ఎంత మంది మహత్ములబ్బా! గాంధీపై పటేల్ విసుర్లు

భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. గాంధీ, నెహ్రూ, పటేల్‌ల మధ్య ఉన్న సంక్లిష్టమైన అనుబంధాలు, జాతీయోద్యమంపై వాటి ప్రభావం, సమకాలీన భారతదేశంలో పటేల్ సిద్ధాంతాల ఆవశ్యకతలపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే పటేల్ జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించిన రచనలు అతి తక్కువ. ఈ లోటును పూరిస్తూ గాంధీ మనమడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్ గాంధీ ఇంగ్లీషులో రాసిన పటేల్ జీవితకథను-“వల్లభ్‌భాయ్ పటేల్.. ” పేరిట ఎమెస్కో పబ్లికేషన్స్ ఇటీవల తెలుగులో ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికర భాగాలు..
లండన్‌లో లా కాలేజీలను ‘ఇన్స్ ఆఫ్ ద కోర్ట్’ అని పిలిచేవారు. అటువంటి కాలేజీలలో ఒకటైన మిడిల్ టెంపుల్లో వల్లభ్‌భాయ్ చేరాడు. అక్కడ కోర్సులో భాగంగా మూడేళ్లలో తొమ్మిది టర్మ్‌లు చదవాలి. ప్రతి టర్మ్‌లో ఏదో ఒక ఇన్‌లో కనీసం ఇన్నిసార్లు రాత్రిపూట భోజనం చేయాలనే నియమం ఉంది. తనకన్న ముందు మోహన్‌దాస్ గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, విఠల్‌భాయ్ అలాగే చేసారు. 1910లో జవహర్లాల్ నెహ్రూ కూడా ఇన్నర్ టెంపుల్లో చేరాడు. ఆయన వల్లభ్కన్న 14 సంవత్సరాలు చిన్నవాడు. అక్కడ చేరేముందు నెహ్రూ.. హారో, కేంబ్రిడ్జ్లలో చదివాడు; వల్లభ్లాగా పెట్లాడ్, నడియాడ్, బోర్సాడ్లలో కాదు. లండన్‌లో వల్లభ్, జవహర్లాల్ కలిసినట్లు ఎక్కడా రికార్డు లేదు. భౌతికంగా, విద్యాపరంగా సమీపంలో ఉన్నా వారు ఎవరి ప్రపంచంలో వారుండిపోయారు.
‘ఈక్విటీ’ అనే సబ్జెక్టులో మొదటి మార్కులు వచ్చినందుకు వల్లభ్‌భాయ్‌కు, గాడ్ఫ్రే డేవిస్ అనే క్లాస్‌మేట్‌కు 1911 జనవరిలో కాలేజీవారు అయిదేసి పౌండ్లు బహుమతిగా ఇచ్చారు. ఆ బహుమతి పొందినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో ఆయన నర్సీభాయ్‌కి రాసిన ఒక ఉత్తరాన్ని బట్టి గ్రహించవచ్చు.
“గౌరవనీయులైన సోదరులు నర్సీభాయ్‌కి, నేను ఒక పరీక్ష రాసాను. మొదటిర్యాంక్ వచ్చింది. గౌరవనీయులైన తల్లిదండ్రులకు నా ప్రణామాలు తెలియజేయండి. అక్కడి సమాచారాలు రాస్తుండండి. కాశీభాయ్ అసలేమీ రాయటంలేదు… భగవంతుని దయ ఉంటే తక్కిన రెండు సంవత్సరాలు త్వరలోనే గడిచిపోయి, తిరిగి మీ అందరినీ చూస్తాను. మీ సేవకుని ప్రణామాలు. వల్లభ్‌భాయ్.”
