బ్రాహ్మణాల కదా కమామీషు -4
బ్రాహ్మణాలలో రాజులు
మిధిల రాజు జనక మహా రాజు గురించి శత పద బ్రాహ్మణం లో ఉంది .ఆయన సభలో ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చేవి .ఒక సారి సభలో ‘’అగ్ని హోత్రం చేసే విధానం ఏమిటి ?అని ప్రశ్నించాడు .శ్వేతకేతువు ,సోమ శుష్ముడు ,యాజ్న్య వల్క్యుడు తోచిన సమాధానం చెప్పారు కాని రాజు సంతృప్తి చెందలేదు .కానిముగ్గురిలో యాజ్న్య వల్క్యుడు చర్చను బాగా నిర్వహించినందుకు వెయ్యి గోవులను బహుమానం గా ఇచ్చాడు .కాని ‘’అగ్ని హోత్ర తత్త్వం యాజ్న్య వల్కుడికీ సరిగ్గా బోధ పడలేదు ‘’అని చెప్పి సభ చాలించేశాడు జనకుడు .మిగిలిన ఇద్దరు ఋషులు జనకుడు పరి పూర్ణ జ్ఞానం తో తమను నిరుత్తరుల్ని చేశాడనుకొన్నారు .దీనికి ప్రతీకారం చేయాలని ఆలోచించి జనకు డిని బ్రహ్మ తత్వ విచారం లోకి దించాలను కొంటే యాజ్న్య వల్క్యుడు ఒప్పుకో లేదు .జనకునితో వాదానికి దిగి గెలిచినా ఓడినా తమకే అవమానం అన్నాడు .అగ్ని హోత్రం నిజ విజ్ఞానాన్ని జిజ్ఞాస తో ఒంటరిగా తెలుసుకొని జనకునికి వివరించి విజయం సాధించాడు .మహా రాజైన జనకుడు ఎంత తత్వ వివేక సంపంన్నుడో మనకు తెలుస్తుంది ..జనకుడు సత్యకామ జాబాలి కి ముఖ్య శిష్యుడు .
వ్రతర్దనుడు అనే రాజు యజ్న విధానాన్నిగురించి యాజకులతో చర్చించి నట్లు కౌశీతకీ బ్రాహ్మణం లో ఉంది .ప్రవాహ జైవాలి అనే పాంచాల రాజు శ్వేత కేతువు కు సమకాలికుడు .ప్రవాహ జైవాలి, శీలా కశా వత్యుడు ,చైకితాన దాల్భ్యుడు అనే ఇద్దరు క్షత్రియులతో వాదం చేసినట్లు ఛాందోగ్యం చెబుతోంది .దాల్భ్యుని సోదరులు బక దాల్భ్యుడు జైమినీయ బ్రాహ్మణం ,చాన్దోగ్యాలలోను కేశి దాల్భ్యుడు కౌశీతకి బ్రాహ్మణం లోను కనిపిస్తారు.ఈ ముగ్గురి తల్లి ఉచ్చైశ్ర వసుడు అనే కౌరవ రాజు సోదరి .తండ్రి శాతానీకుడు .వీరందరి ప్రసక్తి జైమినీయ బ్రాహ్మణం లో ఉన్నది .
ద్రుపద మహా రాజు కూడా యాగ చర్చ చేసినట్లు అతని బిరుదు ‘’యాజ్ఞ సేనుడు ‘’’ద్వారాను ,అతనికుమారు లైన ‘’సుత్వా యాజ్ఞ సేనుడు ‘’,శిఖండి యాజ్ఞ సేనుడు ‘’ద్వారా తెలుస్తోంది .ద్రౌపదికి యాజ్ఞా సేన అనే బిరుదున్న సంగతి తెలిసిందే .వీరంతా యాగ తత్వజ్నులే ,కేశి దాల్భ్యుని సమకాలికులే .జీవల చైతకి ,ప్రాచీన శాల ,ఔపమన్యువు ,సత్య యజ్న పౌలుషి ,బుడిలఅశ్వత రాశ్వి మొదలైన క్షత్రియులు ఉద్దాలక ఆరుణి తో చర్చ చేసినట్లు చాన్దోగ్యమే చెప్పింది .జీవాల కారి ,ఆశాఢ సావయసుడు ,అనే ఇద్దరు క్షత్రియులగురించి కూడా జైమిని బ్రాహ్మణం లో ఉంది .జనక మహా రాజు సమకాలికులైన బార్కు వార్షుడు ,ప్రియ జాన శ్రుతేయుడు ,ల విషయం కూడా ఇందులోనే కనిపిస్తోంది .సుదక్షిణ క్డైమిఅన్న క్షత్రియుడు జనకుని తో ‘’స్తోమ ‘’శబ్దార్ధాన్ని చర్చిన్చాడని తెలుస్తోంది .
కౌశీతకీ ,జైమిని బ్రాహ్మణాలలో కోసల రాజు బ్రహ్మ దత్త ప్రాసేన జితుడి సమకాలికులైన హిరణ్మయ కుషణుడు ,ఇటన్ కావ్యుడు బ్రహ్మ దత్త చైకితానుల గురించి ఉన్నది .పర ఆహ్నర అనే కోసల రాజు ను గురించి,సమీస్వాహుడు అనే మరొక రాజు గురించి తాండ్య బ్రాహ్మణం ,శత పదాలలో ఉన్నది .’’సులభా ‘’అనే క్షత్రియ స్త్రీ జనక మహా రాజు తో ఆధ్యాత్మిక విషయ చర్చ చేసి నట్లు కనిపిస్తోంది ఈమె మైత్రేయి కావచ్చు .ఈమె పేర ‘’సౌలభ బ్రాహ్మణం ‘’ఉండేది అని కాశికా వ్రుత్తి లో చెప్ప బడింది కాని కాలం లో కలిసి పోయి కని పించ లేదు .వీరందరి గురించి తెలియ జెప్పిన బ్రాహ్మణాలు వీరిని ‘’బ్రాహ్మణులు ‘’అని శ్రేష్ట వాచకం తో పేర్కొనటం వారికి ఉన్న ఆధ్యాత్మిక ప్రావీణ్యానికి ,సంఘం లో వారి పలుకు బడికి ,ప్రతిస్థ కు నిదర్శనం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-6-14-ఉయ్యూరు