విమర్శకుడు వచనకారుడు స్నేహితుడు – వెల్చేరు నారాయణ రావు

అతను భాషాశాస్త్రానికి సాహిత్యానుభవం నేర్పాడు, సాహిత్యవిమర్శకి భాషాశాస్త్ర తార్కికత నేర్పాడు. హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలగడం, గాఢమైన ఊహల్ని ప్రకటించగలగడం తెలుగుకి అలవాటు చేశాడు రామారావు.
అతను చేరా కాకముందునుంచీ, నేను నారాని అవకముందునించి-ఎప్పటినుంచో చెప్పలేను-చేకూరి రామారావు నాకు స్నేహితుడు. ఇద్దరమూ జీవితంలోనూ, సాహిత్యంలోనూ కలిసి నడిచాం. మొదట మేం ఎప్పుడు కలుసుకున్నమో కూడా చెప్పలేను. విశాఖపట్నంలో అనుకుంటాను, అతను భద్రిరాజు కృష్ణమూర్తి దగ్గర మాండలిక వృత్తిపదకోశం కోసం పనిచేస్తున్నాడు, ప్రేమ కవిత్వం రాస్తున్నాడు. పిఠాపురం హాష్టల్ దగ్గిర కూర్చుని గంటలకొద్దీ కబుర్లు చెప్పుకునేవాళ్ళం మేం ఇద్దరం.
నన్ను భాషాశాస్త్రంలోకి పట్టుకొచ్చింది చేరానే. మైసూరులో నాకు మొట్టమొదటి భాషాశాస్త్ర పాఠాలు చెప్పాడతను. ఆ తరువాత హైదరాబాదులో భాషాశాస్త్రంలో డిప్లొమా చేసినపుడు కూడా నాకు పాఠాలు చెప్పింది అతనే. ఆ రోజుల్లో నేను హైదరాబాదులో డిప్లొమా చేస్తూ వాల్తేరులో తెలుగు ఎమ్‌ఎ చదువుతూండేవాడిని.
పేరుకి నాకో గది తార్నాకలో వుండేది. కాని నేను వుండేది ఎప్పుడూ చేరా వాళ్ళ ఇంట్లోనే. రంగనాయకిగారు నన్ను కుటుంబంలో మనిషిలా ఆప్యాయంగా చూసుకునేవారు. నేను కిట్టూ అని పిలిచే క్రిస్టఫర్ అప్పుడు చాలా చిన్న పిల్లాడు. ఇప్పుడతను శాన్‌ఫ్రాన్సిస్కోలో హిస్టరీ ప్రొఫెసరు.
ఏవో పనులు, ఆలోచనలు, గందరగోళాల మధ్య, నేను హోటల్‌లో తిండి సరిగ్గా తినక విస్తట్లో అన్ని కెలికేసి, తిన్నట్లనిపించుకుని చెయ్యి కడుక్కుంటుంటే చూసి, దగ్గర కూచుని, ‘ఇదిగో ఈ కూర తినొచ్చు, ఈ పచ్చడి బాగుంటుంది’ అని చెప్తూ, సావకాశంగా తినేదాకా కబుర్లు చెప్తూ తను దగ్గిర కూచుని నాచేత మంచి భోజనం చేయించేవాడు చేరా.
తెలుగు సాహిత్యంలో విమర్శకుడుగా, భాషా శాస్త్రజ్ఞుడుగా, వాక్యవేత్తగా పాఠకుల ఆదరణ పొందాడు చేరా. అన్నింటికన్నా మించి కొత్త కవుల్ని, కవయిత్రుల్ని పనికట్టుకుని గుర్తించి, వాళ్ళ పుస్తకాలకి ముందు మాటలు రాసిన వాటికి గుర్తింపు తెచ్చాడు. పుస్తకం పుస్తకానికి చేరా ముందు మాటలు రాస్తూవుంటే నేను వేళాకోళంగా అనే వాణ్ణి కూడా: ‘ఇక్కడ ముందు మాటలు రాయబడును’ అని ఒక బోర్డు పెట్టుకోరాదూ- అని. ఆ పని ఇప్పుడు నేను చేస్తున్నట్లు వుంది.
