ఇష్టపడే చదువుకు ఇ-లెర్నింగ్

ఇష్టపడే చదువుకు ఇ-లెర్నింగ్

  • 27/07/2014
  • -బి.వి.ప్రసాద్

======== అధ్యయనంలో మనిషికి విద్యకన్నా ఉన్నతమైన, పవిత్రమైన మరో విషయం లేదు. -ప్లేటో ========= కాలగమనంలో సమాజం మారిపోతున్నట్టే చదువు స్వరూపంలోనూ అనూహ్య మార్పు వచ్చింది. రాజుల కాలం నాటి గురుకులాలు అనేక రూపాలుగా మారి విద్యకు కారకత్వంగా ఇంటికి బదులు పాఠశాల పుట్టింది. ప్రాచీన సంస్కృతి నుండి మనకు తెలియని భవిష్యత్ మానవీయ సంస్కృతికి మారడం కోసం అభ్యాసం అనివార్యమైంది. ఒకప్పటి చదువుల తీరు వేరు. గురువులు లేని చదువు, గురువులతో మాత్రమే సాగే చదువు, జీవితకాలం నేర్చుకునే చదువు, ఏమీ నేర్చుకోకుండానే మహానుభావులుగా మార్చిన జీవన చదువు… ఒకొక్కరూ ఒక్కో రీతిన చదివిన వారే గొప్పవాళ్లయ్యారు. స్వాభావికంగా చదువుకు ఒక రూపం ఉన్నా, అది కాలక్రమేణా సమాజ పరిస్థితులు, అవసరాలు, అనివార్యతలతో మారిపోయింది. ఏ దేశ విద్యావిధానమైనా ఆ దేశ చరిత్ర , సంస్కృతులను అనుసరించే ఉంటుంది. విద్యారంగం చరిత్ర దేశ చరిత్రలో అంతర్భాగంగానే ఉంటుంది. భారతీయ విద్యా చరిత్ర కూడా సాంఘిక చరిత్రతో పరిణామం చెందుతూ వచ్చింది. సాంకేతిక విప్లవం… ఆధునిక యుగంలో సాంకేతిక విజ్ఞానం అనూహ్యంగా విస్తరించడంతో ఒక విధంగా నేడు విద్యకు స్వాతంత్య్రం సిద్ధించింది. విద్యార్థి తాను కోరుకున్న సమయంలో ఎంచుకున్న అంశాన్ని నేర్చుకోవడమేగాక, దానిని మూల్యాంకనం చేయించుకునేందుకు, నికషలకు పూర్తి స్వాతంత్య్రం ఇ-లెర్నింగ్ తో సాధ్యమైంది. కఠినమైన పాఠ్యాంశాలను అర్థం చేసుకోలేక, చదువుల్లో వెనుకబడి మందబుద్ధులై, ప్రగతి సాధించలేక , సమస్యలను, అనుమానాలను తీర్చుకోలేక ముడుచుకుపోయే మూర్తిమత్వంతో సమాజంలో ఏకాకిగా మారిపోతున్న పరిస్థితులను అధిగమించేలా విజ్ఞానాన్ని మనిషి అందిపుచ్చుకున్నాడు. ఇపుడు తనే టీచర్, తనే విద్యార్థి, తన చదువులకు తానే మార్గదర్శి, అనుమానాలను నివృత్తి చేసుకునేదీ తనే. ఇందుకు దోహదపడేదే ఇంటర్నెట్ విప్లవం నుండి వచ్చిన ‘ఇ- క్లాసురూమ్’. దీనినే స్మార్టు క్లాసు అన్నా, స్మార్టు టీచింగ్ అన్నా, ఎలక్ట్రానిక్ క్లాసు అని వ్యవహరించినా.. ఏం పేరు పెట్టినా… దాని లక్ష్యం ఒక్కటే. అధ్యాపకుడూ, విద్యార్థి కలిసి టెక్నాలజీ సాయంతో కొత్త విషయాలను నేర్చుకునే దిశగా ‘ఇ- క్లాసురూమ్’లు అడుగులు వేస్తున్నాయ. నేడు మారుమూల ప్రాంతాల్లో సైతం డిజిటల్ క్లాసురూములు, ఆడియో విజువల్ సెంటర్లు దర్శన మివ్వడం బోధనలో, అభ్యాసంలో కొత్త పోకడలకు అద్దం పడుతోంది. బోధనలో వైవిధ్యం… ఒకప్పుడు బ్లాక్‌బోర్డు, సుద్దముక్క, టీచర్లు తయారు చేసే చార్టులు మాత్రమే తరగతి గదిలో కనిపించేవి. ఆ తర్వాత టీవీలు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు వంటివి రంగ ప్రవేశం చేశాయి. ఆధునిక సాంకేతిక పరికరాలే ప్రధాన మాధ్యమంగా తరగతి గదిలో బోధన జరిపితే- ‘డిజిటల్ క్లాస్‌రూమ్’ అంటున్నారు. బోధననూ, అభ్యాసాన్ని డిజిటల్ క్లాస్‌రూమ్‌లు మరింత సులభతరం చేశాయి. పాఠ్యపుస్తకాలను పట్టుకుని టీచర్లు పాఠాలు చెప్పడం, వాటిని వినడం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం పాత పద్ధతి. దీనికి భిన్నమైన వ్యవస్థే- డిజిటల్ క్లాస్‌రూమ్. ఆధునిక టెక్నాలజీ ప్రవేశంతో బోధన, అభ్యాసం తీరుతెన్నులే సమూలంగా మారిపోయాయి. సంప్రదాయ బోధనా పద్ధతిలో అధ్యాపకుడు మాట్లాడేది ఎక్కువ, విద్యార్థి మాట్లాడేది తక్కువ. డిజిటల్ క్లాసుల్లో, ఇ-లెర్నింగ్‌లో విద్యార్థి భాగస్వామ్యం పెరిగింది. కఠినమైన పాఠ్యాంశాలను సైతం కంప్యూటర్ స్క్రీన్‌పై సులభ రీతిలో బోధించేందుకు నేడు అవకాశాలు పెరిగాయి. సరికొత్త బోధనా పద్ధతుల వల్ల విద్యార్థిపై ఒత్తిడి కూడా తగ్గుతోంది. అధ్యాపకులతో వీలైనంత ‘ఇంటరాక్టివ్’గా ఉండేందుకు కొత్త విధానాలు దోహదపడుతున్నాయి. బోధనకు అవసరమైన సాంకేతికను జోడించడమే ఇ-లెర్నింగ్‌లో కీలకాంశం. ‘విద్యార్థులకు ఏమి చెప్పాలనేది సిలబస్… ఏ రీతిలో చెప్పాలనేది కరిక్కులమ్’ అని భావిస్తున్న అనేక విద్యాసంస్థలు ఐటి ఆధారిత బోధనోపకరణాలను, సేవలను విద్యార్థులకు అందిస్తున్నాయి. సిలబస్, కరిక్యులమ్‌ల ఆధారంగా బోధనను కొత్తపుంతలు తొక్కించేందుకు టీచర్లతో పాటు సాంకేతిక నిపుణుల సహాయం కూడా నేడు అవసరమైంది. సమాజం నుంచి, సమాజం కోసం.. సమాజం పాఠశాలను నెలకొల్పుతుంది. పాఠశాల సమాజాన్ని తయారుచేస్తుంది. సమాజం, పాఠశాల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఈ రెండూ ఒకదానితో ఒకటి, ఒకదాని కోసం మరొకటి పనిచేస్తాయి. ఒకదానిపై మరొకదాని ప్రత్యక్ష ప్రభావం కచ్చితంగా ఉంటుంది. సమాజం మంచి పాఠశాలను ఏర్పరిస్తే పౌరులందరికీ మంచి భవిష్యత్ ఉంటుంది. పాఠశాల అనేక విధాల సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నేటి తరం సమాజానికి అనుగుణంగానే ప్రభావితం అవుతూ మార్పును స్వాగతిస్తోంది. ‘అసలు చదువెందుకు..? ఎలాంటి చదువు అవసరం..?’ అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయ. చదువు నిజానికి ఒక జీవాంశం, మరో విధంగా చూస్తే సాంఘికాంశం. నీరు, నీడ, ఆహారం, ప్రత్యుత్పత్తి ద్వారా అభివృద్ధి, విజ్ఞానం వీటన్నింటికీ మూలం విద్య. మానసిక వికాసానికి, మానవత్వం పెంపొందించుకోవడానికి, మంచిని పెంచుకోవడానికి- పోషించుకోవడానికి, మానవుడ్ని ఉన్నతమైన వ్యక్తిగా రూపొందించడానికి చదువు అవసరం. ఎనె్నన్ని మార్పులో… విద్యా బోధన ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు- ఉండకూడదు- ఉండలేదు కూడా. ఎందుకంటే సహజంగానే విద్యకు నిర్ధిష్టరూపం ఉండదు. అది ప్రగతిశీలమైనది. కాలంతో పాటు పరిస్థితుల ప్రభావంతో నిరంతరం అది మారిపోతూ ఉంటుంది. పరిశ్రమలు మానవ సహాయంతో నడిచినపుడు బోధన ప్రక్రియ పలక, నల్లబల్ల, సుద్ద, అచ్చుపుస్తకాలపై ఆధారపడింది. ఒక్కసారి అలా వెనక్కు వెళ్లినట్టయితే క్రీ. పూ. 