ఎ (వి)లక్షణీయం

ఎ (వి)లక్షణీయం

నలబ్భై మూడు డిగ్రీల వేడిలో మా బామ్మర్ది బ్రహ్మం చెమటలు కక్కుకొంటూ ,ఆపసోపాలు పడుటూ జేబు రుమాలతో తుడుచుకొంటూ ,ఆవేశం గా లోపలికొచ్చి వాళ్ళక్కయ్య  హాయ్ చెప్పి ఆవిడిచ్చిన సుగందిపాల తాగి నా దగ్గరకొచ్చి కూల బడ్డాడు  . నేనేదో చానల్ లో  మోడీ మాటలు వింటున్నాను .వాణ్ని పట్టించుకోలేదు .యెంత సేపు నోరు మూసుకు కూర్చుంటాడు పాపం వాడే పలకరించి మొదలు పెట్టాడు ‘’ప్రజలు ఇంత దారుణం చేస్తారని ఊహించ లేదు బావో ‘’అన్నాడు ఎత్తుకొంటూనే .’’ఏమైందిరా ఏదో కొంపలు మునిగి పోయినట్లు ఆ వెధవ యేడుపేమిటి?’’అన్నాను చిరాగ్గా .’’అదేమిటి? /వందేళ్ళ కాంగ్రెస్ ను ఒక’’ టీ అమ్మే’’ వాడు కూకటి వ్రేళ్ళతో పెకలించి పారేస్తే నీకీమీ చీమ కుట్టినట్లుకూడా  లేదా బావా?’’అన్నాడు .’’ఎవరు తీసుకొన్న గోతిలో వారే పడుతారు అనే సామెత తెలుసా?’’అన్నా .తెలుసు దానికి దీనికీ లంకేంటి ?అన్నాడు .’’అవున్రా రెండేళ్ళ నుంచీ పేపర్లూ చానెళ్ళు నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నాయికదా కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా పోతుందని ,వాళ్ళు చేసిన అక్రమాలూ అవినీతి లంచ గొండితనం కుంభకోణాల బరువు పాపాల పుట్టా అక్రమాల చిట్టాతో నిలువు లోతు గోతిలో పడిపోతారనీ ఎవ్వరూ కాపాడలేరనీ ?’’అన్నాను మండి .’’పాపం బుద్ధి మంతుడిలా తలా తోకా ఆడిస్తూ మౌన పరబ్రహ్మ లా రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని నిర్వికార నిరాకార బ్రహ్మలా’’ సోనీ జపం చేస్తూ’’ ఉండే ఆర్ధిక శాస్త్ర వేత్త నాయకత్వానికి ఇంతపరభావమా నేను భరించలేను బావా “?అని ఏడ్చి నంత పని చేశాడు .’’ఒరే బ్రాహ్మీ !పిల్లి కళ్ళు  మూసుకొని పాలు తాగుతుంటే జనం చూడ టం లేదనుకొంటే ఎలా నాయనా “”?అన్నాను .’’ఈ సామేతేమిటో విడమర్చు’’ అన్నాడు .’’అన్ని అక్రమాలు జరుగుతున్నా ద్రుత రాస్త్రుడి లాగా గుడ్డిగా కిమిన్నాస్తి గా ఉండిపోతే ప్రజలు ఎంతకాలం సహిస్తారు?’’అన్నాను .’’అర్ధం కాలా ‘’’’అన్నాడు నోరెళ్ళ బెట్టి  దూర దర్శాన్ యాడ్ లో రైతు భార్యలాగా .’’’’దేశానికి నాయకత్వం వహించే నాయకులే కరువైనారు .సోనియా కరుణా కటాక్షాలు ఇక పని చేయవని అందరికి తెలిసి పోయింది .కనుక ప్రత్యామ్నాయం కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు .అవకాశం వచ్చింది .గుద్ది పారేశారు. చెత్తను ఊడ్చేసి అవతలకు తోసేశారు .ప్రజల ఓపికా సహనం కొంతకాలమే .దాటితే కోట్లు ఖర్చు చేసినా ఓట్లు రాలవు .ఇదీ భారత ప్రజాస్వామ్యం లో ఓటరు మహాశయుడు సరైన సమయం లో కొట్టిన చెంప దెబ్బ .’’అన్నాను .’’చెత్తా –ఊడుపు ‘’అన్నావు మరి ఆ చీపురు ఆయనా ఊడ్చుకు పోయాడుగా ?అన్నాడు అవున్రా కేర్జీవాల్ పై ఏదో క్రేజీ ఉందనుకొని భ్రమ పది దిగాడు .దిల్లీలో కాంగ్రెస్ ను అంతకాగి నిప్పులు తొక్కినా కోతిలా రోజుకో మాట మాట్లాడి నమ్మకం పోగొట్టుకొన్నాడు తనకు ఆలిండియా శీను లేదని తెలుసుకో లేక పోయాడా చీపురు కట్టాయన అందుకే దాన్నీ ఆయననూ ఊడ్చిపారేశారు ‘’అన్నాను

