విశ్వ నటచక్రవర్తి

ఆంగ్లంలో ‘అరెస్టింగ్ పర్సనాలిటీ’ అనే పదం ఒకటుంది. అంటే వంద మందిలోనైనా ఇట్టే గుర్తించగల పర్సనాలిటీ అన్నమాట. ఒక్కసారి చూస్తే చాలు ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తుల విషయంలో ఇలాంటి పద ప్రయోగం చేస్తుంటారు. మహానటుడు సామర్ల వెంకట రంగారావుది కూడా అటువంటి పర్సనాలిటీయే. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి అద్భుతంగా నటించే సత్తా ఆయన సొంతం. మహా ప్రవాహంలాంటి చిత్ర పరిశ్రమలో ఆ ప్రవాహానికి ఎదురెళ్లి, ఆటుపోట్లను భరించి, ఒడ్డుకు చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతనటుడు ఎస్వీఆర్. తొలి సినిమా ‘వరూధిని’ ఆశాభంగం కలిగించినా, మళ్లీ ‘షావుకారు’తో నిలదొక్కుకొని తెలుగు, తమిళ భాషల్లో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేయగలగడం ఆయన అదృష్టమే కాదు ఆ అసామాన అభినయాన్ని తిలకించి, పులకించి పోవడం ప్రేక్షకుల పూర్వజన సుకృతంగా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. సాధారణంగా చాలా మంది నటులకు వాళ్లు పోషించే పాత్రలను బట్టి గుర్తింపు లభిస్తుంటుంది. కానీ తన నటనతో పాత్రలకు మరింత పేరు తెచ్చిన నటుడు ఎస్వీఆర్. డైలాగ్ చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన మాడ్యులేషన్. పది పేజీల డైలాగుల్లో చెప్పే భావాన్ని కేవలం ఒకేఒక ఎక్స్ప్రెషన్తో ఆయన ప్రదర్శించే నేర్పు కేవలం ఆయనకే సొంతం. సినిమాలో తనది చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా అది రంగారావు మాత్రమే చెయ్యాలనే రీతిలో ఆయన అభినయం ఉండేది. పాత్రకు తగ్గ టెంపోని పాటిస్తూ డైలాగ్ చెప్పడంలో ఎక్కడెక్కడ విరామం ఇవ్వాలో, ఎక్కడెక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ పదాన్ని విరిచి మాట్లాడాలో రంగారావుకు బాగా తెలుసనిపిస్తుంది ఆయన సినిమాలు చూసినవారెవరికైనా.
సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు… ఒకటనేమిటి అన్ని రకాల చిత్రాల్లోనూ అభినయించి, సాటి లేని మేటి నటుడనిపించుకొన్నారు ఎస్వీఆర్. ‘షావుకారు’ చిత్రంలో సున్నం రంగడిగా రౌడీ పాత్ర పోషించిన రంగారావు తదనంతర కాలంలో ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జెట్టీలు’, ‘కత్తుల రత్తయ్య’, ‘బందిపోటు భీమన్న’ వంటి చిత్రాల్లో కూడా రౌడీ పాత్రలు పోషించారు. అయితే తన మార్క్ ఆ పాత్రల్లో ఉండేలా ఆయన జాగ్రత్త వహించారు. ‘పాతాళభైరవి’ చిత్రంలో నేపాళ మాంత్రికుని పాత్రతో ‘బుల్బుల్’, ‘డింగరీ’ వంటి కొత్త పదాల్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రంగారావు ‘ బేవకూఫ్’, ‘డోంగ్రే’, ‘గూట్లే’ వంటి కొత్త తిట్లను రౌడీలకు అందించారు. ఏ తరహా పాత్ర ఆయన పోషించినా అందుకు అనుగుణమైన పర్సనాలిటీ ఉండటంతో ఆ పాత్ర రాణించేది. నిండైన విగ్రహం, కళ్లు ఆయనకు ఎస్సెట్స్ అని చెప్పాలి. వాటితోనే ఆయన ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. తెలుగులో, తమిళంలో రాణించి, ‘విశ్వనట చక్రవర్తి’గా ప్రేక్షకుల ప్రశంసలు పొందినా, తనకు ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి రంగారావులో ఉండేది. అది మాత్రం నిజం.
(నేడు ఎస్వీఆర్ జయంతి)