ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’

వాళ్లు చరిత్రలో అతిపెద్ద సునామీని కూడా తట్టుకున్నారు. 2004లో భారత దేశమే కాకుండా, దక్షిణాసియా మొత్తంగా సునామీ ధాటికి ప్రకంపించిపోయిన భీకర క్షణాల్లో కూడా వారిలో ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే సముద్రమట్టానికి ఎత్తున పర్వత ప్రాంతాల్లో నివసించడం తెలిసిన వారికి తమ జాతి అంతర్ధానమైపోతుండటానికి కారణాలు మాత్రం తెలీవు.
ఒక పరిశోధకుడిగా అనేకసార్లు పంకజ్ అండమాన్‌ని సందర్శించారు. ప్రతి యాత్రలోనూ తనకు అండమాన్ కొత్తకోణంలో కనిపిస్తూ వచ్చింది. పర్యావరణ కార్యకర్తగా జార్వాల జీవితాలను సన్నిహితంగా స్పర్శించిన పంకజ్ అంతరించి పోనున్న జాతుల్లో ఒకటిగా నిలిచిన జార్వా తెగ ప్రజల జీవితాలకు అక్షరరూపమిచ్చారు. అదీ కాల్పనిక సాహిత్య రూపంలో.. జార్వా తెగను వెంటాడుతున్న కఠిన వాస్తవాలకు సాహిత్య రూపం ఇవ్వడం ఇదే మొదటిసారి.
కథ: నవల మొత్తంగా హరీష్ అనే ఈ సముద్ర ప్రయాణికుడి చుట్టూనే తిరుగుతుంది. జార్వా తెగ అంతర్థానానికి దారితీస్తున్న అనేక బాహ్య కారణాలను దగ్గరనుంచి గమనిస్తున్న క్రమంలో ఈ నవల కథానాయకుడు తనకు తానుగా ఈ కమ్యూనిటీ కోసం పోరాటకారుడిగా మారిపోతాడు. ఈ నవల మొత్తానికి ఇదే కీలకాంశం.ఈ నవలలో 30 ఏళ్ల హరీష్ ప్రధాన పాత్రధారి. పెళ్లి విడాకులకు దారితీయడంతో విషాదంలో కూరుకుపోయాడు. అండమాన దీవుల గురించి తెలుసుకోవడానికి తన స్నేహితుడితో కలిసి ఆ దీవికి పయనమవుతాడు. ఆ దీవిలో ఉన్నప్పుడు అక్కడి గిరిజనులు, ఇతర ప్రాకృతిక ప్రాణులకూ మధ్య ఘర్షణలోని సంక్లిష్టతలను అర్థం చేసుకుంటాడు. ఇక్కడే అతడు స్థానికురాలైన సీమను కలుసుకుంటాడు. ఇక్కడే పుట్టి పెరిగిన ప్రజలపై తను పరిశోధన సాగిస్తూంటారు. జారా కమ్యూనిటీ ప్రవర్తనలో వస్తున్న మార్పులు దీవివాసులకు వినోదం కలిగిస్తుంటాయి. బయటి ప్రపంచం పట్ల వారి శత్రుభావం ఉన్నట్లుండి మాయమౌతుంది. వారి వైఖరి కాస్త మారుతుంది. చివరకు హరీష్, జార్వా తెగ ప్రజల సమస్యలపై పోరాడేందుకు నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది.
రచయితకు నవలా పరంగా ఇది తొలి రచన కాకపోవచ్చు. అంతకుముందు పర్యావరణంపై, జార్వా తెగపై ఎన్నో వ్యాసాలు రచించారు. ప్రచురించారు. ‘ఒక ఘటనను, కథను వర్ణించడంలో కాల్పనిక సాహిత్యం ఒక వినూత్న ప్రక్రియ. మన కళ్లముందు జరుగుతున్న ఒక జాతి పతనావస్థను నవలా రూపంలో చెప్పడాన్ని నేను నిజంగానే సవాలుగా తీసుకున్నాను’ అని రచయిత చెప్పారు. న్యూఢిల్లీలోని జామా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ పూర్తి చేశారు.
జార్వా కమ్యూనిటి ఉనికిపై ఇంతవరకు ఎవరూ సమగ్రంగా దృష్టి పెట్టలేకపోయారు. తన పుస్తకం ఇతవరకు తెలియని ఇతర కోణాలను స్పృశించిందని పంకజ్ చెబుతారు. ‘మీడియాలో అనేక కథలు, కథనాలు వస్తుంటాయి. చాలాకాలంగా అండమాన్ దీవులకు వెళుతూ వస్తున్నాను. వారి జీవన విధానం, వారి జీవితాల చుట్టూ అలుముకున్న అనేక గాథలను అర్థం చేసుకుంటూ వచ్చాను. అయితే బయటి ప్రపంచానికి మాత్రం ఇప్పటికీ జార్వాల గురించి తెలిసింది చాలా తక్కువే. అండమాన్ లోని సెల్యులార్ జైలు, మంచి టూరిస్ట్ ప్రదేశంగా అండమాన్ విశిష్టత, ఆ దీవి చుట్టూ నెలకొన్ని వివాదాలు ఇవే ప్రధానంగా మీడియాలో వస్తున్నాయి. కాని అంత పెద్ద సునామీనే అవలీలగా జయించిన జార్వా తెగ ప్రజలు ఎందుకు అంతర్థానమవుతున్న జాతిగా మిగిలిపోతున్నారనే అంశం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. బయటి సమాజానికి తెలియని కొత్త కోణాలనే నా కాల్పనిక నవలలో స్పృశించాను’ అంటున్నారు రచయిత.
