పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32

అంతమైన స్వప్నం

ఒకరి ప్రతిభతో ఒకరు పోల్చటానికి వీలు లేక పోయినా వర్డ్స్ వర్త్ ,కాల్రిద్జ్ టేలర్ ,సూతే లు కొత్త మార్గాలు తొక్కారు .తిరుగు బాటు చేయక పోయినా వ్యతిరేకించారు .మనిషి సాటి మనిషిపై బాధ్యత గురించి ఆలోచించారు .రాజకీయాల బదులు సాంఘిక నీతి రాజ్యమేలాలని స్వప్నించారు (యుటోపియ).తమ సృజన తో ఆత్మ శక్తిని అందించి మంచి గొప్ప ప్రపంచం కోసం కలలు కన్నారు .కాని అవి కల్లలే అయ్యాయి .దీనికి అనేక సంఘటనలు కారణమయ్యాయి .వాగ్దానాల హోరేక్కువైంది .బాస్తిల్లీ పతనం వలన రోమాన్స్ ,రివల్యూషన్ లు పల్చ బడ్డాయి .తిరుగు బాటు యువకుల కర్తవ్యమే అయింది .కవులు శృతి కలిపారు లు . వర్డ్స్ వర్త్  వీరందరి తరఫునా వకాల్తా తీసుకొని ‘’bliss was it in that dawn to be alive –but to be young  was very heaven ‘’.అని చెప్పాడు .

కల సాకారం కావాలనే అందరూ భావించారు .స్తబ్దత నుంచి చైతన్యం రావాలని కోరారు .కాని శిష్యులకు వాస్తవం చెడు అయింది .హింస ధ్వనిని తట్టుకోలేక పోయారు ఫ్రెంచ్ .విప్లవం తరువాత  నాలుగేళ్ళకు  ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో యుద్ధం చేసింది .నియంత నెపోలియన్  బెదిరింపుతో  భయం తో పందొమ్మిదో శతాబ్ది ఉదయించింది .తిరుగు బాటు విముక్తి కి అని ,యుద్ధం భావ శుద్ధి (కేతార్సిస్ )కి అన్న అభిప్రాయం తప్పు అయింది .యువత అంతా మధ్య తరగతి కన్జర్వేట్లు గా మారారు .సూతీ ఆస్థాన కవి అయ్యాడు .కాల్రిడ్జి  లైబ్రరీ పుస్తకాలలో కూరుకు పోయాడు .వర్డ్స్ వర్త్ ప్లేటు మార్చి’’ టోరీ’’ అయ్యాడు .

ప్రకృతి కవి – విలియం వర్డ్స్ వర్త్

ప్రకృతికవి అని పిలువ బడే విలియం వర్డ్స్ వర్త్ 7-4-1770నకంబర్ లాండ్ లో కాకర్ మౌత్ లో పుట్టాడు .ఇది అందమైన లేక డిస్ట్రిక్ట్ లో దార్వేంట్ నదీ తీరం లో ఉంది .తండ్రి లాయర్ .ఎస్టేట్ వొనర్ కూడా .వీరిని’’ నార్త్ కంట్రీ పీపుల్స్ ‘’అంటారు .పురాత యార్క్ షైర్ ముతక మనుషులని ముద్రపడ్డారు .భాష కూడా చాలా మొరటుగా ఉంటుంది ..అయిదుగురు పిల్లలలో విలియం రెండవ వాడు .తల్లి ముప్ఫై ఏళ్ళకే చని పోయింది .విలియం సోదరి డరోతి కంటే భిన్నమనస్తత్వం ఉన్న వాడు .చిన్నప్పుడే మూడీ గా కొరుకుడు పడనీ వాడుగా ఉండేవాడు .ఒక సారికోప పడితే గదిలో దూరి చస్తానంటూ బెదిరించాడు .అమ్మ తరఫు బంధువులైన ‘’కూకాంస్ ‘తరచూ వచ్చి వెల్తూండేవారు .వారిలో మేరీ హచిన్సన్ అనే కజిన్ పై ప్రేమలో పడి పెళ్లి చేసుకొన్నాడు .తల్లి చావుతరవాత ఎనిమిదో ఏట హాక్ షెడ్ లోని గ్రామర్ స్కూల్ కు పంపారు .ఏదో వానాకాలం చదువు చదివి అత్తిసరు మార్కులతో ముక్కాడు .క్లాసు పుస్తకాలలోని చదువుకంటే విండర్ మీర్ ,ఆమ్బుల్ సైడ్ పర్వత దృశ్యాల వలన నేర్చిన చదువే ఎక్కువ .ఇంటిలో ఉండే ఆనందం కంటే ఇక్కడే ఎక్కువ ఆనందం సంతోషం పొందేవాడు .ఆటా పాటా ,స్కేటింగ్ ,నడక కొండలేక్కి దిగటం సరస్సులో స్నానాలు ఏంతో ఇష్టం గా ఉండేవి .స్వీయ జీవిత చరిత్ర గా పిలువ బడే ‘’ప్రేల్యుడ్ ‘’లో ఇవన్నీ రాసుకొన్నాడు కవితాత్మకం గ .‘’attends upon the motion of the winds –embodied in the mystery of words’’అందుకే ఈ కవిని ‘’the essential passions of the heart ‘’కు అంకితమైన కవి అంటారు .

