
మూడు దశాబ్దాలకు పైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం సమగ్ర కవితా సంకలనం వచ్చిన సందర్భంగా పాత్రికేయుడు నగునూరి శేఖర్, రీడర్ బూర్ల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కవి అన్నవరం దేవేందర్, కథకుడు కె.వి.నరేందర్, మరొక తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు గాజోజు నాగభూషణం కలిసి చేసిన ఇంటర్వ్యూ ఇది. తెలంగాణ సమాజమే కాదు తెలుగు నేలంతా అతలాకుతలమై ఎదుర్కొన్న సంక్షోభాల, సంఘర్షణల, విధ్వంసాల సారాంశమే ఈ సంభాషణ…
కవి అనేవాడు ఎప్పప్పుడూ ప్రతిపక్షమే. యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ కానివాడు కవి కాడు. అతను రాసేది కవిత్వం కానేరదు.. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు విభిన్న ధృవాల శక్తులు ఇప్పుడు తప్పనిసరిగా విడివడిపోతాయి. అందులో కవులు, రచయితలు, గాయకులు ప్రజలపక్షం వహించి మళ్లీ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది.. కవులు, రచయితలు అన్ని వర్గాల, అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించాల్సివుంది. అప్పుడుగానీ ఉద్యమాల కోరికలకు ఒక రంగు, రుచి రూపు వస్తుంది.
శేఖర్: తెలంగాణ సాహిత్యంలో కవులు, కళాకారుల భాగస్వామ్యం ఎంత?
– ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ప్రముఖమైంది. భావజాల విస్తరణలో వీరి రచనలు అత్యంత ప్రభావవంతమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కవులు, కళాకారుల పాత్ర తెలంగాణ సాధనలో ప్రథమశ్రేణికి చెందినది.
శేఖర్: తెలంగాణ ఆవిర్భావానంతరం కవులు, రచయితల పాత్ర ఎలా ఉండాలి?
– ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కవులు, రచయితలు తమ తమ కార్యాకారణమైన రచనల ద్వారా ప్రజలను ఆధిపత్య నయా దోపిడీకి వ్యతిరేకంగా అప్రమత్తం చేసి ఉద్యమ దిశగా నడిపించాల్సివుంది.
శే: చరిత్ర, సంస్కృతి, భాష పునర్నిర్మాణానికే కవులు, రచయితలు పరిమితం కావాల్నా? లేక రాజకీయ మార్గదర్శనంలో వాళ్ల అవసరముందా?
– అస్తిత్వ ఉద్యమాలకు కారణభూతం ఆధిపత్య అణిచివేత. అందు లో భాగమే చరిత్ర, సంస్కృతి, భాషలను తిరిగి నిర్మించుకోవడం ఇందు లో భాగంగా గత దశాబ్దంన్నరగా తెలంగాణ కవిత్వ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏర్పడిన ఆధిపత్య రాజ్యానికి వ్యతిరేకంగా తిరిగి కవులు ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో తప్పనిసరి సృజనాత్మకంగా ఆచరణాత్మకంగా వ్యవహరించాలి.
శే: తెలంగాణ భాషకు ప్రాధాన్యత విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్నారు?
– తెలంగాణ రాష్ట్ర ఉద్యమం భాష న్యూనత నుండి ప్రారంభమైంది. రాష్ట్రంలో భాషకు, సంస్కృతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం పనిచేయాలి. అందులో భాగంగా ముందు పాఠశాల వాచకాల్లో భాష, చరిత్ర, సంస్కృతిని ప్రవేశపెట్టాలి. గ్రామీణ కార్యాలయాల స్థాయి నుండి సచివాలయం వరకు అన్ని శాఖల్లో మన తెలుగును తప్పనిసరి చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడుకాని తెలంగాణ భాషకు అర్థం పరామర్థం కలుగదు.
