పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44

అమెరికా కవులు

బేకన్ రాసిన ‘’నోవం ఆర్గానం ‘’ముద్రణ పొందిన తరువాత  1620లో కొత్త ప్రపంచం లేక న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా లోని కేప్ కాడబే కాలనీ కి ‘’పిలిగ్రిం  ఫాదర్స్’’అన బడే సేటిలర్స్ మొదట చేరుకొన్నారు .విజ్ఞానం కోసం మానవుడి అన్వేషణ ,విజయం అని బేకన్ పేర్కొన్నాడు వందేళ్ళ తర్వాత క్లాయోన్ బిషప్ వేదాంతి  జార్జి బెర్క్లీ  కొన్ని కవితలను ‘’ఆన్ ది  ప్రాస్పెక్టస్ ఆఫ్  ప్లాంటింగ్ ఆర్ట్స్ అండ్ లెర్నింగ్   ఇన్ అమెరికా ‘’రాస్తూ ,అమెరికా లో కవిత్వం రాయటానికి కొత్త విషయాలున్నాయన్నాడు .బెర్కిలీ ఆశాభావం తో కవిత్వం అల్లాడు .కాలనీ కాలం అంతా పాత ధోరణి సామేతలతోనే కవిత్వం సాగింది .అమెరికాలో మొదటి కవయిత్రి ,న్యూ ఇంగ్లాండ్ గవర్నర్ కూతురు ,ఇంకో గవర్నర్ భార్య అయిన ‘’అన్నే బ్రాడ్ స్ట్రీట్ ‘’1612-1672)గుర్తింపు పొందింది .తన కవితా సంకలనానికి ‘’ది టెన్త్ మ్యూజ్ లేట్లీ స్ప్రంగ్ అప్ ఇన్ అమెరికా ‘’అని అర్ధవంతమైన పేరు పెట్టింది .పాత రొడ్డు కవిత్వ ధోరణిలో కాకుండా స్పెన్సర్ ,,రాలీ ,ఫ్రెంచ్ కవి ద్యు బర్తాస్ వంటి ప్రముఖుల ప్రభావం తో రాసింది . 1624-1729కాలం వాడైన ఎడ్వర్డ్ టైలర్ రాత ప్రతులు ఆయన చని పోయిన రెండు వందల ఏళ్ళ తర్వాత కాని బయట పడ లేదు ,టేలర్ మెటాఫిజికల్ గా  మత భావ స్పూర్తి గా హెర్బర్ట్,డోన్నెల మార్గం లో  రాశాడు .న్యూ ఇంగ్లాండ్ నుంచి న్యూ జేర్సికి కవిత్వపు సీనుమార్చిన వాడు 1752-1832కాలం వాడైనఫిలిప్  ఫ్రే న్యూ ‘’.అతను రాసిన ‘’ది ఇండియన్ బరియల్ గ్రౌండ్ ‘’మొదలైన కవితలలో స్థానిక విషయాల ప్రస్తావన ఉన్నా ,పద్దెనిమిదో శతాబ్ది ఇంగ్లీష్ పధ్ధతి లోనే రాశాడు .స్వంత సీమ భావం తో రాసిన మొదటికవి ,’’అమెరికా కవిత్వ పిత ‘’విలియం కల్లెన్ బ్రయాంట్ .ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

అమెరికా కవిత్వ జనకుడు –విలియం  కల్లెన్ బ్రయాంట్

ఇంగ్లీష్ కవులు పోప్,నుండి కూపర్ దాకా మరీ ముఖ్యం గా ‘’రాబర్ట్ బ్లైర్ ఇంకా చెప్పా లంటే ‘’గ్రేవ్ యార్డ్ స్కూల్ ‘’ప్రభావం తో విలియం కల్లెన్ బ్రియాంట్ తన స్వంత బాణీ వాణి తో కవిత్వం చెప్పాడు .దీనితో అమెరికా కవిత్వానికి ఒక ‘’డిగ్నిటి’’అంటే గౌరవం ,పరువు లభించాయి .మే ఫ్లవర్ సంతతికి చెందిన వాడై  మాసా చూసేత్స్ లోని కమ్మింగ్ టన్ లో   3-11-1794న జన్మించాడు  .అర్భక జీవిగా  బతుకు తాడో లేడో అన్న  భావం తోపుట్టాడు .తల కాయ మామూలు కంటే పెద్ద సైజ్ లో ఉండేది .అక్కడి గ్రామీణ డాక్టర్ రోజూ మంచు నీటిధారలో ముంచి మామూలు సైజు కు తెచ్చాడు .ఆరోగ్య సూత్రం గా తండ్రి కొడుకును రోజూ తనతో అరణ్యాలకు నడకకు తీసుకొని వెళ్ళేవాడు .

