—
రాబందుల్లా మిగిలిపోవద్దు.. గరుడ పక్షిలా ఎదగండి

మనపై గౌరవం తగ్గేందుకు కారణం మనమే
గౌరవం డిమాండ్ చేస్తే రాదు.. ప్రజలు ఇవ్వాలి
గెలిచే వరకే పార్టీలు.. తర్వాత అందరి కోసం పనిచేయండి
ప్రజాప్రతినిధుల అవగాహన తరగతుల్లో స్పీకర్ సుమిత్రా మహాజన్
హైదరాబాద్, జులై 19(ఆంధ్రజ్యోతి): ‘గరుడ పక్షి… రాబందు రెండూ ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతాయి. రెండూ పక్షి జాతికి చెందినవే. కానీ గరుడ పక్షికి మనం ఇచ్చే గౌరవం ఎక్కువ. అది దేవుడి వాహనం. రాబందుకు ఆ గౌరవం లేదు. అది మృత కళేబరాల్లో మిగిలిపోయిన మాంసం కోసం తిరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నిత్యం మననం చేసుకోవాలి. మనం గరుడ పక్షిలా ఉండాలా.. లేక రాబందులా మిగిలిపోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ప్రజల కోసం పనిచేసేవారికి గరుడ పక్షిలా ప్రజల మనన్న దక్కుతుంది. ప్రజల మీద బతికేవారిని రాబందుల్లా చీదరించుకుంటారు. లక్షల మందిలో మీకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి’ అని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక్కడ నిర్వహిస్తున్న అవగాహన తరగతుల్లో భాగంగా శనివారం ఆమె ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాప్రతినిధులకు ఇటీవలి కాలంలో ఎందుకు గౌరవం తగ్గుతోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వేసిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పారు.
’దానికి కారణం మనమే. గౌరవం డిమాండ్ చేసి తెచ్చుకొనేది కాదు. ప్రజలు వారంతట వారు ఇవ్వాలి. మీలాగా నేనూ రాజకీయవేత్తనే. నా నియోజకవర్గానికి మీలో ఎవరైనా వెళ్లి నేను తప్పు చేశానని విమర్శిస్తే చాలా మంది ప్రజలు ఖండిస్తారు. నాపై వారిలో ఉన్న సదభిప్రాయానికి అది నిదర్శనం. అందుకే నేను నా నియోజకవర్గంలో 8 సార్లు గెలిచాను. మీరూ ఆ స్థాయికి ఎదగాలి. మెజారిటీ నేతలు ఇలా ఉంటే తప్పనిసరిగా రాజకీయ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది’ అన్నారు. ప్రజల ముందు గొప్పగా కనిపించాలని తాపత్రయపడవద్దు. మీరు గొప్పవారని ప్రజలు అనుకోవాలని సుమిత్రా మహాజన్ ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ప్రజలు మీకు ఎంత ఇచ్చారో వారికి అంతకు రెట్టింపు ఇవ్వండి. అప్పుడు మీరు మంచి నాయకులు, మంచి ప్రజా ప్రతినిధులు అవుతారు’ అని వివరించారు.
గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు పార్టీలను పక్కనపెట్టాలి. అందరి మనిషిగా ఎదగాలి.. అలాగే ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ‘నేనూ రాజకీయవేత్తనే. నా వద్దకు నాకు ఓటు వేసినవారు…వేయనివారు ఇద్దరూ వస్తారు. అందరినీ ఒకేలా అక్కునచేర్చుకుంటా. 360 డిగ్రీల కోణం అంటే మొత్తం చుట్టూ చూడటం. ప్రజాప్రతినిధి పనితీరు ఆ రకంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన సుమిత్ర అందరికీ ధన్యవాదాలు అంటూ తెలుగులో ముగించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ఈ సమావేశంలో ప్రసంగిస్తూ మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్రను గుర్తు చేసుకొన్నారు. ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి జ్ఞాపక శక్తి తనను ఆశ్చర్యపరిచిందని, 1984లో ఢిల్లీలో తాను ఏ నెంబర్ ఇంటిలో.. ఏ రోడ్డులో ఉన్నానో ఆయన చెప్పారని.. ఆ విషయం తనకే గుర్తు లేదని ఆమె వ్యాఖ్యానించారు. అతిథులకు మెమొంటోలు బహుకరించే సమయంలో ఆమె తన కోసం ఎంపిక చేసిన నెమలి బొమ్మను కాదని వెంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న జ్ఞాపికను అడిగి తీసుకొన్నారు.