
‘రుక్కు తల్లి’ రచయిత: కీ.శే. మునిమాణిక్యం నరసింహారావు
ఈ నవలను 1958లో కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్. రాజమండ్రి వారు అచ్చు వేశారు. సాంఘిక నవలలు పూర్తి విషాదభరితంగా రాయటం అప్పటికి తెలుగులో తక్కువ. గంభీరమైన వస్తువుని తీసుకుని పాఠకులని రంజింపజెయ్యటం కత్తిమీద సాములాంటిది. కావాలనే మునిమాణిక్యంవారు ఈ ప్రయత్నం చేపట్టారనిపిస్తుంది. మృధువైన సరస శృంగారం, సున్నితమైన హాస్యం కాంతం కథల అంతర్వాహిని. ఆ వాహిని అడుగున, హాస్యాన్ని పండించే ఆ బలం వెనుక, ఓ గంభీరత, జీవితపు మౌలికత వున్నాయి. ఆ మూల శక్తి నవలా రూపమే “రుక్కు తల్లి”. ఈ నవలా శిల్పం విషయంలోనూ కొత్త పద్ధతి అవలంభించారు మునిమాణిక్యంవారు. రుక్కుతల్లి స్మృతి గ్రంథంలా వుంటుంది. రుక్కుతల్లి గురించి కుటుంబ సభ్యులు అందరూ చెప్పుకునే స్మృతులుగా నడుస్తుంది కథ.
రుక్కమ్మ తండ్రి ఆరంభించినట్టు కథ మొదలవుతుంది.
‘అది ఆశ్వయుజ బహుళ అమావాస్య. బైట అంతా చిమ్మ చీకటి. మునిసిపల్ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. బొంయ్‌మంటూ గాలి వీస్తున్నది. ఆ గాలి దొడ్లో చెట్లను, ఇంటికప్పును కౌగలించుకుని ఏడ్చి, మైదానంమీదపడి ఏడుస్తూ ఎక్కడికో వెళ్లిపోయింది. చీకటి పడింది’ ఇదీ నవల ఆరంభం. నవలాంశంలోని విషాదం ప్రకృతిలో ప్రతిబింబించేలా ఆరంభించారు.
భార్య పోయిన వెంటనే, ఆ ఇంటికి కూతురు రుక్కుతల్లి ఎలా ఇంటిపెద్దయి బాధ్యతలు స్వీకరించిందో చెప్పాడాయన. తోడబుట్టిన వాళ్ళని కంటికి రెప్పలా కాచుకోవటం, తండ్రికి కావాల్సిన సదుపాయాలు కూర్చటం, వంటావార్పూ చూసుకోవటం… చెపుతుంటే ఉట్టిమాటలేకానీ, చేతల్లో అదో పెద్ద బాధ్యత, ఎంతో అనుభవం వున్న ఇల్లాలు చెయ్యగలిగిన పని. రుక్కు తల్లికి పధ్నాలుగేళ్ళు మాత్రమే. ఆ కబుర్లు అలా సాగుతుండగా, రుక్కుతల్లి బామ్మ… “ఇదంతా ఎందుకర్రా, రాధాయకు జ్వరం వచ్చినప్పుడు రుక్కు పడిన యాతన ఇంతా, అంతానా! చూచిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు” అంది. ఆ విషయాలు వివరంగా చెప్పమన్నారు చుట్టూ వున్నవాళ్ళు. ఆవిడ చెప్పటం ఆరంభించింది.
రాధాయకు పెద్ద పెట్టున జ్వరం వచ్చింది. మామూలుగా చూపించే డాక్టరు చలపతిరావు గారికి చూపించారు. నూటనాలుగు, నూరు అయిదు డిగ్రీలు. వారం అంతా అలాగే గడిచింది. రెండో వారం జ్వర తీవ్రత ఇంకా హెచ్చింది. పసివాడు చాలా నీరసించిపోయాడు. రుక్కు హడలిపోయింది. ఒక్క నిమిషమైనా వాడిని వదిలి వుండేది కాదు. ఎప్పుడూ రాధాయ పక్కనే పడుకునుండేది. పక్క వదిలి లేచిందో రాధాయ కెవ్వున కేకవేసి ఏడ్చేవాడు. అక్కని కదలనిచ్చేవాడు కాదు. డొక్కలో దూరి పడుకునేవాడు. అన్నం తినటానికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు.
