అన్నమయ్య సంగీతమూర్తిత్వం అనంతం! – డా. ఎస్కే ఎండీ గౌస్ బాషా

తాళ్లపాక సాహితీపూదోటలో కొత్త కుసుమాల కోసం వెతుకుతున్న నిత్యాన్వేషి, వేటూరి ప్రభాకరశాసి్త్ర గారి కుమారుడు ఆనందమూర్తి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాధిపతిగా 1990లో
పదవీవిరమణ చేసిన ఆయన, తంజావూరులో మూలన పడి మూలుగుతున్న తాళపత్ర గ్రంథాలను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ‘వివిధ’తో పంచుకున్న జ్ఞాపకాలు, పరిశోధన విశేషాలు..
మీరు ఎప్పటి నుంచి తాళ్లపాక వంశస్థులపై పరిశోధనలు చేస్తున్నారు?
చిన్నప్పటి నుంచే తాళ్లపాక వంశస్థులపై అవగాహన, ఆసక్తి వున్నాయి. మాటల్లో ప్రభాకరశాసి్త్ర గారు నిత్యం వీటిని గురించే చెబుతుండేవారు. సాహిత్యశోధన, యోగసాధన, తాళ్లపాక వంశ పరిశోధనల కారణంగా ఆయనలో ఆధ్యాత్మికత మరింత పెరిగింది. తాళపత్రాల్లో, రాగిరేకుల్లో ఆయన చదివిన, తెలుసుకున్న విషయాలను చెబుతుండేవారు. ఆ ప్రభావం నాపై వుంది. నాపదేళ్ల నుంచే తాళ్లపాక వారిపై పరిశోధన చేస్తున్నట్లే లెక్క.
అన్నమయ్యపై వేటూరి ప్రభాకరశాసి్త్రగారి పరిశోధనలు ఎక్కడ ఆగిపోయాయి? మీరెక్కడ నుంచి ప్రారంభించారు?
ఈ ప్రశ్నకు సమాధానం వివరంగా చెప్పాల్సి ఉంటుంది. 1888వ సంవత్సరంలో కృష్ణాజిల్లాలో జన్మించిన శాసి్త్రగారు 1910 లో యిప్పటి చెన్నైలోని ఓరియంటల్ మాన్యుస్ర్కిప్ట్ లైబ్రరీలో కాపీయిస్టుగా పని చేశారు. అప్పటి నుంచే ఆయన పరిశోధనలను తీవ్రతరం చేశారు. ఎన్నో తాళపత్ర గ్రంథాలను పరిష్కరించి ప్రచురించేందుకు ప్రయత్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పిలుపు మేరకు, తాళ్లపాక వంశ జీవిత పరిశోధనల పై వున్న ఆసక్తితో 1939లో తిరుపతికి మకాం మార్చారు. ఆ తరువాత ఆయన తాళ్లపాక కవుల వాఙ్మయ పరిశోధనపై దృష్టి సారించారు. శాసి్త్రగారి జీవితానికి, తాళ్లపాక వాఙ్మయానికిదొక పెద్ద మలుపు అనే చెప్పుకోవచ్చు. అప్పటికే తాళ్లపాక వారి వాఙ్మయంపై సాధు సుబ్రమణ్యశాసి్త్రగారి కృషితో, పండితులైన వి. విజయరాఘవాచార్యులు, జి.ఆదినారాయణ పరిష్కరణలో మూడు సంపుటాలు ప్రచురితమయ్యాయి. 1925-35 ప్రాంతంలో ఇది జరిగింది. అన్నమయ్య లఘుకృతులు, శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు వేర్వేరు సంపుటాలుగా ముద్రించారు. అయితే సరైన పరిశోధన జరగకపోవడం, ప్రచురణలో లోపం తదితర కారణాల వల్ల అవి అర్ధంతరంలోనే నిలిచిపోయాయి. దాంతో వాటిని ఎడిట్ చేయాలని తితిదే వారు ప్రభాకరశాసి్త్రగారిని కోరారు. అయితే రేకుల మూలంలో ఏముందో తెలుసుకోకుండా ఎడిట్ చేయడం సరికాదన్న ఉద్దేశంతో అన్నమయ్యనాటి రాగిరేకులు కావాలని అడిగారు శాసి్త్రగారు. కానీ అవి కనిపిస్తే గా? వెతగ్గా వెతగ్గా ఓ గదిలో కుప్పగా పోసివున్నాయవి. మొత్తం సుమారు 2500 రాగిరేకులు దొరికాయి. మరో 10 రాగిరేకులు కనిపించకుండాపోయాయి. ఇప్పటికీ అవి దొరకలేదు. వాటన్నింటినీ పరిశీలించి, పరిశోధించి విభాగాలుగా గుర్తించి 4వ సం