మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్ – డా. వెల్చాల కొండలరావు
ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ వాదం బాగా బలపడ్డాక, తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక చాలామందికి అదివరకటి సుపరిచితులు అపరిచితుల్లాంటి వారైపోయారు, ఇంకా అయిపోతూనే ఉన్నారని అచటచటా అనడం జరుగుతోంది. కానీ నాకు మాత్రం నా సుపరిచితులు అప్పటికీ, ఇప్పటికీ సుపరిచితులే. వారి యెడ నా గుండె అప్పటికీ ఇప్పటికీ అలాగే కొట్టుకొంటుంది, నా మనసు వారివైపు అలాగే నాకు తెలియకుండానే లాగుతుంది.
అప్పటి రావెల సోమయ్య గారు, ఐ.వి. చలపతిరావు గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, సి. సుబ్బారావు గారు, నాయని కృష్ణకుమారి గారు, తంగిరాల సుబ్బారావు గారు, ఛాయాదేవి గారు, రాఘవాచారి గారు, కె.వై.ఎల్. నరసింహారావు గారు, సి.ఎస్. రావు గారు, బి.వి.ఎల్. నారాయణరావు గారు, జి.ఆర్.ఎస్. రావు గారు, కృష్ణమోహన్ గారు, వైద్యనాథ అయ్యర్ గారు, హరిప్రసాద్ గారు, సుందరయ్య గారు, ఆత్రేయ శర్మగారు, అరుణా వ్యాస్ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు, మునిపల్లె రాజు గారు, ప్రసన్నకుమార్ గారు, కె. నాగేశ్వరరావు గారు, ఇంకా ఎందరో అప్పటికీ ఇప్పటికీ ఒకలాంటి వారే, నావారు.
అలాగే నేను ప్రేమించినవారు, నన్ను ప్రేమించిన వారు చనిపోయిన వారిలో కూడా ఎంతో ముందున్నారు. ఆవుల సాంబశివరావు గారు, ధూళిపాళ్ల శ్రీరామమూర్తి గారు, పి.ఎస్. రామచందర్‌రావు గారు, అప్పయ్యశాసి్త్ర గారు, నండూరి కృష్ణమాచార్య గారు నా క్లాస్‌మేట్ ఎం. వీరభద్రరావు గారు… ఇంకా మరెందరో.
నేను తెలంగాణ వాణ్ణి. పైన పేర్కొన్న వారంతా తెలంగాణేతరులు. కానీ నన్ను వారలా చూడలేదు, నేను వారినలా అనుకోలేదు. అసలాభావమే ఎన్నడూ మాకురాలేదు. ఎప్పుడు కలిసినా కులాసాగా మాట్లాడుకునేవారం, నవ్వేవారం, నానా కబుర్లు చెప్పుకునే వారం.
అప్పట్లో నేను కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు చలపతిరావు గారు మాకు ప్రిన్సిపాల్‌గా వచ్చారు. ఆయన సతీసమేతంగా దిగారు బస్టాండ్‌లో. స్ఫురద్రూపి, ఆజానుబాహువు. తెల్లని వస్ర్తాల్లో ఉన్న ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను. రండి మా ఇంటికని తీసుకెళ్ళాను. రెండు మూడు రోజులున్నాక కిరాయింటికి వెళ్ళారు. కాలేజ్‌లో అందరమూ కలిసి ఆడుకునేవారం, పాడుకొనేవారం, నవ్వుకొనేవారం, అనేకానేక విషయాల గురించి చర్చించుకొనేవారం.