వెంకటేశ్వర్లు: మీ కవిత్వం సమాజ సంఘర్షణను ఆవిష్కరించే భావజాల వ్యాప్తికే పరిమితం అవుతుందా? ఏదేనీ కార్యాచరణను సూచిస్తుందా?
– నా కవిత్వమే కాదు, ఏ ప్రవహించే కవి కవిత్వమైనా సామాజిక సంక్షోభ, సంఘర్షణ నుంచే పుడుతుంది. ఆ కవిత్వ కార్యాచరణే ఉద్యమాల చిరునామాగా ఉంటుంది.
వెం: మొదటి నుండి మీరు తెలంగాణ నుడికారంతో కవిత్వం రాశారు కదా! తెలంగాణ భావజాల వ్యాప్తిలో మీ కవిత్వం పాత్ర ఏమిటి?
– తెలంగాణలో పుట్టిన కవికే గాక ఏ వెనుకబడిన ప్రాంతంలో జన్మించిన కవికైనా ప్రజల నుడికారంతోనే అతని కవిత్వం విద్యుత్ తేజాన్ని పొందుతుంది. దీనికి ప్రజల భాషకు కొనసాగింపు నేను. తెలంగాణ భావజాల వ్యాప్తిలో నా కవిత్వానిది పాయగొట్టలేని బంధం. అందులో భాగమే భాషా, సామెతలు, నుడికార తల్లి మమకారం.
వెం: తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలోనూ, పూర్వ అధ్యక్షునిగానూ మీ అనుభవాలేమిటీ?
– తెలంగాణ రచయితల వేదికకు నేను అధ్యక్షున్ని అయిన తర్వాత వేదికకు అదివరకు లేని ఒక బలమైన తాత్విక పునాదిని నిర్మించాను. అది పునాదికి, ఉపరితలానికి మధ్యనున్న వైరుధ్యాలను, ఐక్యతలను బాహాటంగా ముందుకు తీసుకువచ్చింది. అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించే దిశగా తెరవే ను ఉద్యమంలో నిటారుగా నిలిపింది. ఈ నిర్మాణంలో ఎందరో వ్యక్తులు అంతర్గత శత్రువులుగా మారితే, ఇరుప్రాంతాలలోని అనేక సమూహాలు బుద్ధితీరా ఆలింగనం చేసుకున్నాయి.
సుజాత: తెలంగాణ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందా?
– సీమాంధ్ర ఆధిపత్య ధిక్కారం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమై అనేక షరతులతో కూడిన భౌగోళిక తెలంగాణ సాధన పాక్షికంగా జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరో దళారి ఆధిపత్య వర్గం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కవులు, రచయితలు అన్ని వర్గాల, అన్ని రకాల ఆధిపత్యాలను ధిక్కరించాల్సివుంది. అప్పుడుగానీ ఉద్యమాల కోరికలకు ఒక రంగు, రుచి రూపు వస్తుంది.
సుజాత: ఇప్పటివరకు విభజన జరిగిన చిన్నరాష్ట్రాలు తమ సహజ వనరులను బహుళ జాతి కంపెనీల చేతికి అప్పజెప్పాయి. అక్కడి ప్రజల కనీస అవసరాల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఆ
క్రమంలో అక్కడ విప్లవోద్యమాల అవసరం కలిగింది. రేపటి తెలంగాణలో మళ్లీ విప్లవోద్యమాల పరిస్థితి రానుందా?
– ఏర్పడిన చిన్నరాష్ట్రాల్లో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి కంపెనీలు ఈ సంపదపై కన్నేసి కాజేస్తున్నాయి. వీటికి దన్నుగా కేంద్ర ప్రభుత్వం తన బలగాల ద్వారా గ్రీన్ హంట్ పేరున నిలిచి, ప్రజలపై అమానుష దాడులకు పాల్పడుతుంది. ఆయా రాష్ట్రాల్లోని పేద ప్రజలకు విప్లవోద్యమం తోడుగా నిలిచింది. తెలంగాణలో గల సహజ వనరులపై, ఏర్పడిన నూతన ప్రభుత్వం అదే వైఖరిని అవలంబిస్తే విప్లవోద్యమాలు అనివార్యంగా తిరిగి మరో రూపంలో తప్పక రావడానికి ఆస్కారం ఉంది. అం తేగాక ఆ విప్లవశక్తులు క్రియాశీలకంగా రూపాంతరం చెందనున్నాయి.
