శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2
ఆశ్వాశాలు పెరిగిన కొద్దీ రామడుగు వారి కవితా ధార విజ్రుమ్భిస్తూ భావం సాంద్రం అవుతూ వచ్చింది .ద్వితీయ ఆశ్వాసం లో చెంచు లక్ష్మిని చూసి నరసింహ స్వామి ఉగ్రం తగ్గి ప్రేమ ప్రకోపించి చల్ల బడ్డాడు .’’శాంత రస గంగ సృజించిన స్వామి దివ్య శృంగార రసాది దేవుడయ్యాడు .నివ్వెర పోయినిల్వున నీఱయి పోయాడు .’’గుడ్డిదౌగవ్వయయ్యే నా క్రుధయే కంతుని గంతుల వింత రంతులన్ ‘’అను కొన్నాడు .తనకోపం అంతా గుడ్డి గావ్వతో సమానమై పోయిందని భావించి బాధ పడ్డాడు .ఆమె ఎవరని అడిగితె చెంచేత గడుసుగా ‘చెలికత్తెలు ‘’సింగ మవే! నరుడౌదే’’అని సందేహిస్తూ ‘’మెకాల మచ్చిక సేసి కొనుటే –ఇంపుగా వేటలాడుటే ఈమె పిచ్చి –అచ్చి వచ్చిన లచ్చి మా అడవి దొరకు ‘’అని అంతర్భావ స్పోరకం గా జవాబిచ్చారు. రాబోయే కధకు నాంది ఇక్కడ పడింది .ఇక ఇద్ద్దరు డైరెక్ట్ అటాక్ లో మాట్లాడుకొన్నారు .’నిన్ను చూసి దర్పకు బారి ‘’కి చిక్కానని నరసింహ అంటే ‘’బుంగ మీసాల నామాల పోరగాడ –ఎరయిన సూస్తే కొంప కోల్లెరే –నన్ను సేరకుర-కోరల సిన్న వాడ ‘’అని కేరే ఝాట్ గా భావించి బదులిచ్చింది నరసిమ్హానికి .మరీ రెట్టించి ప్రేమా దోమా అంటున్న పంగనామాల సోమిని ‘’నాయి బానాలు-నీయి పానాలు తీక ముందే’’ తొలగిపోమ్మన్నది .ఊరుకుంటాడా ఉడుం పట్టు నరసయ్య !’’నిన్ను కౌగిటన్ బట్టక నిలువలేనే ‘’అని తెగేసి చెప్పేశాడు .అప్పుడు ఇద్దరి మధ్యా ‘’చెట్టులెక్క గలవా?’’పాట పద్యాలుగా పరవళ్ళు తొక్కింది .’’బాన మేసి మెకాల పట్టి తుంచుచు జారుడు బండల జారగలవా?అని ప్రశ్నిస్తే ,ఇప్పటికే ఎన్నో అవతారాలు గా జారి పోయిన స్వామి అన్నిటికి ‘’ఎస్ ‘’అంటూ చివరికి ‘’నార సింహుడ బ్రేమ పూజారి నేనే –జారి పోనీకే గైకోవే –సంతసమున ‘’అని తన్ను జారి పోనీకుండా వలచి గట్టిగా చెట్టబట్ట మన్నాడు .ప్రేమ పూజారి అవతారం ఎత్తానని సిగ్గు విడిచి చెప్పుకొన్నాడు .
అంత మాత్రం తో వదలలేదు చెంచిత .మళ్ళీ పరీక్షలెన్నో పెట్టింది .పులుల్ని ,పెద్దపులుల్ని పట్టగలవా ,సాల పువ్వుల్ని పంచగలవా ,పుట్ట కుక్కలా పట్టి కట్ట గలవా ,పెట్టె సొమ్ములతో పేరు వేయగలవా అని సంధిస్తే అన్నిటికీ చేయగలననే జవాబులిచ్చి చివరికి ‘’ప్రేమ పూజారినని తనను వంచించ వద్దని ‘’రికార్డ్ పెట్టాడు .ఏనుగుల్ని ,పట్టగలనని ,కోల వేయ గలనని జీ హుజూర్ ప్రేమ పూజారినని మళ్ళీ మళ్ళీ చెప్పాడు .తాము చెంచులమని తమకు మనిషి మృగం అయిన ఈ వింత జంతువూ సరిపోలదని చెప్పగా అతడు ఆమె జాతి గురించి అడిగితె ‘’జాతేంది ?నీదైన జాడ తెల్సేను పోరా !’’ నీ మగ బుద్ధి పోనిచ్చుకున్నావు కావని ఎద్దేవా చేసింది . .అలా అయితే ‘’మీ నాన్న నాకు మంచి మామ నువ్వు నాకు మరదలువి ‘’అన్నాడు చిర్రున కోపం వచ్చి చెంచిత ‘’మరదలనే ?నీకు –నీ పేమ వరద గానే ?దోవ నిల్వంగా బోకు –నాకు నీ తొడ పనిఏంది? నారసింహ ‘’అని బదులిచ్చింది .పట్టు విడువని పట్టు బట్టల సామి వదలలేదు ప్రాధేయ పడ్డాడు .ఒద్దని చెబితే బుద్ధి లేదా అంది .తన భావం లో ఆమెయే తన భార్య అన్నాడు .’’మోరకా (మూర్ఖా)అలా పిలవద్దు అని సుద్ది చెప్పింది .మనవాడు మళ్ళీ ప్రేమ పూజారి మంత్రం చదివాడు .చివరకు అతని ప్రేమలో స్వార్ధం లేదని గ్రహించి ,అర్ధం చేసుకొని ‘’ఆకు సాటు పిందియనురా ‘’అని తల్లీ తండ్రీ చాటు కన్నేనని ,పెద్దాళ్ళు అంగీకరిస్తే తనకు అభ్యంతరం లేదని సాధారణం గా ఆ సీనులో మనసినిమాల్లో ,కదల్లో ఆడపిల్లలా ‘’బొటవ్రేల నుర్వి రాచే ‘’అంటారు సహజ సిద్ధం గా కవిగారు .ఆమె సిగ్గుకు అదొక ద్రుశ్యకావ్యమే .మనకన్నెలు ఓణీ అంచును నోటిలో పెట్టుకొని నమలుతారు కాలి బొటన వ్రేలు నెల కేసి తల దించుతూ ఎత్తుతూ సినిమాలలో.