తండ్రి మరణం తర్వాత కుటుంబం విచ్చిన్నమైంది .పద్నాలుగేళ్ళప్పుడు అన్న రిచర్డ్ తోకలిసి అమ్మ తరఫు ‘’కాక్సంస్ ‘’ల దగ్గరకు చేరాడు .చిన్నప్పటి నుంచి అన్యోన్యం గా మెలగిన సోదరి దరోతి తల్లి కజిన్ దగ్గర పెరుగుతోంది .పదేళ్లకు కాని ఆమెను మళ్ళీ చూడలేక పోయాడు .ఎవరి మీదో ఆధారపడి ఉండటం ఇష్టం లేని విలియం పది హేడవ ఏట సెయింట్ జాన్స్ కాలేజిలో చేరి విశేష ప్రతిభ కనబరచాకుండానే ,చదువు పై అంతశ్రద్ధ లేకుండా చదువంటే ఏవగింపు కలిగి మానేశాడు .వికారం గా’’ వేగ బాండ్’’గా  కని పించేవాడు .మృదు స్వభావం లేదు .మొరటుతనమే కనిపించేది అన్నిట్లోనూ .స్నేహితులూ ఏర్పడలేదు .ఒంటరిగా రోడ్ల మీద తిరుగుతూ బయటికి వినిపించేట్లు పాడుకొంటూ తిరిగే వాడు .వంద  పంక్తుల ‘’యాన్ ఈవెనింగ్ వాక్ ‘’కవిత రాసి తన తీరు తెన్నులను నింపాడు .జేమ్స్ బీటిల్ అనే  మినిస్త్రెల్ ‘’ప్రేల్యుడ్ ‘’రాయమని ప్రోత్సహించాడు .