‘’సరేకానీ !రాహుల్ ఉన్నాడు ,ప్రియాంకా ఉంది వీళ్ళు కూడా ఏమీ ఊప లేక పోయారేమిటి?’’అన్నాడు ‘’.అవతల వాడు సరైన వ్యూహం తో ,వాగ్దాటితో దేశ ప్రయోజనమే లక్ష్యం గా ,సార్వభౌమాదికారమే ధ్యేయం గా ,పార్టీని ప్రజల్ని ఒప్పించి ప్రేరణ కలిగించి యువతలో ఆశలు కల్గించి ఈ అవినీతి భ్రస్టు కుళ్ళు పట్టిన వ్యవస్థను పునాదులతో సహా కూల్చి పారేస్తేకాని భవిష్యత్తు లేదనే నమ్మకం కలిగించాడు .దాన్ని నమ్మారు అతని సమర్ధతను నమ్మారు అతని వాగ్ధాటికి ముగ్ధులయ్యారు అంతే ఇంక వాళ్ళకేమీ కానీ పించలా .కొండలు దూది పిందేలైపోయాయి. గడ్డిపరకల్లా ఖాదీ షరాబులు ,శాల్తీలు యెగిరి పోయారు .తిరుగు లేని మేజార్టీనిస్తే కాని ఇక లాభం లేదని బి జే పి కే పార్టి మేజార్టీనిచ్చి చరిత్ర సృష్టించారు .ఇది ప్రజా విజయం .నాయక గణ అధికార గర్వ ఖర్వం ‘’అన్నాను .’’బావా !మోడీ పూనిన వాడిలాగా ఆ ప్రవాహ ఝారి ఏమిటి ?నాకే ఆశ్చర్యమేస్తోంది నిన్ను చూస్తుంటే “”అన్నాడు .’’చరిత్ర పునరావ్రుత్తమౌతతుంది అంటారు తెలుసా .ఇందిర ఎమర్జెన్సి పెట్టినప్పుడు ఎందరు పెద్దలు చెప్పినా పేడ చెవిని పెడితే జయ ప్రకాష్ నారాయణ నేతృత్వం లో జనతా పార్టీ ఏర్పడి ఇందిరా గర్వాన్ని నాశనం చేసి ఆసేతు హిమాచలం ఓట్లతో జనతాకు జనతా జనార్దానుడైన జయ ప్రకాష్ కు అధినాయకుడైన మొరార్జీ భాయ్ కి పట్టం కట్టారు .ఇప్పుడూ అదే జరిగింది .మోడీ నే దేశ సంరక్షకుడు అనే నమ్మకమే గెలిపించింది .పార్టీకూడా అతాని అడుగు జాడల్లో నడిచింది.ఆద్వానీ అలిగినా జస్వంత్ బీరాలు పోయినా నితీష్ ‘’ఇష్ ఇష్ ‘’అన్నా లాలూ చేతుల దగ్గరికి కాళ్ళ బేరానికి వెళ్ళినా ఎవరి పప్పులూ ఉడక లేదు . ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ భేదమే కనీ పించలేదు .హిందూత్వం ఆక్రమిస్తుందని గుండెలు బాడుకొన్న కమ్యూనిస్టులకు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ ను రాహుల్ పుట్టిన రోజు కానుకగా ననభై నాలుగు సీట్లకే పరిమితం చేశారు .’’అన్నా.  ‘’బావా ! నీ ఉద్రేకం చూస్తుంటే భయమేస్తోంది .’’అన్నాడు బ్రాహ్మి .

