సాహసమే ఆమె ఊపిరి….

విశాఖతీరంలోని రుషికొండ. ఎప్పటిలాగే పర్యాటకులు వస్తున్నారు, పోతున్నారు. కనుచూపు మేర కనిపించే సముద్రపు నీళ్లను చూస్తున్న వారికి ఒక ఎర్రటి చిన్న పడవ, అందులో తెడ్డు వేస్తున్న ఒక మహిళ కనిపించింది. అంత భీకరమైన సముద్రంలో ఒంటరి మహిళా? ఎవరీవిడ? ఏమిటీ సాహసం? అని ముక్కున వేలేసుకున్నారందరు. మెల్లగా తీరం చేరిందామె. బోటు దిగి ఒడ్డున నిల్చున్నవాళ్లందరినీ ‘హాయ్, హాయ్’ అని ఆత్మీయంగా పలకరించింది. ఇంతకూ ఈమె ఎవరంటే.. జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు కాయక్ (చిన్న పడవ) మీద ఒంటరిగా వెళుతున్న సాహస వనిత శాండీ రోబ్సన్. అబ్బురపరిచే ఆ యాత్ర వెనక ఆమె అనుభవాలు ఆసక్తికరం….
ఆయా దేశాల మనుషులు అక్కడున్న సంప్రదాయ వ్యవహారాలను బట్టి ప్రవర్తిస్తుంటారు. మా దేశంలో అయితే అమ్మాయిల వయసు అడిగితే కోపగించుకుంటారు. ‘నీకు పెళ్లి అయిందా?’ అని స్వేచ్ఛగా అడగలేరు. అదే యూరప్ దేశాల్లో అయితే ఇది సామాన్యమైన ప్రశ్న. ఇండియాలో మాత్రం ఎవరు ఎదురుపడినా ‘నీ మొగుడ్ని వదిలిపెట్టి నువ్విలా తిరుగుతున్నావేంటి?. ఆయనేమీ అనడా?” అంటుంటారు. నాకు నవ్వొస్తుంటుంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అంటే నావైపు అదోలా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
నాకు లాంగ్జర్నీలంటే మోజు. అదీ సముద్రంలో ఒంటరిగా వెళ్లడమంటే మరింత ఇష్టం. తీరప్రాంతం వెంబడి వెళుతుంటే ప్రపంచంలోని ఎంతోమంది కాయక్‌లు పరిచయం అవుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. అవన్నీ వింటుంటే భలే థ్రిలింగ్ అనిపిస్తోంది.
ఈ యాత్రకు కావాల్సినంత డబ్బు నావద్ద లేదు. దాతలను ఆర్థిస్తున్నాను. ఎవరికి తోచింది వారు ఇవ్వొచ్చు. నా వెబ్సైట్లోకి వెళ్లి ఈ మెయిల్లో సంప్రదిస్తే నా బ్యాంకు అకౌంట్ వివరాలు ఇస్తాను. అందులోకి జమ చేయొచ్చు. నేను సముద్ర ప్రయాణం చేస్తూ దగ్గర్లోని ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకుంటాను.
నేను ఆస్ట్రేలియాకు చేరుకోగానే కాయక్ మీద సముద్రయానం చేసిన తొలి మహిళగా రికార్డు నమోదవుతుంది. నేను తిరిగిన దేశాలు, ప్రాంతాలు, కలిసిన మనుషులు, తిన్న ఆహారం, జరిగిన సంఘటనల ఆధారంగా ఒక పుస్తకం రాద్దామన్నది నా ఆలోచన.
రోజుకు 45 కిలోమీటర్లు ప్రయాణిస్తాను. సముద్రపు ఒడ్డున ఉన్న పట్టణాలకు చేరుకున్నప్పుడు లాడ్జిలలో దిగి.. వారానికి సరిపడే కిరాణాసరుకులు, ఆహారం, నీళ్లు సమకూర్చుకుంటాను. రాత్రిళ్లు సముద్రానికి దగ్గర్లోని ఊర్లలో టెంటు వేసుకుని పడుకుంటాను.
“చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, రిటైర్మెంటు. అప్పుడప్పుడు కొన్ని వేడుకలు, పండగలు.. సంతోషాలు, బాధలు. ఇంతకంటే గొప్ప జీవితం లేదా? మనమెందుకంత రోటీన్లో పడి కొట్టుకుపోతుంటాము అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ సాహసయాత్ర. నాకిప్పుడు 47 ఏళ్లు. అరవై ఏళ్ల వరకు చురుగ్గా ఉండగలను. అంతలోపు వీలైనంత ప్రపంచాన్ని చూడాలన్నది నా ఆలోచన. అందుకే చిన్న పడవ మీద ఒంటరిగా సుముద్రతీరం వెంబడి సాహసయాత్రకు పూనుకున్నాను. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ యాత్ర సాగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి చేరుకున్నాను. నా సాహసయాత్ర గురించి మీకు మూడుముక్కల్లో చెబుతాను. కాయక్ అనేది ఒక పొడవైన చిన్న పడవ. నీళ్లలో తెడ్డు వేసుకుంటూ దీని మీద వెళ్లొచ్చు. 1930లో జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు తొలిసారిగా కాయక్ మీద సముద్రయానం చేశారు ఆస్కర్స్పెక్. ఇతనికి సముద్రాల్లో ప్రయాణించడమంటే పిచ్చి. ప్రపంచాన్ని చుట్టేయడానికి అతనికి ఏడేళ్లు పట్టింది. అయిదేళ్లలో పూర్తి చేయాలన్నది నా లక్ష్యం. ఒక మహిళ ఒంటిరిగా సముద్రంలో కాయక్ మీద జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లగలిగితే – అది ప్రపంచరికార్డు అవుతుంది. ఆ రికార్డును నేనే ఎందుకు నెలకొల్పకూడదు అనుకున్నాను.
ఒకప్పుడు టీచర్..
నాది దక్షిణ ఆస్ట్రేలియా. నేను అక్కడే పుట్టి పెరిగాను. ఆ దేశంలో నేను ఔట్‌డోర్ టీచర్‌ను. ఆస్ట్రేలియాలో విద్యాబోధన ఎంతో ప్రయోగాత్మకంగా, స్ఫూర్తివంతంగా ఉంటుంది. అందులో భాగమే ఔట్‌డోర్ ఎడ్యుకేషన్. ఇదొక సాహసయాత్రతో కూడుకున్న విద్యాబోధన. టీచర్లు సముద్రంలో ప్రయాణిస్తూ పిల్లలకు పాఠాలు చెబుతారు. యాత్రలో భాగంగా రకరకాల ప్రదేశాలు, వాటి ఔన్నత్యం గురించి ప్రాక్టికల్‌గా బోధించడం, పిల్లలకు ప్రపంచం పట్ల అవగాహన కలిగించడం ఈ చదువు ఉద్దేశం. నాకు కూడా చిన్నప్పటి నుంచి లోకం తిరగడమంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. రకరకాల ప్రదేశాలు, మనుషులు, సంస్కృతి, ఆహారం.. ప్రపంచంలోని వైవిధ్యాన్ని దగ్గరగా చూస్తూ.. అందులో మమేకం కావడం ఇష్టం. అందుకనే ఔట్‌డోర్ ఎడ్యుకేషన్‌లో టీచర్‌గా, ఇన్‌స్ట్రక్చర్‌గా చేరాను. ఆ రంగంలో ఇరవై ఏళ్లపాటు పనిచేశా. సముద్రంలో కాయక్‌ల మీద సాహసయాత్ర అందులో భాగంగానే అలవడింది. నా సొంత డబ్బులతో తొలిసారి కాయక్‌ను కొనుక్కున్నాను. అప్పటి నుంచి మెల్లగా సముద్రం మీద సాహసయాత్రలు మొదలయ్యాయి. దక్షిణ ఆస్ట్రేలియా సముద్రంలో తొలియాత్ర చేశాను. సముద్రపు అలలను దాటుకుంటూ చిన్న పడవ మీద తెడ్డు వేసుకుంటూ.. వేల కిలోమీటర్లు ప్రయాణించడం ఆషామాషీ కాదు. ప్రమాదకరం కూడా! మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు శారీరక బలం కాస్త తక్కువ. నీళ్లలో తెడ్డు వేసుకుంటూ బోటును నడిపితే భుజాలన్నీ నొప్పిపెట్టేవి. సాయంత్రం అయ్యేసరికి ఒక్కోసారి నిద్రపట్టేది కాదు. అయినా సరే నా అలవాటును మానుకోలేదు.
నెల్లూరు జాలర్లతో..
కాయక్ మీద చిన్న చిన్న సాహసయాత్రలు చేస్తున్నప్పుడు నాకొక పుస్తకం దొరికింది. దాని పేరు ‘డ్రీమ్‌టైమ్ వొయేజ్’. రచయిత పాల్కాఫిన్. అతనిది న్యూజిలాండ్. జీవితాన్నంతటినీ కాయక్ వేసుకుని సముద్రం మీద ప్రయాణించడానికే కేటాయించాడతను. ఆ పుస్తకాన్ని చదివాక.. సాహసయాత్ర కేవలం రికార్డుల కోసమే కాదు, ప్రపంచాన్ని రకరకాల లెన్సుల్లో చూసేందుకు పనికొస్తుంది అని అర్థమైంది. వెంటనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.. జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు సముద్రంలోనే లాంగ్‌ట్రిప్ చేయాలని. కాయక్‌ల మీద యాత్రలు చేసే స్నేహితులు ఉన్నారు కాని.. ఇంత దూరప్రయాణానికి వారు ఒప్పుకోలేదు. ఇక చేసేది లేక నేనొక్కదాన్నే బయలుదేరాను. కేవలం సముద్ర తీరప్రాంతం వెంబడి మాత్రమే ప్రయాణిస్తున్నాను. లోతైన సముద్ర ప్రాంతంలోకి వెళ్లను. జర్మనీలో మొదలై ఇప్పటికి పదకొండు దేశాలు దాటుకుని.. శ్రీలంక మీదుగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడి నుంచి తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది నా యాత్ర. ఇక్కడే నాకు కష్టాలు మొదలయ్యాయి. నెల్లూరు వద్దకు వచ్చేసరికి అప్పటికే సముద్రంలో చేపలు పట్టుకునే జాలర్లు నా వెంటపడ్డారు. నేనో ఉగ్రవాదినని వారు పొరబడినట్టున్నారు. అందుకే బోట్లు తీసుకుని అరుపులు కేకలు పెట్టుకుంటూ నా వద్దకు వచ్చారు. నేను చెప్పేది వాళ్లకు అర్థం కాలేదు. ఉన్నట్లుండి నా వద్ద ఉన్న కొన్ని వస్తువుల్ని లాగేసుకుని పారిపోయారు. వెంటనే అప్రమత్తమై తీరప్రాంతానికి సమీపంలోని ఊరికి వెళ్లి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి విశాఖపట్టణంలోని పూడిమడక సమీపానికి వచ్చేసరికి నా కాయక్ పడవ చెడిపోయింది. దిక్కుతోచలేదు. అక్కడున్న ప్రజలు చెబితే రుషికొండ బీచ్‌లోని శాప్ యాంటింగ్సెంటర్కు వెళ్లగా.. అక్కడ మెంటర్ మెల్విల్ స్మిత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితోపాటు మెరైన్ పోలీసులు సాయపడటంతో పడవ రెడీ అయ్యింది. వాళ్లందరికీ కృతజ్ఞత చెప్పి విశాఖతీరం నుంచి బయలుదేరానిప్పుడు. మిగతా దేశాలతో పోలిస్తే.. ప్రయాణానికి ఆంధ్రతీర ప్రాంతం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాల మీదుగా పశ్చిమబెంగాల్‌కు వెళ్లనున్నాను. అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని బంగ్లాదేశ్ మీదుగా 2016 నాటికి ఆస్ట్రేలియాకు చేరుకోగలుగుతాను..” అంటున్న ఈ సాగరకన్య క్షేమంగా ఇంటికి చేరుకుని.. యాత్రను సంపూర్ణం చేయాలని ఆశిద్దాం.
– నవ్య డెస్క్