రెండేళ్లకే చదవటం వచ్చేసింది .పదికి కవిత్వమే రాస్తే ‘’హాంప్ షిర్ గెజిట్ ‘’లో ప్రింట్ అయింది .పదమూడుకు జఫర్సన్ కు వ్యతిరేకం గా సెటైర్’’ది ఎంబార్గో ‘’ రాశాడు . పదిహేడు లో  పరిపూర్ణ  కవి అయ్యాడు .’’టానా టోప్సిస్ ‘’రాసి డెస్క్ లో ఉంచేశాడు  .ఎప్పుడో తండ్రి కంట బడితే ఆయన నార్త్ అమెరికన్ రివ్యూ ఎడిటర్ కు ఇస్తే చదివి ముచ్చట పడి నిరంతరం రాసి పంపించమని చెప్పాడు .అలాగే రాస్తే వేసేవారు పత్రికలో .ఈ కవితలు చదివిన రిచార్డ్ హెన్రి డొన్నా’’అట్లాంటిక్ సముద్ర ఈతీరం లో ఇలా అద్భుతం గా కవిత్వం రాసిన వాడేవరూ ఇంతవరకు లేరు ‘’అని శ్లాఘించాడు .రాసినవన్నీ పేపర్లు అచ్చువేశాయి మంచి రివ్యూలే వచ్చి ప్రోత్సహించారు .అప్పటికే లా చదివినా ప్రాక్టీస్ పై మనసు పోలేదు .విమర్శకులు ‘’అమెరికా నాయక కవి ‘’అని ప్రశంసిస్తున్నారు .ముప్ఫై అయిదులో ప్రసిద్ధ ‘’న్యూ యార్క్ ఈవెనింగ్ పోస్ట్ ‘’పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్ అయ్యాడు .జీవితాంతం ఇదే పోస్ట్ లో పనిచేశాడు .నలభై లో అయిదు కవిత సంకలనాలు ముద్రించాడు .ఫ్రాన్సెస్ ఫెయిర్ చైల్డ్ ను వివాహమాడా డు .

ప్రెసిడెంట్ లింకన్ బానిస విమోచనకు ఏంతో మనస్పూర్తిగా సహకరించి ప్రచారం చేశాడు ..ఇంగ్లాండ్ నవలా చక్ర వర్తి చార్లెస్ డికెన్స్ అమెరికా పర్యటనకు రాగానే ‘’బ్రియాంట్ ఎక్కడ?’’అని అడిగాడంటే అతని కీర్తి చంద్రికల వ్యాప్తి ఏమిటో తెలుస్తోంది .దేబ్భైలో కూడా మంచి ఆరోగ్యం గా ఉన్నాడు .నడక వ్యాయామం తో బాటు నిత్యం కవిత్వం రాసే వాడు .’’లైబ్రరి ఆఫ్ పోఎట్స్ అండ్ సాంగ్స్’’అనే బృహత్ గ్రంధాన్ని రివిజన్ చేశాడు .ఎనభై నాలుగవ ఏట న్యూ యార్క్ సెంట్రల్ పార్క్ లో ఇటలి దేశ భక్తుడు ‘’మజ్జిని ‘’ శిలా విగ్రహాన్ని మే నెలలో  ఆవిష్కరిస్తూ ,ఎక్కువ సేపు తల మీద టోపీ లేకుండా నిలబడి ఉండటం తో  ఎండ వేడికి తట్టుకోలేక కూలి పోయాడు మెదడుడలో రక్తనాళం గడ్డకట్టటం తో కోమా లోకి వెళ్లి పోయాడు .కొన్ని వారాల తర్వాత12-6-1878న ఎనభై నాలుగవ ఏట చనిపోయాడు .

