పిబరే కృష్ణ. ర.సం -3
పెంచిన గొడ్డు మీద మమకారం ,అది దూరమైతే వచ్చే విచారం మాటలకు అందనిది .మనకే కాదు మనకు మాలిమి అయిన ఆ గొడ్డు కూ అంతే ఆపేక్ష ఉంటుందని తెలియ జెప్పినశ్రీ చిన్నయ్య గారి మల్లేష్ చెప్పిన ‘’పటం కట్టి పెట్టుకో నుండాము’’కధ.నల్లావును తెల్లావును సంతనుంచి తోలుకొచ్చాడు యజమాని. తెల్లావు అందరికి మాలిమయింది .నల్లావు పొట్ల గిట్టలా దగ్గరకు చేరనివ్వటం లేదు. ఇంటిల్లి పాదీ దాన్ని చూసి భయపడుతున్నారు .మేత నీళ్ళు పెట్టటానికీ భయమే .బుసలు కొడుతుంది .తెల్లావు దూడను పెట్టి మరీ కుటుంబానికి దగ్గరయింది .నల్లావును వదిలించుకోవాలని పెద్దాయన ప్లాను .రెండు ఆవులుల్ని తీసుకుని నల్లావునమ్మి తెల్లావు జతకు ఇంకోదాన్ని తెచ్చుకుందామని సంతకు వెళ్ళాడు .ఒంటి ఆవును కొనం అని బేరగాళ్ళు అందరూ అన్నారు .గత్యంతరం లేక ఇష్టం లేక పోయినా నల్లావుతో బాటు తెల్లావునూ అమ్మాల్సోచ్చింది .తెల్లావు ‘’అంబా అంబా ‘’అని కన్నీరు కారుస్తూ కొన్నవాడితో వెళ్ళింది .వాళ్ళ యదలనిండా అబ్బుకున్న మబ్బు వాళ్ళకన్నా ముందే వాళ్ళ ఊరు పోయి తబ్బుకొని ఉంది .ఇంటికి చేరేసరికి ‘’అరవై నాళ్లుగా అలక్కుండా ఇడి సేసిన పొయ్యి గడ్డ మాదిరి గా ఉంది మా ఊరు ‘’అంటాడు యజమాని దుఖం తో .యజమాని తల్లి కొడుకును ‘’బొమ్మలు ఆడించే వాడు పై నున్నాడు ఆయప్ప యెట్లా ఆడిస్తే అట్లాంటా ఆడాలప్పా ‘’అని ఓదార్చింది .’’దానిని అమ్మినబుడు అది నన్ను సూసిన సూపును మరిసేకి కాదమ్మో ‘’అని కన్నీరు ధారగా కార్చాడు .పేగు గ బంధం కన్నా గొడ్డు బంధం బలీయమైనట్లని పించింది .మూడు రోజులతర్వాత తెల్లావు ఎలా బయట పడిందో సరాసరి ఇంటికొచ్చేసి సావిట్లో నుంచుంది .’’యెంత గాపకమే మా మీద కూతురా .ఇన్ని మైళ్ళు ఎట్లోస్తివి కూతురా ‘’అని ఆప్యాయం గా తెల్లావును కావలించుకొని ఆనందం తో కన్నీరు కార్చాడు యజమాని .ఆవు గాయాలకు మందు రాసి కట్టు కట్టి మేత వేశాడు ఆప్యాయం గా .తెల్లావును కొన్న ఆసామికి వాళ్ళ కాసులు వాళ్లకి మర్నాడు సంతలో ఇప్పించేశాడు ఋణం ఉంచుకోకుండా .చాలా ఏళ్ళు తెల్లావు కామ దేనువులా ఇంట్లో లక్ష్మీ దేవిలా వెలిగి బిడ్డల్ని కని చనిపోయింది .చేలో గుంత తవ్వి గౌరవం గా కృతజ్ఞతగా పూడ్చేశారు .సంక్రాంతికి తీసిన తెల్లావు ఫోటో ను ఫ్రేం కట్టించి ఇంట్లో దాచుకున్నారు .అదీ అనుబంధం రక్త బంధం కంటే బలీయమైంది .చెప్పిన విధానం బాగుంది .
పల్లె టూరి వాళ్ళు గొర్రెల మాదిరి అనుకోని నలుగురు బయటి వాళ్ళు వచ్చి ఆయిలింజన్లకు లోనిస్తోంది ప్రభుత్వం అని చెప్పి అందర్నీ ఒక చోట చేర్చి ఒక్కొక్కరి దగ్గర అరవై రూపాయలు వసూలు చేసి ,పంగనామాలు పెట్టి డబ్బుతో హోటల్లో హాయిగా మెక్కు తుంటే సప్లైయర్ ‘’ఈలల కేవుల్లో సరైన గొర్రెలు సిక్కి పోయిరి .ఇంగోక నెల నాల్లన్నా మసాల్దోసేలు తినిందే తినింది’’అని నవ్వుకుంటాడని ‘’ఆ నలుగురు ‘’కద చెప్పి ముగించారు శ్రీ జూజు వాడిజయరాం .
అతన్నేవరో స్నేహితుడినని చెప్పి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి హోటల్లో కాఫీ తగించి బిల్లు కట్టేసి ,సెల్ నంబర్ ఇమ్మంటే నాలుగు రోజుల కిందటే చేశాగా ఆనంబర్ కే చెయ్యి అని చెప్పి చెయ్యిచ్చి ఇంతలో అతనికి ఫోన్ వస్తే ఆందోళన గా మాట్లాడి వాళ్ళ బావకు సీరియస్ అని చెప్పి ఆటో ఎక్కి వెళ్లి పోయిన వాడెవడో అసలు గుర్తుకే రాని స్తితిలో ఉన్నాడు ‘’ఆతడేవడో “’కద లో రచయిత శ్రీ తాడేపల్లి శ్రీనివాస ప్రసాద్ .
