— నిజం గానీ శ్రీ ఆలూరి భుజంగ రావు గారు మరణించి ఏడాది అయిందా?అని పిస్తోంది .నిజాయితీ నిబద్ధతలకు మారు పేరు ,మా ఉయ్యూరు లో దశాబ్దం పైగా ఉన్నవారు నిత్యం కలిసి మాట్లాడిన వారు ,గుంటూరు నుండి ఉత్తర ప్రయ్తుత్తరాలు జరిపిన వార అతి నిరాడంబరులు ఆలూరి వారు .వారిని గురించి జ్ఞాపకం చేసిన ”కాలం కవి ”కి ”నాన్న గారు ”అని గుండె లోతుల్లోంచి పలికిన వారి సంస్కారానికి ధన్య వాదాలు చెబుతూ అందరికోసం దీన్ని మీకు అందిస్తున్నాను -దుర్గా ప్రసాద్
గురుతుల్యులు నాన్నకు వినమ్రతతో…( కాలం ) – కవిని
నిజాయితీకి, ఆచరణకు, నిబద్ధతకు ఎంతో విలువనిచ్చేవారు. డబ్బనే మాధ్యమాన్ని ఓటి కుండలో నీటిలా భావించేవారు. జీవితాన్ని ఒక గొప్ప కళాత్మక- కథాత్మక వస్తువుగా భావించారు. జీవిత సందర్భాన్ని ఉచిత రీతిలో సంస్కరించి, పాఠకులకు ఇవ్వగలిగితే అదే గొప్ప సాహిత్యం, కళాత్మక చిత్తరువు అవుతుందన్నారు. సాహిత్యాన్ని అమూల్యమైనదిగా భావించి, సాహిత్యం అమ్మకపు సరుకు కాకూడదన్నారు.
దేన్నీ మిగల్చదు. ముందూ వెనకగా సమ స్త ప్రాణికోటి కాలగర్భంలో కలసిపోవాల్సిందే! వ్యక్తు లు మిగలరు. వీళ్ల జ్ఞాపకాలే మిగుల్తాయి. నాకు గురుసమానులైన మా నాన్న – ఆలూరి భుజంగరావు గారు మరణించి అప్పుడే సంవత్సరం కావస్తోంది! ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు. 2013 జూన్ 20న ఆయన మనందర్నీ వదిలి వెళ్లిపోయారు. సాహిత్యా న్ని చదువుతుంటే ఆయన జ్ఞాపకాలే వెన్నాడుతున్నాయి…
రచయితల రచనల్లోనే వాళ్ల వ్యక్తిత్వం ద్యోతకమవుతుందంటారు. అద్భుతమైన అనువాదాలనూ, రచనలనూ దాదాపుగా విపరీతమైన శారీరక, మానసిక బాధల్లోనే, దరిద్రంలోనే రాశారు. కానీ తనను మానవుడిగా, రచయితగా తీర్చిదిద్దింది ఈ దేశంలోని కూటికి, గుడ్డకు నోచుకోని కోట్లాది దరిద్ర మానవులే- అని సగర్వంగా చెప్పుకున్నారు. సమస్త విజ్ఞానాలూ, ఐశ్వర్యాలూ, సుఖాలూ- సంపదలూ అన్నీ మురికి ఓడుతూన్న మడి మనుషుల చెమట చుక్కల్లోంచేనని త్రికరణ శుద్ధిగా నమ్మారు. ‘బ్రతకడం ఎట్లా?’ అన్న ప్రశ్న- ఆయన జీవితం అస్తిత్వాన్ని దాల్చిన క్షణం నుండి ఆయనను వేధించిన ప్రశ్న. ఆయన జీవితంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన ప్రశ్న. ‘జీవితాన్ని పొగల్లో, సెగల్లో, పంచాగ్నుల మధ్యా భస్మీపటలం చేస్తున్న ‘బ్రతకడం ఎట్లా?’ అన్న ప్రశ్నకే ప్రాధాన్యతనిస్తే, నా జీవిత చరిత్రగా పేరు పెడితే? అది నా దేశంలోని అసంఖ్యాకులైన మానవుల చరిత్ర అవుతుందని రాసుకున్నారు. సరైన వైద్యం చేయించలేక ఇద్దరు మొగపిల్లల్ని పోగొట్టుకున్నారు. ‘ఈ సమాజ కరాళ దౌష్ట్యాలకు ఎరగా ఇప్పటికీ ఇద్దరు పిల్లల్ని ఇచ్చానని’ 1974లో రాసుకున్నారు. హాలాహలం లాంటి జీవితంలోంచి అమృతమనే సాహిత్యాన్ని రచించారు.