11వ శతాబ్దం వరకూ ప్రాచీన యుగంగా పరిగణిస్తుండగా- అపుడు హిందూ విద్యావిధానం ప్రముఖ స్థానం పొందింది. క్రీ. పూ. 6వ శతాబ్దంలో బౌద్ధమతం ఆధారంగా బౌద్ధమత సంప్రదాయ విద్యావిధానం ప్రారంభమైంది. తర్వాత మహమ్మదీయుల దండయాత్రలు ప్రారంభమైన ఇస్లాం మత సంప్రదాయ విద్య ప్రారంభమైంది. క్రీ.శ 17వ శతాబ్దంలో పాశ్చాత్యులు వర్తకం కోసం మన దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో బ్రిటిష్ వారిది పైచేయిగా మారి క్రైస్తవ మిషనరీల నేతృత్వంలో విద్యా సంస్థలు పనిచేయడం ప్రారం భించాయ. 19వ శతాబ్దం ప్రారంభంలో పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ, విద్యారంగంలో గొప్ప విప్లవం ఏదీ చోటు చేసుకోలేదు. సుమారు 25 ఏళ్లుగా కొంత మార్పు వస్తోంది. ‘విద్యా సాంకేతికం’ (ఎడ్యుకేషన్ టెక్నాలజీ) అనే పదాన్ని తొలిసారి బ్రేయిన్‌మోర్ జోన్స్ రిపోర్టు – యుకెలో ఉపయోగించారు. 14వ శతాబ్దం వరకూ చూసుకుంటే ముఖాముఖిగా బోధన తప్ప మరో మార్గం లేదు. రాతప్రతులపై ఆధారపడటం మొదటిది. విద్యార్ధుల్లో ఉన్న వ్యక్తిగత వ్యత్యాసాల ప్రేరణను ఈ కాలంలో వారు గుర్తించడంలో విఫలమయ్యారని చెప్పలేం. కానీ, వారు కేవలం ఉచ్ఛారణ, రాత ప్రతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 15వ శతాబ్దంలో ముద్రణ విధానం ఆచరణలోకి వచ్చింది. మతాలకు, వ్యాకరణాలకు సంబంధించిన గ్రంథాల ముద్రణ మొదలైంది. 16వ శతాబ్దంలో ఉన్నత విద్యాస్థాయిల్లో పాఠ్యగ్రంథాలను ప్రవేశపెట్టడం మొదలైంది. 17వ శతాబ్దంలో జాన్ కమేనియన్ చిన్న పిల్లలకు పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టారు. 1657లో బొమ్మలతో కూడిన పుస్తకాలను (ఆర్బస్ పిక్చర్స్) కొన్ని వందల సంఖ్యలో ముద్రించారు. తర్వాత రూసో, స్పెన్సర్, ప్రోబెల్ ,పెస్టోలజీ మొదలైన వారు బోధన, విద్యార్థుల అధ్యయనానికి సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు చేశారు. తర్వాత జాన్ డ్యూయి విద్యారంగంలో పలు విప్లవాత్మక మార్పులు తెచ్చారు. థారన్‌డైక్ అధ్యయన సిద్ధాంతాలతో ప్రయోగాలు చేసి తయారుచేశారు. జాన్ ఎడమ్- మూర్తమత్వం అంటే.. అమూర్తత్వం లేకపోవడం అనే ఆలోచన విధానాన్ని ప్రచారంలోకి తెచ్చారు. 20వ శతాబ్దానికి వచ్చేసరికి ఫొటోగ్రఫీ, శబ్దాన్ని రికార్డు చేయడం, ఎడ్యుకేషన్ టెక్నాలజీ లాంటివి పుట్టాయి. ‘విద్యా సాంకేతికం’ విస్తృతి… విద్యారంగంలో తొలి మూడు విప్లవాల గురించి చెప్పుకుంటే- భాషకు లిపిని సృష్టించడం, కాగితం తయారు చేయడం, ముద్రణ ప్రక్రియ. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిణామాల వల్ల ముఖ్యంగా రేడియో, టీవీ, టేప్ రికార్డర్, కంప్యూటర్ల వల్ల నాలుగో విప్లవం వచ్చింది. ఎరిక్ ఎష్‌బి ఈ నాలుగో విప్లవం గురించి చెప్పారు. ఆ విప్లవమే- ‘విద్యా సాంకేతికం’. 1960 ముందు నాటికి ‘విద్యా సాంకేతికం’ అనే పదం దృశ్య, శ్రవణ పద్ధతిలో తరగతి గదిలో బోధనకు ఉపయోగించే బోధన సామగ్రితో ముడిపడి ఉండేది. వేరే మాటలో చెప్పాలంటే ప్రత్యక్ష బోధన అభ్యసన కోసం ఉద్దేశించిన సామాన్యమైన దృశ్య,శ్రవణ ఉపకరణాల వినియోగమే ‘విద్యా సాంకేతిక’ భావన. కానీ, విద్యా సాంకేతికం బోధనోపకరణాల కంటే భిన్నమైనది. అది బోధనోపకరణాలను వినియోగించుకోవచ్చు కాని, విద్యోపకరణాలకు పర్యాయపదం మాత్రం కాదు. ఆ విధంగానే యంత్రాలు గానీ, సామూహిక ప్రసార సాధనాలైన రేడియో, టీవీ వాడకాన్ని కలిగి ఉండొచ్చు- కానీ వాటికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆధునిక ఇంజనీరింగ్ సూత్రాల ప్రాతిపదికగా విద్యుత్-యాంత్రికత ఉన్న సాధనాల అభివృద్ధి, వాటిని విద్య కోసం వాడటం అనే భావనకు సంబంధించిందే ‘విద్యా సాంకేతికం ’. బోధన , అభ్యసనలకు వ్యవస్థా విశే్లషణ వినియోగమే విద్యా సాంకేతికం అవుతుంది. విద్యా రంగంలో రేడియో, టీవీ, కంప్యూటర్, టేప్ రికార్డర్, చలనచిత్రాలు, స్లైడ్‌లు, హార్టువేర్, సాఫ్ట్‌వేర్‌ల ఉపయోగం, శాస్త్ర-సాంకేతిక రంగాల్లోని ప్రగతి ఫలమే పురోభివృద్ధి ఫలితమే విద్యా సాంకేతికం. కార్యక్రమయుత బోధన భావన, అభ్యసన సిద్ధాంతాలు, విద్యా సాంకేతిక అర్థానికి, భావనకు కొత్త రూపును సంతరించిపెట్టాయి. విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, విద్యా తత్వ శాస్త్రం, విద్యా మాపనం, మూల్యాంకనం మాదిరే విద్యా సాంకేతికం కూడా ఒక నూతన క్షేత్రం. గుణాత్మక అభివృద్ధి… విద్య సాంఘిక ప్రక్రియ. ఈ కారణంగానే జనాభా పెరుగుదల, విద్యలో గుణాత్మకమైన అభివృద్ధి, ఆవశ్యకతల వల్ల 1972-73లో భారత ప్రభుత్వం ఒక విద్యా సంకేతిక ప్రాజెక్టును ప్రారంభించింది. మన దేశంలో విద్యాసాంకేతిక రంగంలో జరుగుతున్న కృషికి కేంద్ర బిందువు ఎన్‌సిఇఆర్‌టి. 1973లో విద్యాసాంకేతిక కేంద్రం (సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ) ఏర్పాటైంది. మన రాష్ట్రంలో 1974-75లో రాష్ట్ర విద్యా సాంకేతిక విభాగం (ఇటి సెల్) స్థాపించారు. 1978లో ఎన్‌సిఇఆర్‌టి దేశంలోని నాలుగు ప్రాంతీయ విద్యాకళాశాలల్లో విద్యా సాంకేతిక విభాగాలను ప్రారంభించింది. గత పదేళ్ల కాలంలో మన దేశంలో కొన్ని వర్శిటీలు ఇటి సెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. మద్రాసులోని టెక్నికల్ టీచర్సు ట్రైనింగ్ సంస్థ కూడా గణనీయమైన కృషిని ప్రారంభించింది. సుమారు 15 సంవత్సరాల క్రితం స్థాపించిన ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇనె్వన్షన్’ అనే సంస్థ విద్యా సాంకేతిక రంగంలో అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన విజ్ఞాన విషయాలను దేశం నలుమూలల నుండి సేకరించి విద్యావేత్తలకు అందించేందుకు ఏటా దేశంలో ఒక్కో ప్రాంతంలో సమావేశాలను నిర్వహిస్తూ ప్రశంసనీయమైన కృషి చేస్తోంది. సరికొత్త వారధి… మొత్తం మీద ప్రణాళికాబద్ధమైన కృషినే మనం విద్యగా చెప్పవచ్చు. ఒక పక్క విద్యార్ధి మరో పక్క ఉపాధ్యాయుడు ఉంటారు. దీనిని ద్విధృవ పరిణామ విద్యగా చెబుతాం. వీరిద్దరికీ తోడు సాంఘిక పరిసర ప్రభావం కూడా ఉంటే దానిని త్రిధృవపరిణామ విద్యగా వ్యవహరిస్తాం. విస్తృతార్ధంలో చెప్పాలంటే ‘యధార్థానుభవ జ్ఞానమే విద్య’ అని చెప్పవచ్చు. అంటే ప్రతి అనుభవం విద్యగా చూస్తాం. నియత విద్య, అనియత విద్యతో పాటు యాధృచ్చిక జ్ఞానార్జనకు ఎన్నో మార్గాలు ఇపుడు వచ్చాయి. అందుకే విద్యా సాంకేతికం సంకుచితం కాని అర్థం, విస్తృతమైన భావన కలిగి ఉంది. సరైన సమయంలో తగిన పరికరాల ఉపయోగం, శిక్షణ విధానాన్ని సులువు చేయడంలో ఉపయోగపడి స్పష్టమైన సరైన అవగాహన కల్పిస్తుంది. ఫిల్ముల వంటి జ్ఞానేంద్రియ సాధనాలు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తాయి. శాస్ర్తియ శిక్షణకు, బోధనా కళకు మధ్య ‘విద్యా సాంకేతికం’ సారధి వంటిది. విద్యాసాంకేతికతకు పరిధి, సరిహద్దులు లేవు. సమాజం కోరికలు, విద్యావసరాలు గుర్తించడం వంటి అంశాలను చర్చంచడానికి ఇటి (విద్యాసాంకేతికత) ప్రయత్నిస్తుంది. సమాజంలోని వ్యక్తుల అవసరాలు, కోరికలు తృప్తిచెందడానికి అవసరమైన వనరులను సర్వే చేస్తుంది. విస్తృతమైన విద్యాలక్షాలను, గమ్యాలను కూడా తెలియజేస్తుంది. వ్యక్తీకరించిన లక్ష్యాలు, తయారుచేసిన పాఠ్యప్రణాళికలు, అందుబాటులో ఉన్న వనరులు, వాటికి అనుగుణంగా ఉపయుక్తమైన బోధనాభ్యసన సామగ్రిని తయారుచేయడం అభివృద్ధి చేయడంలో కూడా ఇటి (విద్యాసాంకేతికత)కి సంబంధం ఉంటుంది. ఇంత వరకూ విద్యా సాంకేతిక క్షేత్రంలో జరిగిన అధిక భాగపు పని మాధ్యమ కేంద్రీకృతం- ఉత్పాదనా కేంద్రీకృతం. ఉత్పాదనా కేంద్రకం నుండి ప్రక్రియా కేంద్రకం వైపు ప్రస్తుతం మొగ్గు నడుస్తోంది. ప్రత్యామ్నాయ వ్యూహాలు… వర్తమాన భారతదేశపు విద్యాసాంకేతికవేత్త కేవలం కార్యక్రమయుత పుస్తక రచయిత లేక మాధ్యమ నిపుణుడు మాత్రమే కాదు, విద్యావ్యవస్ధలకు సంబంధించిన అన్ని అంశాల పథక రచన,విధులతో సంబంధం ఉన్న వ్యక్తి. పరికల్పనల నిర్వహణలోనూ, ఆచరణలోనూ వ్యవస్థా విశే్లషణ వినియోగంలోనూ ప్రస్తుతం ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేగాక, సాంకేతిక కాల వినియోగంలో ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించడంలో కూడా ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అభ్యాసకుల జీవితానికి సంబంధం కలిగిన