సంస్కృతం జనని సమస్త భాషలకు అని చెప్పిన హెబ్బార్ నాగేశ్వర రావు-ఆంద్ర భూమి

‘జనని సమస్త భాషలకు..’’

  • – హెబ్బార్ నాగేశ్వరరావు
  • 24/07/2014
TAGS:

ఆగస్టు నెల రెండవ వారంలో ‘సంస్కృత భాషా సప్తాహం’ జరపాలని ‘కేంద్రీయ ఉన్నత విద్యామండలి’ వారు నిర్ణయించడం హర్షణీయ పరిణామం. కేంద్రీయ ఉన్నత విద్యామండలి- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- ఆధ్వర్యంలో పదిహేను వేల అధికార పాఠశాలలు నడుస్తున్నాయట! ఈ పాఠశాలలన్నింటిలోను సంస్కృత భాషా వారోత్సవం జరిపించడం ద్వారా యువజనులలో సంస్కృత భాషా వినిమయం పట్ల మక్కువను మరింతగా పెంపొందించాలని ‘కేంద్రీయ ఉన్నత విద్యామండలి’- సిబిఎస్‌ఇ-వారు భావిస్తున్నారట! ఇలా మక్కువ పెంపొందడం వల్ల ‘సిబిఎస్‌ఇ’కి అనుబంధంగా ఉన్న వేలాది ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలలో సంస్కృత భాషను అభ్యసించే విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య పెరగవచ్చు! కానీ హిందీ వలె, ప్రాంతీయ భాషలవలె సంస్కృత భాషను మొదటి భాషగా మొదటి తరగతి నుండి అభ్యసించే వసతి అన్ని ‘సిబిఎస్‌ఇ’ పాఠశాలలలోను లేదు! అన్ని భారతీయ భాషలకు సంస్కృతం మూల భాష! ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలోని భాషలకు కూడ సంస్కృత భాష మాత్రమే మాతృక! ఆంగ్లేయులు, వారి మానసపుత్రులు, వారి ఔరసులు కాదని చెప్పినంత మాత్రాన, కృత్రిమ భాషా చరిత్రలను మన నెత్తికెత్తినంత మాత్రాన అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషా రూపాంతరాలు కాకుండాపోవు! తెలుగు, తమిళ, హిందీ, అస్సామీ, కశ్మీరీ, మరాఠీ, సింహళ, బోటీ భాషలతో సహా కొలంబోనుండి కైలాసం వరకు గాంధారం నుండి కామరూప వరకూ విస్తరించిన భారతీయ భాషలన్నీ సంస్కృత భాషకు రూపాంతరాలే! అందువల్ల సంస్కృత భాషను అభ్యసించడంవల్ల అధ్యయనం చేయడంవల్ల ఆయా ప్రాంతీయ భాషలలో మన ప్రావీణ్యం మరింత పెరుగుతుంది! అందువల్లనే రాజ్యాంగ పరిషత్‌లో భారత రాజ్యాంగ రచన జరిగిన సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కృత భాషను కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాషగా ప్రకటించాలని కోరారు! ఆయన కోరిక నెరవేరి ఉండినట్టయితే ప్రస్తుత భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యమై ఉండేది!