హోసూరు సాహితీ పితామహుడు శ్రీ నంద్యాల నారాయణ రెడ్డి ‘తెలుగు తావు ‘’కత లో భాషాభిమానం లేని వారందర్నీ ఉతికి ఆరేసి దెయ్యాల్ని చేసి చెట్లకు వేలాడ దీశాడు .హోసూరు సాహితీ క్షేత్రం లో రెడ్డి గారొక దొడ్డ రచయిత .స్పూర్తి ,ప్రేరణ ,పెద్దన్న .తెలుగు ప్ప్రేతాలకు అరవ ,కన్నడ ప్రేతాలు నిలవ టానికి నీడ కూడా ఇవ్వట్లేదని నర్మ గర్భం గా తెలుగు వారికి తమిళ కన్నడ రాష్ట్రాలు చేస్తున్న అన్యాయాన్ని అన్యాప దేశం గా చెప్పిన సరదా దెయ్యాల కద.తెలుగు మాటలు మర్చి పోయి ఆంగ్ల పదాల వ్యామోహం లో పడ్డ వారని చురుకైన వ్యంగ్య కొరడాలతో దెబ్బ తీశాడు పెద్ద రెడ్డి గారు .
ఉబ్బు లింగాలు ఎలా బోల్తాపడి దెబ్బతిని సర్వస్వం కోల్పోతారో వ్యసనం యెంత దుస్తితి కల్గిస్తుందో చెప్పేశ్రీమతి యెన్ సురేఖ రాసిన నీతి కద ‘’యసనం ‘’.హనుమంత రావు కు పొగడ్తలంటే ఇష్టం పొగిడితే యెంత పనైనా చేస్తాడు .ఎంతైనా ఖర్చూ చేస్తాడు .డ్రామా పిచ్చి కూడా ఉంది.డబ్బు పెట్టి నాటకాలాడించి ,మద్రాస్ వెళ్లి సినిమా తీయాలని ఉన్న దంతా ఊడ్చిపారేశాడు .పెండ్లాం తీరూ అంతే ‘’అల్పునికి అధికార మిస్తే అర్ధ రేతిరి గొడుగు పట్ట మనే టైపు .మొగుడు ఆమె పేర పెట్టిన ఆస్తి నంతా అమ్మి పుట్టినింటి వారికీ కట్ట బెట్టింది .వాళ్ళు పనికిమాలిన ప్లాటు ఒకటి ఆవిడకు కొని మిగాతాదంటే నొక్కేశారు బొక్కేశారు .ఆవిడా మొగుణ్ణి వదిలి పట్నం చేరింది .ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మొతగా ఉన్న హనుమంతం చివరికి చిప్ప చేతికొచ్చి అడుక్కు తింటూ బతికాడు .ఈ కద తన పిల్లలకు చెప్పిందో ఇల్లాలు .పిల్లలు తెలివిగా ‘’హనుమంతప్పను ఇంట్లో వొళ్ళు బయటోళ్ళుఇడిసేశారు మంచోల్లుగా ఉండటానికి ఇదా ఫలితం ?’’అని అడిగారు .దానికామె ‘’హనుమంతప్ప మంచోడు అయినందుకు సేడిపోలేదు యాసనాల జోలికి పోయి సేడిపోయాడు ,మంచిగానే మనం ఉండాల’’అని సందేహాన్ని తీర్చింది .
చిన్న తనం లో పిల్లలు ఆడే చిన్న అబద్ధాలను ,తప్పించుకోటానికి వేసే ఎత్తు గడలను అవి బెడిసి కొడితే వచ్చే అపాయాన్ని ‘’సావన బెలుగు సామి ‘’(శ్రావణ బెలగోళ స్వామి )కధలో శ్రీ నా వేం అశ్వద్ధ రెడ్డి సరదాగా పిల్లల మనస్తత్వాన్నిఆవిష్క రిస్తూ చెప్పాడు .సినిమా హాల్లో కి అబద్ధం ఆడి వెళ్లీ లాగూ చొక్కా కూడా విప్పెయించి కొట్టిన దెబ్బలకు బెంబేలెత్తి పోయాడోక పిల్లాడు .వాడి ఉనికి తెలుసుకున్న అత్తయ్య ,అత్త కూతురు వచ్చి దిగంబరం గా దిశ మొలతో ఉన్న వాడిని ‘’యేమిరా సావన బెలుగు సామి నిలిసి నట్లా నిలిసుండావు’’అంటున్న అమ్మలక్కలను కసిరి ఇంట్లోంచి ఒక చెడ్డీ తెప్పించి మేనల్లుడికి తొడిగించి మానం కాపాడింది అత్త .వాడి ఇంటికి తీసుకు పోయి’’రే తరకల నా బట్టా!నీపైన ఎతబెట్టుకుని నిన్నట్నింకా ఒగ కడి కవళ మైనా ముట్ట లేదురా ఈల్లిద్దరూ ‘’అంది అత్త .అమ్మంటే అప్పుడే విలువ తెలిసింది వాడికి .ఆవిడ కూడా కొడుకును పొదివి పట్టుకుని ‘’ఏలమ్మా నా కొడుకు నట్లా ఏడిపిస్తావు ‘’అని అత్తను కసిరి వాడికళ్ళు’’ ఉజ్జీ ‘’ తబ్బు కొనింది వాని యమ్మ .చిన్న కధలో ఎన్నో భావోద్వేగాలు ఆప్యాయత ప్రేమ ,ఆదరణ ,బుద్ధి చెప్పటం దార్లో పెట్టటం అన్నీ కల బోసిన కత .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-14-ఉయ్యూరు