‘’ఉమా సహస్రం ‘’లో ఉమా మహేశ్వర తత్వాన్ని ఆవిష్కరించిన వాశిస్ట గణపతి ముని
ఫిబ్రవరిలో శ్రీ రామనాశ్రమాన్ని సందర్శించినపుడు అక్కడి పుస్తక శాలలో కావ్య కంఠ గణపతి ముని సంస్కృతం లో రాసిన వెయ్యి శ్లోకాల ‘’ఉమా సహస్రం ‘’కొన్నాను .దానికి తెలుగు అర్ధ తాత్పర్య ,వివరణలను శ్రీ పన్నాల రాదా కృష్ణ శర్మ తేలిక భాష లో రాశారు .ఈ నెలలో ఒక వారం కిందటే చదవటం మొదలు పెట్టాను .బ్రాహ్మణ స్వామి అని పిలువా బడే ఆయనకు ‘’భగవాన్ రమణ మహర్షి ‘’అని పెట్టి ,మహర్షి చేత ‘’నాయన ‘’అని అందరిచేతా నాయన గారు అని పించుకున్న గణపతి ముని శ్రీ రమణా స్థాన కవీశ్వరులు .అమ్మవారి పరమ భక్తులు .ఇరవై రోజుల్లో ఉమా సహస్రం రాస్తానని చెప్పి రాయటం మొదలు పెట్టి ,మూడు వంతులు రాసి ,కుడి చేతి బొటన వ్రేలికి వ్రణం ఏర్పడటం వలనకొద్ది రోజులు ఆగి ,ఆపరేషన్ జరిగి కట్టుకట్టటం వల్ల మళ్ళీ ఆగి ,ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండటం రాయాల్సిన శ్లోకాలు 250శ్లోకాలు ఉండటం వలన చివరి రోజు5గురు లేఖకులను ఏర్పరచుకొని ,మహర్షి తన వెనుక ఆశీనులవ్వగా , అయిదుగురికి వరుసగా శ్లోకాలు చెప్పగా వారు రాస్తూంటే అర్ధ రాత్రికి ముందే కావ్యాన్ని ముగించిన అఘటన ఘటనా సమర్ధులు గణపతి ముని .సాకక్షాత్తు వినాయకుని అవతారమే .వెనక ఉన్న భగవాన్ సమాధి స్తితి నుండి లేచి ‘’నేను చెప్పిందంతా రాశావా?’’అని అడిగి ఆశ్చర్యం కలిగిస్తే ,’’అలాగే గ్రహించి గ్రంధాన్ని రాశాను ‘’అని వినయం గా సమాధానం చెప్పారట .ఇదొక అపూర్వ సన్ని వేశమే .
గణ పతి ముని పుస్తకాన్ని ప్రధమ మొదలైన శతకాలుగా శతకం లోని భాగాలను ‘’స్తబకము ‘’లు(పూల గుత్తులు ) గా పేరు పెట్టి ఒక్కొక్క స్తబకం లో 25శ్లోకాలుం డేట్లు ,ప్రతి స్తబకం కధాంశాన్ని బట్టి ఛందస్సును ఉపయోగించి ఎంతో ఛందో వైవిధ్యాన్ని పాటించారు . బహుశా అమ్మవారి దివ్య సుందర విగ్రహాన్ని మనోలోకం లో దర్శించి రాసి ససమర్పించిన భక్తీ తాత్పర్య సుమాలివి .మునికి వేదం ఉపనిషత్ ,శాస్త్ర ,దర్శన పురాణాది గ్రంధాలపై ఉన్న అపారమైన పాండిత్య ప్రతిభకు నిదర్శనం .అమ్మకు ఛందో రూప కదంబ పూల మాల ఇది .మొదటి శతకం మొదటి స్తబకం లో శ్రీ ఉమా మహేశ్వర తత్వావిష్కరణ నన్నెంత గానో ఆకర్షించింది .ఆ వివరాలే మీ ముందుంచుతున్నాను .
మొదటి స్తబకం
మొదటి స్తబకం లో అమ్మ వారి మహా శక్తి తత్త్వ వివరణ వేదోపనిషత్ స్పర్శగా ఉంది .ఆ శక్తి అన్నిటా అవిచ్చిన్నం గా వ్యాపించి ఉంది .యోగం లో కూడా ఆశక్తి తరంగాలు గోచరిస్తాయి .కాని యదార్ధ స్వరూపం కాన రాదు .శక్తి తరంగాలు అంటే శక్తి వివర్తనాలు అంటే రూపాంత రాలు .మనకంటికి కని పించేవి కనిపించని తరంగాలు గా .అనుభవేక వేద్యమే కాని దృష్టికి గోచరించేవి కావు .ఆ మహా శక్తి సత్ స్వరూపుడు ,సర్వ వ్యాపకుడు అయిన పరమేశ్వరుని తపశ్శక్తియే .ఆయన నుండి వేరు చేయటానికి వీలు లేని చిచ్చక్తియే .ఆ శక్తే లీలా దేహ ధారిణి అయిన హైమవతి .అదే మనదేహం లోని కుండలినీ శక్తి .
సత్య స్వరూపుడైన పరమ పురుషుడు ,అన్నిలోకాలకు నాభి యై ,కేంద్రమై సత్యలోకం అన బడ్డాడు . ఆయన నుండి వెలువడి ,అంతటా వ్యాపించే ఆయన సూక్ష్మ శక్తియే తపోలోకం .అఖండ వ్యాపన శీలుడు అని చెప్పటానికే ,అన్నిటికీ ఆద్యుడు అని వివరించటానికే ‘’లోక ‘’శబ్దాన్ని వాడారు .బండి చక్రం నాభి నుండి ఆకులు(కడ్డీలు) చుట్టూ వ్యాపించి ఉన్నట్లు పరమ పురుషుడైన సత్య లోకం లో సర్వ లోకాలు ప్రతిష్టితాలై ఉన్నాయి .వృత్తానికి మధ్య భాగం దాని కేంద్రం అయినట్లే అన్ని లోకాల సముదాయానికి కేంద్రం సత్య లోకం .అదే పరమ పురుషుడు .ప్రాణి నుండి ప్రాణాన్ని వేరు చేయటానికి వీలు లేనట్లు ,పరమ పురుషుని నుండి శక్తిని వేరు చేయటానికి వీలు లేదు .సత్య స్వరూపుడు ,శక్తుడు అయిన పరమ పురుషుని సహజ మైన సూక్ష్మ శక్తి యే తపస్సులేక తపోలోకం .అగ్ని నుండి పొగ వచ్చి అన్ని వైపులకు వ్యాపించి నట్లు పరమ పురుషుని నుండి వ్యక్తం అయ్యే గూడార్దాలన్ని వెలుపలికి వచ్చి అయన శక్తి తరంగాలన్నీ అంతటా వ్యాపిస్తాయి .ఇదే జనో లోకం .గూడార్ధాలు అంటే అవ్యక్త స్తితి లో నుండి పుట్టే ,పుట్టిన ,పుట్ట బోయే అన్ని రకాల జగత్ జీవ ఉపాధులకు ఉపాదాన కారణాలైన పదార్ధాలు అని అర్ధం .పరమ పురుషుని నుండి వాని ఆవిష్కారం ధూమం లాగా ఉంటుంది .అది పరమ పురుషుని తపో జ్వాలల యందంతటా వ్యాపించి జనోలోక మైంది .జనో లోకం అంటే జన్మించే లోకం అని అర్ధం .
పరమ పురుషుని శక్తి సహజ సిద్ధం .దాని స్వభావం కూడా ఆయన లోపల రహస్యం గా ఉన్న పదార్ధాలను ఆవిష్కరింప చేయటమే కనుక జన ,తప ,సత్య అనే మూడు పేర్లుగల త్రిలోకాలు వేరు చేయటానికి వీలు లేవని భావం .వేదాంతులు చెప్పే సత్ చిత్ ఆనంద లక్షణాలు ఏకం ,అద్వితీయం అయిన పరబ్రహ్మ సృష్టి సంబంధం దృష్ట్యా మూడు లోకాలు గా ఉంటాయని గణపతి మునికవి వ్యాఖ్యానించారు .కనుక సత్ –సత్యం ,చిత్ –తపశ్శక్తి ,జనం –ఆనందం .దీని తర్వాతా దక్ష స్వరూపాన్ని ,దాక్షయిణీ జన్మ రహస్యాన్ని దక్ష యాగం కధలో ఉన్న అంతరార్ధాన్ని కవి గొప్పగా వ్యాఖ్యానించారు .వైదిక భాషలో ఉన్న పార్వతీ శబ్దానికి అపూర్వమైన అర్ధాన్ని ఆవిష్కరించారు గణపతి ముని . మొదటి స్తబకం లోని ఇరవై అయిదు శ్లోకాలు ‘’ఆర్యా వృత్తం ‘’లో రాసి అమ్మవారి మహాత్యాన్ని ‘’ఆర్యా మహాదేవతా ‘’అన్న సత్యాన్ని ప్రతిష్టించారు . ఆ విభాగాన్ని తనివి తీరా దర్శిద్దాం .
‘’అఖిల జగన్మాతోమా తమసా తాపేన చాకులా నస్మాన్ –అనుగ్రుహ్నా త్వను కంపాసుదార్ద్రయా హసిత చంద్రికయా ‘’అని ప్రధమ శ్లోకం తో అన్ని లోకాలకు తల్లి అయిన ఉమాదేవి చీకటి,అజ్ఞానం చేత ఆధ్యాత్మిక ఆది దైవికాలన బడే మూడు తాపాల చేత పీడింప బడే మమ్మల్ని దయామృతం తో చల్లనయిన నవ్వు వెన్నెలతో అనుగ్రహించాలి అని ప్రార్ధించారు గణపతి ముని .తర్వాత సమస్త వస్తువుల్లో యెడ తెగ కుండా ప్రవహిస్తూ దేశ కాల పరిమితుల్లేని ఆలోచన కల యోగం లో దర్శింప తగిన తరంగాలుకలిగి జరామరణ ములకు అతీతమైన ,ఇలాంటిది అని వివరించటానికి వీలు లేని మహా శక్తికి నమస్కరించారు .ఆ శక్తి పర మేశ్వరుని చుట్టూ వ్యాపించిన తపశ్శక్తియే అని ఆమె యే లీలా స్వరూపం లో హైమవతి –పార్వతి అయిందని ,ఆమెయే కుండలినీ శక్తి అని కీర్తించారు .పొగ మధ్య ఉన్న వేడిమి వంటి శుద్ధ జ్వాలతో సమానమైన శక్తినే కొందరు స్వర్గం అన్నారు .పొగ లాంటి జనోలోకం అవధులు లేనిది .ఈజనోలోకాన్నే వ్యోమం ,అంతరిక్షం ,గగనం అనే పేర్ల తో పిలిస్తారు .
జనోలోకం లో ఆకాశం అనే ఉపాధి సంపర్కం తో ఇలాంటి వాడు అని నిర్వచించ టానికి వీలు లేని అవ్యక్తుడైన పరమ పురుషుడి కంటే వేరుగా చెప్ప బడే స్వాభిమానం గల ఒక వ్యక్తీ జన్మించాడు .కాంతి మార్గం అయిన జ్వలించే ఆకాశ రూపం అయిన ఈ జనోలోకామే దక్షుడు అని గూఢ భాషలో చెప్పారు .ఆ దక్షుడి గర్భాన జనించిందే దాక్షాయణి .జ్వలిత ఆకాశం దక్షుడు అయ్యాడని చెప్పటానికి ‘’అదితేర్దక్షో అజాయత దక్షాద్వాదతిః పరి ‘’అని వేదమే చెప్పింది .అదితి నుండి దక్షుడు పుట్టాడు దక్షుడి నుండి అదితి జన్మించింది .పరమేశ్వరుడికి అభిమాని అయిన శక్తి దక్షాత్మ ప్రకాశానికి ముందు కూడా ఉంది .ఈ విషయాన్నీ ‘’సత్యా ‘’అనే మాట తో చెప్ప బడింది శ్లోకం లో .సతీ శబ్దం కూడా సర్వదా ఉంటుంది అని సత్యా శబ్దం లానే అర్ధాన్ని చెప్పింది .నిజం గా దక్షుడనే పేరు గల ఆకాశానికి జనని అయిన శక్తి లక్షణా వ్రుత్తి చేత పుత్రిక వుతుంది .ఈ విధం గా అదితి నుండి దక్షుడు ,దక్షుడి నుండి అదితి జన్మించాయని చెప్పిన వేద వచాన్ని సమర్దిన్చాడుకవి .జనని అయిన శక్తికి లక్ష్యార్ధం ‘’ సుత ‘’అంటే పుత్రిక అవుతుంది
‘’జగతాం మాతా పితరౌ సతీ భవౌ కేపి పండితాః ప్రాహుహ్ –అదితి ప్రజా పతీ తావ పరేషాం భాషయా విదుషాం ‘’అని పద మూడవ శ్లోకం లో స్తుతించారు ముని .అంటే లోకాలకు జననీ జనకులు దాక్షాయణీ శివులు అని కొందరు పండితులు చెప్పగా ,మరి కొందరు ఆ జగజ్జననీ జనకులే అదితి కశ్యపులని పురాణ కధనం గా చెప్పారని అర్ధం .కేన ఉపనిషత్ చెప్పిన దాన్ని శ్లోక బద్ధం చేసి లోకం లో కళ్ళున్న వాళ్ళలో దేవేంద్రుడు ధన్యుడని కారణం ఆది మహిళ అయిన ఉమా దేవిని మొదటి సారి చూడ గలిగాడని మిగిలిన దేవతలేవ్వరికీ ఆ భాగ్యం కలగ లేదని చెప్పారు .ఇంకో శ్లోకం లో ఉత్తమ సౌందర్య స్త్రీలలో మొదట గా చెప్ప దగినది గౌరీ దేవి అని కొందరు అంటే ,హిమాలయం దేవతాత్మ అని కాళిదాస మహాకవి కుమార సంభవం లో చెప్పాడన్నారు .
వేద భాషలో మేఘాన్ని పర్వతం గా భావించారు .ఆ పర్వతం నుండి వచ్చిన గంభీర ఘోష కల సహింపరాని విద్యుచ్చక్తి జనించింది .నిరుక్తం లో మేఘానికి ఉన్న ముప్ఫై పేర్లలో పర్వతం అనే పేరు కూడా ఉంది . అంత రిక్షం తన రేణు సమూహం నుండి ఆహారాన్నిస్తోందని కాని పరమేశ్వరుడికి ఇవ్వటం లేదని దక్ష యజ్న పరం గా ఇరవై ఒకటవ శ్లోకం చెప్పారు గణపతి ముని .దీనికి వివరణ –ఆకాశమే దక్షుడు .దక్షుడి నుండే అన్నీ పుట్టాయి .అన్ని ఆయన్నుంచే వచ్చాయి ఈ సామగ్రి సృష్టికే ఇవ్వ బడుతున్దికాని పరమ పురుషుడైన ఈశ్వరునికి ఇవ్వ బడదు అని దక్ష యజ్ఞం లో శివుడికి దక్ష ప్రజాపతి హవిర్భాగాన్ని ఇవ్వక పోవటాన్ని సమర్శించారు కవి ముని .శక్తి అంతా వ్యాపించి ఉన్నా అది రహస్యం గా ఉంటుంది కనుక మామూలు దృష్టికి గోచరం కాదు .నష్టం అయినట్లు కనిపిస్తుంది .అందు చేతనే దక్ష యజ్ఞం లో సతీ అంటే దాక్షాయణి నిర్యాణం చెప్ప బడింది అంటారు ముని –‘’వ్యాప్తాపి యన్నిగూఢా బహి రీక్షక బుధ్యపేక్ష్య యా –శక్తిర్యాగే తస్మిన్నవసానం తదుదితంసత్యాః ‘’అని శ్లోకం లో ఆ రహస్య భావాన్ని బంధించారు .
‘’పర్వత నామనో వైదిక భాషాయాం యదియ మతి బాలా శక్తిహ్ –ఘనతో భవతి వ్యక్తా తదభిహితం పార్వతీ జననం ‘’అంటారు .అత్యంత బలం ఉన్న ఈ శక్తి వేద భాషలో పర్వతం అని పేరుగల మేఘం నుండి పుట్టింది ,అదే పార్వతీ జననం అన్నారు .పర్వతం నుండి పుట్టిన్దికనుక పార్వతి పర్వతం అంటే మేఘం కనుక మేఘం నుండి పుట్టిన శక్తియే ఉమా దేవి అనే పార్వతీదేవి అని భావన .అంటే ఆమె విద్యుత్కాంతి స్వరూపిణి అన్న మాట .భూలోక వాసులమైన మన బోటి వారిని అనుగ్రహించటానికే హిమాలయ పర్వతం లో పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై ఉన్నారని .ఇది భక్తులను అనుగ్రాహించటానికి వారు చేసిన లీలా విలాసం అని గణపతి ముని ‘’తే జోమ్షతః శివా విహా హిఆచలేనుగ్రహాయ భూమి జుషాం –దత్తోయ త్సాన్నిధ్యం లీలా చారిత్ర మాన్య దిదం ‘’అని ఇరవై నాలుగవ శ్లోకం లో చెప్పారు .ఇరవై అయిదవది అయిన మొదటి స్తబకం లోని చివరి శ్లోకం లో ‘’ఆర్యా వృత్తం ‘’ లో రచింప బడిన ఈ శ్లోకాలు వేదాది శాస్త్ర సమ్మత మైన భావాన్ని తెలుసుకున్న వారు శివుని పట్టపు రాణి జగన్మాత అయిన ఉమా దేవి స్వరూపం గానే తెలుసుకొంటారు అని ముగించారు ‘.
‘’ఏ తేషామార్యాణాం జానం తః శాస్త్ర సమ్మతం భావం –జానీయు ర్భవ మహిషీం భువనానా మంబికాం దేవీం ‘’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-4-ఉయ్యూరు