ఇంగ్లాండులో విద్యార్థులు కోరుకుంటే సుమారు 20 నెలలకే పరీక్షలు రాయవచ్చు. ఆనర్స్‌లో పాసైన వారు తమ ఇన్‌లో మరొక టర్మ్పాటు నిర్ణీత కార్యక్రమం ప్రకారం డిన్నర్లు పూర్తిచేస్తే, అప్పుడు వారిని ఆరునెలలు ముందే బార్‌కు పిలుస్తారు. ఆ విధంగా విఠల్వలెనే వల్లభ్ కూడా 20 మాసాలకే ఫైనల్ పరీక్షలు రాసి, ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, 50 పౌండ్ల బహుమతి గెలుచుకున్నాడు. దాని గురించి కూడా ఇంటికి ఉత్తరం రాసాడు:
“మిడిల్ టెంపుల్, లండన్ నుంచి నర్సీభాయ్‌కి, 7-6-1912:
నా పరీక్షలు పూర్తయ్యాయి. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యాను. అందువల్ల ఆరు మాసాలు ముందుగానే ఇంటికి రాగలను. వచ్చే జనవరిలో తిరిగివస్తాను. ఈ మాట తల్లిగారికి, తండ్రి గారికి తెలియజేయగలరు. మిత్రులకు కూడా తెలుపగలరు. ఇంతే విశేషాలు. ప్రణామాలతో మీ సేవకుడు వల్లభ్‌భాయ్.”
అగ్రస్థానానికి చేరేందుకు పటేల్ కోసం ఒక నిచ్చెన వేసి ఉంచి, సమయం కోసం ఎదురుచూస్తుండిన విధి, మరో ఇతర ఆలోచనకు కూడా చేసింది. ఆ విధి 1915లో మరొక బారిష్టర్‌ను అహమదాబాద్‌కు తీసుకుని వచ్చింది. ఆయన పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఆయన అప్పటికే ఇరవై సంవత్సరాలకు పైగా దక్షిణాఫ్రికాలో గడిపాడు. వల్లభ్భాయ్కన్న ఆరేళ్లు పెద్దవాడైన గాంధీ దక్షిణాఫ్రికాలోని భారతీయులకు శ్వేతజాతీయులతో సమానావకాశాలకోసం ఉద్యమించి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాడనటంలో సందేహంలేదు. స్వదేశానికి తిరిగి వచ్చిన నెలరోజులలోనే ఆయనను మహాత్ముడన్నారు. అందుకు వల్లభ్‌భాయ్, “మనకు ఇప్పటికే చాలామంది మహాత్ములున్నా” రంటూ ఈసడించాడు. గుజరాత్ క్లబ్ సభ్యులు కొందరు నగరంలో గాంధీ ఆరంభించిన కొచ్రబ్ ఆశ్రమానికి కుతూహలం కొద్దీ వెళ్లారు. వారు.. సత్యాగ్రహం, అహింస అనే కొత్త ఆయుధాలను గాంధీ తీసుకొచ్చాడనే కబురు మోసుకొచ్చారు. ఆ ఆయుధాలు భారతీయులకు ఉపయోగపడగలవని, బహుశా వారిని పరాయి పాలన నుంచి విముక్తులను కూడా చేయగలవని ఆయన నమ్ముతుండినట్లు వారికి తోచింది. అంతేకాదు, విద్యావంతులైన భారతీయులు ధాన్యం విసరాలని, మరుగుదొడ్లను శుభ్రంచేయాలని ఆయన చెప్పాడని వాళ్లు చెప్పారు.
అది విని నవ్విన పటేల్, గాంధీ “తిక్క” గురించి, “విచిత్ర ఆలోచనల” గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించాడు. కొందరి ఆహ్వానంపై గాంధీ ఒకరోజు ఆ క్లబ్బుకు వెళ్లాడు. అక్కడి లాన్స్పైన ఆయన చేయబోయే ప్రసంగం వినేందుకు కొందరు వెళ్లారు. వారంతా వరండాలోని తన బ్రిడ్జ్ టేబుల్ పక్కనుంచి వెళుతుండగా చిరాకుపడిన వల్లభ్‌భాయ్, వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. బ్రిడ్జ్ టేబుల్ వద్ద పటేల్ చర్యలను గమనిస్తుండిన మావ్లంకర్ ఆ తరువాత చెప్పిన వివరాలను బట్టి, అదంతా 1916 వేసవికాలంలో జరిగినట్లు నిర్ధారించవచ్చు. అంతలో గాంధీ రావటాన్ని చూసి మావ్లంకర్ లేచి నిలుచున్నాడు.
పటేల్: మావ్లంకర్, ఎక్కడకు వెళుతున్నారు? ఎందుకు లేచారు?
మావ్లంకర్: చూడండి, గాంధీ వస్తున్నారు.
