
గతంలో కొన్ని సినిమాల విషయంలో తాను చేసిన తప్పులన్నీ ‘మనం’ సినిమాతో తుడుచుకుపొయ్యాయని నాగార్జున అన్నారు. ఈ సినిమా ఇచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న (ఏఎన్నార్) లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు తరాల నటులు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించగా అక్కినేని కుటుంబం నిర్మించిన ‘మనం’ విడుదలై 85 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. విక్రమ్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విజయోత్సవాన్ని సోమవారం రాత్రి అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ సినిమా సెట్స్ మీదుండగానే నాన్నకిది చివరి సినిమా అవుతుందని తెలిసి కుమిలిపోయాం. చివరి రోజుల్లో నటించడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా వచ్చి తన పాత్రను ఆయన పూర్తి చేశారు. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా హిట్టవుతుందో, లేదోనని భయపడ్డాను. ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్టవడంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న లేకపోవడం ఎంతో బాధనిపించింది. ఆయన లేనిలోటును ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం ద్వారా మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నా’’ అని ఆయన చెప్పారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని చెబుతూ ‘‘దర్శకుడు విక్రమ్‌కుమార్ అయితే వేరే లోకమనేది లేకుండా పనిచేశాడు. అద్భుత దృశ్యకావ్యంలా దీన్ని మలచాడు. ఆయనను అక్కినేని కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. మనం మంచి సినిమాయే కాదు, అందమైన సినిమా. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది’’ అని ఆయనన్నారు. ఈ సినిమాకి సంబంధించి తనకెన్నో అద్భుతమైన అనుభూతులున్నాయని విక్రమ్‌కుమార్ అన్నారు.
ఈ చిత్రంలో నటించడం ఓ బాగ్యంగా భావిస్తున్నానని జయప్రకాశ్‌రెడ్డి చెప్పారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ మహేశ్ రామనాథన్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం లాంటిది ఈ చిత్రం. ఇది తెలుగు సినిమా చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకునే చిత్రం. ముంబైలో ఈ చిత్రాన్ని చూసిన మా మిత్రులు హిందీలో దీన్ని రీమేక్ చేయడం అసాధ్యమని తేల్చేశారు’’ అని చెప్పారు. ‘మనం’ విడుదలైనప్పుడు ఆస్ర్టేలియాలో ఉన్నాననీ, అక్కడే ఈ చిత్రాన్ని చూశాననీ, తన కళ్లవెంట నీళ్లు వచ్చాయనీ వెంకట్ అక్కినేని తెలిపారు. ఇప్పటికి ఈ సినిమాను తాను మూడు సార్లు చూశాననీ, దీనిని ప్రశంసిస్తూ లెక్కలేనన్ని ఫోన్లు వచ్చాయనీ ఏఎన్నార్ కుమార్తె నాగసుశీల అన్నారు. విక్రమ్‌కుమార్ అద్భుతంగా చిత్రాన్ని మలచాడనీ, అనూప్ తన సంగీతంతో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్లాడనీ నాగచైతన్య చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, ‘శిరిడిసాయి’ నిర్మాత మహేశ్‌రెడ్డి అతిథులుగా పాల్గొని యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. రచయిత హర్షవర్థన్, కళా దర్శకుడు రాజీవన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గేయ రచయిత చంద్రబోస్, నటులు కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి, దువ్వాసి మోహన్, కౌశల్, నటి విజయలక్ష్మి, ఇతర యూనిట్ సభ్యులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు.