నిరంతర చైతన్యశీలి – ఓల్గా

సనాతన సంప్రదాయ కుటుంబంలో 1924లో పుట్టి, పదకొండేళ్ళకు పెళ్ళి చేసుకుని, ఐదుగురు పిల్లల్ని కనిపెంచిన ఒక స్త్రీ, ఒక సామాజిక ఉద్యమకారిణిగా, స్త్రీవాదిగా మారిన క్రమమే మల్లాది సుబ్బమ్మగారి జీవితం. ఈ జీవితం ఆమె స్వయంగా నిర్మించుకున్నది. తన నిర్ణయాల ప్రకారం తన జీవితాన్ని నిన్నటి వరకూ కొనసాగించిన మల్లాది సుబ్బమ్మగారు ఇవాళ లేరు. తన జీవితంలో సగం కాలం తన చుట్టూ అల్లుకున్న ఆచారాలు సంప్రదాయాలనే ముళ్ళ పొదలను నరకటంలోనే వృథా అయిపోయిందనీ, కొంతవరకు మాత్రమే సమాజానికి ఉపయోగపడిందనీ ఆమె చెప్పుకునేవారు.
చిన్నతనంలోనే కనుపర్తి వరలక్ష్మమ్మ గారు నడిపించిన స్త్రీ వితైషిణీ మండలి ప్రభావం సుబ్బమ్మ మీద ఉంది. ఆ సంఘంలో పనిచేసిన అనుభవం తర్వాతి రోజుల్లో అనేక సంఘాలు పెట్టి నడపటానికి ఆమెకు ఉపయోగపడింది. 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటంతో ఆమె సాంఘిక ఉద్యమాలలోకి అడుగుపెట్టారు. ‘ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. పగిలిన అద్దం ఎంత అతికించినా అతుకు అతుకే తప్ప సహజం కాలేదు. అందువల్ల విడిపోతే తప్ప పరిస్థితి చక్కబడదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇచ్చి తీరాలి’ అని ఆమె ఆనాడు చీరాల సభలో మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన సంగతి తెలిసి కొంతకాలంగా అస్వస్థతలో ఉన్న ఆమె ఏమనుకున్నారో! ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమరె ్జన్సీలో భర్త రామ్మూర్తి గారు అరెస్టయి జైలులో ఉంటే, ఆ కాలమంతా ఎమర్జెన్సీ వ్యతిరేక భావాల ప్రచారం ఏదో ఒక రూపంలో చేస్తూనే వచ్చారు. 1979లో అభ్యుదయ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలై అనేక కార్యక్రమాలు చేపట్టారు. కూరగాయల ఎగుమతి వల్ల ఇక్కడ వాటి ధరలు పెరగటాన్ని గమనించి ఎగుమతిని నిషేధించాలని కోరుతూ జంటనగరాల మహిళా సంఘాలన్నీ కలసి చేసిన ఆందోళనలో సుబ్బమ్మ ముందు నిలచి పనిచేశారు. ఆ రోజు ఉల్లిపాయల ధర రూపాయి నుంచి మూడు రూపాయలకు పెరిగిందని ఆందోళన చెయ్యాలని పిలుపు ఇస్తే స్వచ్ఛందంగా వెయ్యిమందికి పైగా స్త్రీలు వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. అలాంటి చైతన్యవంతమైన కాలంలో ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తూ జీవించారు మల్లాది సుబ్బమ్మ.