పటేల్: అయితే ఏమిటి. మన గేమును చూసి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఆయనేమంటాడో నేను చెప్పగలను. ఆయన మిమ్మల్ని గోధుమల నుంచి రాళ్లు ఏరగలరా అని అడుగుతాడు. అందువల్ల దేశానికి స్వాతంత్య్రం లభిస్తుందట.
ఆ మాట విని అందరూ మరింత పెద్దగా నవ్వారుగాని మావ్లంకర్ మాత్రం గాంధీ కోసం వెళ్లాడు. ఆయన ఉద్దేశంలో, వల్లభ్‌భాయ్ తన ధోరణిలో ఆ విధంగా మాట్లాడినప్పటికీ ఆ సరికే “ఆ మనిషిని గౌరవించటం” మొదలుపెట్టాడు. పాతికేళ్ల తరువాత వల్లభ్‌భాయ్ ఆ విషయమై మాట్లాడుతూ, 1915లో, 1916లో తను సుమారు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, విశిష్టమైన మేధాశక్తిగల యువకులు గాంధీపట్ల ఆకర్షితులు అవుతుండటం తనకు అర్థంకాని విషయంగా తోచిందని ఒప్పుకున్నాడు.
డిసెంబర్లో బీహార్‌లో పర్యటించిన పటేల్ రైతులను ఉద్దేశించి హిందీలో ప్రసంగాలు చేసాడు. అందులో మధ్యమధ్య గుజరాతీని చేర్చాడు. సూటిగా మాట్లాడే ఆయన పద్ధతి అక్కడ కొత్త పుంతలు తొక్కింది:
“నేను మీమీద కోపగించటానికి వచ్చాను తప్ప ఆశీర్వదించేందుకు కాదు. మహాత్ముడు ఇతర ప్రాంతాలకన్న ముందుగా మీవద్దకు వచ్చారు. కాని ఆ గౌరవానికి మీరు అర్హులైనట్లు తోచటం లేదు. మిమ్మల్ని నోరుమూయించే క్రూరమైన ప్లాంటేషన్ యాజమాన్య ధోరణులు ఇప్పుడు లేవు. అయినప్పటికీ మీరు ఇంకా మూగపశువుల్లా ఉంటున్నారు. మీ జమీందార్లపై రాత్రింబగళ్లు ఫిర్యాదులు చేస్తారు. కాని వాళ్లను దారికి తెచ్చేందుకు ఏమీ చేయరు… జమీందార్లు తమ పద్ధతులు మార్చుకోనట్లయితే వారికోసం వ్యవసాయం చేయకండి.
మీ స్త్రీలను పరదాల వెనకే ఉంచటానికి మీకు సిగ్గువేయటం లేదా? ఎవరీ స్త్రీలు? మీ తల్లులు, సోదరీమణులు, భార్యలు. వాళ్లు బయటి ప్రపంచంలోకి వచ్చినట్లయితే మీ బానిసత్వాన్ని చూసి ఇక మీతో తెగతెంపులు చేసుకుంటారని భయపడుతున్నారా? వారితో మాట్లాడే అవకాశమేగాని నాకు లభిస్తే, ఇటువంటి పిరికిభర్తలతో సంసారం చేయటంకన్నా విడాకులివ్వమని చెప్తాను.
మతంపేరిట బాల్యవివాహాలు చేసే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కారు, వారు దయ్యాలు. జమీందార్లు, బ్రాహ్మణుల నియంతృత్వానికి ఇష్టపూర్వకంగా లొంగిపోయే మీకు, రైతులనిపించుకునే అర్హత లేదు.”
వల్లభ్‌భాయ్ 1929వ సంవత్సరంలో చేసిన ప్రసంగాలన్నింటిలో భూమిశిస్తు హెచ్చుగా ఉండటం గురించి ప్రస్తావించేవాడు. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశాన్నంతా ఒకటి చేయవచ్చునన్నది ఆయన నమ్మకం. కాని మహాత్మునికి అంత నమ్మకం ఉండేది కాదు. ఆయన ఆ అంశాన్ని 1929 సెప్టెంబర్ యంగ్ ఇండియా సంచికలో చర్చించాడు.
వల్లభ్‌భాయ్ పటేల్ (జీవిత కథ)
రచయిత: రాజ్‌మోహన్ గాంధీ
తెలుగు సేత: టంకశాల అశోక్
వెల:300 రూపాయలు
పేజీలు: 822