అలహాబాద్‌గా పేరొందిన ప్రయాగ పవిత్ర పుణ్యక్షేత్రం. గంగ, యమున, సరస్వతి త్రివేణీ సంగమ నిలయం. ఇక్కడ సాధువులెంతోమంది గంగా నదీ తీరం పొడవునా ఆశ్రమాలేర్పరుచుకుని కనిపిస్తారు. ఆ నివాస ప్రదేశాలే ‘అఖాడా’లు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 13 అఖాడాల్లో 4 అలహాబాద్ సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాలో పాల్గొనటం కోసం సాధువులెంతో మంది తరలి వస్తూ ఉంటారు. ఒళ్లంతా బూడిద పూసుకున్న అఘోరాలు, నాగ సాధువులు, లక్షల మంది సన్యాసులు అమావాస్య రోజున గంగానదిలో స్నానాలాచరిస్తూ కనిపిస్తారు. అయితే వారిలో మహిళా సాధ్వీలు చాలా తక్కువ. వారికంటూ ప్రత్యేకంగా అఖాడా కూడా లేదు. అందుకే దేశ వ్యాప్తంగా 10 వేలకు పైగా ఉన్న సన్యాసినులందరూ ఒక అఖాడాను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి శంకరాచార్య అఖాడా అని పేరు పెట్టుకున్నారు. ఈ అఖాడాకు ప్రధాన సాధ్వి 50 ఏళ్ల ‘మహంత్ త్రికాల్ భవంత’.
అసలీ అఖాడా పుట్టడం వెనకొక కారణముంది. సాధారణంగా కుంభమేళాలో అఖాడాల కోసం ప్రత్యేకమైన స్థలం కేటాయిస్తారు. 99 శాతం పురుషులు నివసించే ప్రదేశంలో మహిళలు నివసించటం కష్టం కాబట్టి తమకు కూడా ప్రత్యేక ప్రాంతం కావాలని సాధ్వీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే వీరి డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. తమకు ఒక ప్రత్యేకమైన అఖాడా ఉంటే అక్కడ నివసించటం సులభమవుతుందని భవంత, ఆమె అనుచరులు భావించారు. జగద్గురు శంకరాచార్య పేరిట ఒక అఖాడాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమకంటూ ఒక ప్రత్యేక అఖాడా ఉండాలని సాధ్వీలు పట్టుపట్టడం, దానిని ఏర్పాటు చేసుకోవటం చరిత్రలో ఇదే ప్రథమం. ‘‘హిందూ ధర్మంలో పురుషులు, సీ్త్రలు అనే వివక్ష లేదు. ఇద్దరూ సమాన భాగస్వాములే. అంతే కాదు మహిళలు పుట్టుకతోనే పూజ్యులు. వారే భగవంతుడిని శ్రద్ధగా సేవిస్తారు..’’ అంటారు భవంత. ప్రస్తుతం శంకాచార్య అఖాడాలో అనేక మంది సాధ్వీలు నివసిస్తున్నారు. పురుష అఖాడాలలో మాదిరిగానే ఇక్కడ కూడా బాధ్యతలన్నింటినీ స్పష్టంగా విడగొట్టారు. వీటిని అఖాడాలలో నివసించే కొందరికి అప్పచెప్పారు. ప్రస్తుతం అఖాడాలో హిందు సంప్రదాయ పద్ధతులను బోధించటంతో పాటుగా ఆయుధాలను ఉపయోగించటం కూడా నేర్పుతున్నారు. మహిళల స్వీయ రక్షణకు ఇది తప్పవనేది భవంత అభిప్రాయం. వచ్చేసారి జరిగే కుంభమేళాలో తమకు కూడా సముచిత గౌరవం కల్పించాలని లేకపోతే తాము తిరగబడతామని కూడా భవంత హెచ్చరిస్తున్నారు.
ఆధ్యాత్మికతకు అంకితం
మహంతి త్రికాల్ భవంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ వాసి. ఈమెకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. భవంతకు చిన్న వయసులోనే ఆధ్యాత్మికతపై ఆసక్తి ఏర్పడింది. వివాహమంటే విముఖత ఉన్నా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకున్న భవంతకు ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిన భవంత ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆమె పప్పులు, తృణ ధాన్యాలు ముట్టుకోరు. పళ్లు, కూరగాయలు మాత్రమే తింటారు. పొడవాటి దుస్తులు ధరించి, బంతిపూలు పెట్టుకొనే భవంత అఖాడాలోని దేవాలయం లోపలి గదిలో గడుపుతారు. ఈమె ఉపయోగించే చేతి సంచులు, ల్యాప్‌టాప్ కవర్ అన్నీ కాషాయ రంగులోనే ఉండటం విశేషం.
విధులు – పేర్లు
కొఠారి – కోశాధికారి
భండారి – పాకశాల అధిపతి
కొత్వాల్ – కాపలాదారు
రమ్తా పంచ్ – దేశంలోని అన్ని శాఖలనూ పర్యవేక్షించే వ్యక్తి
వీటిలోని అన్ని ప్రధాన హోదాలు పూర్తిగా మహిళలకే పరిమితం.
అఖాడాలో ఒక రోజు
ఉదయం 4గం. – నిద్ర మేల్కొనటం.
5 – 6 – మంగళ హారతి
6 – 7- ధ్యానం, జపం
8-9.30 – టీ, అల్పాహారం
9.30 – 10 – హారతి పూజ
11 గంటలకు – భోగ ప్రసాదం
మధ్యాహ్నం నుంచి – భక్తుల దర్శనం
సాయంత్రం 5 – దేవాలయం, పరిసరాలు శుభ్రం చేయటం
7 – సంధ్య హారతి
8 – 9 – భజన, ప్రసాదం
10 – నిద్ర