బడ్జెట్‌తో కాదు.. ఐడియాతో సినిమా చేశారు!

‘‘వర్మ మొదటి నుంచీ ముక్కుసూటి మనిషి. ఒకప్పటి వర్మకీ, ఇప్పటి వర్మకీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతనిలో సెంటిమెంట్ అప్పీల్ వచ్చింది. ఐడియాని నమ్మి సినిమా చేసి హిట్ సాధించాడు. ఇప్పట్లో సినిమా అనగానే ఎవరికీ కథగానీ, ఇంకోటిగానీ అవసరం లేదు. బడ్జెట్ ఎన్ని కోట్లు అనే అడుగుతున్నారు. ‘ఐస్‌క్రీమ్’లాంటి సినిమాలు అలాంటి పరిస్థితుల్లో మార్పులు తెస్తాయి. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుని వర్మ చేసిన ప్రయోగం ఫలించింది. కొందరు కలిసి యూనిట్‌గా అయి సినిమా చేసి, లాభాలు వచ్చిన తర్వాత ఎవరి వాటాను వారు తీసుకోవడం చాలా బావుంది. ఇలాంటి ఆల్టర్నేటివ్ సినిమా లేకపోతే పరిశ్రమ మనుగడ కష్టం. రూ.50 కోట్లు ఖర్చుపెట్టిన సినిమాకు రూ.51 కోట్లు వస్తే అది లాభం కింద లెక్కకాదు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ‘ఐస్‌క్రీమ్’కు పెట్టిన ఖర్చుకు దాదాపు 20 రెట్లు లాభాలను చవిచూశాడు. ‘ఐస్‌క్రీమ్2’ను వెంటనే మొదలుపెట్టడం బావుంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఇటీవల విడుదలైన ‘ఐస్‌క్రీమ్’ విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జరిగింది. దాసరి నారాయణరావు పాల్గొని చిత్ర యూనిట్‌కు పారితోషికాలను చెక్కుల రూపంలో అందజేశారు. నవదీప్, తేజస్వి జంటగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘ఐస్‌క్రీమ్’. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘ముందు రూపాయి లేకుండా సినిమా చేద్దామని, సినిమా విడుదలయ్యాక మాత్రం అందరికీ పారితోషికం తప్పకుండా ఇవ్వాలని, మోసం చేస్తే పైకి రాలేనని వర్మ చెప్పారు. దానికి తగ్గట్టే సినిమాను ప్లాన్ చేశాం.
రూపాయికి రూపాయి మిగిలింది. ఈ సినిమాతో నా టీమ్ అంతా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. చక్కటి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని నవదీప్ అన్నారు. వర్మ మాట్లాడుతూ ‘‘ఎంతోమందికి సినిమా తీయాలని ఉంటుంది. అందుకు డబ్బులు అవసరం లేదు. ఐస్‌క్రీమ్ తీసిన సిస్టమ్‌లో ఎవరైనా సినిమా తీసి అవతలివారిని మెప్పించగలిగితే తప్పకుండా సినిమాలను విడుదల చేసి లాభాలను చవిచూడవచ్చు. కాకపోతే సమష్టిగా పనిచేయాలి. అదే జరిగితే పరిశ్రమతో పనిలేకుండా ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా సినిమాలు చేయొచ్చు. ఇప్పటి వరకు అందరూ వర్మ స్కూల్ అని అంటుంటారు. నిజంగా నాకు స్కూల్ లేదు. కానీ ఈ టెక్నిక్‌ల గురించి వీడియోల ద్వారా వివరించాలని ఉంది’’ అని అన్నారు.
నాది కుక్కబుద్ధి: ఇటీవల రివ్యూలు రాసిన వారిని ‘చీకట్లో అరిచే కుక్కలు’ అన్న వర్మ దాని గురించి మాట్లాడుతూ ‘‘అమితాబ్‌బచ్చన్‌ని కూడా ట్విట్టర్లో బూతు మాట అన్నవాడిని నేను. అయినా ఆయన దాన్ని తప్పుగా తీసుకోలేదు. ఆయనకు నా గురించి తెలుసు. స్పాంటేనియస్‌గా మాట్లాడటం నాకు అలవాటు. అలా కాకుండా ఏదో మొహమాటానికి మాట్లాడితే అది నేను మాట్లాడినట్టు ఉండదు. నేను రాసిన లేఖలో మీడియా మొత్తాన్ని కించపరచలేదు. ఒక వెబ్సైట్లో పర్టిక్యులర్ రివ్యూ రాసిన వ్యక్తినే అన్నాను. అతని విషయంలో ఇంకా ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను. మిగిలిన వాళ్లను ఉద్దేశించి అన్నట్టు అనిపిస్తే సారీ. నాది కూడా కుక్కబుద్ధే’’ అని వివరించారు.