తొలి దళిత స్త్రీవాద కధ ఊరబావి

ఒక సాహిత్య ఉద్యమం సామాజిక, చారిత్రక కారణాల వల్ల కొంత వాడివేడి తగ్గాక పునర్‌మూల్యాంకనం చేసుకోవడం అవసరం. అప్పటివరకు గుర్తింపుకు రాని రచనలు, రచయితలు, కవులు, కవయిత్రులు ముందుకు వస్తారు. ఈ పనిని ఎక్కువగా విమర్శకులు, రచయితలు చేస్తారు. ఒక్కోసారి వీరిలో ఆ ఉద్యమ కవులు, రచయితలు కూడా ఉంటారు. అంటే ఒక ఉద్యమం తర్వాత సాహిత్య వాతావరణం కొంత నిశ్శబ్దానికి గురై మరో ఉద్యమం ప్రారంభమయ్యే మధ్య కాలంలో ఆ సాహిత్యాన్ని కొత్త సైద్ధాంతిక పద్ధతుల ద్వారా, లేదా పాత పద్ధతుల ద్వారా పరిశీలించడం జరుగుతుంది.
దళిత సాహిత్యం దళిత స్త్రీకి ఇచ్చిన గుర్తింపు తక్కువే. అయితే స్త్రీవాద సాహిత్యం, దళితవాద సాహిత్యం దళిత స్త్రీ వాదానికి కావాల్సిన నేపథ్యాన్ని ఏర్పరిచాయి అనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. దళిత స్త్రీ సాహిత్యంగా ‘నల్లపొద్దు’ కవితా సంకలనం ఆధునిక తెలుగు సాహిత్య పరిణామంలో గుర్తించదగిన మైలురాయి లాంటిది. గోగు శ్యామల, జూపాక సుభద్ర, జాజుల గౌరి, బోయ జంగయ్య, గద్దల బాను, కాలువ మల్లయ్య మొదలైన వాళ్లు దళిత కథాసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు, చేస్తున్నారు.
‘దళిత స్త్రీ గురించి దళిత స్త్రీలే రాయాలి’ అనే అంశాన్ని వదిలి ఆలోచిస్తే దళిత సాహిత్యం ఉద్యమ స్థాయికి రాకపూర్వమే – 1969 జూలై 2, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వెలువడిన కొలకలూరి ఇనాక్ కథ ‘ఊరబావి’. ఈ కథను దళిత సాహిత్యంలో భాగంగా కాక, దళిత స్త్రీ వాదానికి భూమికగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సాహిత్య ఉద్యమ పరిణామంలో చైతన్యం, ప్రతిఘటన అనేవి చివరి అంశాలు. కానీ వీటిని రచయిత ఈ కథలో దళిత సాహిత్య ఉద్యమ ప్రారంభంలోనే చిత్రించారు.
2002 మార్చి 8న అలీసమ్మ విమెన్స్ కలెక్టివ్ విడుదల చేసిన ప్రకటనలో భారతీయ స్త్రీవాదాన్ని పితృస్వామ్య దృక్కోణం నుండే కాకుం డా కులతత్వ కోణం నుండి కూడా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది- ‘భారత మహిళా లోకా న్ని కులతత్వ పితృ స్వామ్యం చీల్చివేసిన విషయాన్ని గుర్తించవల సిందిగా దళితేతర స్త్రీలనూ మేం కోరుతున్నాం. భారతదేశంలో కేవలం పురు షాధిపత్యం మాత్రమే కాదు, కులతత్వ పితృస్వా మ్యం పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తించ వలసిందిగా మిమ్మల్ని కోరు తున్నాం. భారతీయ మహిళల్లో కొనసాగుతున్న భిన్నత్వం (బహుళత్వం) రాజకీయ ప్రాధాన్యతను గుర్తించవలసిందిగా కోరు తున్నాం. మీరు రూపొందుతున్నారు, మేం ధ్వంస మవుతున్నాం. మిమ్మల్ని గుడిలో ప్రతిష్టిస్తున్నారు. మమ్మల్ని రేయింబవళ్లూ పనిచేయమని పొలాల్లో విసిరేస్తున్నారు. మిమ్మల్ని ‘సతి’గా మార్చుతున్నా రు. మమ్మల్ని వేశ్యలుగా మార్చుతున్నారు. ప్రజా స్వామిక స్త్రీవాదం ఏదైనా దాని లక్ష్యం జండర్, కులం, వర్ణం మొదలైన అధికార నిర్మాణాల్లో యిమి డి వున్న సామాజిక బంధాలను మార్చడమే.’
