నేనుగానీ ఒక ఈలగానీ వేశానంటే…

మాటలతో మాయ చేసే గారడివిద్య ఆయనకు తెలుసు కాబట్టే ‘మాయలోడు’లో ప్రేక్షకులందర్నీ మాయ చేశారు. ఎక్కడ ఏ అక్షరం పడితే బావుంటుందో తక్కెడలో తూకం వేసినట్లు రాయగలరు కాబట్టే ‘శుభలగ్నం’లో సెంటిమెంటును పండించారు. పొట్టి మాటలతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడానికి యముణ్ని సైతం భూలోకంలోకి రప్పించిన ఆయన అక్షర విన్యాసం.. ఎలాంటిదో ‘యమలీల’ చూస్తే తెలుస్తుంది. ఒక ముక్క మాట్లాడలేని మూగజీవానికి సైతం గుండెకు హత్తుకునే మాటలు రాయొచ్చని ‘రాజేంద్రుడు గజేంద్రుడు’తో నిరూపించుకున్నారు. ఫ్యామిలీ, హ్యూమర్, సెంటిమెంట్ డైలాగుల్లో ఆరితేరిన ఆయనే దివాకర్‌బాబు. బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకొచ్చి.. వంద సినిమాలకు మాటలు రాసిన ఆయనే ఈ వారం డైలాగ్‌గురు..
“నువ్వు నీ మొగుణ్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగుణ్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!”
“కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు”
“ఇంకేం యముండ.
అదుగో గోల్కొండ”
“అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు”
“గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ”
‘పుష్పక విమానం’లో ఒక్క డైలాగు లేదు. కాని ప్రేక్షకులకు అద్భుతంగా అర్థమైంది. చార్లీచాప్లిన్ సినిమాల్లోను మాటలు ఉండవు. ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. దీన్నిబట్టి మనకు అర్థమైంది ఏంటంటే- సినిమాకు డైలాగులు అవసరం లేదని. తెర మీద ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా చెప్పలేనప్పుడు మాత్రమే డైలాగులు రాయాలన్నది నా అభిప్రాయం. ఊరికే సినిమా నిండా వాగుడు వాగుడు వాగుడు ఉండకూడదు. అయితే ఆ ప్రయత్నం.. నా పూర్వీకులు చేయలేదు. నేను చేయలేదు. నా తర్వాత వారు కూడా చేయలేదు.
‘శుభలగ్నం’ క్లయిమాక్స్ సీను రాయను అని మొండి కేశాను. ఎందుకంటే రాస్తే.. ఈ పాత్రలన్నీ నాకు దూరమైపోయినట్లే లెక్క. అంటే ఆ పాత్రలతో నాకు తెలియకుండానే అంత అనుబంధం ఏర్పడిందన్నమాట.
‘ఘటోత్కచుడు’లో ఏవీఎస్‌కు రాసిన.. ‘రంగు పడుద్ది’ బాగా పాపులర్ అయ్యింది. గుంటూరులో రౌడీబ్యాచు ఈ మాటను అంటుండే వాళ్లు. దాన్ని నేను చిన్నప్పుడు విన్నట్లు గుర్తు. రంగు అంటే రక్తం. అందుకే ‘రంగు పడుద్ది’ అంటుంటారు.
సినిమాల్లోకి వస్తానని ఏ నాడు అనుకోలేదు. కరూర్ వైశ్యాబ్యాంకులో ఉద్యోగం చేసేవాణ్ణి. చదువుకునే రోజుల నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం నాకు. నాటకాలు రాయడం, పరిషత్తు పోటీల్లో పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం ఇదే పని. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఇవన్నీ చేసేవాణ్ణి. అయితే బదిలీ మీద విజయవాడకొచ్చాను. ఏదో పని మీద మద్రాసు నుంచి రేలంగి నరసింహారావుగారు ఆ ఊరొచ్చారు. పూసల వెంకటేశ్వరరావు అనే రచయిత నా గురించి ఆయనకు చెబితే ఒకసారి వచ్చి కలవమన్నారు. రేలంగి బస చేసిన హోటల్ గదికి వెళ్లి ఆయన్ని కలిశాను.