సుజాత: గడీల చరిత్ర పునరావృతమవుతుందా? అట్టి చరిత్రను తిప్పికొట్టే పరిస్థితులు ఇప్పుడున్నాయా?
– మొదటి తెంలగాణ సాయుధ పోరాటం తర్వాత భూస్వామ్య వర్గాలు రూమీ టోపీ స్థానంలో గాంధీటోపీలు ధరించినట్టే, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మలిసాయుధ పోరాటంలో పట్టణాలకు, నగరాలకు పారిపోయిన వర్గాలే తిరిగి తెలంగాణ సాధన ఉద్యమంతో కొత్తరూపాన్ని సంతరించుకున్నాయి. అవి కూలిన గడీల పొగరు వగరులతో సరికొత్త అధికార వేషంలో ప్రజలపై ఆధిపత్యాన్ని సాగించనున్నాయి. ఈ వర్తమాన రాజ్యాశ్రిత పెట్టుబడి రూపం రాజ్యాన్ని తిప్పికొట్టే పరిస్థితులను అదే చేతులారా కొనితెచ్చుకుంటుంది.
సుజాత: కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ప్రాతిపదిక ఏమి ఉండాలి?
– తెలంగాణ ఉద్యమంలో ప్రతిపాదించిన కొత్త జిల్లాలన్నీ సహజ వనరుల దోపిడీకి, వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రజా అవసరాలకు, పాలనకు, వనరుల రక్షణకు అనుకూలంగా జరగాల్సివుంది.
అన్నవరం: మూడు దశాబ్దాలుగా నిరంతర కవిత్వ వ్యవసాయం చేస్తున్నారు. మీ కవిత్వంలో ఇంతగా తాజాదనం కనపడడానికి మూల సూత్రం ఏమిటి?
– ప్రజాఉద్యమాలతో మమేకం కావడమే కాక, సమాజ చలనాలతో సమాంతరంగా కవిత్వమై ఉరుకడమే నా తాజాతనానికి కారణాలు.
అన్నవరం: తెలంగాణ అస్తిత్వ సాహిత్యంలో తెలంగాణ భాష సొర్రకముందే మీ కవిత్వం నిండా తెలంగాణ భాష పదాలు విరివిగా ఉన్నవి ఎట్లెట్ల?
– నేను కవిత్వం రాస్తున్నప్పటి నుంచే తెలంగాణ జీవద్భాష నన్ను అనవరతం వెంటాడేది. అప్పుడు విజయవాడ నుంచి వచ్చే పత్రికలకు కవిత్వం మధ్యలో ఇమిడిన తెలంగాణ పదాల్ని రాసి పంపితే ఆనాటి సంపాదకులు పచ్చింకుతో అండర్‌లైన్ చేసి తిప్పి పంపేవారు. కానీ నేను నెలా రెండు నెలల పిదప అదే కవితను అదే పత్రికకు అలాగే పంపితే అచ్చయ్యేది. అలా అలా నేడు పత్రికలో తెలంగాణ భాషకు కవిత్వం, కథల ద్వారా అనివార్యత కలిగింది. ఆ విధంగా భాషకు అనుకూల వాతావరణం కల్పించినట్లయ్యింది.
అన్నవరం: 1996లో వెలువరించిన ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’లోనే ప్రపంచీకరణ దుష్ప్రభావాలు దుర్బిణి వేసి దూరదృష్టితో ఎలా పట్టారు? తెలుగు కవిత్వంలో గ్లోబలైజేషన్ పట్టుకున్నది మీరు కదా!