తన చేరాతల ద్వారా ఎంతోమందిని కొత్తవాళ్ళని సహృదయపూర్వకమైన తన వచనంతో చక్కగా పరిచయం చేశాడు చేరా. తగాదాలు వచ్చినా హుందాగా వ్యవహరించాడు. సున్నితమైన హాస్యంతో, గొప్ప మనసుతో, మంచి అభిరుచి తప్ప మరేదానికి పెద్ద స్థానం యివ్వని సాహిత్య దృష్టితో అందరినీ కలుపుకుంటూనే అయినా తన దృక్పథంలో రాజీ పడని నిష్కర్షతో నిండు కుండ లాంటి పెద్ద మనిషి తరహాతో రామారావు తెలుగులో నిలిచిపోయే వచనం రాశాడు.
వివాదపడితే చేరాతోనే వివాదపడాలి. సంపత్కుమారతో వచన విషయంలో వాదించినా నాతో నగ్నముని కొయ్యగుర్రం గురించి విభేదించినా వాదన అంటే ఇలా వుండాలి అని అనిపించుకునే వాదన చేశాడు. అప్పట్లో వచ్చిన ‘చేరా-నారా సంవాదం’ గురించి ఇదేదో వెల్చేరు రామారావు, చేకూరి నారాయణరావు ఒకరితో ఒకరు వాదించుకున్నట్లుగా వుంది అనేవారు కూడాను.
వాదనల్లో, విమర్శలో ఆయన వాడే వాక్య నిర్మాణంలో ఆలోచనని సంయమనంతో నిబ్బరంగా ప్రకటించడంలో తెలుగుకి ఒక కొత్త ప్రమాణాన్ని యేర్పరిచాడు రామారావు. అతను భాషాశాస్త్రానికి సాహిత్యానుభవం నేర్పాడు, సాహిత్యవిమర్శకి భాషాశాస్త్ర తార్కికత నేర్పాడు. హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలగడం, గాఢమైన ఊహల్ని ప్రకటించగలగడం తెలుగుకి అలవాటు చేశాడు రామారావు. ఆ అలవాటుని కొనసాగించగలవాళ్ళు, ఆ పద్ధతుల్ని అనుసరించగలవాళ్ళు అతన్ని సహేతుకంగా కాదనగలవాళ్ళు తెలుగులో ఇప్పటికీ కనబడటం లేదు.
తమతో అంగీకరిస్తే సున్నితంగా నవ్వి ఊరుకునేవాళ్ళూ, తమతో విభేదిస్తే ఉత్సాహంతో వినేవాళ్ళు, నాకు తెలిసి తెలుగులో ఎక్కువమంది లేరు, ఆ చాలా కొద్దిమందిలో రామారావు ఒకడు.
నేను ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవిత్వాన్ని అనువదించి సంకలనం చేసే రోజుల్లో అతన్ని ప్రతిరోజు అమెరికానుంచి పిలిచేవాణ్ణి, నిద్ర ఇంకా పూర్తికాని తెల్లవారు ఝామున. నేనడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి, నేను అనువదిస్తున్న ప్రతి పద్యాన్ని గురించి తన దృక్పథంతో వివరంగా మాట్లాడి ఎన్ని కబుర్లు చెప్పేవాడే, తను ఇంకా మొదటి కాఫీ కూడా తాగలేదనే సంగతి కూడా మరిచిపోయి.
కంప్యూటరు వచ్చి ఉత్తరాల్ని రాయడాన్ని చంపేసింది కాని చేరా గొప్ప ఉత్తరాలు రాసేవాడు. ఆయన తన మిత్రులకి రాసిన ఉత్తరాలు దొరికినన్ని సంపాదించి వాటిని కలిపి ప్రచురిస్తే తెలుగు సాహిత్యంలో ‘ఉత్తరాయణం’ ఆయన చేతిలో ఎంత గొప్ప స్థాయికొచ్చిందో బోధ పడుతుంది.
తెలుగు సాహిత్యంలో ఒక తరం వెళ్ళిపోతోంది. ఆ తరంలో నా దగ్గర స్నేహితులు చాలా మంది వెళ్ళిపోయారు: శంకరమంచి సత్యం, ముక్తేవి లక్ష్మణరావు, సంపత్కుమారాచార్య, చలమాల ధర్మారావు, ఇప్పుడు చేరా.
వీళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళు. నేనింకా వుండడం ఈ దుఃఖాన్ని అనుభవించడానికి.
– వెల్చేరు నారాయణ రావు