ఉగ్రం తగ్గి ప్రేమ అగ్రమై ఆమె నవ్వుల పువ్వులు కోసుకొంటానని, పెదవి జుంటి తేనెను జుర్రుకొంటానని ,ముఖ పద్మ పై తేనే తీగలా విహరిస్తానని ‘నరసుందరుడు తొందర పడ్డాడు .ఆమె పై పూలు చల్లి లైన్ క్లియర్ చే సు కొన్నాడు .’’పుష్ప మౌదునే ‘’ అన్న ఆ పురుషునికి లేత పూవులా మాల ఆ లేమ వేసి సిగ్గు బుగ్గల మొగ్గ అయింది చెంచు లక్ష్మి .దండ తీసుకొని కైదండ ఇచ్చి అక్కున చేర్చుకొన్నాడు నారసింహుడు .నిండు కౌగిట ఆమె’’ నిమీలిత నేత్ర’’ అయింది .యెంతో సహజసుందరం గానో సాగింది చెంచులక్ష్మీ నారసింహుల జాతి అతీత ,కులాతీత ప్రణయం .ప్రేమ పూజారికి ప్రియ లక్ష్మీ సాక్షాత్కారమయింది .ఇంతలో ఆమె తండ్రి ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు .నరసిమ్హాన్ని చూసి ‘’ఇటుల దయ్యము ఓలేను వెంట నటేదే –పోమ్మేహే –ఇక ఆగర –బుద్దియు సుద్దియు లేదటే ‘’అని పాపం మాటలు పడ్డాడు వైకుంఠ వాసి .తానూ ఒంటరివాడినని చెప్పగా ‘’ఒంటికాయ సొంటి ముక్క ‘’అని సామెత చెప్పాడు భిల్ల రాజు .’’తోకాడిం చుచు అవాకులు సేవాకులు పేలద్దని మా బాల గోల నీకేలా’’ ఛోచొ’’పోరా ‘’అని పశువును అదిల్చి నట్లు అదిలించి ,నరసిమ్హానికి సింహానికి మాటల గడ్డి పెట్టి పోపోమ్మన్నాడు .తన అమ్మాయికి ధూళో గాలో సోకిన్దనుకొన్నాడు .లేక పొతే ఆఎర్రి మొగం ఈ ‘’నర మెకాన్ని’’దగ్గర తీయటం ఏమిటి అనుకున్నాడు .ఇక లాభం లేదని కూతుర్ని వెంట బెట్టుకు ఇంటికి బయల్దేరాడు .తండ్రి వెంట నడిచే చెంచులక్ష్మి ‘’సరంగులు మొకుల్ని వదిలి తే బలవంతం గా వెళ్ళే పడవ లాగా ,ప్రారంభ దశలో వచ్చీరాని పదాల తో కడు నెమ్మదిగా సాగు కకవిత్వం లా ,మారాం చేస్తూ బడికి వెళ్ళే గారాల బిడ్డడు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళినట్లు ,అవును అమ్మితే కొన్న వాడి వెంట బెంగగా వెళ్ళే ఆవు, దూడ లాగా నెమ్మదిగా నడుస్తూ వెనక్కి తిరిగి చూస్తూ చెలికత్తెలు బలవంతం గా లాక్కు వెడుతుంటే అయిష్టం గా కదిలి వెడుతోంది
ప్రబంధాలలో ప్రణయంతర్వాత విరహం ఉండటం సాంప్రదాయం .ఇక్కడ కూడా కవి గారు నారసింహ ,చెంచు లక్ష్ముల విరహ వేదనను వర్ణించారు .మారుని పుష్ప బాణానికి ఇంత పదునా అని తిట్టుకున్నారు .అతడు పువ్వుల నన్నిటికి తన విరహ బాధ చెప్పుకొన్నాడు ‘’అందాల మాకందమా ! ఏమి ?యా చందామా స్పర్శ యంత ప్రహ్లాద మిడేనే ? యెంత యోగమే –నాడు సౌఖ్యంబదేల్ల-జిక్కి చక్కని వన్నెల జింకయయ్యే –అరెరే వేటాడగా నరహరినే హరినే –బాల సొగసు కీల దర్పకుని కోల’’అని తన గోల వెళ్ళ బెట్టాడు .హరి అయినా నరహరి అయినా కందర్ప దర్పాన్ని ఆపలేక పోయి విజేతుడయనయ్యానని విచారించాడు కందర్ప దర్ప సుందర నారాయణుడు .
‘’సుమము సుమమును మదుప సంశోభితంబే –మదుప మధుపంబు ఝంకార మధురిమంబే
స్వరము స్వరమును సమర వికస్వర రవంబే –వనము వారల పాలి బంధనమే యయ్యే ‘’
అని ప్రబంధ కర్త ఆ వనం లో ప్రతిదీ వారి మన్మదోద్దేపనకు ఎలా సహకరించిందో హృద్యమైన పద్యం లో చెప్పారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-14-ఉయ్యూరు
.