భాషను ఒకటవ తరగతి నుంచి అభ్యసించినప్పుడు మాత్రమే భాషా పరిజ్ఞానం విద్యార్థి మనస్సులో వ్యవస్థీకృతవౌతుంది! ‘సిబిఎస్‌ఇ’ పాఠ్యక్రమం- సిలబస్‌లో సంస్కృత భాషను మొదటి భాషగా ఒకటవ తరగతి నుండి పదకొండవ తరగతి వరకు అభ్యసించడానికి వీలుంది! కానీ ‘సిబిఎస్‌ఇ’ పాఠ్యక్రమం బోధిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు అందుకు వీలు కల్పించడం లేదు. అధ్యాపకులను నియమించడం లేదు. ఇలాంటి అవకాశం ఉందన్న విషయాన్ని ఒకటవ తరగతిలో తమ పిల్లలను చేర్చే తల్లిదండ్రులకు చెప్పడం లేదు. ఫలితంగా ‘సిబిఎస్‌ఇ’ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు ఇంగ్లీషును హిందీని కాని, ఇంగ్లీషును ప్రాంతీయ భాషను కాని మొదటి రెండు భాషలుగా ఎంపిక చేసుకొని ఒకటవ తరగతి నుంచి చదువుతున్నారు! ఐదవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే మూడవ భాషగా కొంతమంది విద్యార్థులు సంస్కృత భాషను చదివిన లాంఛనాన్ని పూర్తిచేస్తున్నారు. తొమ్మిదవ తరగతి నుంచి ఈ చదివిన సంస్కృతాన్ని మరచిపోతున్నారు! సంస్కృత భాషా వారోత్సవాలను నిర్వహించడం వల్ల సంస్కృత భాషను ఇష్టం ఉన్న విద్యార్థులు మొదటి భాషగా ఒకటవ తరగతి నుంచి నేర్చుకొనటానికి వీలైన వ్యవస్థ ప్రతి ‘సిబిఎస్‌ఇ’ అనుబంధ పాఠశాలలోను తప్పనిసరిగా ఏర్పడాలన్న ధ్యాస పెరిగితే ఉత్సవాలకు సార్థకత ఏర్పడుతుంది!
సంస్కృత భాషా మాధ్యమంగా బోధించే విద్యావ్యవస్థ రూపుకట్టకపోవడం స్వతంత్ర భారతదేశం అమెరికాలాగా బ్రిటన్ లాగా స్వరూప స్వభావాలను సంతరించుకొని ఉండడానికి ప్రధాన కారణం! భాషను భాషగా మాత్రమే నేర్చుకొనడంవల్ల అది సాహిత్యానికి లేదా గ్రాంథిక రూపానికి పరిమితమైపోతుంది. సర్వజీవన రంగాలలో భాషా ప్రభావం ప్రస్ఫుటించాలంటె ఆ భాష బోధనా మాధ్యమంగా వికసించాలి! బోధనా మాధ్యమంగా అనేక తరాలుగా దేశమంతటా వ్యవస్థీకృతం అయింది కనుకనే అన్ని రంగాలలోను ఆంగ్లభాషా ప్రభావం ప్రస్ఫుటిస్తోంది! విదేశాలనుంచి వ్యాపించిన భాషలు మన దేశంలో బోధనా మాధ్యమాలుగా చెలామణి అవుతుండడంవల్ల ఆయా భాషలలో భౌతిక, సామాజిక, విజ్ఞాన, సాంస్కృతిక శాస్త్ర విషయాలను అభ్యసిస్తున్న వారి మానసిక ప్రవృత్తి సహజంగానే ఆయా విదేశాల పట్ల మక్కువ కలిగి ఉంటోంది! విద్యావంతులు స్థానికతకు భారతీయ జీవన పద్ధతులకు దూరం కావడానికి ఇది దశాబ్దులపాటు దోహదం చేసింది! భారతీయుల అస్తిత్వ సంక్షోభానికి ఇది ప్రధాన కారణం!! ఈ దేశంలో లక్షలాది ఏళ్లపాటు ఉన్నత విద్యాబోధన సంస్కృత భాష మాధ్యమంగా కొనసాగడం చరిత్ర! అందువల్లనే సంస్కృత భాషా మాధ్యమంగా అద్వితీయ సనాతన సంస్కృతి ఈ దేశమంతటా వికసించింది! బ్రిటిష్‌వారి భౌతిక దురాక్రమణ బౌద్ధిక దురాక్రమణను కూడ వ్యవస్థీకరించింది! ఈ కొత్త వ్యవస్థ నడికొనే వరకు ఈ దేశంలోని అన్ని ప్రాంతాలలోను సంస్కృత భాష మాధ్యమంగానే ఉన్నత విద్యాబోధన జరిగింది! క్రమంగా సంస్కృత భాషా స్థానాన్ని ఆంగ్ల భాష ఆక్రమించడం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దినాటి భారతీయుల చరిత్ర! ఈ ‘దురాక్రమణ’ ఇప్పటికీ తొలగలేదు! కనీసం మిగిలిన భారతీయ భాషలలోవలె సంస్కృత భాష మాధ్యమంగా సైతం విద్యాబోధన జరిపించే పద్ధతి కూడ ఆరంభం కాలేదు! అందువల్లనే సంస్కృత భాష కేవలం కావ్య భాష- క్లాసికల్ లాంగ్వేజ్- అన్న అపప్రధ తొలగడం లేదు. ‘సంస్కృత భారతి’వంటి అఖిల భారత వ్యాప్త సంస్థలు సంస్కృత భాషను వ్యవహార భాష- కమ్యూనికేటివ్ లాంగ్వేజ్-గా పునరుద్ధరించడానికి కృషిచేస్తున్నాయి. లక్షలాది మంది దేశంలో సంస్కృత భాషలో నిత్య వ్యవహారం సాగిస్తున్నారు. సంస్కృత భాషామాధ్యమ వ్యవహార గ్రామాలు అవతరించాయి! ఆ గ్రామాలలోని ప్రజలందరూ నిరక్షరాస్యులు సైతం సంస్కృత భాషలోనే పరస్పరం సంభాషించుకొంటున్నారట! వ్యవహారం సాగిస్తున్నారట! కానీ ప్రాథమిక విద్యాబోధన కాని ఉన్నత విద్యాబోధన కాని సంస్కృత భాషామాధ్యమంగా సాగే వ్యవస్థ మాత్రం పునరుద్ధరణకు నోచుకోలేదు!