‘’మనరాస్త్రం లో తెలంగాణా ఇచ్చినా కొంప  కోల్లేరయ్యిన్దెం?’’అని వాడి ప్రశ్న .’’పార్టీని కలిపెస్తాడని గులాబీ రంగు ఆయన తో ,పార్టీకి అండగా ఉంటాడని లక్ష కోట్ల అవినీతి ఆయన్ను జైల్లోంచి తప్పించి బెయిలిప్పించి కేసులు మాఫీ ప్రయత్నం చేస్తే జనం గుడ్డిగా నమ్ముతారా ?విభజన ప్రక్రియ సవ్యం గా జరిపించార? తెలుగు రాని’’ చేవటాయల ‘’పెత్తనం తో క్రూరం గా హీనం గా హేయం గా చీల్చి పబ్బం గడుపుకొన్నారు .గులాబీ ఆయన దిల్లీలో గులాబి పూలిచ్చి ఇక్కడికొచ్చి ముళ్ళు గుచ్చాడుకంటిలో .అసలాయన్ను ఆయన భార్యే నమ్మదంటారు మరి కాంగీ అధినాయక గణం యెట్లా నమ్మిందో ?/జగనూ శీను అర్ధం చేసుకొని దూరం గా జరిగి స్వంత బాణీ వాణీ మొగిన్చేసరికి బిత్తర పోయారు .రెండు పక్కలా వాచి పోయింది. ఆంధ్రాలో అడ్రస్ గల్లంతు తెలంగాణలో చావు తప్పి కన్ను లొట్టా .బీరాలు పలికే రఘు వీరా ,జలయజ్ఞం లో ‘’తెల్ల  పంచ కట్టాయన ‘’కు తోడ్పడి కోట్లు నోక్కేశాడని చెప్పుకొనే పొన్నాల నాయకత్వం పై ప్రజలకు విశ్వాసమే లేదు .పార్టీ గుర్తు తో పోటీచేసి భస్మాసుర హస్తం పెట్టుకొన్నారు .ఆంధ్రాను పునర్నిర్మించే ధైర్యం ఓపికా సాహసం వ్యూహం ఉన్న వాడు చంద్ర బాబే అని నమ్మి ఎక్కించారు అనుమానం  లేకుండా. దీనికి మోడీ ‘’పవనమూ’’తోడైనాయి అని నా జవాబు .. ‘’బావోయ్ !నువ్వు చాలా ఆవేశం గా ఉన్నావ్ అక్కనడిగి .కాస్త మజ్జిగ తెచ్చిస్తా కూల్ బావా కూల్ ‘’అని లోపలి కెళ్ళి వాడూ పుచ్చుకొని నాకూ తెచ్చిచ్చాడు .

‘’ కొత్త ప్రభుత్వాలు ఎలా పని చేస్తున్నాయి బావా ?’’ ‘’ప్రారంభం అదిరింది .మోడీ చాలా హుందాగా ఉన్నాడు సమర్దుల్నే పెట్టుకొన్నాడు .కాని ‘’ముండే ‘’మరణం పార్టీ కి ఇబ్బందే .కెసిఆర్ లో ఉద్రేకం తగ్గలేదు ‘’పందెం కోడి’’ గా వ్యవహరిస్తున్నాడు .ప్రతిదానికీ ‘’లొల్లి ‘’చేయటం ముఖ్య మంత్రికి తగదని పిస్తోంది .బాబు లక్షలాది జనం మధ్యలో ప్రమాణం చేయటం నాకు అంత నచ్చ లేదు .అత్యుత్సాహం అని పించింది .కోడెల సమర్దుడే కాని స్పీకర్ హోదాకు తగిన హుందాతనం ఉన్నవాడని నేననుకోను .నోటి తొందర మనిషి .కాని బుద్ధప్రసాద్  ఆశ్చర్యం గా డిప్యూటీ స్పీకర్ అవటం అందరికీ ఆనందం కలిగించే విషయమే .అజాత శత్రువు గా పేరున్నవాడు .కాని ఆయనకు సాంస్కృతిక రంగం పై అధికారం ఇచ్చి ఉంటె ఇంకా బాగుండేది .ఆయన తెలుగు దేశం లో చేరిన రాత్రి నేను ఫోన్ చేసి అభినందించి త్వరలో మంత్రి కావాలని కోరుకొంటున్నానని చెప్పాను. మళ్ళీ డిప్యూటీ అయిన రోజు ఫోన్ చేసి అభినందించి నేను అనుకొన్నది జరిగింది అన్నాను నవ్వుతూ నిజమే నన్నారు .’’