– 1990 తర్వాత దేశం సామ్రాజ్యవాదానికి, బహుళజాతి కంపెనీలకు బహిరంగంగా తలుపులు బార్లా తెరిచింది. అందులో నాటి సీ.ఎం/సీఈవో అయిన చంద్రబాబునాయుడు ప్రపంచీకరణకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలను చేసాడు. అందులో తెలంగాణ విధ్వంసానికి పరాకాష్ట అయ్యింది. గ్రామీణ ప్రాంతాలు చిన్నాభిన్నమైపోయి పొట్టచేతపట్టుకొని వలసలకు పయనమయ్యాయి. అవసరమున్నా లేకున్నా వినిమయ సంస్కృతి మనిషిని పరాయీకరించి, మానవ సంబంధాల్ని అల్లకల్లోలం చేసింది. అందులో కవిగా నేను మినహాయింపు కాదు, కాబట్టి 1993 నుంచి 1996 వరకు రాసిన కవిత్వంతో మొట్టమొదటి సారిగా ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ కవితా సంపుటిని తీసుకువచ్చాను. ఈ సంపుటి ద్వారా ప్రపంచీకరణ గురించి మున్ముందుగా విప్పిచెప్పాను.
అన్నవరం: దళిత బహుజన సాహిత్య ఉద్యమాలను తెలంగాణ ఉద్యమం కప్పేసింది కదా! తర్వాత తర్వాత దళిత బహుజన ఆదివాసి అస్తిత్వ సాహిత్యాలు ఎలా ఉంటాయి?
– తెలంగాణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జరిగిన అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమంలో అన్ని అస్తిత్వాలు మిళితమై ఉన్నాయి. అయితే పాయలు పాయలుగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో దళిత, బహుజన, స్త్రీ, గిరిజన, మైనార్టీ అస్తిత్వాలు ఉద్యమాల రూపంలో ముందెన్నడూ లేనంతగా ప్రముఖంగా ముందుకు వస్తాయి. నిలదీస్తాయి.
అన్నవరం: కొత్తగా సాహిత్యంలోకి వచ్చిన కవులకు మీరిచ్చే సూచనలు?
– నూతనంగా సాహిత్యంలోకి వచ్చేవారికి, 2000 నుంచి సాహిత్యంలో కొనసాగే వారికి చేతులు జోడించి ఒకటే నా సవినయ విన్నపం. సాహిత్యంతోపాటుగా తప్పక సామాజిక శాస్త్రాల అధ్యయనం చేయాలి. ప్రజా దృక్పథంతో రచనలను నిర్మాణాత్మకంగా కొనసాగించాలి. అప్పుడుగానీ ఆయా రచనలు రక్తమాంసాలు చెమటతో వెలుగొందుతాయి.
నరేందర్: మీ కవిత్వం ప్రపంచీకరణని సిసికెమెరాల్లో చూపిస్తున్నట్టుగా ఉంటుంది? ఇంత గాఢంగా రాయడం మీకు ఎలా సాధ్యమైంది?
– నా కవిత్వానికి ప్రాణం 1975 ప్రాంతంలో తెలంగాణలో జరిగిన పోరాటాలు. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన విధ్వంసాలే ఊపిరి. నా కవిత్వంలో అంతరిస్తున్న మానవ సంబంధాలు, ప్రపంచీకరణ, రక్తమంటకుండానే హత్యలు, రాజ్యం, వికృతరూపమైన ఆత్మహత్యలు, వలసలు అన్నీ దృశ్యమానమవుతాయి. ప్రత్యక్ష బాధితున్ని నేను కాబట్టి నా కవిత్వంలో అవి ప్రధాన శక్తిగా ఉంటాయి.
నరేందర్: వైపని లాంటి గొప్ప కతలు రాసిన మీరు కథలు రాయడం ఎందుకు ఆపేశారు?