పుటం పీఠికలో శాసి్త్రగారు ప్రకటించారు. అవి అన్నమయ్య, ఆయన కుమారుడు పెద తిరుమలాచార్యుడు, ఆయన కుమారుడు చిన తిరుమలాచార్యులు రాసినవని తేల్చారు. అన్నమయ్య కాలంనాటి రాగిరేకుల మందం వేరు, వాటి బరువు వేరు. ఇక మిగిలిన ఇద్దరి కాలం నాటి రాగిరేకుల మందం వేరు. అంతేగాక అన్నమయ్య నాటి రాగిరేకులకు రంధ్రం ఒకలా, మిగిలిన యిద్దరి రాగిరేకులకు మరో విధంగా వున్నాయి. అంతేనా, వాటిపై సూక్ష్మంగా వారి పేర్లను సూచించే చిహ్నాలూ వున్నాయి. వీటన్నింటినీ పరిశోధించి వేరు చేశారు. మళ్లీ యిందులో శృంగారపరమై న కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలుగా వేరు చేశారు. ఆనక ఎడిట్ చేసి 1949లో వాటిని ముద్రించారు. 4వ సంపుటం సగభాగం ఎవరో చేశారు. 5వ సంపుటం మాత్రం పూర్తిగా శాసి్త్రగారి కృషి ఫలితమే. అదేవిధంగా ఆధ్యాత్మిక సంకీర్తనలు కూడా. అన్న మయ్య మనవడు తాళ్లపాక చిన్నన్న రచించిన ‘అన్నమాచార్య చరిత్ర’ గ్రంథాన్ని పరిష్కరించి ప్రచురించారు. అప్పటి నుంచే అన్నమయ్య జీవితం, సాహిత్యం, సంకీర్తనలు బాగా వెలుగులోకి వచ్చాయి. అప్పుడే అన్నమయ్య మూర్తి సాక్షాత్కరించింది. తద్వా రా వెంకటేశ్వరుని మహాత్మ్యం కూడా దశదిశలా వ్యాపించింది. మహామహా పండితులకు తప్ప వేరెవ్వరికీ తెలియని అన్న మయ్య, ఆయన సాహిత్యం ఈరోజు సాధారణ ప్రజానీకానికి కూడా బాగా తెలిసొచ్చిందంటే అందుకు ప్రధాన కారణం ప్రభాకరశాసి్త్రగారే. రాగిరేకులపై సంకీర్తనలు లభించాయి. కానీ స్వరా లు లేవు. రాగతాళాలు మాత్రమే తెలియజేశారు. దాంతో విద్వాంసుల చేత వాటిని పాడించేందుకు ప్రయత్నించారు. సంపుటాల్లోని కొన్ని పాటలను తీసి ఒక పుస్తకంగా వేసి గాయకుల చేత పాడించారు. మొట్టమొదట అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభించింది ఆయనే. అప్పట్లో ఒక రోజు చంపక ప్రదక్షిణం వద్ద రెండు రాళ్లు కనిపించాయి ఆయన శిష్యగణానికి. వాటిపై ఏవో అక్షరాలున్నట్లు వారు చెప్పడంతో అక్కడికెళ్లి చూసి, వాటిని తెప్పించుకున్నారాయన. అవి ఇప్పుడు తిరుమల మ్యూజియం వద్ద వున్నాయి. ఆ రాళ్లపై వున్న అక్షరమాలను పరిష్కరించా లనిఆయనెంత తపనపడ్డారో చెప్పలేను. ఏడడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు, తొమ్మిదంగుళాల మందం కలిగి వున్నాయవి. ఒకదానిపై ‘2’ అంకె, మరో దానిపై ‘4’ అంకె వేసి వున్నా యి. రెండవ దానిపై 94 పంక్తులు, నాల్గవ దానిపై వంద పం క్తుల వరకూ వున్నాయి. అవి స్వరంతోటి, సాహిత్యంతోటి కలిసి వున్నాయి. అలా స్వరసాహిత్యాలు కలిసి వున్న ఆ శిలల్లోని సం గీతం బయటకు రాలేదు. వాటిని పరిష్కరించి ప్రకటిస్తామని 1949లో శాసి్త్రగారు చెప్పారు. సంగీత శాసనం బయటకు తెచ్చా రు. కానీ అందులోని సంగీతం బయటకు రాలేదు. అందు కోసం తర్వాత కూడా ప్రయత్నాలు జరిగాయి. అన్నమయ్య సంకీర్తనల్లో 6,7 సంపుటాలకు ఆయనే కాపీ రాయించారు. కానీ అవి ముద్రిం చే లోపే 1950లో పరమపదించారు. అప్పటికి నా వయసు ఇరవయ్యేళ్లు.