ఒక సినిమాకు కథ చెప్పడం అదే ఫస్ట్‌టైమ్. చిన్న లైన్ చెప్పగానే ఆయనకు తెగ నచ్చింది. ‘లైన్ బాగుంది. ట్రీట్‌మెంట్ రాసి మద్రాసుకు పంపండి’ అన్నారాయన. వెంటనే రాసి పంపించేశాను.
అదే కథతో సినిమా తీస్తున్నట్లు నాకు కబురు పెట్టారు. “డైలాగులు కూడా నేనే రాస్తానండీ” అని రేలంగిని అడిగితే సరే అన్నారు. అలా ‘కొంటెకాపురం’తో డైలాగ్ రైటర్‌గా నా ప్రస్థానం మొదలైంది. అప్పట్లో అది పెద్ద హిట్. చంద్రమోహన్ హీరోగా ఫేడవుట్ అవుతున్న సమయంలో వచ్చిందది. సినిమా రచనలో అనుభవం లేకపోయినా.. నాటకాలకు, దృశ్యమాద్యమానికీ వ్యత్యాసం తెలుసు. ఆ తర్వాత ‘డబ్బు ఎవరికి చేదు’, ‘మన్మధలీల కామరాజు గోల’లకు మాటలు రాశాను. మెల్లగా అవకాశాలు పెరగడంతో.. బ్యాంకు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అప్పటికి పన్నెండేళ్లు బ్యాంకులో పనిచేశాను. ‘శుభలగ్నం’, ‘యమలీల’, ‘ఘటోత్కచుడు’, ‘మావిచిగురు’, ‘చూడాలనివుంది’, ‘ఆహ్వానం’, ‘మాయలోడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించే అవకాశం వచ్చింది. మొత్తం కలిపితే వంద సినిమాలకు డైలాగుల్ని అందించాను నేను. రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, ఎస్వీ కృష్టారెడ్డి, ముత్యాలసుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, గుణశేఖర్ వంటి దర్శకులతో పనిచేశాను. నాకు గుర్తున్న కొన్ని సినిమాల్లోని కొన్ని డైలాగులు ఇవి.
రాజేంద్రుడు గజేంద్రుడు
కథ సిద్ధమయ్యాక – దర్శకుడు ఎవరైతే బావుంటుంది? అని ఆలోచిస్తున్నాం. “మీరే చేయండి” అని ఎస్వీ కృష్ణారెడ్డిని ప్రోత్సహించాం. కథ ఆయన రాసిందే కావడంతో తీయడం సులువైంది. అప్పట్లో నేను కేవలం డైలాగులు రాయడం వరకే పరిమితం కాలేదు. స్క్రీన్‌ప్లేను మలచడం, పాత్రలకు ఒక స్వభావాన్ని ఇవ్వడం, కథా చర్చల్లో పాల్గొనడం చేసేవాణ్ణి. ఈ సినిమాకు పనిచేయడం మాత్రం కొత్త అనుభవం. సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక్కరే హీరో కాదు. ఏనుగు కూడా హీరోనే! అది జంతువు కాబట్టి మాట్లాడలేదు. దాని పక్కనున్న క్యారెక్టర్ మాట్లాడే మాటలను బట్టి.. ఏనుగు భావాలను ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఏనుగు తల ఊపితే.. “ఓహో! నువ్వు అలా అనుకుంటున్నావా” అని పక్క పాత్రలు చెబుతుండాలి. అలా రాయడం చాలా డిఫికల్ట్ ఫీట్. ఇంతకుమునుపు జంతువుల సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ చూశాను. అయితే ప్రాక్టికల్‌గా వచ్చేసరికి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’కు మాటలు రాయడం కష్టం అనిపించింది. ఏనుగు బాధ పడుతోంది. ఆ బాధను ఎలా చెప్పాలి? ఏనుగు పక్కనే అత్యంత ప్రీతిపాత్రమైన రాజేంద్రుడు అనే పాత్ర దాని హృదయాన్ని అర్థం చేసుగోలడు అనేది చెప్పగలగాలి. అయితే ఆ విషయం ప్రేక్షకులకు నేరుగా తెలియకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ.. సంభాషణలను రాశాను.