‘’డబ్బా ఆపి భవిషత్ గురించి చెప్పు బా ‘’అన్నాడు .’’ఏముందిరా .మోడీ అయినా బాబైనా గులాబీ ఆయన అయినా ప్రతి అడుగు జాగ్రత్త గా వేయాలి .అఫెన్స్ లో ఉండాలేకాని డిఫెన్స్ లో పడరాదు ‘’అనగానే ‘’అంటే’’అన్నాడు .’’బడ్జెట్ ముందే రైలు చార్జీలు భారీగా పెంచటం మంచిదికాదు .దీని వల్ల మోడీ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది .అది సత్ సాంప్రదాయం కాదు .కొంత సమయం తీసుకొని ఉండటమో కొద్దిగా పెంచట మో  చేసి ఉండాల్సింది .’’అనగానే ‘’నల్ల ధనం మాట ఏమిటి బా ?’’అన్నాడు .’’అది ‘’అంత వీజీ ‘’కాదు .వాగ్దానాలకు ఆచరణకూ ఎప్పుడూ అంతరం ఉంటుందని గుర్తించాలి .’’అన్నాను .’’రుణ మాఫీ’’? మళ్ళీ ప్రశ్న ‘’తప్పక చేయాల్సిన అంశమే దీనికి బ్యాంకులు కేంద్రమూ పూర్తిగా సహకరించాలి .అప్పుడే సాధ్యం .’’అన్నాను .’’జగన్ భవిష్యత్తు ‘’?అడిగాడు .’’మంత్రి వర్గ ఉప సంఘం వేశారు కేసులు మళ్ళీ తెరుస్తారు .పాపం హైదరాబాద్ రావాలన్నా బెజవాడ రావాలన్నా కోర్టు పర్మిషన్ తప్పదేమో .అదీగాక ‘’అదిగో వచ్చేస్తున్నాడు ‘’అని చర్లపల్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారని చానెళ్ళలో పత్రికలలో కార్టూన్లు కూడా చూశాం కదా ‘’అన్నాను .’’చెప్పులాయన సంగతి ?’’అని అనుబంధ ప్రశ్న .’’పాపం మునిగాడు ముంచారు కూడా పార్టీ వాళ్ళు .ప్పుడు ఏ పార్టీ చెప్పులూ లేకుండా తిరుగుతున్నాడు  ‘’సుప్రీం కోర్టులో  విభజన పై కేసు ?’’ఇంకో లకోటా .’’కేసు అయితే వేశారు కాని డబ్బులు పెట్టి ఎవరు కేసును ముందుకు నడిపిస్తారో తెలియటం లేదు .జరగాల్సిన విభజన అయ్యే పోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు .దీన్ని మళ్ళీ చుట్ట చుట్టేయటం సాధ్యమా ‘అని పిస్తుంది చూద్దాం కాలమే తేల్చాలి దీన్ని ‘’అన్నాను.

‘’ ఇటలీయమ్మ’’ సంగతి ?మరో ప్రశ్న .బి జెపి ,టిడిపి జాగ్రత్తగా పని చేస్తే కాంగీని,సోనియాను అటు దేశం లోను ఇటు రాష్ట్రం లోను మార్చే పోతారు .కాంగ్రెస్ కు తులసి తీర్దానికి స్టేజి దాటి పోయింది .  తమిళనాడు ,బెంగాల్ లాగా ఆంధ్రా లోను అడ్రస్ ఉండదు .కాని అంత జాగ్రత్తగా ఉంటారా అని అనుమానం .ఆద్వానిజీ కి రాష్ట్రపతి యోగం ఉంది .దానికింకా టైం ఉంది .అది దక్కితే సమస్యలుండవు .ఇక్కడ కాన్గీకి జగనే గతి .వదిలి పోయిన వారు పోగా మిగిలిన వారిని సోనియా ఇవాళ కాక పొతే రేపు లాగేసు కొంటుంది .అప్పుడే దానికిక్కడ గతి .కమ్మీలు ఇక ప్రజా జీవితం లో చెల్లు బడి కారు .’’.చిరు విషయం ‘’అన్నాడు .’’తనను బల వంతం గా కాన్గీలో కలిపేసుకొన్నందుకు ‘’టిట్ ఫర్ టాట్’’గా దగ్గరుండి ప్రచారం చేసి మరీ ఓడించానని స్వగతం చెప్పుకొంటున్నాడని విన్నాను. అదీ నిజమేనేమో నని పించింది ‘’.  అనగానే బ్రాహ్మి బుర్ర వేడెక్కి లోపలి కెళ్ళి చెంబేడు ఐసు నీళ్ళు తాగి నాకు కనపడకుండా అదే పోత పోయి జంప్ జిలానీ అయ్యాడు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.