సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )

వాల్మీకం లో మహర్షి కధా గమనానికి ఎన్నుకొన్న పాత్రలు, అవి నిర్వహించే పాత్రా  చూస్తె అత్యాశ్చర్యమేస్తుంది .జటాయు పక్షి మానవ మాత్రులైన రామ లక్ష్మణులకు సీత జాడ చెప్పి గొప్ప మేలు చేశాడు .అతని అన్న సంపాతి సీతాన్వేషణలో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయి అతన్ని  ఉత్తి చేతులతోదర్శించటానికి భయపడి  నిస్పృహతో ప్రాయోప వేశం చేస్తున్న వానరులకు మార్గ దర్శనం చేసి  జటాయువు  సాయపడ్డాడు .ఈ వివరాలను వాల్మీకి మహర్షి కిష్కింద కాండలో వర్ణించాడు .

సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తీ అయి అతనికి భయపడి బాబాయిని నానా మాటలు అంటాడు అంగదుడు .వానర సైన్యాన్ని పెడమార్గం పట్టించి ,సుగ్రీవునికి ఎదురు నిలిచేలా చేలని మనసులో ఆలోచనా చేశాడు .ఈవిషయం సూక్ష్మగ్రాహి అయిన హనుమ గ్రహించాడు . అంగ దుడికి నయానా భయానా చెప్పి తప్పు మార్గం లో నడవద్దని హెచ్చరించాడు .వానరులెవరూ అతన్ని అనుసరించరని గట్టిగానే చెప్పాడు .ఇవన్నీ  యువరాజు మనసు మార్చలేక పోయాయి .పిన తండ్రి కి స్థైర్యం పారిశుధ్యం ,సౌమ్యత ,సౌజన్యం ,సామర్ధ్యం వంటి సద్గుణాలు లేవన్నాడు అంగదుడు .తల్లిలాంటి వదిన తార తో కాపురం చేసిన వాడికి ధర్మం ఏమి తెలుసన్నాడు  .రామ కార్యం లో ఆలస్యం చేసిన సోమరికి  కార్య శూరత్వం తెలీదన్నాడు .ధర్మానికంటే లకష్మణుడి కోపానికి భయపడి సీతాన్వేషణకు వానరుల్ని పంపాడని  ,తనకు పట్టం కట్టడని చెప్పి  కిష్కింద కు  రానని భీష్మించాడు .తనకోసం తల్లి తార విలపిస్తూ ఉంటుందని గుర్తు చేసుకొని దర్భలు పరచి ఆమరణ నిరాహార దీక్ష కు పూను కొన్నాడు .హనుమ అంతకు ముందే వానరుల్ని యువరాజుకు సాయం చెయ్యద్దని చెప్పినా కొద్దిమంది  అంగదుడి తో పాటు నిరాహార దీక్షకు కూర్చున్నారు.ఊరికే కూర్చోక జరిగిన విషయాలు అంటే శ్రీరామ వన వాసం ,సీతాపహరణం ,జటాయువధ విషయాలను ఏడుస్తూ పాటల్లాగా పాడుకొంటున్నారు .బిగ్గ్గరగా కేకలు పెడుతున్నారు .ఆర్త నాదాలు చేస్తున్నారు .

ఈ ఆర్తనాదాలు అక్కడే పర్వత గుహలో ఉన్న సంపాతికి వినిపించాయి .అందులే తన తమ్ముడు జటాయువు పేరుకూడా వినపడటం తో మరీ కంగారు పడ్డాడు .అసలే ముసలితనం రెక్కలు తెగి పోయాయి.ఆహర సంపాదన లేక చిక్కాడు .ఇంతమందిని చూడగానే మంచి  ఆహారం చాలా రోజులకు సరిపడ్డ ఆహారం దొరికిన్దికదా అని సంబర పడ్డాడు .సంపాతి పక్షి అక్కడ ఉండి తీక్ష్ణ దృష్టితో తమల్ని గమనించటం అంగదుడు చూశాడు .కిష్కింధకు వెళ్ళలేడు ,రామ కార్యం సాధించానూ లేడు ఇప్పుడు ఈ పక్షికి బలికావలసి వస్తుందేమోనని భయపడి హనుమకు చెప్పాడు .తమ్ముడు జటాయువు రావణుడి చేతిలో చంపబద్దాడని విని వివరం తెలుసు కొందామనుకోన్నాడు కాని కదల లేడు మెదల లేడు .కిందికి దిగలేకపోయాడు .జటాయు వృత్తాంతం తెలుసుకోవాలని ఉన్న తనను దింపమని వేడుకొంటాడు .రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వేరవటం దేనికి అని అంగదుడు సంపాతిని వానర సాయం తో కిందికి దింపుతారు .

వానరుల వల్ల  తానూ బతికుండగానే తన తమ్ముడు చని పోయిన వార్త విని తల్లడిల్లాడు .ముసలితనం వలన తానేమీ పోరాడలేనని వాక్కు సాయం మాత్రం చేస్తానని వారికి చెప్పాడు .రావణుడుడు ఉండే చోటు చెబితే చాలు అన్నాడు అంగదుడు .తన కధను చెప్పుకొస్తాడు సంపాతి .పూర్వం తమ్ముడు జటాయువుతోకలిసి స్వర్గానికి వెళ్తాడు తిరిగి వస్తుంటే సూర్య కిరాణ తాపం బాగా హెచ్చుగా ఉంటె తమ్ముడు తట్టుకోలేక అల్లల్లాడుతుంటే తాన రెక్కల కింద అతడిని ఉంచుకొని కాపాడాడు దానితో ఆ సూర్య ప్రతాపానికి సంపాతి రెక్కలు కాలిపోయాయి . సంపాతి  వింధ్య పర్వతం పైన పడిపోతే ,జటాయువు జనస్థానం లో పడిపోయాడు .అప్పటినుంచి ఒకరి సంగతి మరొకరికి తెలియదు .కాని సంపాతికి దూర దర్శన శక్తి మాత్రం ఉంది .ఆ విషయాన్ని వివరిస్తాడు .ఆకాశం లో అనేక మార్గాలున్నాయని ,పిచ్చుకలు ,పావురాళ్ళు మొదటి వలయం లోనే సంచరిస్తాయని తర్వాత కాకులు  ఆ తర్వాత ,క్రౌంచ పక్షులు  ఆ తర్వాత ,డేగలు ,తర్వాతా గద్దలు  తర్వాతా హంసలు ,అన్నిటికంటే పైన వైన తేయులు విహరిస్తాయని ,పక్షులు వైన తేయ సంతతికి చెందినవని ,ఎవరి ఆహరం ఎక్కడ ఉంటె అక్కడికి వాటి ద్రుష్టి ప్రసరిస్తుందని గృధ్ర జాతికి శత యోజనం వరకు చూసే ద్రుష్టిశక్తి  ఉందని చెప్పాడు .తేరిపార చూసి లంకలో రావణాసురిడి అశోక వనం లో రాక్ష స స్త్రీల మధ్య సీతా దేవి ఉందని ,శత యోజన విస్తీర్ణ సముద్రం దాటితేనే సీతాదేవి కని పిస్తుందని అనునయంగా చెప్పాడు. అమ్మయ్యా దారి దొరికింది ప్రాణాపాయం తప్పింది అని అందరూ సంతోషపడి క్రుతజ్ఞతలు చెప్పారు .

తన తమ్ముడు జటాయువుకు ధర్మోదకాలివ్వాలనే కోరిక తనకు కలిగిందని సంపాతి అనగానే కృతజ్ఞత గా వానరులు నెమ్మదిగా మోసుకొని వెళ్లి సముద్ర తీరం వద్ద దించారు .తమ్ముడికి ధర్మోదకాలు వదిలిన అన్నను మళ్ళీ మోసుకొని వెళ్లి గుహలో చేరుస్తారు .జాంబవంతుడు సీతాపహరణ వృత్తాంతాన్ని తెలిసి నంత వరకు చెప్పమని సంపాతిని కోరాడు .అప్పుడు సంపాతి తన కొడుకు సుపార్శ్వుడు రావణుడు సీతను ఎత్తుకు పోతుండగా చూశాడని ,అతనితో పోరాటం కూడా చేశాడని ,తనకు రోజూ ఆహారాన్ని కొడుకే సంపాదించి తెచ్చిస్తాడని ఒక రోజు  ఆహారం  దొరక్క సముద్రం దగ్గరకు వెడితే సీతను ఎత్తుకు పోతున్న రావణుడిని చూశాడని ,వాల్లిద్దరినిఆహారం గా  గ్రహించటానికి సిద్ధపడితే రావణుడు దీనం గా బ్రతిమిలాడితే వదిలి పెట్టాడని ,ఆ విషయం తనకు చెప్పగానే కొడుకును కోపగించానని చెప్పాడు .సంపాతి చెప్పిన విషయాలు వానరులలో నిస్తేజాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని కల్గించాయి .సంపాతి చరిత్రను తెలుసుకోవాలని అడిగితే పూస గుచ్చినట్లు వివరించాడు .

వింధ్య పర్వత ప్రాంతం లో ‘’నిశాకరుడు ‘’అనే  దివ్య ద్రుష్టి ఉన్న మహర్షి ఉన్నాడని ,ఆయన మహిమతో తనకు రెక్కలూ చూపు రావచ్చుననే ఆశతో ఆయన్ను దర్శించానని తన చూపు పోవటానికి కారణం మహర్షి అడిగితే సవివరం గా చెప్పానని సంపాతి వివరించాడు. మహర్షి దివ్య దృష్టితో చూసి జరుగ బోయే  రామ కదను వివరించి ,సీతాన్వేషణ లో ఉన్న వానరులకు వాక్సహాయం చేస్తే మళ్ళీ రెక్కలోస్తాయని చెప్పాడని అన్నాడు .మహర్షి తాను సీతా రామ లక్ష్మణుల వన వాసం ,సీతాపహరణం రావణ ప్రలోభం ,సీత సంయమనం ,దివ్య పాయస భక్షణం ,రామ లక్ష్మణులకు నివేదించిన తర్వాతే తాను ఆరగిస్తానని చెప్పాడు సంపాతికి .తనకున్న తపో బలం తో సంపాతికి అప్పటికప్పుడే రెక్కలు వచ్చేట్లు చేయగలడు కాని రామ కార్యం లో సంపాతికి కూడా సంబంధం కలిగించాలని అలా చేయటం లేదని మహర్షి సంపాతికి వివరించాడు .తనకు కూడా రామ లక్ష్మణులను చూసి తరించాలని ఉన్నా అంతదాకా ప్రాణాలను కాపాడుకోలేనని మహర్షి అంటాడు .కాని తన ప్రభావం వల్ల సంపాతి శరీరం అంతవరకు నిలబడి ఉంటుందని అభయమిస్తాడు .

మహర్షి మాట నమ్మి సంపాతి ఎనిమిది వేల సంవత్సరాలు శరీరాన్ని కాపాడుకొంటూ ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాని వానరులకు తెలియ జేశాడు .ఇలా సంపాతి తన కధను వివరించి చెప్పుతున్డగానే అతని ఎర్రని  రెక్కలు  మళ్ళీ మొలుస్తాయి .యెగిరి చూసి సంతోష పడతాడు .ఇది శుభ లక్షణమని సీతాన్వేషణ ఫలి స్తుంది అని చెప్పటానికి కిది నిదర్శనమని భరోసా ఇస్తాడు .కోల్పోయిన పౌరుషం వానరులకు తిరిగి వస్తుంది .కృత నిశ్చయం తో సీతాన్వేషణకు దక్షిణ దిక్కుకు బయల్దేరి వెడతారు .ఇక్కడ ఒక తమాషా సంగతి గమనించాలి .సంపాతి మాట్లాడినంత సేపు హనుమ మౌనం గా ఉండిపోతాడు .ఇది విచిత్రం గా కని పిస్తుంది .మరో విశేషం  సంతాపాన్ని సంతోషం గా తాను మార్చుకోవటమేకాకుండా వానరులకూ కలిగించాడు ఆ అను భూతి .అంతకు ముందు స్వయం ప్రభ గుహలోకి ప్రవేశించిన వానరులను స్వయం ప్రభ ఎందుకు వచ్చారని అడిగితే రామ వృత్తాంతాన్ని చెప్పారు వానరులు .అక్కడ ఆమె కూడా ఏమీ ప్రశ్నించకుండా విన్నది .మౌనం లో ఎన్నో అర్ధాలను వెతుక్కో వచ్చని మహర్షి అభిప్రాయమేమో ?

రామ కార్యం లో వానరులతో పాటు పక్షిజాతికి చెందిన అన్న దమ్ములు జటాయువు ,సంపాతి సహకరించటం విశేషం .

ఆధారం –డాక్టర్ ఇలపావులూరి పాండురంగా రావు గారి –అనుదిన రామాయణం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు

.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.