పిబరే కృష్ణ .ర.సం -4.
శ్రీ పూతల పట్టు రఘునాధ రెడ్డి పేరెన్నిక గన్న రచయిత.ఆయన రాసిన ‘’ఆ నెత్తురూ ఆ చెమటే ‘’గుండెల్ని పిండిస్తుంది .తండ్రి పెద్దకుడుకును కానీ కానీ కూడ బెట్టి చదివించి పెళ్లి చేసి చేతికి ఆధారమవుతాడనుకుంటే మెదడు వాపోచ్చి చచ్చిపోయి తండ్రి దుఖాన్ని కష్టాన్ని మరింత పెంచాడు .రెందోకొడుకు మీద ఆశ పెట్టుకున్నాడు. వాడికి చదవు అబ్బలేదు .కానిచిత్తూరు లో ’’ గుడ్డ లంగడి’’పెట్టి అనుభవం లేక అప్పులు చేసి తలెత్తుకు తిరగ లేకుండా చేశాడు .తన చిన్నప్పుడు తండ్రి చేసేదిలేక కూరగాయల గంప నెత్తి కెత్తుకొని సంతలో కంటే ఇంటింటికీ తిరిగి అమ్మితే డబ్బు లేక్కువోస్తాయని తిరుగుతున్నాడు .దీన్ని చూడ లేక పోయాడు చిన్నాడు .ఆ మాటే అమ్మతో అన్నాడు ‘’ఇంకొన్నాళ్ళు మనకీ అగసాట్లు తప్పవు .అన్న సదివి ఉద్యోగం రాగానే ఈ ఇక్కట్లుండవు ‘’అని సముదాయించింది .అప్పుడు కడుపు లో తిండి లేకుండానే తల్లీ తండ్రి పొలం పనులు చేసుకొంటూనే ఉన్నారు .
ఇవన్నీ ఫ్లాష్ బాక్ లాచిన్నకోడుక్కు గుర్తుకొచ్చి ‘’కస్టపడే వాళ్లకు కడ కన్నా సుకం దొరకతా దంటారు .మా నాయనకు కడా వరకు అగసాట్లే మిగిలినాయి .మా బతుకులు సిన్గారించాలని ఆయన బతుకును ఎండ బెట్టుకున్నాడు .ఆయన నెత్తిన పెట్టుకుని మోసి మోసి అమ్మింది కూరగాయలూ ,కూరాకులూ కాదు –ఆయన నెత్తుర్నీ చమట నూ అమ్మి నలుగురు బిడ్డలా కడుపు నింపాడు .ఆ నెత్తురూ ,ఆ చమటే మా అన్న చేతిలో బడి పుస్తకమైంది .అవే మా అక్కోల్ల మెడలో తాళి బొట్టయింది .అవే చిత్తూర్లో నా పేరిట గుడ్డ లంగడి అయింది ‘’అని నిర్వేదం చెందుతాడు .ఇప్పుడు ‘’సంపారిస్తా ‘’(సంపాదిస్తా)నెమ్మది గానే ఉన్నాడు .నాయన్ని కడుపు కింత ముద్ద పెట్టి చూసుకో గలడు.అయితే’’ ఆ ముద్ద తినేకి నాయన లేడిప్పుడు’’ అని దుఖిస్తాడు .గుడ్డల యాపారం లో తానూ అంతా పోగొట్టుకున్నందుకు తన్ను చూసి వేదన పడిపడి’’లక్క వాయి ‘’కొట్టి అపుడే తీరిపోయినాడు . కొడుకుగా తండ్రి రుణాన్ని తానేట్లా తీర్చుకో గలను ?అంటూ వేదనకు గురైనాడు .
ఇందులో ప్రతి మాట అర్ధ వంతం గా రాశాడు రచయిత .అంతా జీవిత అనుభవ సారమే .పేదోళ్ళ నిరాశా నిస్ప్రుహలె .కదా కధనం లో మంచి పట్టు సాధించాడు ‘’పూతల పట్టు ‘’.