కాలేజి లో చదువు పూర్తిచేసి  లా చదువుతాడేమో నని  కుటుంబం ఆశ పడింది .మనవాడికి ఆ ధ్యాసే లేదు .పార్శ్వ నెప్పి ,తల నెప్పి తో బాధ పడేవాడు .విలియం ఏది చేసినా చెల్లెలు హర్షించేది .’’ఆరోగ్యం బాగా ఉంటె వాడే లా చదువుతాడులే ‘’అని సర్ది చెప్పేది .సైన్యం లో చేరాలను కొన్నాడు .లండన్ చేరి ఫ్రాన్స్ లో జరుగుతున్న విషయాలు తెలుసుకొన్నాడు బాష్టిస్తి పతనమైంది .రాజరికాన్ని కూల ద్రోసి ప్రజాస్వామ్యం ఏర్పరచారు ..ప్రేల్యుడ్ కవితలను బ్యూపే అనే ఆతను మెచ్చి ప్రోత్సహించాడు .స్వార్ధ రహిత విప్లవ వాదిగా మారాడు .దానినే ‘’France standing at the top of golden hours –and human nature seeming born  again ‘’అని కవిత్వీకరించాడు .నిరంకుశత్వాన్ని ఈసడించాడు .ప్రజలు తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని చెప్పాడు .ఇదొక ‘’యుటోపియా ‘’.దీన్ని సాధ్యం చేయాలని ఆలోచించాడు .ఒక రకం గా .పునర్జన్మ పొందాడు .ఆర్లియాన్స్ లో ఒక లాడ్జి లో ఉన్నాడు .పాల్ వాలన్ తోపరిచయం జీవితాన్నే మార్చేసింది .అయన తన సోదరి ‘’ఆన్నేట్టే ‘’ను కవికి పరిచయం చేశాడు .ఆమె ఫ్రెంచ్ కన్య .మన వాడి మారిన మనస్తత్వం ఆమెకు నచ్చింది  .ఇద్దరూ ప్రేమలో పడి ఒక కూతురుఆన్ కరోలిన్  ను కన్నారు .ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మధ్య యుద్ధం మొదలైంది .ఎక్కడికీ కదిలే వీలే లేకుండా పోయింది .భార్య పిల్లను పంపే అవకాశమే లేదు. ఇంగ్లీష్ దేశస్తుడైనా తను ‘’ప్రపంచ భక్తుడు ‘’అని పించుకొన్నాడు .ఆ ఊహా ప్రపంచానికి తన భార్య ఒక ప్రతీక అనుకొన్నాడు .

ఇరవై మూడులో తీవ్ర హింసల పాలయ్యాడు .ఫ్రాన్స్ లో హింస రాజ్యం చేస్తోంది .కాని ఇది ప్రపంచ విముక్తికి దోహదం చేస్తున్దనుకోన్నాడుపాపం .భార్య విషయం లో ఆందోళన ఎక్కువైంది .అక్రమ సంతానానికి కారకుడైనందున ఇంట్లోకి రానివ్వలేదు .అక్కడ భార్య ఇతనికోసం ఎదురు చూస్తోంది .భర్త ఏదో ఒక రోజు వచ్చి కలుసుకొంటాడని ఎదురు చూస్తోంది .కానిమనవాడు ఆ జ్ఞాపకాలన్నీ తుడిచేసుకొన్నాడు .ఆమెతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను తగల బెట్టాడు .ఈ ఉదంతాన్ని డెబ్భై ఏళ్ళు దాచేశాడు విలియం మరణం తర్వాతే ఇది బయట పడింది .ఆమెకు ద్రోహం చేశానని మనసు క్షోభ పడుతోంది .విప్లవం ఊపులో అన్నీ మరిచాడు .చివరికి అది రక్తపు టేరులను పారిస్తోందని తెలుసుకొన్నాడు .ట్యూటర్ గా ,మేగజైన్ కు రచయితగా ఉండాలనుకొన్నా సాగలేదు .సంపాదనే లేదు. స్నేహితుల దయాదాక్షిణ్యం పైనే జీవిస్తున్నాడు .క్షయ తో మరణానికి చేరువ లో ఉన్న రైస్లీ అనే అతనికి సేవచేశాడు .అతని మరణం తో తొమ్మిది వందల పౌండ్లు లభించాయి .

డరోతి మేనమామల ఇల్లు వదిలి విలియం ను చేరింది .పల్లె టూరు లో ఉండాలని కోరింది .అతను  ‘’నేచర్స్ లారిఎట్ ‘’కావాలని భావించింది .లండన్ వెళ్ళిపోయాడు .మళ్ళీ దొర్సేట్ షైర్ లో రేస్ డౌన్ లో ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉన్నారు .వారిద్దరి మధ్య విపరీతమైన ఆకర్షణ ప్రేమ ఉండేవని చరిత్రకారులు చెప్పారు .వారిద్దరి మధ్యా సంభాషణలు కూడా ప్రేమికుల సంభాషణల్లా ఉండేవి .ఆమె ఇతని భావాలకు విరుద్ధం గా కని  పించేది .ఇరవై మూడేళ్ళ వయసులో ఒక పబ్లిషర్ విలియం రాసిన ‘’డిస్క్రిప్టివ్ స్కెచెస్ ‘’,యాన్ ఈవెనింగ్ వాక్ ‘’లను ముద్రించి ఇచ్చాడు .ఇవి ఆగస్టన్ పోయిట్రీకి అనుకరణ .సమీక్షలు ఆశా జనకం గా రాలేదు. కాల్ రిడ్జి వచ్చి వీరితో చేరిన తర్వాతే విలువతెలిసింది .వర్డ్స్ వర్త్ ‘’వర్త్ ఏమిటో ‘’ లోకానికి తెలిసింది ఆంగ్ల కవిత్వా తీరు తెన్ను మార్చేసే కవిత్వం వచ్చింది .కాల్ రిడ్జికి విపరీతమైన భావోద్రేకం ఊహా ఉన్నాయి .వర్డ్స్ వర్త్,  కాల్ రిడ్జి,  సూతే త్రయం అవిభాజ్యమై కొత్తపోకడలతో ఇంగ్లీష్ కవిత్వాన్ని కదను తొక్కించారు .