ఆకలిగొన్నవారు, అన్నార్తులు, అభాగ్యులు కనపడితే వాళ్లు అడిగినా, అడగకపోయినా ఎంతో కొంత తన జేబులోంచి తీసి వాళ్ల చేతుల్లో పెడుతుండేవారు. వాళ్ల కళ్లల్లో దైన్యం, ఆకలి కనపడుతోందనేవారు. నిజాయితీకి, ఆచరణకు, నిబద్ధతకు ఎంతో విలువనిచ్చేవారు. జీవితంలో ఇంకా నేర్చుకోవలసింది ఎంతో వున్నదని భావించేవారు. డబ్బనే మాధ్యమాన్ని ఓటి కుండలో నీటిలా భావించేవారు. జీవితాన్ని ఒక గొప్ప కళాత్మక- కథాత్మక వస్తువుగా భావించారు. జీవిత సందర్భాన్ని ఉచిత రీతిలో సంస్కరించి, పాఠకులకు ఇవ్వగలిగితే అదే గొప్ప సాహిత్యం, కళాత్మక చిత్తరువు అవుతుందన్నారు. సాహిత్యాన్ని అమూల్యమైనదిగా భావించి, సాహిత్యం అమ్మకపు సరుకు కాకూడదన్నారు. ఎంత బాధలో వున్నా హాస్యోక్తుల్ని విసురుతుండేవారు. ఆయన భాషలో సున్నితమైన హాస్యం మేళవించి వుండేది.
2000 నుండి 2013 దాకా అంటే దాదాపుగా 13 ఏళ్లు వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే కాకుండా, రాహుల్ సాంకృత్యాయన్ జీవిత చివరి దశ లో ఏ రకమైన మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడ్డారో.. ఆ రకమైన బాధల్నే భుజంగరావు కూడా అనుభవించారు. ఒక్కొక్కప్పుడు సమయ, సం దర్భాలనుఆయన మెదడు స్వీకరించలేకపోయేది. తన కు వచ్చిన భావనను వెంటనే వ్యక్తపరచాలనుకునేవారు. తన మరుపు, మాటలు, ఆప్తులనూ, మిత్రులనూ బాధపెడుతున్నాయేమోనని కలవరపడిపోయేవారు. తనస్థితికి అమితంగా బాధపడేవారు. ఒక రకం గా మెదడుకు సంబంధించిన అనారోగ్యం ఆయన మెదడును కబళించివేసింది. ఐతే, సహృదయులైన సాహితీమిత్రులు ఆయన స్థితిని అర్థంచేసుకుని, ఆయ నను ఆదరించేవారు- తాను నమ్మిన ఆదర్శం, సిద్ధాం తం, ఆశయాల పట్ల చివరిదాకా పూర్తి జ్ఞాపకశక్తితో, చాలా ఖచ్చితంగా చెప్పగలిగి వుండడం గమనార్హం.