పల్లె టూరి సింగిల్ టీచర్ బడి భాగోతమే ‘’కోడి గుడ్ల మేస్టరు’’.అయ్యవారు ఇస్కూల్ కి రాగానే కాళ్ళు బల్ల మీద పెట్టి కుర్చీలో హాయిగా గుర్రెట్టి పడుకుంటాడు .’’ఇంట్లో వాళ్ళ రావిడి పడలేక ‘’బడి కోస్తాడు గురూ గారు .పిల్లలూ దేవాన్తకులే మేస్టారి ని బురిడీ కొట్టించే ఘనులే .చదువు చెబితే మాత్రం గోడకు సున్నం అతికి నట్లు మనస్సులో నాటుకు పోతుంది .చెప్పాలిగా .సందేహం వచ్చి నిద్ర లేపి అడిగితే ‘’చిత్రాన్నమూ బెల్టు బువ్వా’’ తిని పిస్తాడు .అంటే వాయిన్చేస్తాడన్న మాట .మేస్తురికి కోడి గుడ్లు లంచం ఇస్తే ఇంకేమక్కర్లేదు. అందుకే ఆయన ‘’కోడి గుడ్లు మాస్తురు ‘’అయ్యాడు .కొట్టకుండా ఉండాలంటే కోడి గుడ్డు చదివిన్చాల్సిందే అయ్యవారికి అదే లంచం ఆయనకు .త్రిక సంధి సూత్రం తెలియదని విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేసిన మేనక లా ఒకమ్మాయి అడిగితే ,ఆమె పుస్తకం లోని చిన్నయ సూరి సూత్రం చదివింది .చిర్రున కోపం వచ్చింది మేస్టారికి ‘’ఆంధ్రా వాళ్లకి ఏమీ ‘’పంగ ‘’లేదు .అట్లా మాటల్లో రాయక పొతే అందరికి తెలిసేట్లు తెలుగు లో రాస్తే ఏమి ?’’అని విసుక్కుని తన పద్ధతిలో తేట తెల్లం గా ‘’అ ,ఈ ,ఏ లను మూండ్లు అంటారు .మూండ్ల మీది ఒంటి హల్లు జంట హల్లుగా మారుతుంది .జంట హల్లు అయినప్పుడు ముందరి పొడవచ్చు పోట్టిదవుతుంది .నేను పాటము రాసింటే ఇట్లే రాసి ఉందును .తెలుగు చిన్నోల్లకు నోళ్ళు తిరగని మాటలతో పుస్తకాలు నింపేసి చదువుమంటే యట్లా ?పాట మంటే యెట్లుం డాల.మేస్తురు చెప్పక పోయినా చదివితే చాలు తానుగా తెలిసి పోవాల ‘’అని పాటం తో బాటు గొప్ప హితవూ చెప్పాడు అయ్యవారు .అయ్య వారికి కొడుగుడ్డు నజరానా ఇస్తే గబుక్కున గోడకు కొట్టి సోనంతా నోట్లో పోసుకుని గుటుక్కున మింగుతాడు .కదా రచయిత శ్రీ రాజన్న గారి శ్రీకాంత్ .సరదా గా ఉన్నా యదార్ధానికి ఆయువు పట్టు ఉన్న కథ .
శ్రీ మతి రామక్క గారి సుమ రాసిన ‘’సమసి పోయిన తాళి బొట్టు ‘’లో తల్లి తాళి బొట్టు తూటు పడి ,నల్ల పూసలు మాసిపోయి యెర్ర గుండ్లు సమసిపోయి కనిపించాయి ఆడపిల్లలకు. అదే వాళ్ళు చూడటం మొదటిసారి. అయ్యో అని ఏడుస్తున్నారు ‘’బిడ్డలో బిడ్డలో అని అంతా బిడ్డలకే చేసి పెట్టి ,తన కోసం ఇంతైనా యోచన చేయకుండా బతికేస్తోంది ‘’తల్లి అని తెలుసుకున్నారు .దుఖాన్ని ఆపుకో లేక పోతుంటే ఆయమ్మ ‘’అయ్యో కోతి బిడ్డల్లారా ఎందుకే అట్లా ఏడుస్తారు .ఇది మా అత్తకి వాళ్లత్త యేసిన తాళి బొట్టు .నా పెండ్లపుడు మెరుగు పెట్టించి వేసిరి .అందుకే పాతదయి సమసి పోయింది .ఏడ వద్దు కల కుండా ఉండండి ‘అని ఓదార్చింది ఆ దొడ్డ ఇల్లాలు కూతుళ్ళను .కొత్త తాళి బొట్టు తెచ్చి పెడతానని పెద్దకోడుకన్నాడు .’’వద్దు కొడకా .ఈ బంగారును ఏమైనా ఎత్తుకు పోతానా .రాజమ్మ కొడుకులు చేసి నట్లు చేయకుండా ఊళ్ళో నామర్యాద ఊరోళ్ల ముందర నిలబెట్టండి కొడకా అంతే చాలు ‘’అని అడ్డు చెప్పింది .తల్లిపై గౌరవం పిల్లలపై ఆపేక్షా ఏదీ కావాలనుకొని పెద్దరికం ,మర్యాద బతుకు కోసం తపన మనకు కని పిస్తాయి .ఒక కూతురు తాళి బొట్టును పసుపు దారానికి కూర్చి అమ్మ మేడలో వేయగా సంతృప్తి పడ్డారందరూ .గుండెలోతులను తడిమే కద.