సామ్యుల్ టేయిలర్ కాల్ రిడ్జి

కాల్ రిడ్జ్ రాసి వదిలిన వాటిని పూర్తీ చేయటానికి రెండు నిండు జీవితాలు చాలవు అంటారు .తేల్చుకోలేని మనస్తత్వం ,నల్లమందు భాయీ .21-10-1772లో దేవాన్ లో సెయింట్ మేరీ లోని ఒటారిలోజన్మించాడు .పదముగ్గురి లో చివరి సంతానం .అన్నతో గొడవ పడి వాడు చావా కొడితే నది ఒడ్డున స్పృహ తప్పి పడిపోయి మర్నాటి దాకా లేవలేదు .చలికి ఒళ్ళు మొద్దుబారింది. దీనితో నరాల బాధలేర్పడ్డాయి .అందువలన జీవితం అంతా దాదాపు పనికి రాని  వాడుగా ఉండి పోవాల్సి వచ్చింది .ఒంటరిగా పుస్తకాలతో కాలక్షేపం చేశాడు .’’అరేబియన్ నైట్స్ ‘’చదివి ఆరేళ్ళ వయసులో సాహస గాధ లంటే మహా ఇష్టపడ్డాడు .మాయలు మంత్రాలు తమాషా కధలు చదివి రాత్రుళ్ళు పలవ రించేవాడు ..తొమ్మిదో ఏట దరిద్రం తో తండ్రి చనిపోయాడు .ఒక లోకల్ జడ్జి కాల్ రిడ్జి ని చారిటీ స్కూల్ లో చేర్పించాడు. .అక్కడి మురికి వాతావరణం నచ్చలేదు.తిండి అసలు బాగా లేదు చిన్న రొట్టె ముక్కే గతి .ఇవి భరించలేక ఒక మూల చేరి ‘’చదువే చదువు’’ గా గడిపాడు .రివరెండ్ జేమ్స్ బాయర్ అనే టీచర్ మాత్రం ఇతన్ని దారిలో పెట్టి మార్చాడు .’’Boy! the school is your father .The school is your mother –the school is your sister .,your brother all the rest of your relations ‘’అని ప్రబోధించాడు .జీజస్ ను ప్రేమించమని బోధించాడు .అంటే కాల్ రిడ్జి జీవితం కార్నర్ తిరిగింది .

అతని చూపుల్లో మార్పు వచ్చింది కాని కవళికలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి .కళ్ళల్లో కాంతి ప్రస్పుటం గా గోచరిస్తోంది .అందరిలో కొట్టవచ్చినట్లు ప్రత్యేకం గా కని  పించే వాడు .విలియం ‘’రిడ్జి’’ ని ఇంటికి ఆహ్వానిస్తే అతని సోదరి ఇవాన్స్ పై మనసు పారేసుకొని ,చెట్ట పట్టాలేసుకొని తిరిగాడు .ఆమెపై కవితా వర్షం కురిపించాడు .కాల్ సోదరుడు లూక్ డాక్టర్  అయ్యాడు .మనవాడికి సర్జన్ అవాలనే అభిలాష కలిగింది .కుప్ప తెప్పలుగా మెడికల్ పుస్తకాలు, సామగ్రి అందు బాటులో ఉన్నాయి .రోగాల, మందుల గురించి సమగ్ర జ్ఞానం సాధించాడు .ఇదంతా ఒక భ్రాంతిలో చేసిన పని .కీళ్ళ వాతం తిరగ బెట్టింది .పది హేడు నుండి పందొమ్మిదేళ్ళ వరకు మంచం మీదే ఉండి పోయాడు .