యవ్వనం లో ముసలి వారికోసం ముసలి తనం లో పిల్లలకోసం రాశాడు బ్రియాంట్ .’’అమెరికా వర్డ్స్ వర్త్ ‘’అని అందరూ గౌరవం గా పిలిచే వారు .అతిసాదారణం గా ,స్వచ్చం గా ,పవిత్రం గా ఉండేవాడు .సరదా మనిషికూడా .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో లోవెల్ బ్రియాంట్ లోని లోపాలను తెలియ జేశాడు .అయితే వీరందరి కంటే ఎడ్గార్ అస్లేన్ పో ‘’ in character no man stands more loftily than Bryant .the peculiarity melancholy expression of his countenance has caused him to be accused of harshness or coldness of heart .Never was there a greater mistake .His soul is charity itself ,in all respects generous and noble ‘’అని ఖచ్చితమైన యదార్ధవివరణ చేశాడు .అమెరికన్ రొమాంటిక్ కవి గా పేరు .మార్టిన్ లూధర్ కింగ్ ఏంటో మెచ్చుకొని ఆయన చెప్పిన మాట ‘’truth crushed to earth will rise again ‘’అని పడే పడే గుర్తు చేసేవాడు .వాల్ట్ విట్మన్ కు ‘’మెంటార్ ‘’.

 

 

 

William Cullen Bryant Cabinet Card by Mora-crop.jpg

వ్యక్తిత్వ వికాస కవి   –రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

న్యు ఇంగ్లాండ్ కవిత్రయం గా ఎమర్సన్ విట్ట్టియర్ ,లాంగ్ ఫెలో లు గుర్తింపు పొందారు .సంస్కృతికి ఆనవాలుగా నిలిచారు .వీరి వలననే అమెరికా స్వంత గడ్డ పై   కవిత్వ బీజం  నాటబడి ,సాగు చేయబడి ,పోషింపబడి వికసిత పుష్పమై , అందంగా ఆకర్షణీయం గా  సువాసనలీనుతోంది .

‘’గాడ్ ఇంటాక్సికేటేడ్ యాంకీ ‘’గా పిలువాడే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ 25-5-1803లో మాసా చూసేత్స్ లోని బోస్టన్ లో జన్మించాడు .తండ్రి వారసత్వం గా వచ్చిన యూనిటేరియన్ క్లేర్జిమన్ అయ్యాడు .మూఢాచారాలకు వ్యతిరేకి ..ఎనిమిదో ఏట తండ్రి చనిపోతే ఎనిమిది మంది సంతానాన్ని పోషించే బాధ్యతా ఎమర్సన్ పై పడింది. అందరి సానుభూతి సహకారం తో బాధ్యతను నేర వేర్చి పెంచి పెద్ద వాళ్ళను చేశాడు .అంత తెలివైన వాడు కాక పోయినా పందోమ్మిదేళ్ళకే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .కొంతకాలం స్కూల్ లో బోధించి తర్వాతా చర్చి మినిస్టర్ అయ్యాడు .ఎలెన్ లూసా టకర్ ను వివాహమాడి ,మినిస్టర్ పదవి వదిలేశాడు .ఇతరులకు బోధించటా న్ని సమర్ధించాడు .యూరప్ సందర్శించాడు .అదే జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది .కార్ లైల్ వర్డ్స్ వర్త్ కవులతో సమావేశమై జీవితపు విలువలను అధ్యయనం చేశాడు .ఇంగ్లాడ్ తిరిగి లేక్ పోఎట్స్ ను చూశాడు .కార్ లైల్ కు సన్నిహితుడయ్యాడు .