జండర్, కులం, వర్ణం అనే మూడు విధాల దళిత స్త్రీ పొందుతున్న అవమానాలను, ప్రతి ఘటించిన వైనాన్ని ‘ఊరబావి’ కథలో ఇనాక్ చిత్రించారు. కథలో ప్రధానాంశం దళితుల నీటి సమస్య. ఈ సమస్య పరిష్కారాన్ని ఆనాటి సాహిత్య పరిస్థితుల దృష్ట్యా రచయిత సంస్కరణ లేదా ఉద్ధరణ ద్వారా చూపాలి. కానీ ఇనాక్ ఒక మాదిగ స్త్రీ చైతన్యం ద్వారా పరిష్కారాన్ని చూపడం గుర్తించదగిన గొప్ప విషయం.
క్లుప్తంగా కథ విషయానికి వస్తే- వేసవి కాలంలో మిగిలిన బావులు ఎండి పోవడంతో పల్లెజనం, గ్రామంలోని జనం ఒకే బావి నుంచి నీళ్లు తెచ్చుకోవలసి వస్తుంది. పల్లెలో దళితులు బావినీళ్లు తోడుకోడానికి గ్రామంలోని వాళ్లు ఒప్పుకోరు. ఊరిజనం కనికరించి తోడిపోయాలి. బావి దగ్గరకు నీటికెళ్లిన మాదిగ చిదంబరం భార్యను ఊరి యువకుడు బాన ఎత్తుతూ ఆమె శరీరాన్ని చూస్తూ, తాకుతూ బాన వదిలేస్తాడు. బాన పగిలి పోతుంది. విషయం పల్లెంతా, ఊరంతా పాకుతుంది. ఎవరికీ తెలియకుండా చిదంబరం భార్య బావిలో ఎద్దుదట్టేన్ని పడేస్తుంది. అంతకు ముందే చిదంబరం ఊరి జనాలను వేణుగోపాలస్వామి ఆలయంలోకి పోలీసు సహాయంతో వెళ్లడం, రైల్వే స్టేషన్లో బెంచీపై కూర్చొని ఊరిజనాలు వస్తే లేవకపోవడం లాంటి సంఘటనల్లో ఎదిరించి ఉంటాడు. అందువల్ల చిదంబరం మీద అనుమానంతో మునసబు చిదంబరం తండ్రి రాముడ్ని, చిదంబరాన్ని కట్టేసి కొడతాడు. కానీ ఆ రాత్రి చిదంబరం భార్య మునసబును ఎవరికీ తెలియకుండా మంచానికి కట్టేసి కొడుతుంది. మునసబు సావిడికి, వాములకు నిప్పు పెడుతుంది. దాంతో ఊరి జనాలు, మునసబు బావి నీళ్లను పల్లెజనాలు వాడుకోడానికే ఒప్పు కుంటారు. చివరకు బావిలో ఎద్దు దట్టేన్ని బయటకు తీయడానికి అందరూ భయపడుతుంటే చిదంబరం భార్య చాకచక్యంగా బయటకు లాగుతుంది.
ఈ కథలో అన్యాయానికి గురయ్యే పాత్రలు మూడు. ఒకరు- చిదంబరం తండ్రి రాముడు. ఇతడు ఏమాత్రం చైతన్యం లేని వ్యక్తి. రెండు- చిదంబరం. ఇతడు సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కోరుకుంటా డు. మూడు- చిదంబరం భార్య. బావి దగ్గర జరిగిన అవమానానికి అతడ్ని కొట్టడం.. పల్లెనీటి సమస్య తీర్చడానికి ఎద్దుదట్టేన్ని బావిలో వేయడం.. రైల్వేస్టేషన్లో భర్త చిదంబరాన్ని కొట్టడానికి చెయ్యెత్తిన ఊరి అతడ్ని ఆపి, దబాయించడం.. మామను, భర్తను కొట్టిన మునసబును మంచానికి కట్టేసి కొట్టడం.. మునసబు ఆస్తి సావిడి, వాములు తగలబెట్టడం.. చివరకి ఎవరి వల్లా కాని ఎద్దుదట్టేన్ని బావిలోంచి తీయడం.. ఇవన్నీ మాదిగ స్త్రీ చైతన్యాన్ని తెలియజేసే సంఘటనలే.