– అత్యంత వేగంగా మార్పు చెందుతున్న సమాజాన్ని కథలుగా రాయడానికి తగిన సమయం, అధ్యయనం ఉండాలి. ఇవాళ ఉన్న స్థితి తెల్లారేసరికి మరోరూపంలోకి మార్పు చెందడాన్ని నాలోని కథకునికి సరిగ్గా సరైన తెలివిడిలోకి రాకపోవడం వలస జనం ఆశించినంతగా కథలు రాయలేకపోయాను తప్ప మరొకటి కాదు.
నరేందర్: మీ జీవితం వేరు, మీ కవిత్వం వేరు కాదనిపిస్తుంది. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యమా?
-నేనే నా మొదటి కవితా సంపుటికి ఆవిష్కరణగా ముందుమాట రాసుకున్నాను. అందులో పేర్కొన్నట్లు నాకు జీవితం, కవిత్వం వేరు వేరు కాదు. సమాజానికి నాకు నా కవిత్వం ఒక యానకం. ఇది గత మూడు దశాబ్దాలకు పైగా నా నిరంతర చలన కవిత్వం ద్వారా నిరూపించాను.
గాజోజు: తెరవే తర్వాత రచయితల సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి?
– తెరవే తర్వాత వచ్చిన రచయితల సంఘాలన్ని ఆయా వ్యక్తుల, శక్తుల, ఉనికి సంక్షోభాల నుంచి జన్మించాయి. ఈ సంఘాలు ప్రజల వైపా లేక అధికారం, ఆధిపత్యం దిక్కా అనేది వారి కార్యాచరణతో కాలపరీక్షలో తేలిపోనుంది.
గాజోజు: వామపక్ష ఉద్యమాలు కవిగా మీకొక వర్గదృక్పథాన్ని కలిగించడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపాయి?
– 1972 నుంచి నేను ఏదో కవిత్వం రాస్తున్నాను కానీ 1975 అత్యవసర పరిస్థితి తర్వాత నా చుట్టూ జరుగుతున్న ప్రజా ఉద్యమాలు నన్ను ఒక స్పష్టమైన ప్రజాదృక్పథం కలిగిన కవిగా తీర్చిదిద్దాయి. అందులో జక్కని వెంకట్రాజం, నిజాం వెంకటేశం గారల చేయూతతో సాహిత్యంలో ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నాను.
గాజోజు: కవి, రచయితలు ప్రజల పక్షం వహించి పాలకులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలని మీరు పదే పదే చెపుతారు. ఈ బాటలో సాగిన మీ సాహితీ ప్రస్థానంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
– కవి అనేవాడు ఎప్పప్పుడూ ప్రతిపక్షమే. యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ కానివాడు కవి కాడు. అతను రాసేది కవిత్వం కానేరదు. నా కవిత్వ యాత్రలో అణిచివేత, రాజ్యహింస జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. వాటిని ఎప్పుడూ ఇబ్బందిగా ఫీలవలేదు.
గాజోజు: దోచుకొనేవాళ్లు, దోపిడీకి గురయ్యేవాళ్లుగా సమాజం విభజితమవుతున్న వేళ, రాజ్యహింసకు వ్యతిరేకంగా సమాంతర ఉద్యమ సమాజాన్ని నిర్మించడంలో సాహితీవేత్తల పాత్ర ఎలా ఉండాలి?
– తెలంగాణ సాధన ఉద్యమంలో దోపిడీదారుడు, దోపిడీకి లోనైనవాడు ప్రజావ్యతిరేకులు, ప్రజా అనుకూలురు కలిసి పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు విభిన్న ధృవాల శక్తులు ఇప్పుడు తప్పనిసరిగా విడివడిపోతాయి. అందులో కవులు, రచయితలు, గాయకులు ప్రజలపక్షం వహించి మళ్లీ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది.