ఊసుల్లో ఉయ్యూరు -51
సోడాలోనే కాదు మాటల్లోనూ గాస్ బాగా దట్టించి కిక్కిచ్చే మా- సోడా మోహన్
మేము 1950లో హిందూపూర్ నుంచి ఉయ్యూరుకు పూర్తిగా మకాం మార్చేశాము .అప్పుడు నాకు పది ఏళ్ళు .వేసవిలో దాహం వేస్తె ఉయ్యూరు సెంటర్ లో బూర గడ్డ బసవయ్య కొట్టు ముందు ‘’హిమాలయా కూల్ డ్రింక్స్ ‘’అనే షాపు ఉండేది అక్కడికి వెళ్లి ఐస్ లో పెట్టిన చల్లని సోడా కొట్టించుకొని తాగే వాళ్ళం .కావలసిన వాళ్ళు డ్రింకులు తాగే వాళ్ళు. అప్పుడు మాకు అంత ‘’దృశ్యం ‘’లేదు .దాని యజమానులు ఇద్దరు ముస్లిం లని జ్ఞాపకం .గళ్ళ లుంగీలతో బారెడు నల్ల యెర్ర గడ్డాలతో చూపులకు కొంచెం భయంకరం గా ఉండేవాళ్ళు .ఒకటని పేరు’’ బాబులు’’అని జ్ఞాపకం ఊరు ఊరంతా సాయం వేళ సోడా డ్రింకులకు అక్కడికే చేరేవారు .సోడా ఓపెనింగ్ మోతలతో సెంటర్ అంతా దద్దరిల్లేది చూట్టానికి ,వినటానికి సరదాగా ఉండేది . ఆ డ్రింకు షాపు యజమానుల్లో ఒకాయన తర్వాత టైలర్ గా మారి మా బట్టలు కుట్టేవాడు వాళ్ళ అబ్బాయిలు నాకు క్లాసు మేట్లు.మా ఇళ్లదగ్గర ఆడవాళ్ళకు సోడా తాగాలంటే చాలా ఇబ్బంది గా ఉండేది .అవకాశమే ఉండేది కాదు .
అదుగో అలాంటి పరిస్తితులలో’’ సోడా మోహన్ ‘’ ఆపద్బాన్ధవుడే అయ్యాడు మాకు .ఇంటింటికీ సోడా బండీ తీసుకొచ్చి సోడా అరలపై రెండు గొనె సంచీలు కప్పి ఎక్కడ నీళ్ళు ఉంటె అక్కడ వాటిని పూర్తిగా నీటి తో తడిపి ప్రతిక్షణం సోడా చల్లగా ఉండేట్లు చేసేవాడు .అవసరమైతే గడ్డి కప్పే వాడు .కనుక సెంటర్ కి సోడా కోసం వెళ్ళాల్సి వచ్చేదికాదు .అతనే మా ఇంటికి వచ్చేవాడు మిట్ట మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిదింటి దాకా సోడా బండీ బ్రాహ్మణ కోమట్ల బజార్లలో తిప్పేవాడు .సోడాలన్నీ ఖర్చాయి పోయేవి మా దాహార్తిని తీర్చిన ‘’సోడా భగీరధుదు ‘’సోడా మోహన్ .ఎర్రగా కుది మట్టం గా కాఖీ నిక్కర్ ,గళ్ళ చొక్కాతో ఉండేవాడు ఎప్పుడూ నవ్వు ముఖం తోనే కని పించేవాడు .సరదాగా మాట్లాడే వాడు .మాటల్లో దించి అక్కర లేక పోయినా సోడా కొట్టి తాగించటం మోహన్ ప్రత్యేకత .సోడా ను ఓపెనర్ తో కొట్టి దాదాపు మూడు నాలుగు నిమిషాలు గాస్ ను బుస బుస పొంగించి కెవ్వు కేక లా శబ్దం వచ్చేట్లు చేసి తాగటానికి ఇచ్చేవాడు .ఆ సోడా తాగితే యెంత కడుపు నిండా భోజనం చేసినా యిట్టె అరిగి పోయేది .అదీ మోహన్ సోడా స్పెషాలిటి .కనుక ఒక సోడా తో ఆగే వారు కాదు రెండు తాగి బ్రేవ్ మని త్రేం చాల్సిందే .అదీ దాని ప్రభావం .అందుకే నేను ‘’మోహన్ !నువ్వు సోడా కంటే నీ గాస్ మాటలనే మాకు అమ్ముతున్నావయ్యా ‘’అనే వాడిని .దాదాపు మా కంటే అయిదారేళ్ళు చిన్న వాడేమో మోహన్ .
సోడా మోహన్ అనే అందరూ పిలిచేవారు అవతల బజారు లో సోడా కోడితే మా బజారులో విని పించేట్లు చేయ గల నేర్పు అతనిది .కనుక ఆ శబ్దం విని లైన్ లో ఉన్నాడని తెలిసి మా సందు చివర నిలుచొని ఇంటికి పిలిచే వాళ్ళం .ఇంటిల్ల పాదీ తాగే వాళ్ళం .అందుకని సాయంత్రం ప్రతి రోజు మా ఇంటికి రాకుండా వెళ్ళే వాడు కాదు .’’సోడా చల్లని ఐస్ సోడా ‘’అని అరుస్తూ సోడా అమ్మే వాడు .వేసవిలో మా అక్కయ్యలు బావలు మేనల్లుల్లు మేన కోడళ్ళు ఉయ్యూరు వచ్చేవారు కనుక సోడా లకు మంచి గిరాకీ ఉండేది .అప్పుడు సోడా అర్ధణా అని జ్ఞాపకం తరువాత అణా అయింది .ఆ తర్వాత పది పైసలు ,పావలా అర్ధ రూపాయి దాకా పాకింది .అప్పట్లో సోదాలో నవాసారం కలిపే వారని అది హాని అని అనేవారు కాని సోడా మోహన్ సోడా లో అదిఉండేది కాదని మా నమ్మకమే కాదు ఊళ్ళో అందరి నమ్మకం కూడా .అందుకే మోహన్ అంటే ఆదరణ హెచ్చు .అతని సోడా తాగక పొతే రోజు గడవదని నమ్మకం ఏర్పడ్డాయి .
సోడా మోహన్ అసలు పేరు రామ మోహన్ .ఇంటి పేరు కొలసాని అని జ్ఞాపకం కాపులు .వాళ్ళ నాన్న నరసింహా రావు .హైస్కూల్ దగ్గర ఇప్పటి సుందరమ్మ పేటలో స్థలం కొని పాక వేసుకొని ఉండేవాడు అతను టైలర్ .బట్టలు కుట్ట్టే వాడు మా బట్టలూ కుట్టేవాడని జ్ఞాపకం .ఎర్రగా భారీ పర్సనాలిటి నీరుకావి లుంగీ కట్టేవాడు చొక్కా తోడుక్కుండగా నేను చూడ లేదు .ఒళ్లంతా బొచ్చు తో భీకరం గా ఉండేవాడు .మంచివాడు మేమంటే గౌరవం గా ఉండేవాడు .భార్య కూడా ఎర్రగా భారీ పర్సనాలిటీయే .రామ మోహన్ కు ఇద్దరు తమ్ముళ్ళు ,ఒక చెల్లెలు రెండవ వాడు కృష్ణ మోహన్ .ఊర వారి సినిమా హాల్ దగ్గర సోడా బీడీ సిగరెట్ బడ్డీ పెట్టాడు ఇప్పుడు ఆటో కొని నడుపుతున్నాడు .మూడవ వాడి పేరు జ్ఞాపకం లేదుకాని నేను ఉయ్యూరు హైస్కూల్ లోపని చేసినప్పుడు చదివాడు .చెల్లెలు కూడా ఎర్రగా బాగా ఉండేది స్కూల్ లో నా స్తూదేంటే సోడా మోహన్ ఆర్ ఎస్ ఎస్ కు వీర విధేయుడు .మాతో బాటు సంఘానికి వచ్చేవాడు .అతను ఎంత ఎర్రగా ఉంటాడో అంతటి నల్లని పిల్లను చేసుకొన్నాడు ఆశ్చర్య మేసింది .గేదెలను కొని మేపుతూ పాలు అమ్మేవాడుకూడా సాధారణం గా భార్యయే ఇళ్ళకు తెచ్చి పాలు పోసేది .ఇతనికి సోడా వ్యాపారమే సరి పోయేది .హైస్కూల్ లో గడ్డి పాట పాడేవాడు గడ్డికోసి గేదెలను మేపే వాడు .పాట అప్ప్రువ్ కాక పొతే వచ్చి నాకు చెప్పే వాడు . టైం పడుతుందని సలహా చెప్పేవాడిని మాస్టార్ని అయిన తర్వాతా ‘’మేస్టారూ ‘’అనే పిలిచేవాడు .ఆప్యాయతకు మారు పేరు గా మసిలాడు .ఊరందరి కి మంచివాడని పించుకొన్నాడు తగాదా మనిషి కాదు .డబ్బులు చేతిలో లేక పొతే అప్పు పెట్టి తాగి ఒకే సారి చెల్లించే వాళ్ళం .