తిరిగి వచ్చి కంకార్డ్ లో కాపురం పెట్టిలిడియా జాక్సన్ ను  రీండవ పెళ్లి చేసుకొన్నాడు .ప్రదేశాలు తిరుగుతూచాలా ఉపన్యాసాలిచ్చాడు .అసాధారణ మేధావిగా పండిన వేదాంతిగా గుర్తింపు వచ్చింది .’’మనిషి అంటే బంధుత్వాల కలయిక ,అస్తిత్వ వ్రేళ్ళ మూలం ‘’అనే వాడు .ఎవరు బాగా అర్ధం చేసుకొంటారో వారే గొప్ప .ఉత్సాహం లేకుండా దేన్నీ పొందాలెం హీరోయిజం కు రీజన్ అనవసరం అందుకే గొప్ప .వ్యక్తిలో ప్రపంచ భావన ఉంటేనే అది ఆకర్షిస్తుంది .మతం లో కొత్త ఆలోచనలు భావాలు వ్యాప్తి చెందించాడు ఎమర్సన్ .నలభై నాలుగులో ‘’పోయెమ్స్ ‘’ప్రచురించాడు .ఒక ఏడాది తర్వాతా ‘’మే డే అండ్ అదర్ పోయెమ్స్ ‘’తెచ్చాడు .వ్యాస సంకలనాలు రెండు ముద్రించాడు . డెబ్భై లో జ్ఞాపక శక్తి క్షీణించింది .లాంగ్ ఫెలో చని పొతే సమాధి దగ్గర ‘’అతను మంచి వాడు .కాని పేరు మాత్రం గుర్తుకు రావటం లేదు ‘’అన్న జ్ఞాని .సమాజానికి దూరమైపోయి కంకార్డ్ లో 27-4-1882లో డెబ్భై తొమ్మిదో ఏట మహా జ్ఞాని ,స్కాలర్ కవి వేదాంతి తత్వ వివేచనా పరుడు ఎమర్సన్ మరణించాడు .ఆయన వేదాంతం మానసిక మైంది .’’Emerson ;s poetry is both rich and casual –homespun cloth of gold –‘’అని లోవెల్ మెచ్చాడు .ఎన్నో భాషలలోని అనువాదం పొందిన రచనలు చేశాడు ముఖ్యం గా భారతీయ ఫిలాసఫర్లు ఎమర్సన్ ను ఆదర్శం గా భావించారు .

 

 

 

బానిసత్వ వ్యతిరేక కవి –  జాన్ గ్రీన్ లీఫ్ విట్టర్

ఎమర్సన్ లాగానే అనుదిన కర్మ కండను విట్టర్ వ్యతిరేకించాడు .తండ్రి వ్యవసాయ దారుడు 17-12-1807లో మాసా చూసేత్స్ లోని హావేర్ హిల్ లో పుట్టాడు చిన్నప్పుడే తండ్రితో పొలం వెళ్లి సాయం చేశాడు శీతాకాలం లో ఎనిమిది సెంట్లకు స్లిప్పర్ జత తాయారు చేసి అమ్మి ట్యూషన్ ఫీజు సంపాదించాడు మొదటి తరం అఎసత్రికి చేతిలో కేవలం ఇరవై అయిదు సెంట్లు మాత్రమె ఉన్నాయి ..దేనికైనా మైళ్ళకొద్దీ దూరం నడిచి తెచ్చుకోవాల్సి వచ్చేది స్కూల్ టీచర్ బుర్న్స్ కవిత్వ పుస్తకం ఇస్తే ఇష్టపడి చదివాడు .దాన్ని జీవితాంతం దగ్గర పెట్టుకొన్నాడు .పద్దేనిమిదేల్లకే ‘’ఫ్రీ ప్రెస్ ‘’మాసపత్రిక లో కవిత మొదటికవిత ప్రచురించారు .వరుసగా నూట యాభై కవితలు రాశాడు .బానిస వ్యతిరేకం గా ‘’జస్టిస్ అండ్ ఎక్స్పిదిఎంసి ‘’కరపత్రిక ముద్రించాడు ..బానిసత్వ వ్యతిరేకతపై స్పందించిన కవి రాజకీయ నాయకుడు అయ్యాడు .ఎమర్సన్ లాంటి ఫ్రీ థింకర్స్ బానిసత్వాన్ని సమర్ధించటం జీర్ణం చేసుకో లేక పోయాడు .

ఫిలడెల్ఫియా వెళ్లి ‘’పెన్సిల్వేనియా ఫ్రీమన్’’పత్రికకు సంపాదకుదయ్యాడు .బానిసత్వ నిర్మూలన సంఘానికి పెన్సిల్వేనియా హాల్ ను వేదిక చేశాడు .’’the crank of an opinion mill –making his rustic reed of song –a weapon in the war of wrong ‘’అని బాధపడ్డాడు .తర్వాత ‘’స్నో బౌండ్ ‘’లో తన కవితా శక్తియుక్తులన్నీ ప్రదర్శించాడు .ఎనిమిది సెంట్ లకు స్లిప్పర్ జత తయారు చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు అక్కడ ప్రముఖ సిటిజన్ అయ్యాడు .లిజేందరి ఫిగర్ అనిపించాడు .అతని ఎనభయ్యవ పుట్టిన రోజు జాతీయ పండుగ గా నిర్వహించారు .ఎనభై అయిదవ పుట్టిన రోజుకు కొన్ని నెలల ముందు 7-9-1892న విట్టర్ కవి మరణించాడు .’’ఏ ఫేబుల్ ఫర్ క్రిటిక్స్ ‘’లో రస్సెల్ లో వెల్ ‘’there is Whitttier ,whose swelling and vehement heart –strains the strait breasted darb of the Quaker apart –a fervor of mind which knows no separation –twixt simple excitement and pure inspiration ‘’అని మెచ్చుకొన్నాడు .’’సాంగ్ ఆఫ్ ది నీగ్రో బాట్ మాన్ ‘’అనేక ముద్రణలు పొందింది .క్వేకర్ ఉద్యమకవి గా కూడా ప్రసిద్ధుడు .

