బ్రాహ్మణాల కధా కమా మీషు -18
ప్రణవం
పర బ్రహ్మ బ్రహ్మ దేవుడిని ఒక తామరాకు పై సృష్టించాడు .తన కోరికలను ,లోకాలను ,దేవతలను ,వేదాలను ,యజ్ఞాలను ,శబ్దాలను ,భూతాలను స్థావర జంగమాలను ఏ విధం గా ఏకాక్షరం వలన తెలుసుకోవాలి అని ఆలోచించి ,బ్రహ్మ చర్యాన్ని పాటించి చివరకు ‘’ఓం’’అనే ప్రణవాన్ని కనుగొన్నాడు .ఓంకారం లో రెండు వర్ణాలు ,నాలుగు మాత్రలు ఉన్నాయి .ఇది సర్వ వ్యాపి ,మార్పు లేనిది ,బ్రాహ్మీ మాయం .దీని నుంచే కోరిన వస్తువులు ,సమస్త లోకాలు ,దేవతలు ,యజ్ఞాలు ,శబ్దాలు ,స్థావర జన్గమాత్మకమైన భూతాలు పుట్టాయి .
ప్రణవం లోని మొదటి అక్షరం నుండి స్వర్గం ,రెండవ అక్షరం నుంచి తేజస్సు వెలుగు పుట్టాయి .ఓంకారం లోని మొదటి స్వర మాతృక నుంచి భూమి అగ్ని ఓషధులు ,వృక్షాలు ,భూహ్ అనే వ్యాహృతి ,గాయత్రీ ఛందస్సు మూడు విధాలైన స్తామాలు ,తూర్పు దిక్కు ,వసంత రుతువు వాక్కు ,నాలుక సృష్టింప బడ్డాయి .దాని రెండవ స్వర మాత్ర నుంచి అంత రిక్షం ,వాయువు ,యజుర్వేదం ,భువ అనే వ్యాహృతి ,త్రిష్టుప్ ఛందస్సు ,పది హేనురకాల స్తామాలు ,పశ్చిమ దిక్కు ,గ్రీష్మ ఋతువు ఉచ్చ్వాస నిస్శ్వాసాలు చేసే అవయవాలు నిర్మించ బడ్డాయి .మూడవ స్వర మాత్ర నుండి స్వర్గం ,సూర్యుడు ,సామ వేదం ,స్వః అనే వ్యాహృతి ,జగతీ ఛందస్సు ,ఉత్తర దిక్కు ,వర్ష రుతువు ,కళ్ళు మొదలైనవి ఏర్పడ్డాయి .దాని ‘’వ’’కార మాత్ర నుండి నీరు ,చంద్రుడు ,అధర్వ వేదం ,నక్షత్రాలు , అంగీరసులు ,అనుష్టుప్ ఛందస్సు దక్షిణ దిక్కు ,శరదృతువు మనసు మొదలైనవి జనించాయి .దాని ‘’మ’’కార మాత్ర నుండి ఇతిహాస పురాణాలు ,వాక్కు ,ఛందో యుక్తమైన భాష ,ఉపనిషత్తులు ,వ్రుధాత్ ,కారత్ ,గుహన్ ,మహాత్ ,తత్ ,శం,ఓం అనే వ్యాహృతులు ,నృత్యం ,గానం .చైత్ర రాధా దేవతలు ,తేజస్సు ,తేజస్సు ,వెలుతురూ ,ఊర్ధ్వ దిక్కు ,అదో దిక్కు ,హేమంత ,శిశిర ఋతువులు సృష్టింప బడ్డాయి .
ఓంకార సహాయం తో దేవతలు రాక్షసులని జయించారు ఓంకారమే అన్ని వేదాలకు మూలం .ప్రపంచానికి ఆధారం .ఈ విధం గా దిక్కులు ,ఛందస్సు ,పంచ భూతాలు ,వేదాలు రుతువులు ,సూర్య చంద్రులు ,ఇతిహాస పురాణాలు ,ఓంకారం నుండి పుట్టాయని గోపద బ్రాహ్మణం చెప్పింది .
గాయత్రీ మంత్రం
గాయత్రిని మించిన మంత్రం లేదు ‘’ఓం భూర్భువస్సువః త్తత్చావితుర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ‘’అనేది గాయత్రి మంత్రం .గాయత్రికే సావిత్రి అని పేరు ఈ మంత్రం తత్త్వం గ్లావుడు ,మౌద్గాల్యుడు అనే ఇద్దరు ఋషుల మధ్య జరిగిన సంభాషణ రూపం లో వివరించ బడింది .మైత్రేయ వంశం లో పుట్టిన గ్లావుడు మౌద్గాల్యునికి వేదాలు వాటి అర్ధాలు తెలియవు అని నిందించాడు .అందుకు మౌద్గాల్యుడు ‘’సకల వేదం సారం ,సకల ఆధార మైన గాయత్రీ మంత్రం యొక్క తత్త్వం నీకు తెలుసా?’’అని శిష్యుని ద్వారా ప్రశ్నించాడు .మంత్రం తత్త్వం తనకు తెలియదని ,మౌద్గాల్యుని తూల నాది నందుకు క్షమాపణ చెప్పుకొని గాయత్రీ మంత్రం తత్వాన్ని ఉపదేశించమని వేడుకొన్నాడు .మౌద్గాల్యుడు సాకల్యం గా వివరించి చెప్పాడు .