ఇందులో – అలీకి ఒక సన్నివేశముంది ‘జంబలకిడిపంబ’ తీస్తున్న సమయంలో.. నేను, అలీ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు.. ‘జిబ్రిష్ లాంగ్వేజ్’లో ఒక కామెడీ ట్రాక్ చేసి చూపించాడతను. అదే భాష కాదు. ఒట్టి సంజ్ఞలతో చేసే భావవ్యక్తీకరణ.అంతే!
అలీ చేసిన ఆ సీను బాగా గుర్తుండిపోయింది. దాన్నే క్యారెక్టర్‌గా మలిచి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో బ్రహ్మానందానికి పక్కనుండే ఒక పాత్రను పెట్టాను. ఆ పాత్రను అలీనే చేశాడు. అతను మాటి మాటికీ ‘ఇంద చాట’ అంటుంటాడు. అందులో ఒక్క ముక్క అర్థం కావు. దాని వల్ల బ్రహ్మానందం పడే అవస్థల్ని చూస్తే నవ్వొస్తుంది. వీళ్లిద్దరి మధ్య నడిచే సీన్ల కోసం పెద్ద పెద్ద డైలాగులేమీ రాయలేదు. అందుకే ప్రేక్షకులకు నచ్చింది.
మాయలోడు
ఆ రోజు నాకు జ్వరం వస్తే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను. ఎస్వీ కృష్ణారెడ్డి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ క్యాసెట్టును పంపిస్తే.. డీవీడీ ప్లేయర్‌లో వేసుకుని చూస్తున్నానప్పుడు. నా పక్కనే మసాజ్ చేసే వ్యక్తి కూర్చున్నాడు. సినిమాను చూస్తూ.. కొన నాలుకను బయటికి చాపి.. కనుబొమలు పైకి ఎగరేసి.. ఒక విచిత్రమైన ఫేసు పెట్టాడు. ఆ దృశ్యం చూస్తున్నంత సేపు.. “ఇతను మెచ్చుకుంటున్నాడా? లేదంటే వెక్కిరిస్తున్నాడా?” అనేది అర్థం కాలేదు. ఇదే భావనను తీసుకుని క్యారెక్టరైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అలా పుట్టిందే ‘మాయలోడు’లో బ్రహ్మానందం పక్కనుండే అలీ క్యారెక్టర్. బ్రహ్మానందం ఏం మాట్లాడినా నాలుక బయటపెట్టి కనుబొమలు పైకెగరేసి.. మౌనంగానే తలను అటూఇటూ ఆడిస్తుంటాడు అలీ. అతని వింత ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులు నవ్వి నవ్వి ఊగిపోయారు. ఒకసీనులో అమ్మాయిలతో హోటల్‌లో కలిసి భోంచేసిన బ్రహ్మానందం బిల్లు కట్టలేక పిండి రుబ్బాల్సి వస్తుంది. అప్పుడు అలీ నాలుక బయటపెట్టి తల ఆడించే విన్యాసం అద్భుతంగా నవ్వించింది. ఆ సీనుకు డైలాగులు అవసరం లేదనే రాయలేదు. ఒక వేళ అలీకి మాటలుండి ఉంటే అంత నవ్వించగలిగేది కాదు ఆ సన్నివేశం. ఆ కిటుకు రచయితకు తెలిసుండాలి. డైలాగు రైటర్ ప్రతి పాత్రను వాగుడుకాయ చేయకూడదు.
