బ్రాహ్మణాల కదా కమా మీషు -13
తాండ్య బ్రాహ్మణం
సామ వేదం లోని ‘’కౌదుమ శాఖ ‘’కు చెందినదే తాండ్య బ్రాహ్మణం .దీనిలో ఇరవై అయిదు అధ్యాలున్డటం చేత పంచ వింశ బ్రాహ్మణమనీ పేరుంది .తండి మహర్షి దీనికి ప్రవర్తకుడు కనుక ఆపేరోచ్చింది . చివరి రెండు ఖండికలను ‘’అద్భుత బ్రాహ్మణం ‘’అంటారు .తాండ్యానికి అద్వితీయ స్థానం ఉంది .180యాగాల నిర్వహణ వివారా లిందులో ఉన్నాయి .కురుక్షేత్రానికి దూరం గా ఇది వర్ధిల్లిందని భావన .క్రీ పూ.ఎనిమిదవ శతాబ్దికి చెందినదిగా భావిస్తున్నారు .యజ్న యాగాది విషయాలు వివరిస్తూనే మధ్యలో అనేక లౌకిక విషయాలను ఈ బ్బ్రాహ్మణం చెప్పింది .విద్యా సంపన్నుడైన అతిధి ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఎవరూ కూడా మనసు నొప్పించే మాట మాట్లాడకూడదు .అతిధి మనసుకు నొప్పికలిగితే ఆతిధ్యం వ్యర్ధమౌతుందని తెలిపింది .కర్మకాండకు, దార్మికతకు బాగా తోడ్పడింది .
సత్ర యాగాలు రెండు రకాలు .పన్నెండు నుంచి వంద రోజులు చేసేయాగానికి రాత్రి సత్రమని ,వంద రోజులు దాటిన దాన్ని అయన సత్రమనీ అంటారు .గీత బద్ధం గా ఋక్కులను గానం చేస్తే స్తోత్రమని ,గీత రహిత రుక్కుల్ని ‘’శస్త్రమని ‘’అంటారు .సామ వేదాధ్యాయి అయిన ఉద్గాత స్తోత్రం చేస్తాడు .రుగ్వేదాధ్యేత అయిన హోత మంత్రోచ్చారణ చేస్తాడు ,సామ వేదం నేర్చిన ఉద్గాత ఋక్కులను గానం చేస్తే స్తోత్రం అవుతుంది .సామగానానికి ఉద్గాత ,స్తోత ,ప్రతి హర్త ,సుబ్రహ్మణ్యుడు అనే నలుగురు రుత్విక్కులుంటారు .మూడు డరుక్కులకు ఒక సామ గానం చేయాలి .ఇవి ఇరవై ,లేక ఇరవై ఎనిమిది ఆవ్రుత్తులుగా ఉంటాయి .ఈ సంఖ్యలకే స్తోమం అని పేరు .గానం చేయాల్సిన మంత్రాలను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయటాన్ని ‘’విష్టుతి ‘’అంటారు .ఇష్టి ,పశు యాగాలలో సోమ యాగం ఒక భాగం గా ఉంటుంది సోమయాగం రుక్ ,యజు సామ వేదాల ననుసరించే చేయాలి .వసంత రుతువులోనే సామయాగాన్ని నిర్వ హించాలి .పది పదిహేనవ అధ్యాయాల మధ్య పన్నెండు రోజులు చేసే ‘’వ్యూఢ ద్వాదశాహం ‘’అనే యాగం చెప్పా బడింది .కొన్ని యాగాలలో యజమాని మూడు రోజులు అడవిలో నివశించాలి .సర్వ సత్ర యాగం ఏడాది పాటు చేయాలి .
తాండ్య బ్రాహ్మణ శైలి ప్రాచీనమైనది .కల్ప సూత్ర శైలిలో ఇది ఉంటుంది .సామ వేదం బ్రాహ్మణాలు రెండు ఒకటి తాండ్య శాఖ రెండోది తలవర శాఖ .సరస్వతీ, ద్రుషద్వతి నదుల మధ్య ఈ యాగాలు చేశారు వ్రాత్య సోమాలు అనే యాగాల ద్వారా బ్రాహ్మణులు కాని ఆర్యులు ప్రాయశ్చిత్తం చేసుకొని బ్రాహ్మణ సంఘం లో ప్రవేశించటాన్ని ఈ బ్రాహ్మణం తెల్పింది .నైమిశారణ్యం లో ఋషులు అనేక యాగాలు చేశారు .ఇక్కడ ‘’సుదామ ‘’అనే నది ఉన్నట్లు చెప్ప బడింది .జనకుడి ప్రస్తావన ఇందులో కని పించదు .దీని చివరలో ‘’అతి రాత్రం ప్రజా పథెహ్ సహస్ర సంవత్సరః ‘’అంటే వెయ్యేళ్ళు అతి రాత్రం అనే సత్ర యాగాన్ని చేస్తే ప్రజాపతికి మళ్ళీ ప్రజా సృష్టి చేసే శక్తి ఏర్పడుతుంది అని అర్ధం .
సౌమిత్ర సామ గొప్ప తనాన్ని చెప్పే కద ఒకటి ఉంది .దీర్ఘ జిహ్వ అనే రాక్షసి చరువు ,పురోడాశాడులను తన నాలుక తో నాకేస్తూ యజ్ఞాన్ని పాడు చేసింది .ఇంద్రుడు దాన్ని ఏ విధం గానూ చంప లేక పోయాడు .సుమిత్రుడు అనే కుత్స మహర్షి సహకారాన్ని కోరాడు .సంస్కార వంతమైన యాగా శాలలో ఆమెను మాయ చేసి వశం చేసుకొని ఇంద్రుడితో సామసాయం తో ఆ రాక్షసిని చంపించాడు .అందుకే దీనికి ‘’సౌమిత్ర సామ ‘’అనే పేరొచ్చింది .
కాలేయం అని ఇంకొక సామ ఉంది .లోకాధి పత్యం సురాసురులు పోటీ పడ్డారు దేవతలు తండ్రి ప్రజాపతి తో మొర పెట్టుకొన్నారు .వారికి సామాను ఉపదేశించి అసుర బాధ నుండి విముక్తులవమని ఉపదేశించాడు ‘’ఏతే వైతాన్ కాలయిష్యద్వం ‘’అనటం వలన కాలేయం అనే పేరొచ్చింది .కలి అనే రుషి దర్శించాడుకనుక కాలేయం అనీ అంటారు .శ్వానాశ్వుడు సత్ర యాగం చేస్తుంటే కొందరు యాజ్ఞికులు క్రోధం తో అతడిని నీళ్ళు లేని మరు భూమికి తీసికెళ్ళి వదిలేశారు .అప్పుడు ఆయన వర్షం కోసం ఈ సామాను కను గోన్నాడు .దీన్ని గానం చేయగానే అక్కడ వర్షం పడి పంటలు బాగా పండాయి .మరుభూమిని సస్య శ్యామలం చేసి మళ్ళీ యజ్న భూమికి చేరాడు .దోవ తప్పిన వాడు ఈ సామాన్ని గానం చేస్తే మళ్ళీ గుర్తించగలడు అని సారాంశం .
కవి అంటే శుక్రాచార్యుడు .ఆయన దర్శించిన సామ ను ‘’కావం ‘’అంటారు .ఉశనా అన్నా శుక్రుడే కనుక ఇంకో సామకు ‘’ఔశనం ‘’అని పేరొచ్చింది .బ్రహ్మ అన్ని యజ్ఞాలను ఈ సామ చేత సృష్టించాడట .పూర్వం దేవతలు వేదరాశిని తమలో తాము పంచుకోగా బ్రహ్మ కొచ్చిన భాగమే పెద్దదిగా ఉందట .దీన్ని యజ్ఞా యజ్నీయం అంటారు .ఎద్దు మూత్రం పోసినప్పుడు ఎలా వంకర టింకర గా పోస్తుందో సామాన్నికూడా అలా మెలికలు గా గానం చేయాలి .దేవతలు అగ్నిని ముందు పెట్టుకొని అశ్వం తో శత్రువులను ముట్టడించేట ప్పుడు చేసిన సామగానాన్ని ‘’సాకమశ్వం ‘’అన్నారు .సాకం అంటే ‘’కూడా ‘’అని అర్ధం .
చర్మ రోగాలను కూడా సామ గానం వల్లపోగొట్టుకోవచ్చునని ఈ బ్రాహ్మణం తెలియ జేసింది .ఆంగిరస్సు కుమార్తె ‘’ఆకూ పార’’కు చర్మమంతా ఉడుము చర్మం లాగా గట్టి ఆ మారింది .ఆమె ఇంద్రుని ప్రార్ధించి తే దోషాన్ని పోగొట్టాడు .ఎలాంటి కోరికతో నైనా ఈ సామాన్ని గానం చేస్తే వారికి ఆకోరికలు సిద్ధిస్తాయి అని ‘’ఆకూ పార ‘’అనే సామ బోధిస్తోంది .బ్రాహ్మణులేకాకుండా క్షత్రియులు కూడా కొన్ని సామలను దర్శించారు ..ఆర్శభ సామ ‘అనేది క్షత్రియ సామ .విశ్వామిత్రకుమారుడు ఋషభుడు పుట్టే వరకు మహర్షి క్షత్రియుడుగానే ఉన్నాడు .అందుకే అది క్షాత్ర సామ అయింది ‘’బ్రాహ్మాణా చ్చంసి సామ’’అని అందుకే అన్నారు .
బ్రాహ్మనాలలో విధించ బడిన శస్త్రాలు అంటే స్తోత్రాలు బ్రాహ్మణాలుగానే పిలువ బడుతున్నాయి .వీటిని పఠించే ఋత్విక్కు ‘’బ్రాహ్మనాచ్చంసి ‘’.స్తుతులు రెండు రకాలు ఒకటి స్తోత్రాలు రెండు శస్త్రాలు .గానం తో చేయబడిన మంత్రం స్తోత్రం .గానం లేని మంత్రం శస్త్రం..పురుషులే కాదు స్త్రీలు కూడా మంత్రం ద్రస్టలుగా ఉన్నట్లు ఈ బ్రాహ్మణం తెలిపింది .’’త్వాస్టీసామ ‘’అనేది త్వష్ట కుమార్తెలైన త్వాస్త్రులు ఇంద్రుడికి కంటి రోగం వలన నిద్ర పట్టక పోతే ఈ సామ గానం చేసి చంటి బిడ్డను జోల పాడినట్లు పాడి నిద్ర పుచ్చారట .’’ఔర్నాయణం ‘’అనే సామ లో పూర్వం అంగి రసులు సత్ర యాగం చేస్తే స్వర్గాన్ని పొందినా దేవా యాన మార్గం గోచరించ లేదు .వాళ్ళలో కళ్యాణుడు అనే అంగిరసుడు అంత రిక్షం లోకి వెళ్లి ‘’ఊర్నాయువు ‘’అనే గంధర్వుడిని ప్రార్ధిస్తే ఆయన మార్గాని తెలియ జేసి ‘’ఊర్నాయువు నాకు దాన్ని చెప్పాడు .నేనే తెలుసుకొన్నాను అని అబద్ధం చెప్పద్దు .’’అని చెప్పాడు కాని ఇతడు అబద్ధంఆడి మాట తప్పిజ్ఞానం నశించి కుష్టు రోగి అయ్యాడు .ఊర్నాయు సామకు అంతటి శక్తి ఉందని తెలుస్తోంది .ఇక్కడ దర్శనం అంటే కనుక్కోవటమే కాని రాయటం కాదని గ్రహించాలి .
ఋత్విక్కులు మర్చి పొతే ప్రక్క వాడు జ్ఞాపకం చేయ రాదు .ప్రజా పతిని అతిధిగా పిల్చి చరువు,పురోడాశం తో సంతృప్తి పరచేటప్పుడు కూడా మధ్యలో మర్చిపోయిన కర్మ ను గుర్తు చేయ రాదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-14-ఉయ్యూరు