ఆ రెండు శాసనాలు అపరిష్కృతంగానే వుండిపోయాయి. నేను ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా, తెలుగు విభాగాధిపతిగా వున్నప్పుడు కూడా ఆ శాసనాల పరిష్కారం కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. ఆఖరికి 1994లో పురావస్తుశాఖతో కలిసి పని చేశాం. రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు కఠోరమైన తపస్సు చేశాం. నాతో పాటు మరో నలుగురు విద్వాంసులు, నిపుణులు కలిసి పనిచేశారు. ఎట్టకేలకు వాటిని పరిష్కరించాం. ఆ కృషి ఫలితమే ‘‘ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము’’ గ్రంథం. దీనిని తితిదే సహకారంతో 1998లో ముద్రించాం. నాన్నగారు సంకల్పించిన పని పూర్తి చేయడానికి 49 ఏళ్లు పట్టింది. ఆ రోజు నాన్నగారు వదిలేసిన దానిని మేం పూర్తి చేశామన్న ఆనందం మాటల్లో చెప్పలేను. ఆ శాసనాల మీద వున్నది ‘సూళాది’ రచనలే. వాటిల్లో దశావతారాలకు సంబంధించిన పది పాటల్ని సీడీ రూపంలోకి తీసుకొచ్చాం.
మీ మాటల్ని బట్టి 20వ శతాబ్దంలో అన్నమాచార్య సారస్వత సాహిత్యమూర్తిత్వం వ్యక్తమైంది సరే! మరి ఆయన సంగీతమూర్తిమత్వం వ్యక్తమవ్వడం ఎలా?
ఇది 21వ శతాబ్దంలో సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. అందుకు ‘‘ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము’’ దోహదపడిందని భావిస్తున్నాను. నిజానికి దీనికి ముడిసరకు తిరుమలలో లేదు. తంజావూరులోని సరస్వతీమహల్ లైబ్రరీలో వుంది. నేను అక్కడున్న పెద తిరుమలాచార్యుని స్వరసహితములైన సంగీత ప్రబంధాలను వెలుగులోకి తీసుకొచ్చాను. తంజావూరులోని తాళపత్రాల్ని ఏపీ ప్రభుత్వం మైక్రోఫిల్మ్ చేయించింది. వాటిల్లోనే నాకు పెద్ద తిరుమలాచార్యుని స్వరసహిత ఝొంబడ ప్రబంధాలు లభించాయి. సంగీత లక్షణకారులు 24 రకాల ఝోంబడ ప్రబంధాలున్నట్లు రాశారు. కానీ ఉదాహరణలు దొరకలేదు. వారికి ఇంచుక తరువాతి కాలంలో వచ్చిన పెదతిరుమలాచార్యుని ఝోంబడ రచనను నేను విశిష్టంగా గుర్తిస్తున్నా. ఇది 25వ రీతి ఝోంబడంగా భావిస్తున్నా. దానిని ‘శ్రీ వెంకటేశ్వరుని ఝోంబడ ప్రబంధం’ అంటాను నేను. ఇలాంటివెన్నో తంజావూరు లైబ్రరీలో పుంఖానుపుంఖాలుగా వున్నాయి. అవి వెలుగులోకి వచ్చినప్పుడు అన్నమయ్య సంగీతమూర్తిమత్త్వం వ్యక్తమవుతుంది.
అన్నమాచార్య ‘చరిత్ర’లో ఆయనకు సంబంధించిన సమగ్ర సమాచారముందని భావిస్తున్నారా?
లేదు. అందులోనే గ్రంథపాతాలున్నాయి. వాటికై మైనంపాటి వారు, వీఏకే వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నమాచార్యులు, వ్యాసయోగి, వల్లభాచార్యులు ముగ్గురూ సమకాలికులు. అన్నమయ్య జీవితచరిత్ర చిన్నన్న రాసినట్లే తక్కిన ఇద్దరి జీవితాలకు కూడా కావ్య రూపాలు వచ్చాయి. వాటిపై తులనాత్మక పరిశోధన జరగాల్సి వుంది.
అన్నమయ్య ఎక్కడ పుట్టాడో, ఎక్కడ తనువు చాలించాడో మీ పరిశోధనల్లో తేలిందా?
ఆయన మాడుపూరులో పుట్టి, తాళ్లపాకలో కన్ను మూసి వుంటారని భావించవచ్చు. అన్నమయ్య జీవితంపై ఎంతో పరిశోధన చేసిన వీఏకే రంగారావుగారూ ఇదే భావాన్ని ప్రకటించారు.
తిరుపతిలో ప్రభాకరశాసి్త్రగారు నివసించిన నివాసం ఇప్పటికీ వుందా?
తిరుపతిలో రాములవారి ఉత్తరమాడ వీధిలో మేం వుండేవారం. అక్కడే శాసి్త్రగారు తుదిశ్వాస విడిచారు. మేం హైదరాబాద్కు మకాం మార్చిన తరువాత ఆ నివాసాన్ని చాలామంది కొనుగోలు చేశారు. ఆ నివాసాన్ని జాతీయ స్మారకమందిరంగా, ప్రదర్శనశాలగా మార్చేందుకు తరువాతి కాలంలో నేను ప్రయత్నించాను. కానీ ఆ యింటిని విడివిడిగా చాలామంది కొనుగోలు చేయడం వల్ల అది సాధ్యం కాలేదు. అయితే అదృష్టవశాత్తు ఆ యింటిలోని ఓ భాగాన్ని ప్రభాకరశాసి్త్ర మిత్రమండలి వారు కొనుగోలు చేశారు. మిత్రమండలి పేరుతోనే రిజిస్టర్ అయి వుంది. ఆ ఇంటిని స్మారకమందిరంగా చేయాలనేది నా కోరిక. ప్రభుత్వం తలచుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇక ప్రభాకరశాసి్త్ర జీవిత సన్నివేశాలకు సంబంధించి మొత్తం 15 వీడియోలు తీశాం. కానీ అవీ బయటకు తీసుకురాలేకపోయాం.2012లో శాసి్త్రగారి జన్మస్థలమైన పెదకళ్లేపల్లిలో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన పుట్టి పెరిగిన నివాసాన్ని లైబ్రరీగా మార్చాలని తితిదే భావించింది. కానీ ఆ యింటి యజమాని దానిని నేలమట్టం చేసేశాడు. దాంతో ఆ ఇంటిని స్మారకమందిరంగా చేయలేకపోయాం. అయితే అక్కడ వేదపాఠశాల పెట్టేందుకు తితిదే ప్రయత్నిస్తోంది. ఆ వూరు సంగీతజ్ఞాని సుసర్ల దక్షిణామూర్తి గారి జన్మస్థలం కూడా కాబట్టి అక్కడ సంగీత పాఠశాల పెట్టేందుకు కూడా తితిదే ప్రయత్నిస్తోంది. ఇతర కవుల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రభాకరశాసి్త్రగారి పేరుతో కూడా నిర్వహిస్తే బావుంటుంది. మేం ఏర్పాటు చేసిన ట్రస్టును తితిదేకే అప్పగించాం. అందువల్ల తితిదే వారే వాటిగురించి చర్యలు తీసుకుంటే బావుంటుంది.
భవిష్యత్తులో దేనిపై పరిశోధనలు చేయబోతున్నారు?
ముందే చెప్పినట్లు అన్నమయ్య సంగీత సారస్వతం వెల్లడి కావాల్సి వుంది. తంజావూరు లైబ్రరీలోని తాళపత్రాలు దానికి మంచి ఆధారమవుతాయి. అక్కడ మనం ఎవ్వరం చూడని, ఎప్పుడూ చదవని చరితను చెప్పే వేలాది తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటి దుమ్ము దులిపిన రోజున అన్నమయ్య సంగీత సరస్వతి బయల్పడుతుంది. దానికోసం శక్తి మేరకు ప్రయత్నం చేస్తా. మద్రాస్ యూనివర్శిటీలోని ఓరియంటల్ మాన్యుస్ర్కిప్ట్ లైబ్రరీలో కూడా చాలా తాళపత్ర గ్రంథాలున్నాయి. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని భాషల వారీగా, ప్రాంతాల వారీగా చూడకుండా జాతి సంపదగా ప్రభుత్వాలు భావిస్తే అవి భద్రంగా వుంటాయి. కానీ ఆ నమ్మకం కనిపించడం లేదు.
ఇంటర్వ్యూ :
Thanks for sharing interesting information about Annamayya. Hope Dr Veturi Anandamurthy garu will unearth valuable insights from the archives and will bring to light. All the best for his efforts.