జీసస్ కాలేజ్ కేంబ్రిడ్జి నుంచి స్కాలర్షిప్ పొందాడు .మంచానికే పరిమితమై పోయాడు .జబ్బుతో .ఫ్రెంచ్ రివాల్యూషన్ చూసి రిపబ్లికన్ గా మారి గొప్ప వక్త అయ్యాడు .అప్పులు ఎక్కువయ్యాయి  .తప్పించుకోవటానికి లండన్  పారి పోయాడు .దీనినే అతని భాష లో ‘’I fled to London to debauchery ‘’అన్నాడు .సంపాదన లేదు .ఉన్నదానితో గాంబ్లింగ్ ఆడాడు .ఆత్మ హత్యా ప్రయత్నం చేశాడు .ఇరవై ఒకటిలో పేరు మార్చుకొన్నాడు .ఆర్మీ లో చేరాడు .నాలుగు నెలల తర్వాత సోదరుడు జార్జి చలవ తో బయట పడ్డాడు .అన్నీ తొందర బాటు నిర్ణయాలే . కేంబ్రిడ్జి కి తిరిగి వచ్చి స్కాలర్షిప్ పునరుద్దరింప బడితే చదువు సాగించాడు .అద్భుతం గా అనేక అనువాదాలు చేశాడు .మొదటి రచన ‘’లెవ్ టి ‘’మొదలెట్టాడు .దీనికే ‘’సర్కాసియాన్ లవ్ చాంట్ ‘’అని మరో పేరు .రాబర్ట్ సూతీ తో పరిచయమేర్పడింది .ఇద్దరికీ కవిత్వం పిచ్చి ఎక్కువే .

రాబర్ట్ సూతీ

12-8-1774లో బ్రిస్టల్ లో పుట్టాడు రాబర్ట్ సూతీ .వంశం బాగా గౌరవాదరాలున్నదే .తాత సోమర్సెట్ రైతు .తండ్రి బట్టల వ్యాపారి .తల్లి సంపన్న గృహం నుంచి వచ్చింది .సూతీ పిన తల్లి రక్షణ లో పెరిగాడు .ఆడపిల్లలా ముద్దు చేసి డ్రెస్ చేసి ఆరేళ్ళ వరకు పెంచింది .ఎనిమిదో ఏట ‘’స్కిపియో ‘’అనే ట్రాజెడీ రాశాడు .తర్వాత కవిత్వం రాశాడు .పదమూడు లో పెద్ద అంత్య ప్రాసల కవిత్వం రాశాడు .లాటిన్ లో పాండిత్యం సంపాదించి తోటి వారికి నేర్పాడు .

స్కూల్ చదువు కుంటి నడక నడుస్తోంది ‘’ది ఫ్లాజలేంట్ ‘’అనే స్కూల్ మేగజైన్ ను నిర్వహించాడు .కాలానికి భిన్నమైన దొరణు లుంటే స్కూల్ నుంచి బయటికి పంపేశారు . క్రైస్ట్ చర్చికి అప్ప్లై చేస్తే తిరస్కరించారు .ఆక్స్ ఫర్డ్ లోని బిలియాల్ కాలేజి అడ్మిషన్ ఇచ్చింది .అందులో చేరిన కొద్ది రోజులకే బ్రిటన్ ఫ్రాన్స్ యుద్ధం మొదలైంది .చదువు వదిలేసి రిపబ్లికన్ అయ్యాడు .అక్కడ దేశం లో కొంపలు మునుగుతుంటే , స్వతంత్రం కోసం పోరు సాగుతుంటే  కాలేజిలో ‘’యూక్లిడ్ ‘’చదువుతూ కూర్చోవటం భావ్యం కాదను కొన్నాడు .ఈ భావాలతో ‘’జోన్ ఆఫ్ ఆర్క్ ‘’రాయటం ప్రారంభించాడు .ఇంకా అప్పటికి వేదాంతం ఒంట బట్టలేదు .యువ రక్తపు పొంగులో రాసిన రచన అది .సమాజానికి తీవ్ర చికిత్స కావాలన్నాడు .అమెరికా వెళ్ళాలనే ఆలోచనా వచ్చింది .అమెరికా లో స్వాతంత్ర పోరాటం నచ్చింది. స్వేచ్చ పొందటం ఆకర్షించింది .