సరిగ్గా అదే సమయంలో రుక్కుతల్లి చెల్లెలు సుశీల పెళ్ళి. పెళ్ళికి తెనాలి అలాగే జబ్బు పిల్లాడితో వెళ్ళారు. పెళ్ళి సమయం అంతా రుక్కుకి తమ్ముడి ఆందోళనే. ఆ తర్వాత ఆ జ్వరం మరీ పెరిగింది. పిల్లాడికి రక్త విరోచనాలు ఆరంభమయ్యాయి. పరిస్థితి చెయ్యి జారిపోతుందేమో అనిపించే సమయంలో నిష్టగా రుక్కు దేవీ పూజ చేసింది. అద్భుతం జరిగినట్టు రాధాయకి జ్వరం, అనారోగ్యం తగ్గుముఖం పట్టాయి. రుక్కుతల్లి కఠోరశ్రమ, గురి రాధాయని బ్రతికించాయని అందరూ అనుకున్నారు. తల్లి లేకుండా చెల్లెలి పెళ్ళి, తమ్ముడి ఆందోళన చెరోవైపు దిగలాగుతున్నా, ఎంతో పెద్ద తరహాగా రుక్కుతల్లి చూపించిన నిబ్బరం అందరికీ అబ్బురమైంది. ఇక్కడ మునిమాణిక్యం నరసింహారావు గారు ఉత్తరం రూపంలో రాసిన మాటలు గుండెల్ని పట్టుకుంటాయి. ఓ పధ్నాలుగేళ్ళ పిల్ల పెద్ద తరహాలో మాట్లాడే ఆ పలుకులు ఏ మాత్రం అజాగ్రత్తగా రాసినా, ముది పేరక్క కబుర్లైపోయే ప్రమాదం వుంది.
“ప్రతివాళ్ళూ వచ్చి రాధాయ బుగ్గగిల్లి, మా తండ్రే! ఎంత పాటు పడ్డావురా నాయనా! ఆ భగవంతుడు సరిగ్గా చూశాడు అని ముద్దు పెట్టుకుని పండో, ఫలమో వాడి చేతుల్లో పెడుతున్నారు. వాడు మళ్లీ నలుగురిలో పడ్డందుకు ఎంతో సంతోషంగా వుంది” తెనాలి నుంచి రుక్కు తండ్రికి రాసిన ఉత్తరంలో మాటలు ఇవి.
ఈ మాటల్లో నుడికారం మొత్తం దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తుంది. తమ్ముడు చచ్చి బ్రతికిన ఆనందం, నలుగురి ఆదరం, తండ్రితో ఇదంతా ఉత్తరం ద్వారా పంచుకోవటం… ఇవన్నీ ఏక కాలంలో, కొద్ది వాక్యాలలో సాధించారు రచయిత.
రాధాయ దగ్గర్నుంచి జ్వరం రుక్కుతల్లికి అంటుకోవటం, అది న్యూమోనియాగా మారటం, రుక్కుతల్లి యాతన, ఆమె మేనమామ సత్యం ఆవేదన, తండ్రి నరక యాతన, ఆ ఇంటి పెద్ద సత్యం అత్తగారు రాజమ్మగారి సూటిపోటి మాటలు, తల్లిలేని పిల్ల రుక్కుకి తలదువ్వేవారు లేక విపరీతంగా పేలు పట్టి, కొద్దిగా మిగిలున్న ఆ పిల్ల రక్తాన్ని పీల్చటం, మంచం మీదికి చీమలు రాకుండా, మంచం నాలుగు కోళ్ళు, నీళ్ళు పోసిన పళ్ళాలలో పెట్టడం లాంటి ఎన్నో సూక్ష్మాతిసూక్ష్మ విషయాలు వివరించాడు రచయిత. జ్వరంపడిన మనిషిమీద ప్రేమ, ఇంటినంతా రోగగ్రస్తం చేస్తుంది. ఆ దిగులు కనిపించకుండా అందరినీ కమ్ముకుంటుంది. రోగం వచ్చిన వాళ్ళ చుట్టూ వుండేవాళ్ళ ప్రవర్తన మానవత్వానికి గీటురాయిగా తీసుకోవచ్చు. ఇలాంటి అంశాలవల్లే ఇంత దిగులు. కథా ఆసక్తిగా చదువుతాం. చూపులనుంచి జారిపోయే జీవితం చూపించటం ఓ కళ. నిత్యం కళ్ళముందు కనిపిస్తున్న మన మనసుకి ఎక్కని విషయాల్ని హత్తుకునేలా రాయటం రచనా ప్రక్రియ బలం.
సహజంగా మన నమ్మకాలకి ఆవల వుండే విషయాలు కొన్ని ఈ నవలలో వున్నాయి. చనిపోయిన రుక్కు అమ్మగారు రుక్కుకి కనపడటం. రుక్కుకి జబ్బుగా వున్నప్పుడు వచ్చి పక్కలో కూచోవటం, రుక్కు తండ్రికి కూడా ఇలాగే భార్య కనిపించిన భావన. దేవతని ప్రార్థించి రుక్కు తమ్ముడి జ్వరాన్ని తను తీసుకోవటం, తమ్ముడు రాధేయ చావుని తనమీద వేసుకోవటం లాంటి దైవిక సంఘటనలున్నాయి. కానీ ఇప్పటికీ ఇలాంటి నమ్మకాలు కొందరిలో వున్నాయి. ఇలాంటి ఈ రకం రచనాతీరు, ఈ నవలకి సాంద్రతని కూర్చిందేకానీ, పలచన చెయ్యలేదు. సెంటిమెంట్‌లా తోచే ఎన్నో సంఘటనలు “రుక్కుతల్లి”లో వున్నాయి.