చిదంబరం భార్య నీటికోసం బావి దగ్గరకెళ్లి పొందిన అవమానంలో ఒక్క జెండర్ అంశమే కాకుండా నీటిని బావి దగ్గర సొంతంగా తోడుకోలేకపోవడం అనే దళిత సమస్య కూడా ఉంది. ఈమె భర్తను, మామను కొట్టడం, రైల్వే స్టేసన్ సంఘటనలు ఒక్క కుల సమస్యనే కాకుండా భూస్వామ్య వ్యవస్థలో ఉన్న వర్గ సమస్యను కూడా తెలియజేస్తాయి. అదే విధంగా ఎద్దుదట్టేన్ని బావిలోంచి తీయడంలో దళిత స్త్రీకి శ్రమలో ఉన్న ప్రాధాన్యాతను కూడా తెలియజేస్తుంది. ఈ అంశాలన్నీ దళిత స్త్రీకి, దళితేతర స్త్రీకి గల భేదాన్ని వివరిస్తూ, దళిత స్త్రీ ఎదుర్కొనే సమస్యలను కూడా మన ముందుకు తెస్తాయి.
ఈ కథ వెలువడిన సుమారు పదేళ్లకు దళితులపై జరుగుతున్న అనేక దాడులు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో మాదిగకుంట చెరువులో పశువులకు పెట్టే కుడితిని పోయడం జరిగింది. ఆ కుంటలో నీళ్లు మాదిగలు తాగేవాళ్లు. దీనిని దళిత స్త్రీ సువార్తమ్మ ఎదిరించింది. తర్వాత ఈ సమస్యే పెద్ద తిరుగుబాటుకు దారితీసింది. అంతేకాదు కారంచేడు దళిత స్త్రీ హత్యల కేసులో ప్రధాన సాక్షి అలీసమ్మ. ఆమె కొడుకును చంపడం స్వయంగా చూసింది. సాక్ష్యం చెప్పడానికి పూనుకోవడంతో ఆమెను కూడా చంపేశారు.
‘ఊరబావి’ కథలో రూపం విషయానికి వస్తే- కథ సమస్యతో ప్రారంభమవుతుంది. ముగింపులో సమస్య పరిష్కారం ఉంది. పాత్రోచితమైన భాష, వర్ణనలన్నీ సహజత్వానికి దగ్గరగానే ఉంటాయి. కథ సర్వసాక్షి దృక్కోణంతో సాగినా రచయిత ఎక్కువగా కథలో ప్రవేశించారు. ప్రధాన పాత్ర చేసే పనులను గోప్యంగా ఉంచి ‘ముళ్ల’ను వర్ణించడం ద్వారా తెలియజేస్తారు- ‘చిదంబరం మునసబు మంచం వైపు చూశాడు. చేతులు తలవైపు పట్టెకూ, కాళ్లు కాళ్ల కట్టకూ కట్టి వేయబడ్డాయి. ముళ్ళు! నేర్పయిన ముళ్ళు! ఏనుగు ముళ్ళు! అతనికి ఊరబావి గిలకల పట్టెలకు మోకులు వేసిన ముళ్ళు గుర్తుకు వచ్చాయి!’ కథ చివరలో ఎద్దు దట్టేన్ని బావి లోంచి తీసిన తర్వాత ముళ్లు గురించి చిదంబరం ఈ విధంగా ఆలోచిస్తాడు. ‘చిదంబరం ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాడు. బావిలోంచి మోకులు తెచ్చి ఆమె పట్టెకు వేసిన ముళ్లు గూర్చి. చక్కని ముళ్లు! అందమయిన ముళ్లు! నేర్పుగల ముళ్లు! ఏనుగు ముళ్లు!’
ఈ కథలో చిదంబరం భార్య అని ప్రధాన పాత్రను పేరు లేకుండా చిత్రించడం వెనుక దళిత స్త్రీకి సమాజంలో, దళితుల్లోనూ ప్రాధాన్యత తక్కువగా ఉందని తెలియజేయడం మాత్రమే. ఈ విధంగా ఈ కథ దళిత స్త్రీచే రచించబడకపోయినా, దళిత రచయితగా గుర్తింపు పొందిన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ దళిత స్త్రీ చైతన్యాన్ని, ప్రతిఘటనను కథలో వాస్తవ రూపంలో రాశారు. దళిత స్త్రీవాదం నేడు తన మూలాలను కథలో కూడా వెతుక్కునే సమయం వచ్చింది కాబట్టి ఈ కథను ప్రప్రథమ కథగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
-శ్రీభవ్య
9603935285