చివరికద ‘’కృష్ణ రసం ‘’ కు స్పూర్తి ప్రదాత ,సారధి సచివుడు ,నేస్తం ,ప్రేరణ ’ప్రళయ కావేరి ‘’వంటి అద్భుత జీవిత వాస్తవ కధలను రాసిన శ్రీ సా వేం .రమేష్ రాసిన ‘’ఎందుండి వస్తీవి తుమ్మెదా “’.ఇందులో కొడుకు వస్తాడని అందరికి చెబుతూ ఎదురు చూస్తా,వాడేదో కాగితం రాసినట్లు చెబుతూ ,వెతుక్కుంటూ ,వాడిరాకను ఈమె వాయిదాలు వేస్తూ వాడు రాక పోవటాన్ని జీర్ణించుకోలేక తాగుడు కు అలవాటు పడి దమ్ము కొడుతూ’’ఎందుండి వస్తీవి తుమ్మెదా ‘’పాట పాడుకుంటూ బిచ్చ గత్తే లాగాతిరుగుతూ పెట్టింది తింటూ బతికే ఒక ముసిలి కద..రచయిత కనపడ్డ ప్పుడల్లా ‘’కొడుకా నువ్వే నా కొడుకువి ‘’ అనేది .ఆమె చనిపోయిన సంగతి చాలా కాలానికి తెలుసుకున్న రచయిత అవాక్కయ్యాడు .
ఇలా ‘’మోతు(దు)కు పూల వాన ‘’కదా గుచ్చం ఆద్యంతం అలరిస్తుంది .ఆ పూల వాన లో తడిసి ముద్దవుతాం గుండెలను తట్టుతుంది .మనసును ఆలోచింప జేస్తుంది .కలవర పెడుతుంది .సాను భూతి చూపిస్తుంది .ఇవన్నీ హోసూరు ప్రాంత నిసర్గ భాషా సౌందర్యానికి వన్నె చిన్నేలే .వారి కతలే ,వెతలే ,మట్టి గుబాళిం పులే .ఇందులో వాడిన కొన్ని మాటల కు అర్ధాలు తెలుసుకుని ఆ భాషా మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం . కృష్ణ రసాన్ని పానం చేద్దాం .
మొయిలు –మబ్బు ,బానము –ఆకాశం ,మీజు –ఈత ,మచ్చు –కత్తి,కొర –మంచు ,మొరము –చేట ,ఆనె రాళ్ళు –వడగళ్ళు ,బూబమ్మ పురుగులు –సీతా కోక చిలకలు ,తలవరు –పంచాయితీ ప్రెసిడెంట్ ,శాన బోగుడు –కరణం,కారే దారుడు –మునసబు ,దిట్టము –పధకము ,చేపలుకి –సెల్ ఫోన్ ,పోల్లరి –టైలర్,అరిది –చోద్యం ,సమసిపోవు –అరిగి పోవు .
దీని తర్వాత శ్రీ అగరం వసంత్ రాసిన ‘’వెండి మొయిళ్ళు –బండ బతుకులు ‘’కదా సంపుటి లోని కదా వివరాలు తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-14-ఉయ్యూరు