దానికి, వాస్తవికత కలిగిన దానిగా విద్యావ్యవస్థను తయారుచేయడానికి,అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం దేశంలో ఒక విప్లవం జరుగుతోంది. ఇందులో విద్యా సాంకేతికంగా చాలా కీలక పాత్రను పోషిస్తోంది. స్వయం అభ్యసనానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇందుకు దోహద పడేదే ఇ-లెర్నింగ్. ప్రత్యక్షంగా తరగతి గదికి వెళ్లకుండానే, అధ్యాపకుడు ఎదుటగా లేకుండానే నచ్చిన విద్యను అభ్యసించేందుకు వీలు కల్పించేదే-ఇ-లెర్నింగ్. భారత విద్యావ్యవస్థను ఒత్తిడి చేస్తున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి వ్యవస్థా పద్ధతి అందుబాటులో ఉన్న అన్ని వనరుల ఉపయోగం, అభ్యసనం ప్రాముఖ్యత- ప్రధాన దారులు చూపేవిగా ఉన్నాయి. విద్యా సాంకేతికం సమర్ధవంతమైన అవిరళ ఉపయోగానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి- 1986లో జాతీయ విద్యావిధానంలో భాగంగా టీవీ, రేడియో ప్రసార నెట్‌వర్కును ఏర్పాటుచేయడం, విద్యాటీవీ చానల్‌ను ఏర్పాటు చేయడం వంటివి. సాంకేతిక పద్ధతుల సమ్మేళనం.. ఈ క్రమంలోనే కంప్యూటర్ అసిస్టెడ్ ఇనస్ట్రక్షన్ (సిఎఐ) వచ్చింది. తర్వాతి దశలో కంప్యూటర్ మేనేజ్డ్ బోధన (సిఎంఐ) వచ్చింది. కంప్యూటర్ అసిస్టెడ్ బోధనలో విద్యార్థి డైరెక్ట్ బేసిస్ మీద కంప్యూటర్ విధానంతో పాలుపంచుకుంటాడు. బోధనా పరికరాలు ఈ పద్ధతిలో నిల్వ చేయబడతాయి. కంప్యూటర్ మేనేజ్డ్ పద్ధతిలో బోధనా తీరును నడిపేందుకు కంప్యూటర్ ఉపాధ్యాయునికి తోడ్పడుతుంది. కానీ, ప్రత్యేకమైన సాంకేతిక సామగ్రి, బోధన సామగ్రి మీద ఇది ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ విధానంతో విద్యార్థి అనుకూలంగా ఉండలేడు. ఆ విధానం సరైన సమయానికి తగిన విధంగా ఉండదు కూడా. బోధనకు సహకరించేందుకు అందించే ప్రక్రియలోనూ మదింపు చేసే పనిముట్లలోనూ, ఉపకరణాలను నిర్వహించడంలోనూ కంప్యూటర్ పాత్ర ఎంతగానో విస్తరించింది. అందించు ప్రక్రియ (డెలివరీ సిస్టమ్ ) ప్రత్యేకంగా అదుపు చేయడంలో, క్లిష్ట పరిస్థితుల్లోనూ బోధనా యంత్రాల శక్తిని కంప్యూటర్ విస్తరిస్తుంది. ఈ సమయంలో విద్యార్థి అసలైన సమాధానంతో సరిపడే రీతిలో జవాబులు తయారుచేయాలి. అది ఈ యంత్రం మారి- మరో దానికి వెళ్లే ముందుగా జరగాలి. బోధనను అందించడంలో తక్కువ ఖర్చుతో కూడిన సింగిల్, యూజర్ పద్ధతిని ఉపయోగిస్తారు. మదింపు చేసే పనిముట్లలో ప్రామాణీకృతమైన పరీక్ష విధానానికి , విడివిడి అంశాల వివరణకు మొత్తం మార్కులకు, పరీక్షకులకు తగిన కార్యక్రమాన్ని కంప్యూటర్‌కు అందించాలి. ఈ క్రమంలోనే తరగతి గదిలో నూతన విధానాలు అమలులోకి వచ్చాయి. తరగతిగదిలో కంప్యూటర్ వినియోగం, వెబ్‌సైట్ ఏర్పాటు, తరగతి గది బ్లాగులు, వికీలు, వైర్ లెస్ క్లాసు రూం, మైక్రోఫోన్లు, మొబైల్ యాప్స్, స్మార్టు బోర్డులు, యునైటెడ్ స్ట్రీమింగ్, టీచర్ ట్యూబ్, అన్‌లైన్ మాద్యమాలు వినియోగం, డిజిటల్ కెమరాలు-వీడియో కెమరాల వినియోగం, ఇంటరాక్టివ్ వైడ్ బోర్డు సాధనాలు, డాక్యుమెంటరీ కెమరాలు, ఎల్‌సిడి ప్రొజెక్టర్లు తరగతి గదిలోకి వచ్చేశాయి. వీటన్నింటి సమ్మేళనమే ఇ-లెర్నింగ్. ఇ-లెర్నింగ్‌కు విధి విధానాలు… ఇ-లెర్నింగ్ రూపొందించాలంటే కొన్ని ప్రమాణాలను విధిగా పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాల్లో సాధారణ కంటెంట్‌కు ఉండే నియమాలు, ఇ-లెర్నింగ్‌కు వాడే సాఫ్ట్‌వేర్ విధి విధానాలు,లెర్నింగ్ మేనేజిమెంట్ సిస్టం అని ఉంటాయి. ఈ ప్రమాణాలు వివిధ ప్లాట్‌ఫామ్‌లపై ఎలా రూపొందించాలి? ఎలా పంపిణీ చేయాలనే విషయాలపై ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ నియమాలు లేదా ప్రమాణాలు ప్రస్తుతం విభిన్నమైన నాలుగు వ్యవస్థలు రూపొందిస్తున్నాయి. కమ్యూనికేషన్ ఇంటర్ ఫేస్ లేదా ఎపిఐ వనరులను ఇతర వ్యవస్థలతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే విషయం, ఒక పద్ధతిలో ఇ-లెర్నింగ్‌ను వివరించడానికి మెటా డాటా, వనరులు లేదా రిపోర్టులను ఉపయోగకరమైన బండిల్స్‌లోకి తేవడం ఎలా విషయంపై కంటెంట్ ప్యాకేజింగ్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సామాజిక మాధ్యమాల కలయక ఇ-లెర్నింగ్ ప్రమాణాలు రోజురోజుకూ కొత్త విషయాలను సంతరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇ-లెర్నింగ్ నేడు సామాజిక మాధ్యమాలతో కూడా పెనవేసుకుని విద్యారంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాందీ ప్రస్తావన పలికాయి. ఇ-లెర్నింగ్ రెండో తరంలో ఇ-క్లాసు రూమ్‌లుగానూ, నేడు ఇ-స్కూళ్లుగానూ ఆవిర్భవిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్య కోసం సోనెట్, ఇన్‌ఫ్లిబినెట్ వంటి ఇ-లైబ్రరీలు అందుబాటులోకి వచ్చాయి. పాఠశాల విద్యార్థులకు ‘మన టీవీ’ ఉండనే ఉంది. ప్రభుత్వం తరఫున జ్ఞానదర్శన్ టీవీ పనిచేస్తోంది. వీటన్నింటితో పాటు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. అటెండెన్స్, పెరఫార్మెన్స్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్‌తో పాటు మరో అడుగు ముందుకు వేసి అప్‌లింకింగ్ సదుపాయంతో విద్యార్థి తరగతిలో విన్న పాఠానే్న మరోమారు కావాలంటే ఇంట్లో విని దానిని అభ్యాసం చేసేందుకు కూడా వీలు కల్పిస్తున్నారు. వెంటనే ఆన్‌లైన్‌లో ప్రగతి సమీక్ష నిర్వహించి, అందులో విద్యార్థి పాఠ్యాంశాన్ని చేసుకోవడంలోను, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడో తదితరల విషయాలను సైతం క్షణాల్లో విశే్లషించే సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రిపరేషన్‌తో మొదలైన ఎలక్ట్రానిక్ విప్లవం రెండో దశలో ఇ-క్లాసు రూమ్, నేడు ఇ-స్కూళ్లు దశకు చేరుకుంది. ప్రభుత్వం సైతం ఇ-క్లాసు రూమ్‌లకు సిద్ధం అవుతోంది. పాక్షికంగా ఐసిటిని వినియోగిస్తోంది. రానున్న రోజుల్లో విద్యారంగంలో ఇది మరిన్ని విప్లవాలకు దారితీస్తుందనడం నిస్సందేహం. * * విద్యా బోధన ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు- ఉండకూడదు- ఉండలేదు కూడా. ఎందుకంటే సహజంగానే విద్యకు నిర్ధిష్టరూపం ఉండదు. అది ప్రగతిశీలమైనది కాలంతో పాటు పరిస్థితుల ప్రభావంతో మారిపోతూ ఉంటుంది. * విద్యా సాంకేతికం (ఎడ్యుకేషన్ టెక్నాలజీ) అనే పదాన్ని తొలిసారి బ్రేయిన్‌మోర్ జోన్స్ రిపోర్టు -యుకె లో ఉపయోగించారు. * విద్యారంగంలో తొలి మూడు విప్లవాలు చెప్పుకుంటే భాషకు లిపిని సృష్టించడం, కాగితం తయారుచేయడం, ముద్రణ ప్రక్రియ. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిణామాల వల్ల ముఖ్యంగా రేడియో, టివి, టేప్ రికార్డర్, కంప్యూటర్ల ఫలితాల వల్ల నాలుగో విప్లవం వచ్చింది.ఎరిక్ ఎష్‌బి ఈ నాలుగో విప్లవం గురించి చెప్పారు. ఆ విప్లవమే విద్యాసాంకేతికం . సామాజిక బాధ్యత… విద్యా వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా అవి ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్నది నిర్వివాదాంశం. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో విద్యారంగం ప్రగతికి అన్ని విధాలా తోడ్పాటు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాల ఏర్పాటుకు భారీగా విరాళాలు ఇస్తున్నాయి. మహారాష్టల్రోని పూణె, ఔరంగాబాద్ ప్రాంతాల్లో వంద పాఠశాలల్లో ‘ఇ-లెర్నింగ్’ పరికరాలను అందజేసేందుకు పారిశ్రామిక దిగ్గజమైన ‘టాటా గ్రూపు’ సంసిద్ధత వ్యక్తం చేసింది. పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, సీడీలు వంటివి అందజేస్తారు. విద్యార్థుల్లో పలు రకాల నైపుణ్యాలను పెంచేందుకు వీలుగా ‘ఇ-లెర్నింగ్’ విధానాల్లో తగిన కరిక్యులమ్ రూపొందిస్తారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మెరుగైన బోధనా పద్ధతులను ప్రభుత్వం రూపొందిస్తుంది. వాటిని అమలు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ఆర్థికంగా సహకరిస్తాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ‘ఇ-లెర్నింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టేలా ఇప్పటికే మహారాష్టల్రో కొన్ని స్కూళ్లను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో మరిన్ని పాఠశాలల్లో ‘ఇ-లెర్నింగ్’ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు భారీగా ఆర్థిక కేటాయింపులు అవసరం. ఈ కారణంగానే పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతతో నిధులను కేటాయించేందుకు ముందుకు వస్తున్నాయి.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.