‘నేను గానీ ఒక ఈలగానీ వేశానంటే’ అంటూ రాజేంద్రప్రసాద్ రోడ్డు మీద గారడివిద్య చేసి మూటముల్లె సర్దుకుని వెళ్లిపోయే సీను అది. జనం వెళ్లిపోయినా.. అక్కడొకచిన్న పిల్ల దిగులు ముఖం పెట్టుకుని కూర్చునుంటుంది. ‘ఏంటమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావు?’ అనడిగితే.. “మా మమ్మీడాడీని మా మావయ్య చంపేశాడు..” అని ఏడ్చినంత పని చేస్తుంది. అంతవరకు రాజేంద్రప్రసాద్ చేసిన గారడి విద్యలు నిజమని నమ్మిన ఆ పిల్ల ‘నువ్వుగానీ ఒక ఈలగానీ వేస్తే మా అమ్మానాన్నా వస్తారుగా’ అని ఆశగా అడుగుతుంది. ఆ చిన్న సన్నివేశం ప్రేక్షకుల గుండెల్ని తాకింది.
మరొక సీను – రాజేంద్రప్రసాద్ నిరక్షరాస్యుడు. అంధురాలైన అమ్మాయిని చేరదీసుంటాడు. ఒకసారి తన పేరు రాయమని కోరతాడు. అప్పుడు ఆ అమ్మాయి పలకలో రాస్తుంది. పక్కనున్న వ్యక్తితో రాజేంద్రప్రసాద్ “ఏంట్రా కరెక్టుగా రాసిందా” అని అడుగుతాడు. “గాడు అని రాసిందిరా” అంటాడతను. వీరబాబు ‘గాడు’ (సినిమాలో తన క్యారెక్టర్‌పేరు) అని రాసిందా” అని అంటాడు రాజేంద్రప్రసాద్. అప్పుడు ఆ వ్యక్తే మళ్లీ ‘జిఒడి గాడ్ అని రాసింది” అని చెప్పగానే హీరో కళ్లలో నీళ్లు మెదులుతాయి. అంటే ఆ పిల్ల తనను దేవునిగా భావిస్తోంది అని చెప్పడం ఆ చిన్న డైలాగు ఉద్దేశం. అంతకంటే మరొక్క మాట అక్కడ అక్కర్లేదు.
సినిమా అన్నది ‘మేక్ బిలీఫ్’. ప్రేక్షకులు చూస్తున్నంతసేపు వాళ్లను నమ్మిస్తే చాలు. ‘మాయలోడు’లో పెద్ద ఫ్లా యేంటో మేకర్స్‌గా మాకు తెలుసు. కాని అంతవరకు ఆలోచించకుండా ప్రేక్షకులను మాయ చేయగలిగాము. గారడీ తెలిసిన రాజేంద్రప్రసాద్ అవసరం అనుకుంటే టక్కున మాయమైపోగలడు. మనుషుల్ని కప్పల్ని, కుక్కల్ని, పిల్లుల్ని చేయగలడు. కాని ఇంట్లో వున్న గుడ్డి పిల్లకు మాత్రం కళ్లు తెప్పించలేడు. మరేమిటి నాన్సెన్సు. తనకున్న విద్యతో ఆ పిల్లకు కళ్లు తెప్పించొచ్చుగా! అని ప్రేక్షకుడు ప్రశ్నిస్తే? అన్న తర్కం రాకుండా సీన్లు రాయాల్సొచ్చింది. ఆఫ్ ద స్క్రీన్ ఆఫ్ ద మైండ్. స్క్రీన్ మీద చూపించిందే ప్రేక్షకుడు నమ్ముతాడు. దాని వెనకున్నది నమ్మడు.
శుభలగ్నం
దీనికి కథ భూపతిరాజా. ‘ఇన్‌డీసెంట్ ప్రపోజల్’ అనే ఆంగ్ల చిత్రం నుంచి కథను తీసుకున్నారాయన. ఆ కథలో కోటి రూపాయలకు భార్యను అమ్మేస్తాడు ఓ భర్త. అదే కథను తెలుగులో తిప్పి రాశాడు రాజా. కాబట్టే ‘శుభలగ్నం’లో భర్తను అమ్ముకుంటుంది భార్య. నాకు కథ వినిపించాక.. మీరు నమ్ముతారో లేదో కాని.. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే చకచకా మాటలన్నీ రాసేశాను. ఇందులో ఆమని పాత్రకు చిన్న అమాయకత్వం కనక జోడించకపోయుంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యుండేది. ఆమనిది సాధారణ గృహిణులు ఆశపడే స్వభావం. ప్రతిదాన్నీ పక్కవాళ్లతో పోల్చుకోవడం ఆమె నైజం. మాట మాటకు ఆఖర్న ‘ఏమిటో..’ అంటూ దీర్ఘం తీసి చెప్పే ఆమె మానరిజం అప్పట్లో అందరి మెప్పు పొందింది.
భర్తను కోటి రూపాయలకు అమ్మేసిన ఆమని.. ఒక ఖరీదైన బంగళా కొంటుంది. ధగధగలాడే నగలు ధరించి, పట్టుచీర కట్టుకుని.. దర్జా ఒలకబోస్తుంటుంది. ఆ సమయంలో బంగళాను అమ్మేసిన సుహాసిని అక్కడికొస్తుంది. ఆవిడను చూసిన ఆమని “నా వైభోగం చూసిపోదామని వచ్చావా ఏమిటి?” అంటుంది. “లేదు పనివాళ్లు అన్ని సామాన్లు తీసుకెళ్లారు. నా భర్త ఫోటో మాత్రం ఉంది. అది స్వయంగా తీసుకెళదామని వచ్చాను” అని చెబుతుంది సుహాసిని. మళ్లీ ఆమని కలుగజేసుకుని “ఉన్నదాంట్లోనే తృప్తిగా బతుకు అని చెప్పావుగా. ఇప్పుడు ఉన్నదాన్నే అయ్యాను. నీకంటే గొప్పదాన్నని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?” అని ఆమని కాస్త పొగరు స్వరంతో చెబుతుంది. “నువ్వు నీ మొగున్ని అమ్ముకుని బంగళా కొన్నావు. నేను నా మొగున్ని బతికించుకోవడానికి బంగళా అమ్ముకున్నాను. నువ్వు నాకంటే ఎప్పుడూ పేదదానివే!!” అని సుహాసిని చెప్పే డైలాగ్ ఆమనిని ఆలోచనలో పడేస్తుంది.
ఆ రోజు పెళ్లి రోజు. పేకాటలో మునిగిపోయిన ఆమని ఆ సంగతిని మరిచిపోతుంది. ఆటలో గుర్తుకొచ్చి వెంటనే ఇంటికి పరిగెత్తుకొస్తుంది. అప్పటికే రెండో భార్య రోజాను తీసుకుని బయటికి వెళ్లుంటాడు జగపతిబాబు. ఇంటికొచ్చిన ఆమని గబగబ మేడ మీదికి ఎక్కి మొగుడి కోసం వెతుకుతుంది. లేడని తెలుసుకుని విసుగుతో మెట్లు దిగుతూ కిందికొస్తుంటే.. అక్కడే ఉన్న వాళ్లమ్మ అన్నపూర్ణ “ఇంతకన్నా దిగిపోవడానికి నీకు మెట్లు లేవమ్మా” అంటుంది. ఆ ఒక్క చిన్న డైలాగు ఆ సన్నివేశానికి ఎంత బలాన్ని అందించిందో చెప్పలేను. డబ్బు కోసం మొగున్ని అమ్ముకుని.. అతను లేని లోటును మెల్లగా తెలుసుకుంటున్న ఆమె.. రియలైజేషన్‌లోకి వెళ్లిందీ అని చెప్పటానికి ఆ మాట తోడ్పడింది.
అది క్లయిమాక్స్ సీను – డబ్బు మీద ఆశ చచ్చిపోయి ఉన్నదంతా అనాధాశ్రమానికి రాసిచ్చేసి.. విదేశాలకు వెళుతున్న మొగుడి కోసం ఎయిర్‌పోర్టుకు వస్తుంది ఆమని. అక్కడ రోజా, జగపతిబాబు మధ్య ఒక సీనుంటుంది. పరాయి మొగుడి మీద ఆశ పడటం ఎంత తప్పో తెలుసుకున్న రోజా.. “కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు” అని చెబుతుంది. ఈ డైలాగే కాదు. ఇందులోనివన్నీ చాలా క్లుప్తంగా ఉంటూనే, శక్తివంతగా అనిపిస్తాయి. కాబట్టే సామాన్యప్రేక్షకుల హృదయాలను పట్టుకున్నాయవి. నేనెక్కడా ఇందులో పంచ్‌లు పడాలని మాటలు రాయలేదు. ఆ సందర్భానికి ఆ పాత్ర మనసులో ఏముంది? ఏం మాట్లాడితే బాగుంటుంది? అన్నదాన్ని దృష్టిలో పెట్టుకునే రాశాను.
చూడాలని ఉంది
చిరంజీవి ఒక పెద్ద మాస్ హీరో. అయినాసరే చాంతాడంత మాటలు రాయలేదు. సౌందర్య తన ట్రంకుపెట్టెలో దాచుకున్న ప్రేమలేఖను చదివి వినిపించే సీనొకటి అద్భుతంగా పండింది.(మొదటిపేజీ తరువాయి)
ఆమెకు ఇదివరకు ఎవరో లవ్‌లెటర్ రాస్తే దాన్ని పెట్టెలో నుంచి అపురూపంగా బయటికి తీస్తుంది. లేఖను చదవమంటాడు చిరంజీవి. అప్పుడు సౌందర్య సిగ్గుతో కూడిన అమాయకపు ముఖంతో.. గొంతు సవరించుకుని.. లేఖ తీసుకుని.. “పద్మావతీ పద్మావతీ.. నీ ఎర్రని మూతి.. చూడగానేపోయింది నా మతి” అని చదువుతూ మెలికలు పోతుంది. చదవడం అయిపోగానే “చూశావా నా కోసం రక్తంతో రాశాడు” అంటుందామె. “అబ్బో అంత కలర్ ఇచ్చాడా?” అంటాడు చిరు.
డైలాగుల కోసమని డైలాగులను నేనెప్పుడూ రాయను. పొదుపుగా రాయడం అలవాటు. ఒక సీనులో విలన్ అనే ఒకే ఒక్క మాటతో హీరో గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన సీను అది. ఒక పాత సినిమాలో ఎస్వీ రంగారావు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో “నీకు మరణమే శరణ్యం. నీకు.. మరణమే.. శరణ్యం. నీకు.. మరణమే… శరణ్యం” అనే డైలాగును అద్భుతంగా చెబుతాడు. ఏకవాక్యాన్నే మొదట మెల్లగా, రెండోసారి ఇంకాస్త గట్టిగా, మూడోసారి మరికాస్త గట్టిగా హైపిచ్‌లో చెప్పాలి దీన్ని. అదే భావోద్వేగంతో ‘చూడాలనివుంది’లో విలన్ ప్రకాష్‌రాజ్‌కు డైలాగును రాశాను. “మీరొకసారి ఎస్వీరంగారావు గారి సినిమా చూస్తారా? అందులో ఆయన ఎలా చెప్పారో తెలుస్తుంది” అన్నాను ప్రకాష్‌రాజ్‌తో. అయితే ఆయన “వద్దండీ నేను చూడను. చూస్తే ఆయన ఇమేజ్ నా మీద పడుతుంది. నేను నా సొంత స్టయిల్‌లోనే చెబుతాను” అన్నారు. అప్పుడు ఆయనకు రాసిన డైలాగ్.. “వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు. వాడు సామాన్యుడు కాడు”. ప్రకాష్‌రాజ్ చెప్పిన ఆ డైలాగ్ హీరో రేంజ్‌ను పెంచింది.