కుల నిర్మూలనోద్యమంలో కూడా ఆమె చాలా కృషి చేశారు. కులనిర్మూలన సంఘంలో చేరి, సభలలో మాట్లాడటం, వ్యాసాలు రాయటం, ఆ సంఘం చేసే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సహాయపడటం వంటి పనులెన్నో చేశారు. 1983లో కుల, మత ప్రసక్తిలేని వివాహాలను ప్రోత్సహించటానికి ‘అభ్యుదయ వివాహ వేదిక’ని స్థాపించి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ కూడా కులాంతర, మతాంతర వివాహాలు జరిపిస్తూ వచ్చారు. హేతువాద ఉద్యమంలో భాగమై ఆ చైతన్య వ్యాప్తికి దోహదం చేశారు. 1988లో రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో ఆరు అడుగుల మనువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని విని సుబ్బమ్మగారు అంబేద్కర్ సంఘం వారి మీటింగులో దుష్ట మేధావి మనువు అంటూ మనుధర్మ శాస్త్రాన్ని తూర్పార బట్టారు. రాడికల్ హ్యూమనిస్టుగానూ ఆమె పనిచేశారు.
స్త్రీల సమస్యల మీద అనేక వ్యాసాలు, కథలు, నవలలు రాశారు. చాలా రాడికల్ భావాలతో ఆమె కథలు సాగేవి. వికాస కేంద్ర స్థాపన తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని సుబ్బమ్మ గారు చెప్పేవారు. సమస్యలలో ఉన్న స్త్రీలు ఎవరైనా అక్కడికి రావచ్చుననే ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. ‘నేను ఫెమినిస్టుని కాదు’ అని సామాజిక ఉద్యమాలలో సేవలో, రచనలో ఉన్న చాలామంది స్త్రీలు చెప్పుకుంటున్న రోజుల్లో ‘నేను ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని చె ప్పుకున్న సాహసవంతురాలు సుబ్బమ్మగారు. ఆమె ఆత్మకథ శీర్షిక కూడా ‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా’. ఆంధ్రప్రదేశ్లో సారా వ్యతిరేకోద్యమం పెద్ద ఎత్తున సాగిన నాటికి సుబ్బమ్మ గారికి 68 సంవత్సరాలు. అయినా సారా వ్యతిరేకోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రదర్శనల్లో, ప్రభుత్వంతో జరిపే చర్చలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలలో తన వాగ్ధాటితో సారాపై విరుచుకు పడ్డారు.
‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ అని పెట్టి తన స్థిర చరాస్తులను పిల్లలకు కాకుండా ట్రస్టు ద్వారా సామాజిక సేవకు అందేలా చేయటం సుబ్బమ్మగారి ప్రత్యేకత. ఒకప్పుడు ఆమె నివసించిన ఇంట్లో ఇప్పుడు బాలికలకు వృత్తి శిక్షణ కళాశాల నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అక్కడ సుబ్బమ్మగారు తన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జీవించి ఉండగానే ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే-మరణించిన తర్వాత మన గురించి ఎవరు పట్టించుకుంటారు? మనం చేసిన పనులను మనమే గౌరవించుకుంటే తప్పేంటి అని అన్నారు. అప్పుడు నవ్వేశాం గానీ మన దేశ చరిత్ర నిర్మించిన స్త్రీల గురించి మనకి తెలిసినదెంత?
వారు తమ గురించి తాము కొంత శ్రద్ధ తీసుకుని ఉంటే స్త్రీల చరిత్ర ఎంత సంపన్నవంతంగా ఉండేది అనిపించినపుడు సుబ్బమ్మగారు చేసిన పని అర్థవంతమైనదేనేమో అనిపిస్తుంది. ఈ పురుష ప్రపంచంలో స్త్రీలు పని చేసుకుంటూ పోవటమే కాక తమ గురించి తాము చెప్పుకోవాలి. లేకపోతే ఇంత ఆధునిక కాలంలోను వారిని తేలికగా మర్చిపోతారు.
భోళాగా కనిపిస్తూ, గలగలా మాట్లాడుతూ, విశ్రాంతి లేకుండా పనిచేస్తూ, నమ్మినదాన్ని నిక్కచ్చిగా చెప్తూ, దానిని ఆచరిస్తూ ఎంతటి అధికారులనైనా నిర్భయంగా నిలదీస్తూ తనకున్న అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకున్న మల్లాది సుబ్బమ్మగారు తన సేవల ద్వారా, చరిత్రలో చిరకాలం జీవిస్తారు.
-ఓల్గా