రీమేక్ చేయడమే చాలా కష్టం – శ్రీప్రియ

‘‘చాలా మంది ‘ఆ.. రీమేకే కదా’ అని ఈజీగా
మాట్లాడేస్తుంటారు. కానీ ఒరిజినల్ స్టోరీని
తెరకెక్కించడం కంటే రీమేక్ చేయడమే చాలా క్లిష్టమైన
వ్యవహారం. హిట్టయిన ఒరిజినల్‌తో రీమేక్‌ను పోల్చి
చెబుతుంటారు కాబట్టి దాన్ని బాగా తీయాల్సిన ఒత్తిడి
ఎప్పుడూ ఉంటుంది’’ అని చెప్పారు శ్రీప్రియ. వెంకటేశ్,
మీనా జంటగా డి.సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి
సంయుక్తంగా నిర్మించిన ‘దృశ్యం’ సినిమాను ఆమె
డైరెక్ట్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం
విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా
సోమవారం ఆమె పత్రికలవారితో సంభాషించారు.
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
మీనా, నదియా నాకు చాలా కాలం నుంచి తెలుసు కాబట్టి వారితో పనిచేయడానికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నేను పెద్ద పెద్ద హీరోలతో కలసి నటించా. ఒక డైరెక్టర్‌కి వెంకటేశ్ వంటి హీరోతో పనిచేయడం ఎంత ఈజీనో. నన్ను ఓ డైరెక్టర్‌గా ఎంతో గౌరవభావంతో చూశారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన రాంబాబు పాత్రకు తెలుగులో ఆయనకంటే బెస్ట్ చాయిస్ ఇంకొకరు ఉండరు. ఆ పాత్రను గొప్పగా చేశారు. ‘దృశ్యం’కు సంబంధించి నాకు పాత్రలకు సరిగ్గా సరిపోయే ఆర్టిస్టులు దొరికారు. పైగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థకు మంచి ప్రొడక్షన్ టీమ్ ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మంచి ప్రతిభావంతులు ఉండటంతో నా పని సులువయ్యింది. అనుకున్నవిధంగా చాలా త్వరగా సినిమాని పూర్తి చేయగలిగాం.
కన్నీళ్లొచ్చాయి
ఒక డైరెక్టర్‌గా ఈ సినిమాని తీసింది నేనే అయినా సినిమాని చూస్తుంటే నాకే కళ్లవెంట నీళ్లొచ్చాయి. అంతగా ఈ సినిమాలో భావోద్వేగాలు పండాయి. ప్రేక్షకులనూ అవి కదిలిస్తున్నాయని సినిమాకి వస్తోన్న ఆదరణ తెలియజేస్తోంది. మంచి సినిమా అయితే అది ఏ తరహా సినిమా అయినా చూస్తామని తెలుగు ప్రేక్షకులు గతంలో ఎన్నోసార్లు రుజువు చేశారు. జానపద చిత్రాలను ఆదరించిన వారే ‘శంకరాభరణం’ వంటి క్లాసిక్నూ అమితంగా ఇష్టపడ్డారు. ఇప్పుడు ‘దృశ్యం’ వంటి ఫ్యామిలీ థ్రిల్లర్‌ను హిట్ చేశారు. సాధారణంగా రీమేక్ అంటే నేటివిటీని మిస్ కాకుండా సినిమా తియ్యడం ఓ సవాలు. తెలుగువాళ్ల, తమిళుల సంస్కృతితో పోలిస్తే మలయాళీల సంస్కృతి భిన్నం. అయితే ‘దృశ్యం’ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ఏ భాషలో తీసినా స్ర్కిప్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. తెలుగులోనూ పెద్దగా మార్పులు చెయ్యకుండానే ఒరిజినల్ స్ర్కిప్టు ప్రకారమే వెళ్లాం. మంచి ఫలితం సాధించాం.
డైరెక్షన్ డిఫికల్ట్
నేను సినీ ఇండసీ్ట్రలో అడుగుపెట్టి ఇది 42వ సంవత్సరం. తెలుగులో కృష్ణ, మురళీమోహన్, మోహన్‌బాబు వంటి హీరోల సరసన చేశాను. ఇప్పుడు వెంకటేశ్‌ను డైరెక్ట్ చేశాను. నటన, దర్శకత్వంలో ఏది సులువంటే నటన అనే చెబుతాను. ఒక రచయిత రాసిన సన్నివేశాన్ని, దర్శకుల సూచనల ప్రకారం నటించడంలో పెద్ద కష్టమేమీ ఉండదు. కానీ దర్శకత్వం అలా కాదు. అన్ని శాఖలనూ సమన్వయపరుస్తూ, సినిమా బాగా రావడానికి బాగా కష్టపడాలి. తెరపై సన్నివేశం పండినా, పండకపోయినా డైరెక్టర్‌దే బాధ్యత. అందుకే డైరెక్షన్ అనేది చాలా డిఫికల్ట్ జాబ్. నేను నటించే కాలంలోనే డైరెక్టర్ చేసే పనిని పరిశీలిస్తూ ఉండేదాన్ని. ప్రాక్టికల్‌గా నేను డైరెక్షన్ నేర్చుకుంది దాసరి నారాయణరావుగారి వద్దే. ఆయన ‘స్వప్న’ సినిమా తీస్తున్నప్పుడు నెల రోజుల పాటు ఆయన వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ఆ అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ‘దృశ్యం’తో కలిపి ఇప్పటికి ఆరు సినిమాలు డైరెక్ట్ చేశా.
ఆమె నా రోల్‌మోడల్
డైరెక్టర్‌గా నాకు రోల్‌మోడల్ విజయనిర్మల గారు. ఒక లేడీ డైరెక్టర్‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకున్న ఆమె అంటే నాకెంతో గౌరవం. ఆమెతో కలసి పనిచేశాను కూడా. తెలుగులో ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టం. ‘మగధీర’లో రామ్‌చరణ్ అన్నా ఇష్టమే. నిత్యా మీనన్ నాయిక గా నేను డైరెక్ట్ చేస్తోన్న ‘మాలిని 22’ షూటింగ్ కొద్దిగా మిగిలుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.