బి జే పి అన్నా మోహన్ కు మంచి అభిమానమే వాజ్ పాయి అద్వాని గురించి వీరావేశం గా చెప్పేవాడు .అలాగే ఒక పల్లెకారు అతను చిన్న వంతెన దగ్గర ఉండేవాడు పగలల్లా చేపలు లు పట్టి అమ్ముకొని సాయంత్రాలలో మా పార్ధి మేస్టారి పార్ల మెంట్ కు చేరేవాడు .పేరు జగన్నాధం అని గుర్తు . ఆర్ ఎస్ ఎస్ జనసంఘ్ జెపి లంటే యెంత అభిమానమో అతనికి మాటల్లో చెప్పలేను మాతో పాటు టు చక్కగా పరిశుభ్రమైన భాష లో రాజకీయాలు మాట్లాడేవాడు మేము చెప్పింది వినేవాడు .తను చెప్పదలచింది సంకోచం లేకుండా చెప్పేవాడు .ఎలక్షన్లు వస్తే మాకు సందడే సందడిఅర్ధ రాత్రి దాకా కబుర్లే .కోమటి సాంబయ్య ,పార్ధి, కొలచల చలపతి ,మండా వీర భద్ర రావు ,ఎల్ ఐసీ శ్రీ హరిరావు ,ఇంకో ఎల్ ఐసీ కొమటా యన ,నేనూ ముత్తయ్య మేష్టారు ఆయన కెసీపి భాస్కర రావు మొదలైన వారందరం చేరే వాళ్ళం .భలే సరదాగా ఉండేది .సోడా మోహన్ సోడా లన్నీ అమ్ముకొని ఇంటికెళ్ళి భోజనం చేసి వచ్చి మాతో చేరేవాడు .
సోడాల ధ్యాసలో ఉన్నాం కనుక మా ఉయ్యూరు సోడా గాస్ గురించి చెప్పక పొతే ఉయ్యూరు నన్ను క్షమించదు .మా షుగర్ ఫాక్టరీ బై ప్రాడక్ట్ గా సోడా గాస్ ఉండేది సిలిండ ర్లలో నింపి హై ప్రేసర్ లో లిక్విడ్ గా మార్చి నిలవ ఉంచి హోల్ సెల్ గా రిటైల్ గా అమ్మేవారు .అక్కడి నుండే తెచ్చుకొని సోడా మెషిన్ కు సిలిండర్ బిగించి సోడా కాయల్ని శుభ్రం గా గడ్డిపరకల తో కడిగి ,మిషన్ న్ కు తగిలించి సోడా గాస్ నింపి కేసుల్లో అమర్చుకొని బ లలోను సోడా బండీ లలోను పెట్టుకొని అమ్మేవారు .ఏ గాస్ కు లేని ప్రత్యేకత ఉయ్యూరు సోడా గాస్ కు ఉంది . దీని రుచి కిక్కు అదుర్స్ తాగిన వాడు కెవ్వు కేక .మిగతా ఊళ్ళలోని గాస్ ఎందుకో ఏదో వాసన వచ్చేది .ఇది మాత్రం చాలా స్వచ్చం గా ఉండేది .అందుకే రాష్ట్రం అంతా ఉయ్యూరు నుంచే సిలిండర్లు తెప్పించుకొనే వారు .”ఇది గాస్ ”కాదు పచ్చినిజం . కంకిపాడు పామర్రులలో బస్ లు ఆగినా ఉయ్యూరులోనే ప్రయాణీకులు సోడా కొట్టించుకొని తాగే వారు అదే మా కెసీపి సోడా గాస్ కున్న ప్రత్యేకత
మా ఇంటినుంచి సెంటర్ కు వెడుతుంటే సెంటర్ కు దగ్గరలో కుడిప్రక్కన ఒక కుర్ర సాహేబు గారి కిళ్ళీ కొట్టు ఉండేది .అక్కడ కిళ్ళీ స్పెషల్ అక్కడే అందరూ కిళ్ళీలు కట్టించుకోనేవారు చాలా రుచిగా ఉండేది .అతని దగ్గరా సోడాల అమ్మకం ఉండేది .హిమాలయా కూల్ డ్రింక్స్ మూత పడిన తర్వాత ఈ బడ్డీ లోనే సోడా తాగేవారు బాగా ఉండేది కూడా .అతను మనిషి కురచ పొట్ట లావు .అతని బావ మరిది నా శిష్యుడు ట్యూషన్ కూడా చదివాడు .కొంత కాలం బస్ రిజర్వేశాషన్ టికెట్లు కూడా అమ్మేవాడు అతనిదే కాటూరు రోడ్డులో ఉన్న సహారా ఆఫీసు బిల్డింగ్ అని విన్నాను .