ఐ.వి. చలపతిరావు గారికి మంచి వక్తగానే కాక సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో కూడా చాలా ఆసక్తి కలవారిగా పేరుంది. అతనికి చెందిన ఆ గౌరవం కళాశాలలో పనిచేసే మా అందరికీ దక్కేది. మాకే కాదు, విద్యావంతులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు వారివలన గౌరవం, గుర్తింపు సమకూరేది. మా గౌరవానికి వారు నిధిగా, మాప్రతినిధిగా మేమందరమూ భావించేవారం. ఇంతకూ ఇక్కడ చెప్పదలచిన విషయమేమిటంటే, ఆ రోజుల్లో ఇతడు అక్కడివాడు, ఇక్కడివాడను భేదమెవరికీ వుండేది కాదు. వారలాంటి భావం వచ్చేట్లు నడిచేవారు కారు. అందరం ఎంతో కలిసి మెలిసి ఉండేవాళ్లం. విశ్వనాథగారి లాంటి, కె.వై.ఎల్. నరసింహారావు గారి లాంటి, పాండురంగం గారి లాంటి, ఐ.వి. చలపతిరావు గారి లాంటి సుపరిచితులు, శ్రేయోభిలాషులు నాకెంతో మందున్నారు. నన్నడిగితే నాకు ఇక్కడి వారిలో కంటే అక్కడి వారిలోనే తెలిసిన వారు ఎక్కువున్నారు.
మా కరీంనగర్ వారు అప్పటికీ ఇప్పటికీ స్థానికులమైన మాకన్నా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి, ఐ.వి. చలపతిరావు గారి, కె.వై.ఎల్. నరసింహారావు గారి పేర్లు ఎక్కువచెప్పుకుంటారు. వారిని మరిచిపోరు, పోలేరు. ఎందుకంటే వారు అక్కడ అంత శ్రద్ధా నిమగ్నతలతో పనిచేసేవారు. అక్కడివారిని అంత ప్రేమించేవారు, గుర్తించేవారు, గౌరవించేవారు. అదీ ‘సమైక్యత’ అను పదానికి అసలర్థం. కలిసుండడం కాదు కలిసిమెలిసి ఉండడం, ఒకేచోట ఉండడం కాదు, ఒకటిగా ఉండడం.
ఇక, కవి సమ్రాట్ విశ్వనాథ వారు, తనకు జ్ఞానపీఠ పురస్కారం వస్తే తెలంగాణ వారమైన జువ్వాడి గౌతమ రావుగారిని, కోవెల సంపత్కుమారాచార్య గారిని, నారాయణరావు గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని, నన్ను వారి ఊరికి (నందమూరు) తీసుకెళ్ళి అనేకానేక అతిథి సత్కా రాలు చేసి స్వయానా తమ చేతులతో వడ్డిస్తూ, ‘ఈ కరీంనగర్ వాసుల రుణం నేనెన్ని జన్మలకు తీర్చుకోగలను’ అని అన్నారంటే మనమూహించుకోవచ్చు వారు ఆ నేలను, ఆచటి వారిని ప్రేమించారో, గౌరవించారో, ఎంతగా వారితో మమేకమయ్యారో.
విశ్వనాథ, ఐ.వి. చలపతిరావు, కె.వై.ఎల్. నరసింహారావు ముగ్గురూ ముగ్గురే ముత్యాల లాంటి వారు. వారి ప్రిన్సిపాల్‌గిరీ కాలంలో వారొక విధమైన పరిపాలనా చరిత్రను సృష్టించారు. అచటి విద్యార్థులకే కాదు అచటి వారందరికీ విద్యంటే, సాహిత్యమంటే, సంస్కృతంటే, దేశభక్తంటే, సామాజిక స్ఫూర్తి అంటే ఏమిటో, వారి పాఠాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఉద్బోధల ద్వారానే కాక వారి జీవన విధానాల ద్వారా చూపెట్టారు. అలాగే సాదాసీదాగా బ్రతకడమంటే, నీతి నిజాయితీగా ఉండడమంటే, వికాసవంతం గా, వినయవంతంగా, వివేకవంతంగా, ఆత్మాభిమానంతో, ఆత్మ విశ్వాసంతో జీవించడమంటే ఎలాగో వారు స్వయానా జీవించి చూపించారు.