‘’వేదాలు ఛందస్సు ,సవిత (సూర్యుడు)యొక్క శ్రేష్టమైన భాగాలు .అన్నం ఆయన ప్రకాశం .ధియః అంటే విధులు లేక కర్మలు .వీటి వల్లనే ఆయన లోకమంతా సంచ రిస్తాడు .మనస్సు సవిత .వాక్కు సావిత్రి .మనసున్న చోట వాక్కు ,వాక్కు ఉన్న చోట మనస్సు ,ఉంటుంది .అగ్నియె సావిత్రి .పృథ్వి సావిత్రి .అగ్ని ఆదిత్యుడు వేదాలు వేదాలు ఛందస్సులు యజ్ఞం దక్షిణ సమస్తం సావిత్రియే .దీని తత్వాన్ని తెలుసుకొన్న వాడు సర్వ పాప విముక్తుడై సుఖ సంతోషాలను పొందుతాడు .
రుక్ –సామల సంబంధం
ఉత్తర భాగం లోని తృతీయ ప్రపాఠకం లో ఈ రెంటి సంబంధం చెప్ప బడింది .ఆదిలో రుక్ ,సామలు మాత్రమె ఉండేవి .రుక్కు కు ‘’సా’’అని సామకు ‘’ఆమ ‘’అని పేరు .పుల్లింగం లో ఉన్న సా తో స్త్రీలింగం లో ఉన్న’’ ఆమ ‘తో’’సకల జీవరాసులని అభి వృద్ధి చేయతామికి మనం కలుసు కొందాం ‘’అని చెప్పింది .కాని సామ అందుకు ఒప్పుకోలేదు .రుక్ కన్నా తానే గొప్ప అని ప్రగల్భాలు పోయింది .కోపించిన రుక్ తానె రెండు భాగాలుగా విడిపోయి మొదటి భాగం రెండో భాగం తో మాట్లాడింది .కాని రెండో భాగం పలకనే లేదు .అప్పుడు తాను మూడు భాగాలుగా విడిపోయి సామను మళ్ళీ పలకరించింది .కనుక సామ మూడు రుక్కుల చేత కీర్తింప బడుతోంది .ఈ సంభాషణ అంతా ‘’సా’’,’’మ’’మధ్య జరిగింది .
గమ్ అనే ధాతువుకు డో’’ ప్రత్యయం చేరిస్తే గో’’శబ్దం ఏర్పడుతుంది .గో శబ్దానికి పొందదగిన పదార్ధం అని అర్ధం .పొంద దగింది వేదవాణి ,పృధివీ రాజ్యం ,స్వర్గ సుఖం .వీటిని పొందే మార్గాన్ని తెలిపే బ్రాహ్మణం కాబట్టి గోపధం అయింది .వేదం విజ్ఞానం పొందటం ,రాజ్య వ్యవహారాలూనడపటం ,పరమ సుఖాన్ని పొందటం అనే పురుషార్ధాలు కలుగుతాయి .
పూర్వం వైదిక యుగం లో ‘’పని ‘’అనే కొండ జాతి వాళ్ళు బ్రాహ్మణుల ఆవులను దొంగిలించి కొండ గుహలో దాచారట .’’సరమ ‘’అనే ఇంద్రుని కుక్క ఆ ఆవులకోసం వెతుకుతూ అనేక ప్రదేశాలు తిరిగి కనుక్కోన్నది .ఇంద్రునికి తెలిసింది ఇంద్రుడు దండెత్తి పణి జాతి వారి బలాన్ని చేదించి ఆవులను విడిపించాడు .అన్గిరసులు ఇంద్రునికి సాయం చేశారు .అందుకే గోపద బ్రాహ్మణం అధర్వాం గీరస బ్రాహ్మణం ఆనే పేరు తెచ్చుకోంది .ఈ నాటి డిటెక్టివ్ పరిశోధనకు ఆ నాడే బీజం పడిందని భావించ వచ్చు .అడుగు జాడలు వేలి ముద్రలు కుక్కల సాయం తో నేరస్తుల ఆచూకీ ఇవన్నిటికీ ఈ బ్రాహ్మణం ఆధారమే .
తొలి ఏకాదశి శుభా కాంక్షలు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – . 8-7-14 –ఉయ్యూరు