యమలీల
ఒక్కోసారి రచనకు లొకేషన్లు కూడా పనికొస్తాయి అనేందుకు ఇందులోని ఒక సీను నిదర్శనం. ఈ స్క్రిప్టు నేను మద్రాసులోనో ఇంకోచోటో కూర్చుని రాసుంటే ఎలా రాసుండేవాన్నో తెలీదు. భవిష్యవాణి పుస్తకాన్ని పొరపాటున భూలోకంలోకి జారవిడచడంతో.. ఇంద్రుడు శపిస్తాడు. దాంతో యముడి వేషం వేసిన సత్యనారాయణ, చిత్రగుప్తుడైన బ్రహ్మానందం భవిష్యవాణి కోసం.. భూలోకంలోకి వస్తున్న సన్నివేశం అది. “శాపం పడితే పడింది కాని మనకు సెలవు దొరికింది” అని చమత్కరిస్తాడు చిత్రగుప్తుడు. అందుకు కోపమొచ్చిన యముడు “యముండా…..!!!!” అని ఘీంకరిస్తాడు. “ఇంకేం యముండ. అదుగో గోల్కొండ” అని బ్రహ్మానందం చెప్పిన డైలాగుకు థియేటర్లన్నీ విజిళ్లతో మోగిపోయాయి. వాళ్లిద్దరు భూలోకంలోకి వచ్చారు అని చెప్పడానికి గోల్కొండను చూపించడం నా ఉద్దేశం. యముండకు, గోల్కొండకు ధ్వని కూడా బాగా కుదిరింది. ఈ డైలాగును హైదరాబాద్‌లో కూర్చుని రాశాను కాబట్టే ఈ ఐడియా వచ్చింది. ఇంకోచోట అయ్యుంటే వచ్చేది కాదేమో!
ఇంకో సీనులో అమ్మ గొప్పతనాన్ని చెప్పాల్సొచ్చింది. భూలోకంలో యముడు భోజనం చేస్తుంటాడు. అప్పుడతను “అమృతం దేవతలు తీసుకుని అమ్మ ప్రేమను మానవులకు ఇచ్చారు. మానవులే అదృష్టవంతులు” అంటాడు. ఆ డైలాగు ప్రేక్షకుల మన్నన పొందింది. ఇంకో సీనులో యముడు ఒక తాగుబోతును తన సహజసిద్ధ ధోరణిలో ‘మానవా’ అని పిలుస్తాడు. అప్పుడు ‘మానను’ అంటాడు ఆ తాగుబోతు.
‘యమలీల’లో అందరికీ గుర్తున్న కవిత ఒకటుంది. తనికెళ్ల భరణి “గల్లీలో నా చెల్లి పెళ్లి. జరగాలి మళ్లీ మళ్లీ” అనేదే ఆ కవిత. ఆ సినిమా తర్వాత ఈ కవితకు వచ్చిన పాపులారిటీ అంతాఇంతా కాదు. అందర్నీ బాగా నవ్వించింది. ఇప్పటికీ నవ్విస్తోంది..” అని ముగించారు దివాకర్‌బాబు.
ప్రస్తుతం మణికొండలో కొత్తగా కట్టుకున్న ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారాయన. సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ విశ్రాంత జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. ‘మీరు ఇప్పుడేమీ రాయడం లేదా’ అంటే ‘ప్రతి మనిషీ ఒక చోట ఆగాల్సి వస్తుంది. అది ఎవరికైనా తప్పదు. ఇప్పుడొస్తున్న సినిమాలకు మాలాంటి వాళ్లం రాయలేము. బూతులు అసలే రాయలేను..” అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారీ సక్సెస్‌ఫుల్ డైలాగ్ రైటర్.
ఇంటర్వ్యూ: మల్లెంపూటి ఆదినారాయణ
“కళ్లు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ల కూడదు. మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు”
ఈ డైలాగ్ ఏ మూవీలోనిదో తెలియ చేయగలరు .