అలాగే పాండిత్యమంటే ప్రతిభంటే ఏమిటో, వాటి కొరకు ఎలా పరిశ్రమించాలో, పాటుపడాలో చూపెట్టారు. ఒక మంచి ఆచార్యుడంటే, ఒక మంచి విద్యా పరిపాలకుడంటే ఎలాంటి వాడో కూడా. ఆరోజుల్లో కళాశాలలకు బైటి ప్రపంచానికి సంబంధమే ఉండేది కాదు. కానీ, ప్రిన్సిపాళ్ళుగా చలపతిరావుగారు, కె.వై.ఎల్. నరసింహారావుగారు అలాంటి సంస్కృతిని బ్రేక్ చేసి సంస్థకూ, సంఘానికీ సంబంధం ఏర్పరిచారు. చలపతిరావు గారు, పి.వి. నరసింహారావు గారితో కలిసి జిల్లా అంతటా పర్యటించి విద్య, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విషయాలపై కూడా ఉపన్యసించేవారు. ఇంగ్లీషులోనే కాక తెలుగులో కూడా ధారాళంగా మాట్లాడేవారు. ఆ విధంగా అక్కడి వారికి ఎంతో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య సాంస్కృతిక చైతన్యం, సామాజిక ప్రేరణ కలిగించేవారు. అలాగే దేశభక్తి, స్వయంశక్తి కూడా. ఎవరూ వారివైపు వ్రేలు చూపించేవారు కారు వారు అక్కడివారు కారని. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణవారు వారందరినీ తెలంగాణ వారికన్నా ఎక్కువ ప్రేమిస్తారు, ఆ కాలేజీలో వారు గడిపిన రోజులు అపుడపుడు జ్ఞాపకం చేసుకుంటుంటారు, వాటిని ‘గోల్డెన్ డేస్’గా, ‘లక్కీడేస్’గా భావిస్తారు.
నాకూ ప్రిన్సిపాల్‌గా మంచిపేరు వచ్చిందంటే అది వారి వలననే, వారిచ్చిన స్ఫూర్తి వలననే. నేనెప్పుడూ ప్రిన్సిపాల్ అంటే అలాగుండాలని అనుకునే వాడిని వారిని చూసి, వక్త అంటే అలా ఉండాలని అనుకునే వాడిని వారిని విని. వారు జీవితమంతా అలాగే నిస్వార్థంగా గడిపారు నిప్పులాంటి నిజాయితీ పరులుగా. నూరేళ్ళకు దగ్గర పడుతూ కూడా ఇప్పటికీ ఐ.వి. చలపతిరావు గారు నిర్విరామంగా రచనలు చేస్తూ, ఉద్బోధలు చేస్తూ అలాగే ఉన్నారు అప్పటిలాగే ఆదర్శప్రాయంగా, ఇప్పటికీ ఈ వయసులో కూడా ఇంకా అనేకానేక పుస్తకాలు వ్రాస్తూ, అనేకానేక చోట్ల ఉద్యమిస్తూ, అనేకానేక విద్యాసంస్థల్లో సలహాదారులుగా పనిచేస్తూ, వారి పాత కొత్త పరిచయస్తులందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆనందపరుస్తూ.
అందుకే అంటాం మేము విశ్వనాథ వారిని, ఐ.వి. చలపతిరావు గారిని, కె.వై.ఎల్. నరసింహారావు గారిని వారు మీ వారే కాదు మా వారు కూడానని. మీవారికన్నా వారు మా వారే ఎక్కువని. అందుకే అంటాము అప్పటికీ ఇప్పటికీ మా విశ్వనాథయని. మా చలపతి రావుగారని, మా కె.వై.ఎల్. నరసింహారావు గారని.
అందుకే గదా అన్నారు విశ్వనాథ వారు వారి వేయిపడగలలో…
‘ఏ కులం, ఏ వర్ణం, ఏ ప్రాంతం వారయితేనేమి? తాదృశ్య మహా ప్రకృతులకు నమస్కారం!’ అని. అలాంటివారు ఆంధ్రా ప్రాంతం వారైనా, తెలంగాణ ప్రాంతం వారైనా మరి మనవారే కదా మరి మనందరివారు.
– డా. వెల్చాల కొండలరావు
కన్వీనర్, తెలంగాణ కల్చరల్ ఫోరమ్.