మన దేశంలో భాషల వికాసం వైవిధ్య భరితమైన వైవిధ్య పరిరక్షకమైన హైందవ జాతీయ స్వభావానికి అనుగుణంగా ఉంది! ‘‘ఒక జాతికి ఒక భాష, ఒక భాషకు ఒక జాతి’’అన్న భాషా జాతీయత అనేక ఇతర దేశాలలో పెంపొందింది. అలాగే, ‘‘ఒక మతం ఒక జాతి, ఒక జాతికి ఒకే మతం’’ అన్న మత జాతీయతలు కూడ పుట్టుకొచ్చాయి! సంకుచిత సమిష్టి స్వభావం, తమది కాని దానిని సహించలేని ఉన్మాద చిత్తవృత్తి ఇలాంటి ‘ఏకరూపత’కు కారణం! భారత జాతీయ సనాతన సంస్కృతి బహుళ రూపాలలో ఏకాత్మతత్త్వాన్ని గుర్తించిన విలక్షణ జీవన పద్ధతి! అనాదిగా అందువల్లనే వైవిధ్యాలు భారత జాతీయ సాంస్కృతిక భూమికపై వికసించాయి! వైవిధ్యాలను వికసింపచేయడం హైందవ జాతీయ సకల భావ సహిష్ణుతకు, సకల తత్త్వసమన్వయబుద్ధికి అనుగుణమైన సహజ పరిణామక్రమం! అతి పెద్ద దేశాలలో ఒకే ప్రధాన భాష ఉంది! చిన్న దేశాలలోను ఒకే ప్రధాన భాష ఉంది. కాని భారతదేశంలో మాత్రం అనాదిగా అనేక ప్రధాన భాషలు వికసించాయి. ఒకప్పుడు దేశంలోని మొత్తం ప్రజలు సంస్కృత భాషను మాట్లాడేవారు. ఆసేతుశీతనగం సంస్కృత భాషలోనే జనజీవన వ్యవహారం కొనసాగింది! కానీ అప్పుడు సైతం వివిధ ప్రాంతాలలో వివిధ సంస్కృత భాషా ప్రాంతీయ రీతులు విలసిల్లాయి! ఈ ప్రాంతీయ రీతులు క్రమంగా ప్రాకృత భాషలుగా పరిణతి చెందాయి! అనేక మతాల మధ్య సమన్వయం కొనసాగినట్టే అనేక భాషల మధ్య కూడ సమన్వయం కొనసాగింది. ఈ సమన్వయం పేరు మళ్లీ సంస్కృత భాష! వైవిధ్యాలను సహించలేక ఇతరుల ‘వాటిని’ విధ్వంసం చేసిన చరిత్ర హైందవ జాతికి లేదు, భారతదేశానికి లేదు! అందువల్లనే సంస్కృత భాష ఒకటిగానే ఉండిపోలేదు, వివిధ భాషలుగా విస్తృతిని సంతరించుకుంది!
ఇలా అనేక ప్రాంతీయ భాషలు సంస్కృతంలో సమాంతరంగా కొనసాగినప్పటికీ దేశంలోని ప్రజలందరూ సంస్కృత భాషను కూడ మాట్లాడారు! ఇది చరిత్రలో ఒక దశ! ఇలాంటి దశ త్రేతాయుగంనాటి రఘురాముని కాలంలో ఉన్నట్టు చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి! సీతారాములు చరిత్రలో భాగం… సీతను వెదకడంకోసం లంకకు వెళ్లిన హనుమంతుడు ఆ యమ్మతో ఏ భాషలో మాట్లాడాలి? అన్న మీమాంసకు గురయినట్టు వాల్మీకి మహాకవి వివరించాడు. సంస్కృత భాషలో ప్రసంగించవచ్చు. కానీ అలా ప్రసంగించినట్టయితే సీతమ్మ తనను మారువేషంలో ఉన్న రావణాసురుడని భ్రమించి భయపడే ప్రమాదం ఉందని హనుమంతుడు నిర్ధారించాడు. లంక విదేశం, భారతదేశపు దక్షిణతీరం నుండి దక్షిణంగా ఐదువందలమైళ్ల- వందయోజనాలు- సముద్రము దాటిన తరువాత ‘లంక’ఉంది. కానీ అక్కడ కూడ సంస్కృత భాష ఆ కాలంలో చెలామణిలో ఉంది. ప్రపంచమంతటా ఒకప్పుడు సంస్కృత భాష చెలామణిలో ఉండేదన్న పిఎన్‌ఓక్ వంటి చరిత్రకారుల నిర్ధారణ. అందువల్ల, అతార్కికం కాదు! సీతమ్మ ఇలా భ్రమించరాదన్న తలంపుతోనే ఆంజనేయుడు ‘‘ప్రాకృత భాషలోనే మాట్లాడ్డం ఆవశ్యకం’’- ‘‘అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్..’’అని నిర్ధారించాడు. సంస్కృత భాష ప్రాకృత భాషలు సమాంతరంగా ఆ కాలంలో కొనసాగాయి!!
కలియుగంలో మూడువేల ఏళ్లు గడిచిన నాటికి, క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దునాటి మహాకవి కాళిదాసు నాటకాలు రచించేనాటికి సంస్కృత భాషను సాధారణ ప్రజలు మాట్లాడడం లేదు! నేర్చుకున్న పండితులు మాత్రమే, ఇప్పుడు ఇంగ్లీషును నేర్చుకున్న పండితులవలె, సంస్కృత భాషను మాట్లాడారు. అందువల్లనే కాళిదాసుని నాటకాలలో కొన్ని పాత్రలు సంస్కృతంలోను, మరికొన్ని పాత్రలు ప్రాంతీయ భాషలోను ప్రసం గిస్తాయ. పాలనాభాషగా, పండితుల భాషగా, విద్యాబోధనా మాధ్యమ భాషగా, వివిధ ప్రాంతీయ భాషల మధ్య అనుసంధాన భాషగా సంస్కృత భాష బ్రిటిష్‌వారు మన దేశంలో చొరబడిపోయేవరకు ఉపయోగపడింది!!
బ్రిటిష్‌వారు అంచెలంచలుగా సంస్కృత భాషను ఈ అన్ని ‘విధుల’నుండి తొలగించి ఆంగ్లభాషను ఆయా విధులకు వినియోగించడం చరిత్ర! తమ అధికార బలంతో బ్రిటిష్‌వారు ఇలా సంస్కృతాన్ని తొలగించి ఆంగ్లాన్ని వెలిగించారు! అందువల్లనే ఈ దాస్య చరిత్రను రద్దుచేయాలని సంస్కృత భాషను మళ్లీ వెలిగించాలని అంబేద్కర్ మహాశయుడు ప్రయత్నించారు! ఆ ప్రయత్నం అప్పుడు నెరవేరలేదు! నెరవేరి ఉంటే ఇప్పుడు ఇంగ్లీషులో నడుస్తున్న మొత్తం వ్యవహారం సంస్కృత భాషలో నడిచి ఉండేది! రష్యావారు, చైనావారు తమ భాషలలో ‘‘నడిపించు’’కుంటున్నారు! భారతదేశపు మాతృభాష సంస్కృత భాష!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.