమూని వెలది తొడల
సిరి కోడి, కర బహిష్కృతమై కువృత్తిచే నడుమ మిన్నంది స్తనముల కోడి
శాతముఖంబయి సారసాయత లోచనావయవద్యుతి కవల నోడి
విపుల శుచివృత్తి దుర్వర్ణ వికృతి విడిచి యాశుగతి నంతమున
విగ్రహంబు దాల్చి
వెలది యనిపించుకొనియు నవ్వెల వెలందికుద్ది యనరానిదయ్యె బో యుక్తి లేక
– రాధాకృష్ణ సంవాదము – మండపాక పార్వతీశ్వరకవి 19శ.
నక్షత్రం, నాయిక గోటిముందు ఓడిపోయి నకారాన్ని దన్నుగా తెచ్చుకొంది. నభంబు అయ్యింది. అయినా నాయిక నడుము ముందు ఓడిపోయింది. ఇదే క్లూ. పద్యం మొత్తం ఇలాగే. ప్రయత్నించండి. ఇందులోని సమీకరణాలు కూడికలు తీసివేతలూ ఇలా ఉంటాయి.
1.
భము/ = న + భము = నభము
2
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = కల + భము = కలభము
3
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = కల + భము = కలభము/ = కలభము – కల = భము/ = కర + భము = కరభము
4
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = కల + భము = కలభము/ = కలభము – కల + కర = కరభము
5
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = భము + కల = కలభము/ = కలభము – కల + కర = కరభము/ = కరభము – కర = భము/ = కుం + భము = కుంభము
6
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = భము + కల = కలభము/ = కలభము – కల + కర = కరభము/ = కరభము – కర = భము/ = కుం + భము = కుంభము/ = శాత + కుంభము = శాతకుంభము
7
భము/ = న + భము = నభము/ = నభము – న = భము/ = భము + కల = కలభము/ = కలభము – కల + కర = కరభము/ = కరభము – కర = భము/ = కుం + భము = కుంభము/ = శాత + కుంభము = శాతకుంభము/ = శాతకుంభము – శాతకుం = భము/ = శు + భ + విగ్రహము = శుభవిగ్రహము.
ఇదీ మన ప్రాచీనకవుల గణితశాస్త్ర పాండిత్యం. ఇలాంటివి కోకొల్లలు.
– డా. అద్దంకి శ్రీనివాస్
అద్భుతం అమోఘం సార్