సోడా మోహన్ కు పోటీగా ఇద్దరు ముగ్గురు సోడా బండీ లు వేసుకొని ఊరిలో తిరిగి సోడా లమ్మే వారు .అందులో ఒక సాహేబు గారు ఒక సన్నగా పీలగా ఉండే కాపు ఆయనా ఉన్నారు .వీరి సోడా కంటే సోడా మోహన్ సోడా కే అప్పటికీ ఇప్పటికీ గిరాకీ ఎక్కువ .ఈ మధ్య మోకాళ్ళ నెప్పి తో బాధ పడుతున్నట్లు సోడా మోహన్ చెప్పాడు .కాని సోడా అమ్మకం మాన లేదు .ఇప్పుడు లక్ష్మి టాకీస్ అని పిలువ బడే ఏకాంబరేశ్వర పిక్చర్ పాలెస్ దగ్గర బడ్డీ కొట్టు లో సోడా లు అమ్మేవారు .అలాగే అన్ని దియేటర్ల దగ్గరా ఇప్పుడున్నాయి .
జనం తెలివి మీరి ఇప్పుడు మామూలు సోడా తాగటం మానేశారు నిమ్మకాయ సోడా లే తాగుతున్నారు .ఉయ్యూరు సెంటర్ లో అయిదారు షాపులు ఉన్నాయి నిమ్మకాయ కోసి రసం పిండి పోడవైనపెద్ద గాజు గ్లాసులో పోసి కొద్దిగా సోడా ఉప్పు పంచదార లేక ఉప్పు కలిపి రెండు మూడు సోడా లు దానిలో కొట్టి ,నురగలు తెప్పించి చెంచా తో కలిపి ఇస్తారు చాలా బాగుంటుంది వేసవి స్పెషల్ అయిన్దిప్పుడు నిమ్మకాయ సోడా .నా ముస్లిం శిష్యుడికి సెంటర్ లో కనక దుర్గా హోటల్ దగ్గర నిమ్మకాయ సోడా షాపులున్నాయి నేను తాగ టానికి వెడితే చాలా స్పెషల్ గా కలిపి ఇస్తాడు .అందరి కంటే డబ్బు తక్కువే తీసుకొంటా డుకూడా .ఇప్పుడు మా బజారులో కోట దగ్గరే నిమ్మకాయ సోడా తయారు చేసి అమ్మతున్నారు .కిందటి వేసవిలో అమెరికా నుంచి మా అమ్మాయి మనవలు వచ్చినప్పుడు రోజూ అక్కడికే వెళ్లి రాత్రివేళ నిమ్మకాయ సోడా తాగేవారు .అంతకు ముందు కొన్నేళ్ళు నిమ్మకాయ రసాం కలిపి గాస్ తో సోడా బుడ్డి ని నింపి కొట్టి ఇచ్చేవారు . అది అంత బాగుండే దికాడు .ఇప్పటి విధానమే చాలా బాగుంది .కొందరు సోడాను రబ్బరు ఓపెనర్ అక్కర్లేకుండా వ్రేల్లతోనే కొట్టే మొనగాళ్ళు ఉండేవారు వాళ్ళు కొడుతుంటే గుడ్లు అప్పగించి చోద్యం గా చూసే వాళ్ళం
ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు సోడా మోహన్ గురించి రాయటానికి అవకాశం కలిగింది ఇన్నేళ్ళు రాయ నందుకు సిగ్గు పడుతూ ఇప్పటికైనా రాయ గలిగి నందుకు ఆనందిస్తూ సోడా మోహన్ గురించి రాయలేదేమని నన్ను ప్రశ్నించిరాయమని గట్టిగా చెప్పి ప్రేరణ నిచ్చిన మా రెండో అబ్బాయి ఛి శర్మ ను అభినందిస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-6-14-కాంప్ –మల్లాపూర్ –హైదరా బాద్
Soda Mohan Last Name “Repalle”. He is still doing same business.
I have been following your blog from last two years. Keep writing about Vuyyuru.
S R Kolasani
Bangalore