ఎంతో నిమగ్నత వుంటే తప్ప రాహుల్జీని అనువదించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న ఆధునిక సౌకర్యాలు (జిరాక్స్ మిషన్ లాంటివి) అప్పుడు లేవు. ఆర్థిక సమస్యలూ, అనారోగ్యం సరేసరి. పెద్ద కుటుంబం చిన్న ఇల్లు. ఇల్లంతా బంధువులతోటి, మిత్రులతోటి నిండి వుండేది. కమ్యూనిస్టు భావాలు కలిగి వుండటాన పనిచేసే చోట మేనేజ్‌మెంట్ నుండి మానసిక వత్తిడి, హింస ఎక్కువగా వుండేవి. ఇటువంటి పరిస్థితులలో నిరంతర అధ్యయనం. రాహుల్జీ, యశ్‌పాల్, ప్రేమ్‌చంద్ లాంటి ప్రముఖుల అనువాదాల్ని ఎలా చేయగలిగారో అని అనిపిస్తుంది. పేపరు కింద కార్బన్ పెట్టుకుని వేసవి వడగాలులతో, చెమటను తుండుగుడ్డతో తుడుచుకుంటూ రాసేవారనీ, రాహుల్జీని అనువదించేటపుడు అన్నం తింటూ మధ్యలో లేచివెళ్లిపోయి చెయ్యి కడుక్కునేవారని అమ్మ చెప్పేది. తన సొంత రచనలను, ఎంతో శ్రమకోర్చి అనువాదం చేసిన అనువాదాలను అనేకం పోగొట్టుకున్నారు. అవి వెలుగు చూడాలనీ, ఆ ఆణిముత్యాలను తెలుగు పాఠకులకు అందించాలనీ తపనపడేవారు. ప్రస్తుత సమాజంలో సాహితీపరుల బాధ్యతను గుర్తుచేస్తూ.. కవి ధరించవల్సింది కలమా? ఖడ్గమా? అన్న మీమాంస వచ్చినపుడు- సుబ్బారావు పాణిగ్రాహి కలంతో పాటు ఖడ్గాన్ని కూడా ధరించవల్సిందేనని అనేవారు. భవిష్యత్ తరాలు తప్పనిసరిగా ‘నాదీ-నీదీ’ అనేది లేని సమాజాన్ని నిర్మించుకుంటారని, అలాంటి సమాజాన్ని నిర్మిద్దామని కలలు కనేవారు. ఐతే అప్పటిదాకా ఎంతమంది మానవులు రక్తతర్పణం కావించారు? అంటూనే తప్పకుండా ఆ రోజులు వస్తాయని విశ్వసించేవారు.
‘జీవితంలో తాను అనుకున్నవి ఏవీ అనుకున్నట్టుగా జరగలేదని కనీసం చావైనా ప్రశాంతంగా రావాలని’ కోరుకున్నారు. ఆయన చనిపోయేదాకా గుంటూరులోని ఎ.టి.అగ్రహారం, 7వ లైనులో దాదాపుగా 10 ఏళ్ల పాటు వున్నారు. చనిపోయేనాటికి ఆ ఇంటి అద్దె 2,200 రూపాయలు. ఇంటి నేల గచ్చునేల కాదు. మట్టినేలకు ఎర్రకళాయి పూశారు. అందుకే కొంచెం తక్కువ అద్దె తీసుకునేవారు. ఆయన చనిపోయాక ‘ఇంత గొప్ప వ్యక్తి! గొప్ప సాహితీవేత్త! అనుకున్నది ఆచరించి చూపే నిజాయితీపరుడు! దహన కార్యక్రామాలు అయ్యేదాకా ఇంటి ఆవరణలోనే వుంచండి.. బయట వుంచవద్దని’ ఇంటి ఓనరు చెప్పారు. ప్రశాంతంగా చనిపోవాలన్నది ఒక్కటి మాత్రమే ఆయన జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో తనకు కమ్యూనిస్టు, మార్క్సిస్టు, మావోయిస్టు భావజాలం తోడ్పడ్డాయనీ, తనను మనిషిగా తీర్చిదిద్దాయనీ అటువంటి ఆ భావజాలానికీ, ఆలోచనా విధానానికీ, ఆచరణకీ అత్యంతగా కృతజ్ఞుణ్ణయి, వినమ్రుణ్ణయి తలవంచుకు అభినందనలు తెలియపరుచుకుంటున్నానని -సగౌరవంగా చెప్పుకున్నారు.
ఆయన ఆశయాలనూ, ఆదర్శాలనూ, నమ్మిన సిద్ధాంతాలనూ గౌరవించి, కొనసాగించడమే కా.ఆలూరి భుజంగరావు గారికి మనమిచ్చే నివాళి. శిరస్సు వంచి చేతులు జోడించి వినమ్రంగా నమస్కరిస్తూ.. జోహార్లు చెప్తూ.. కన్నీటి పర్యంతమవుతూ..
– కవిని