సామాన్యుని చేతిలోకి పుస్తకం

ఉత్తమ గ్రంథాల ప్రచురణ కోసం, యువజనుల్లో పఠనాసక్తిని పెంపొందించడం కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో న్యూఢిల్లీలో 1957లో స్థాపించబడిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బిటి). దీని విభాగాలు మొదట కోల్‌కతా, బొంబాయి, బెంగుళూరులలో ఏర్పాటయ్యాయి. 2009లో జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా మండలి సహకారంతో ఎన్బిటి దేశవ్యాప్తంగా యువజనులలో పుస్తక పఠనాభిలాష అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది. అక్షరాస్యులైన యువజనుల విద్యా స్థాయికి, వారి పఠనాసక్తులకు మధ్య సంబంధమున్నట్టు ఆ అధ్యయనంలో వెల్లడయింది. టెలివిజన్ ప్రసారాలను వీక్షించడం, ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయడం కంటే పుస్తక పఠనమే ముఖ్యమని అక్షరాస్యులైన యువజనులలో 75 శాతం మంది అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది.
1986 జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాల వారికి పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి ముఖ్యంగా బాలలు, యువతలో పఠనాసక్తిని పెంచడానికి ప్రతి రాష్ట్రంలోనూ కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ ‘బుక్ ప్రమోషన్ సెంటర్స్’ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఎన్బిటి అన్ని రాష్ట్రాలలోనూ ఈ సెంటర్స్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం గౌహతి, పాట్నా, గోవా, అగర్తలా లతోపాటు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న సాక్షరతా భవన్లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే జూలైలోగా సెంటర్ ప్రారంభం కానున్నది. బుక్ ప్రమోషన్ సెంటర్లో పుస్తక విక్రయ కేంద్రంతో పాటు సాహితీవేత్తలు, చిత్రకారులతో సమావేశాలు, చర్చలకు సైతం సదుపాయంగా ఉండేలా ఒక సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పుస్తక ప్రచురణ, పఠనాసక్తిని ప్రోత్సహించడం, భారతీయ గ్రంథాలను విదేశాలలో ప్రచారం చేయడం, రచయితలకు, ప్రకాశకులకు ఆర్థిక సహాయం చేయడం, బాలల సాహిత్యాన్ని ప్రోత్సహించడం ఎన్బిటి ప్రధాన కార్యక్రమం. ఈ సంస్థ చాలా సంవత్సరాలుగా దేశమంతటా పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి రెండేళ్ల కొకసారి న్యూఢిల్లీలో విశ్వ పుస్తక వేదికను ఏర్పాటు చేస్తున్నది. ఆసియా, ఆఫ్రికా దేశాలలో జరిగే పుస్తక ప్రదర్శనల్లోకెల్లా ఇదే పెద్దది. ఇందులో 1200కు పైగా దేశ విదేశాల ప్రచురణ సంస్థలు పాల్గొంటాయి. ఈ ప్రదర్శనల్లో రచయితలతో ముఖాముఖి, పుస్తకావిష్కరణలు, చర్చలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది.
పుస్తక పరిశ్రమ అభివృద్ధికి ప్రచురణ, విక్రయ విభాగాల్లో ప్రతిభావంతులైన యువకుల కోసం ఢిల్లీలో మూడు మాసాల శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. 100 రూపాయల సభ్యత్వ రుసుముతో ఎన్‌బిటిలో సభ్యులుగా చేరిన వారికి ప్రతి కొనుగోలుపై 20 శాతం తగ్గింపు ఉంటుంది. సాహిత్య అకాడమీ, పబ్లికేషన్స్ డివిజన్ మొదలైన సంస్థల ప్రచురణలను కూడా ఈ బుక్ ప్రమోషన్ సెంటర్ విక్కయ కేంద్రం అందుబాటులో ఉంచుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉండే ఈ సెంటర్‌ను సాహిత్యకారులందరూ ఉపయోగించుకోవాలని దాని బాధ్యులు పత్తిపాక మోహన్ కోరుతున్నారు.