 

 

Inline image 1

హెన్రి వాడ్స్ వర్త్  లాంగ్ ఫెలో

లాంగ్ ఫెలో కవికి పాఠ్యపుస్తకాలు  తీవ్రఅన్యాయాన్ని  చేశాయి .చేత్తకవితలే ఎంచి ,వేసి ఆయన గౌరవ భంగం కల్గించాయి .అయన కవితలు నీతి బోదకాలు అంటూ అపచారమూ చేశారు .కనుక ఆయన అంటే వాల్ పోస్టర్ కవి అనుకొన్నారు .ఆకారమూ విలేజ్ మినిస్టర్ లా ఉండేది .’’వంటింటి కవి ‘’అని ముద్రపడింది .కాని అమెరికా కవుల్లో బాగా ప్రాభవ మున్న కవి లాంగ్ ఫెలో .ఇరవై నలుగురు పబ్లిషర్లు ఆయన రచనలను ప్రచురించాటమంటే అసామాన్య విషయమే .’’ది కోర్ట్ షిప్ ఆఫ్ మెయిల్స్ స్తాన్దిష్ ‘’పదివేల కాపీలుఒక్క రోజులోనే ఇంగ్లాండ్ లో  అమ్ముడయింది .’’ది సాంగ్ ఆఫ్ హైవత ‘’ప్రపంచ భాషలన్నిటిలోనూ అనువాదం పొందింది .కాని సమకాలీన కవులు లాంగ్ ఫెలోను’’ షార్ట్ ఫెలో ‘’గా భావించి అన్యాయం చేశారు .’’అమెరికా లోని భిన్న సామాజిక స్తితులపై విభిన్న మానవులపై ,సామాజిక వర్గాలపై ,వృత్తుల వారిపై విలువైన కవిత్వం రాసి మాబోటి వారికి మార్గ దర్శనం చేశాడు లాంగ్ ఫెలో ‘’అన్నాడు అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ .సంవత్సర ఆదాయం యాభై వేల డాలర్లకు పైనే ఉండేది .’’ది హంగింగ్ ఆఫ్ ది క్రేన్ ‘’కవిత మూడు వేల డాలర్లు సంపాదించింది .

27-2-1807లో మెయిన్ లోని పోర్ట్ లాండ్ లో జన్మించాడు .తన బాల్యాన్ని ‘’a boy;s will is the wind;s will –and the thoughts of youth are long long thoughts ‘’అని రాసుకొన్నాడు .తండ్రికమ్మరి పని చేసేవాడు .చిన్నప్పుడే తను కవిని అవుతాననే నమ్మకముండేది లాంగ్ ఫెలోకి .ఇర్వింగ్ రాసిన దానికి అనుకరణగా ‘’స్కెచ్ బుక్ ‘’రాశాడు .పన్నెండో ఏట ‘’ది బాటిల్ ఆఫ్ లోవేల్స్ పాండ్ ‘’కవిత పోర్ట్ లాండ్ గెజెట్ లో అచ్చయింది .బోదేన్ కాలేజి లో చేరి అన్నిటా ప్రధముడు గా వచ్చాడు .’’చాతర్తాన్ అండ్ హిస్ పోయెమ్స్ ‘’పై రాయమంటే ‘’అవర్ నేటివ్ రైటర్స్ ‘’గా పేరు మార్చి రాసిన సాహసి .లాయర్ కావాలని లేదు .సాహిత్యం మీదే మనసు .ఆధునిక సాహిత్యం పై ఒక చైర్ ను ఏర్పరచి వచ్చి చేరమని బౌడెన్ ఆహ్వానిస్తే వెళ్లి చేరి పందొమ్మిదో ఏట దాన్ని నిర్వహించిన లేత కుర్రాడు అని పించాడు దీని వలన విదేశీ యాత్ర సాధ్యమైంది ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ జెర్మని వంటి దేశాలు తిరిగి సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆ వారసత్వాన్ని తన దేశీయ అమెరికన్ కవిత్వం లో జోడించాడు ..ఇరవై నాలుగులో పదవి స్తిరపడింది మేరీ స్తోరేర్ పోటర్ ను వలచి పెళ్ళాడాడు బోధనపై పెద్దగా ఇష్టం లేక పోయినా పాతికేళ్ళు బోధనా చేసి హార్వర్డ్ ప్రొఫెసర్ అయ్యాడు .మళ్ళీ విదేశీయానం స్కాండినేవియన్ జర్మన్ సాహిత్యాన్ని అర్ధం చేసుకొని కార్లైల్ ను కలిసి విద్యా వేత్తతలతో మెదిలాడు .స్వీడిష్ భాష నేర్చాడు ఫిన్ని భాష లోని మహాకావ్యం ‘’కలేవేల ‘’ను జేర్ణం చేసుకొని తన ‘’హైవత ‘’లో ప్రతిబింబింప చేశాడు .

