వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి

పొద్దున్నే లేవగానే
పొగలు కక్కే కాఫీ తాగుతూ
పేపరు చదవాలని నా చిరకాల వాంఛ
కలల శాలువా కప్పుకొని
నిద్రా దేవత కౌగిలిలో
ఇంటిల్లిపాది పరవశిస్తున్న వేళ
నేను మాత్రం కళ్ళు నులుముకొంటూ
కాలు పెడతాను వంటింట్లోకి
నా సుందర సూర్యోదయాలన్నీ
వంటింటి ఆకాశంలోనే
ప్రతి ప్రభాతం కాఫీరాగం పలికించడానికి
శ్రుతి చేస్తాను వంటింటి వాయులీనాన్ని
చిన్నప్పుడు భయపెట్టిన దయ్యాల కథల్లా
పెద్దయ్యాక వెంటాడే పీడకల వంటిల్లు
నలభీమ పాకమని ప్రస్తుతించినా
వంటింటి పుస్తకంపై కాపీరైటు వనితలకే
విద్యార్థులు ఒక జవాబునే పదే పదే రాసినట్లు
ప్రతి రోజు బియ్యం కడిగి కడిగి
కూరలు తరిగి తరిగి
ప్రతినిత్యం లక్షల క్షణాల అవిరళ శ్రమ
పచ్చడి ప్రియులకు పప్పు ప్రియులకు
వేపుడు లేనిదే వెర్రెత్తి పోయేవారికి
అందరి అభిరుచుల మేర వండిపెట్టి
నా అభిరుచినే విస్మరించిన నేపథ్యంలో
ఇల్లు పట్టించుకోని వాళ్ళు
పిల్లల పేర్లు తెలియని వాళ్ళు
సంఘసేవకులుగా కీర్తింపబడుతున్న వేళ
మున్నూటరవై ఐదు రోజులు
వంటింటి చెరసాలలోనే మగ్గిపోతూ
నిగమశర్మ అక్కలా మిగిలిపోతున్నా
ంంం
ఉపమలతో రూపకాలతో
ఉత్తమ కవితను తీర్చిదిద్దినట్లు
కనుల విందుగా నోటికి పసందుగా
నా శాయశక్తులా సమయమంతా వెచ్చించి
వంట చేసి వడ్డించినా
చేస్తావుగానీ మా అమ్మ చేతివంటను
మరపించలేవనే అభిప్రాయ ప్రకటనతో
నేనొక దిగులు పిట్టను
ంంం
ఎంత జాగ్రత్తగా వున్నా
ఎప్పుడో ఒకప్పుడు పప్పులో కాలెయ్యక తప్పదు
నా అభిమాన కవి కవిత్వం చదువుతూ
తిక్కన కందంలా తీర్చిదిద్దాలనుకొన్న
తియ్యని కంద పులుసు
ఛందో భంగమైన పద్యంలా
అంద వికారంగా మారినపుడు
ప్రతి పద్య చమత్కార చేమకూర కవిత్వంలా
హృద్యంగా వండదలచిన చేమదుంపల కూర
చేదు రుచినే మిగిల్చినపుడు
పరవశింపచేసే పాటలు వింటూ
మల్లెమొగ్గలా పరిమళించాల్సిన అన్నాన్ని
మసిబొగ్గులా మార్చినపుడు
వెండిగిన్నెలాంటి పాలగిన్నె
కుండపెంకులా మాడినపుడు
వంటంటే శ్రద్ధ లేదని
రుచి లేని పచనంతో
తన జీవితం వ్యర్థమైందని
శ్రీవారు పరిపరి విధాలుగా
గాయపరచినపుడు నా మనసును…
ంంం
బాల్య వివాహ పంజరంలో
ఊపిరాడక ఉసురు కోల్పోయిన పూర్ణమ్మ
కలలు కాలరాచిన కన్యాశుల్క బాధిత బుచ్చమ్మల
బ్రతుకు కన్నీటి చిత్రాలు చిత్రించినందుకు గాక
సామూహిక వంటశాలలు నిర్మించాలని
ఒక చిన్న మాట రాసిన గురజాడ చేతిపై
ఒక చిన్న ముద్దు పెట్టాలని నా కోరిక
-మందరపు హైమవతి
94410 62732