రుక్కు తన మేనమామ గురించి చెబుతూ… “పదిహేనేళ్ళ కిందట మొదటిసారి నేను కళ్ళు తెరిచినప్పుడు, ముందుగా చూచింది మామయ్యనే! నేను తల్లి గర్భంలోంచి మామయ్య చేతుల్లో పడ్డానుట! అప్పటినుండి మామయ్యకు నామీద ప్రేమ, నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడే మామయ్య నన్ను ఎత్తుకు ఆడించాడు. నాకు ప్రాణాధారమైన అన్నం తినటం నేర్పింది కూడా మామయ్యే! ఒక్కటే కోరిక ఉందమ్మా. మామయ్యను చూస్తూనే పోవాలని ఉంది”
“దేవి, ఆజ్ఞ! నా ప్రాణం కానుకగా ఇచ్చాను! నేను ఉంటే మామయ్య నాకు సహాయం చేయటం, ప్రేమ వర్షించటం మానడు. ఇది చూసి మామయ్య అత్తగారు రాజమ్మగారు దుఃఖపడక మానదు. తద్వారా మామయ్య కాపురంలో కలతలు. నేను లేకపోతే ఇవన్నీ ఏవీ ఉండవు. దేవీ ఆజ్ఞ ప్రకారం ఎట్లాగో పోవాల్సిందే. ఇది కూడా కలిసొస్తుందని సంతోషిస్తున్నా” ఇవీ రుక్కుతల్లి భావాలు.
చివరి దశలో సత్యం రుక్కుతల్లి తలని తన తొడపై పెట్టుకున్నాడు. అది మామయ్యనే నమ్ముకుంది. మామయ్య దేముడనుకుంది. మామయ్య చేతుల్లోనే అది పుట్టింది. మామయ్య చేతుల్లోనే ఉంది.
రుక్కుతల్లి అలాగే పరలోకాలకు తరలిపోయింది. మేనమామ మేనకోడళ్ళ ఆప్యాయ బంధం, తండ్రీ కూతుళ్ళ బంధాన్ని మించి కనపడటం “రుక్కు తల్లి” నవలలో చూస్తాం. ఇదో భిన్న సంప్రదాయాంశం.
ఓ పధ్నాలుగేళ్ళ పిల్లని కథానాయికనిచేసి, ఆ పిల్ల త్యాగాల్ని, దైన్యాల్ని రసభరిత రచనగా తీర్చి దిద్దగలగటం గొప్ప విషయం. ఈ నవలలోని ఓ ప్రతిపాదన కలకాలం నిలిచేది. ‘బిడ్డలను ప్రేమతో పెంచటానికి స్త్రీయే కావాలి. స్త్రీ చేసిన త్యాగం పురుషుడు ఎప్పుడూ చెయ్యలేడు. స్త్రీ చూపగల ఓర్పు, సహనము పురుషుడికి తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు. స్త్రీ ప్రేమ స్వరూపిణి’.
ఈ ప్రతిపాదనకి తగినట్టుగానే ‘రుక్కు తల్లి’ నవల రూపకల్పన జరిగింది.
‘బిడ్డలు కన్నతల్లులారా! మీరు పదిమంది చేరి మాట్లాడుకొంటున్నప్పుడు రుక్కు తల్లి పేరు ఒకసారి తలవండి. బుద్ధి తెలిసిన ఏ పిల్లయినా తమ్ముళ్ళను, చెల్లెళ్ళను ప్రేమతో చూడకపోతే రుక్కు కథ చెప్పండి’ అంటూ గురజాడవారి పూర్ణమ్మని గుర్తుతెచ్చేలా ఈ నవల ముగించారు నరసింహారావుగారు.
కుటుంబంపట్ల ఆడపిల్లకి ఉండే అపరిమిత అనురాగం రుక్కు తల్లి నవల. ఆనాటి కుటుంబ సంప్రదాయంలోని బలం అర్థం చేసుకోవటానికి ఈ నవల చదివి తీరాలి.
హాస్య రచయితగా పేరుపొందిన ముణిమాణిక్యం నరసింహారావుగారి గంభీర చింతన, నవలా రచనలోని నవ్యరీతి, జీవితపు పొరల్లోని మానవతా చ్ఛాయల్ని ఆయన పట్టుకున్న తీరు విలక్షణమైంది. విషాదభరిత రస కావ్యం ‘రుక్కు తల్లి’.