అరిస్తోక్రసికి వ్యతిరేకం గా పాంటిసోక్రసి  ఏర్పాటు

సూతీ కాల్రిడ్జి స్నేహిత బృందం ఆడా మగా కలిసిఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నారు   .ఆదర్శ జీవితం గడపటమే ధ్యేయం .అందులో పన్నెండు జంటలు ఉన్నాయి  .కొంత పొలం సంపాదించారు .ప్రతి వారూ రోజుకు మూడు నాలుగు గంటలు కస్టపడి పని చేయాలి .వచ్చింది అందరూ సమానం గా అనుభవించాలి .ఒక నమూనా రాజ్య స్థాపన చేయాలని ఆదర్శం .యుద్ధానికి ,విప్లవానికి దూరం గా ఉండి దీన్ని సాధించాలని ప్లాన్ .కాల్రిడ్జి దీనికి నికి పాంటిసోక్రాసి పాన్తిసోక్రసి ‘’అని పేరు పెట్టాడు .ఇది అరిస్తోక్రసి కి వ్యతిరేకం .స్వయం నిర్ణయ ప్రభుత్వం ఏర్పడాలి .కొద్ది మందిని ఎన్నుకొని వారిద్వారా పాలన సాగించాలి .ఇందులో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులూ బాధ్యతలు ఉంటాయి .ఇదొక సాంఘిక సంస్థ .వీరి భావనలు అభిప్రాయాలు అంతా కవితాత్మకం గా ఆకర్షణీయంగా  గా ఉన్నాయి .కొంత కాలం ఈ ‘’స్వప్న లోక విహారం’’ బాగానే నడిచింది. కాని కాల్ రిడ్జి ఇవాన్స్ ను మర్చిపోలేక  పోతున్నాడు .సారా ఫ్లికర్ కు లైన్ వేస్తున్నాడిక్కడ .ఇంగ్లాండ్ వదిలి ఊహా లోకం లో విహరించ వద్దని మేరీ ఇవాన్స్ చెబుతూనే ఉంది .ఆమె ఇతన్ని సోదరుడి లాగా భావిస్తున్నాని రాసింది .షాక్ అయి అవాక్కయ్యాడు  ఇర  ఇరవై మూడు వయసులో కాల్ రిడ్జి సారా ను పెళ్లి చేసుకొన్నాడు ..యెంత పకడ్బందీ గా ప్లాన్ చేసినా ‘’పాంటిసోక్రసి ‘’ఇబ్బందుల పాలయ్యింది .ఇంగ్లాండ్ అమెరికాల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది .ఈ బృందం వేల్సు లో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడికి చేరి రచనలు చేసి ,వ్యవసాయం చేస్తూ డబ్బు సంపాదించా లను కొన్నారు .ఇందులో ఇద్దరు అప్పుల్లో మునిగి ఉన్నారు .బృందం చీలిపోయే దశకు చేరింది .’’the fraternal group ceased to fraternize ‘’అయిపొయింది .ఒకరి నొకరు తిట్టుకొన్నారు .సూతీ రహస్యం గా ఎడిత్ ను పెళ్ళాడాడు .ఆమె లా చదవటానికి నిర్ణయించుకోంది. కాల్ రిడ్జి ఈ ముఠాను వదిలేసి క్లేవేడాన్ చేరి కవిత్వం లో పడ్డాడు .

ఈ త్రయం పై మరి కొన్ని విశేషాలు ఈ సారి

SamuelTaylorColeridge.jpg  William Wordsworth 001.jpg

Robert Southey.jpg   రాబర్ట్ సూతీ                                    

కాల్రిడ్జి                                                           వర్డ్స్ వర్త్

రాబర్ట్ సూతీ

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.