రచయిత చాలాకాలంగా ఎన్జీఓ, కార్యాచరణ గ్రూప్ కల్పవృక్ష్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఇది 30 ఏళ్ల నుండి ఉనికిలో ఉంది. ఈ సంస్థ కార్యకర్తగానే తను అండమాన్ దీవులకు పలుసార్లు వెళ్లివచ్చారు. ఈ ఎన్జీవో నేతృత్వంలో అండమాన్ లోని జార్వా తెగ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారు. 2006లోనే అటవీ సమాచార హక్కుపై వీరు పనిచేశారు. ఒక నిర్దిష్ట కమ్యూనిటీకి చెందిన స్థానికుల కోసం పర్యావరణ విద్యను కూడా చేపట్టారు. జార్వాల వర్యావరణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇది వివరిస్తుంది. ఈ తెగ ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు వారిముందు పరిష్కారమార్గాలను కూడా చూపించారు. వాటిని కాలానుగుణంగా అక్షరబద్ధం చేశారు.
కొంత మంది అండమాన్ దీవుల నిసర్గ సౌందర్యాన్ని గురించి చెప్పారు. కొందరు ఆ దీవిలోని ఆదిమ గిరిజన జాతి గురించి చెప్పారు. కాని రచయిత, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త పంకజ్ సెక్షారియా నవల విశిష్టమైనది. ఇది కాల్పనిక రచనే కావచ్చు, కాని అందమైన కథ, అద్బుతమైన సజీవపాత్రలతో ఇది రూపొందింది. పైగా అనేక వాస్తవమైన, చారిత్రక ఆధారాలను ఈ నవలలో మనం గమనించవచ్చు. అండమాన్ దీవులపై అత్యంత అభిమానం, 20 ఏళ్ల పాటు సాగించిన అవిరామ పరిశోధనా ఫలితమే ‘ది లాస్ట్ వేవ్’ నవల. అండమాన్ దీవి అద్బుత గాథను ఈ నవల చిత్రిక పట్టింది.
రచయిత మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ స్వీయ అభిరుచితో మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ పూర్తి చేశారు. తర్వాత నానోటెక్నాలజీ రీసెర్చ్‌లో సృజనాత్మక సంస్కృతులు అనే అంశంపై పీహెచ్‌డి చేశారు. కల్పవృక్ష్ ఎన్జీవో సభ్యుడు. రెండు లఘుచిత్రాలను కూడా తీశారు. అండమాన్ దీవిగురించిన తృష్ణతో రెండు దశాబ్దాలతరబడి అండమాన్ భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రజలు, వారి పర్యావరణ వ్యవస్థ వంటి అనేక అంశాలపై రచయిత పరిశోధిస్తూ పోయారు. ఇప్పటికే మూడు కాల్పనిక రచనలు చేసిన పంకజ్ 2010లో కల్పవృక్ష ఎన్జీవో ప్రచురించిన ‘ది జార్వా ట్రైబల్ రిజర్వ్ డోజియర్ – కల్చరల్ అండ్ బయొలాజికల్ డైవర్సిటీస్ ఇన్ ది అండమాన్ ఐలండ్స్’ అనే పుస్తకానికి సహ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు.
ఇంతవరకు రచయిత ది హిందూ, ఫ్రంట్‌లైన్, శాంక్చువరీ ఆసియా, డౌన్ టు ఎర్త్, తెహెల్కా తదితర పత్రికలలో 200 ప్రత్యేక కథనాలు, ఫీచర్ కథనాలు, ఫొటో ఫీచర్లు, అభిప్రాయ వ్యాఖ్యలు ప్రచురించారు.
భారతీయ ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్ ఇండియా మే నెలలో ‘ది లాస్ట్ వేవ్ – యాన్ ఐలండ్ నావెల్’ను ప్రచురించింది. అసలు ధర రూ.350 కాగా పుస్తకాల షాపుల్లో, ఆన్ లైన్లో కాస్త తక్కువకే లభ్యమవుతోంది. అండమాన్ దీవుల, జార్వా తెగ చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలంటే ఈ నవలను తప్పక చదవాలి. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ ఆన్‌లైన్ పుస్తక షాపుల్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ ఆగస్టులో ఈ నవలను అండమాన్ దీవుల్లోనే ఆవిష్కరించడానికి రచయిత ప్రయత్నిస్తున్నారు.
అండమాన్ దీవులు, దీంట్లో నివసిస్తున్న గిరిజన తెగల మార్మికత, నిగూఢత గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న రచయిత హైదరాబాద్ నివాసి కావడం విశేషం. ఈ దీవులకు, జార్వా తెగకు సంబంధించి వెలుగులోకి రాని పలు అంశాలపై కొన్నేళ్లుగా రచయిత కథనాలు రాస్తూ వచ్చారు. జర్నలిజం, రీసెర్చ్‌ను దాటి ఇక్కడి జీవితం గురించి చెప్పడానికి నవలను ఎంచుకున్నాను, దీనిద్వారా దీవిపై కొత్త దృక్కోణాలు వెలుగు చూడటమే కాకుండా విస్తృత పాఠకులకు అండమాన్ విశేషాలు అందుతాయనే అభిప్రాయంతోనే ఈసారి నవలా రచనను ఎంచుకున్నానని పంకజ్ చెప్పారు.
గిరిజన జాతుల అంతర్థాన ప్రక్రియపై ఈ నవల ఒక సందేశాన్ని ఇస్తుంది. పర్యావరణంతో సహా వారు ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఈ కథ వివరిస్తుంది.
ప్రతులకు