అమెరికా తిరిగి వచ్చి కరిగీ హౌస్ అనే చారిత్రాత్మక ప్రదేశం లో నివశించాడు .పదిహేనేళ్ళు చిన్నదైన ఫాని ఎలిజా ను వలచి వలపించి రెండో పెళ్లి చేసుకొన్నాడు .వీరి వివాహం బోస్టన్ లో పెద్ద పండగే అయింది .అయిదుగురు పిల్లల్ని కన్నారు .ఒక రోజు ప్రమాద వశాత్తు కొవ్వోత్తికి భార్య సమ్మర్ డ్రెస్ కు అంటుకొని కాలుతుంటే లాంగ్ ఫెలో పక్క రూమ్ లో నుంచి పరిగెత్తుకొని వచ్చినా ఆర్పలేక ఆమె పూర్తిగా కాలి చనిపోయింది .విచారం అలముకొన్నా కవిత్వం ఆగలేదు .’’పోయెమ్స్ ఆఫ్ స్లేవరి ‘’రాసి ఎవరూ చేయని సాహసం చేశాడు .ఇవాన్జిలీన్ మొదలైన లిరిక్స్ రాశాడు .ఇంకా గొప్ప రచనలు రావాల్సి ఉంది .

‘’టేల్స్ ఆఫ్ ఏ వె సైడ్ ఇన్ ‘’ప్రచురించి పేరు తెచ్చుకొన్నాడు .వయసు పబడిన కొద్దీ రచనా క వ్యాసంగం పెరిగింది .అరడజను పుస్తకాలు రాశాడు .నరాల జబ్బు బాధించింది హార్ట్ ఎటాక్ వచ్చింది .24-3-1882న చనిపోయాడు వెస్ట్ మినిస్టర్ ఆబ్బే లో సమాధి చేశారు .కధలను మహాద్భుతం గా చెప్పాడు .కవిత్వం పర్వత ఝరి లాగా వేగం గా ప్రవహిస్తుంది .మార్గ దర్శిగా గుర్తింపు పొందాడు .అమెరికా గడ్డపై స్వంత కవితా సేద్యం చేసి అమూల్య ఫలాల నందించిన తోలి తరం కవులలో ముఖ్యుడు .అమెరికా కు సంపూర్ణ వికాసాన్ని ఇచ్చిన కవులలో ఒకడు .

డాంటే రాసిన డివైన్ కామెడీ ని అనువాదం చేసిన మొదటి అమెరికాన్ కవి లాంగ్ ఫెలో .లిరిక్ పోయెమ్స్ రాసి మాస్ కు చేరువైన కవి .హెక్సా మీటర్ లో ,ఫ్రీ వేర్స్ లో కూడా రాశాడు .హీరోయిక్ కప్లేట్స్ బాలడ్స్ నూ రాశాడు .నైతిక ,సాంస్కృతిక విలువలకుప్రాధాన్యత నిచ్చాడు  ,భౌతికానికి అతీతం గా ఆలోచన చేశాడు .ఆయన కాలం లో అందరికంటే ప్రసిద్ధుడు .విట్మన్ ఫ్రాస్ట్ మొదలైన కవులకు ప్రేరణ .

 

Inline image 2

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-6-14-కాంప్ –మల్లాపూర్ –అమెరికా

 

 

గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.