శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం
ప్రబంధ సువాన మరచి వందేళ్ళయింది .ఈ కంప్యూటర్ కాలం లో అంత ఓపిక తో అష్టాదశ వర్ణలతో వాటిని రాసేదెవ్వరు , రాసినా అంత ఓపిక తో చదివే, చదవ గలిగే వారెవ్వరు?అనే ప్రశ్న ఉండనే ఉంది .సరే పండితకవులు మనకేమీ తక్కువ కాదు .చదివే వారూ ఉండనే ఉన్నారు ఉంటారు కూడా .మరి రాయించే వారెవ్వరూ?రాజులు జమీందార్లు కాల గర్భం లో చేరిపోయారు .ప్రభుత్వ సాహితీ సంస్థలున్నా ,ఆ పేరెత్తితే మీద పడే ‘’వామ భావీయులు ‘’ఏమంటారో నాన్న దడుపు .అందుకే ఎవ్వరూ ఈ వందేళ్ళ నుంచి ప్రబంధం జోలికి పోలేదు .కాని ,కాలం ఎప్పుడు చలన శీలి .ఎన్నో మార్పులు తెస్తుంది .అలాంటి శుభ ఘడియ వచ్చింది ఆంద్ర ప్రబంధానికి .ఆగ్రి గోల్డ్ వారు నిర్వహిస్తున్న ‘’నది ‘’మాస పత్రిక ప్రబంధ రచనకు ఆహ్వానం పలికింది .విశిష్టమైన నగదు బహుమతులను ప్రకటించింది .ఆసక్తి ,ఆలోచన, సత్తా ఉన్న కవులు కలాలకు పదును పెట్టారు .అద్భుతమైన ప్రబంధ రచనలు చేసి ఆశ్చర్య చకితులను చేశారు .ఈ ఊహించని స్పందనకు నిర్వాహకులే ముక్కు మీద వేలు వేసుకొనే ట్లయింది .మన కవుల సామర్ధ్యం ప్రబంధ రచనలలో ప్రస్పుటమైంది .సాహిత్య పిపాసువుల దాహార్తి తీర్చింది .అందుకు ఆ ఆలోచన వచ్చి దాన్ని కార్య రూపం లోకి తెచ్చిన ‘’నది ‘’వారిసాహసోపేత నిర్ణయానికి ,అమలు పరచిన తీరుకు మది నిండుగా అభినందనలు తెలియ జేస్తున్నాను .ఈ పోటీలో పాల్గొని కవిత్వ మహత్వాన్ని చవి చూపిన కవీశ్వరులకు హృదయ పూర్వక అభినందనలు .అందులో మొదటి మూడు స్థానాలను దక్కించుకొన్న వారికి మరీ మనః పూర్వక శతాభినందనలు ,వందనలు .ఉత్తమ ప్రబంధం గా శ్రీ గడియారం శేష ఫణి శర్మ గారి ‘’పుత్రోదయం ,ద్వితీయ ఉత్తమ ప్రబంధం గా డా.రామడుగు వెంకటేశ్వర శర్మ గారి ‘’శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ‘’,తృతీయ ఉత్తమ ప్రబంధం గా శ్రీ చింత పల్లి నాగేశ్వర రావు గారి ‘’నర్మదా పురుకుత్సీయం ‘’ ఎంపికయ్యాయని ,ప్రధమ ,ద్వితీయ తృతీయ ప్రబంధాలకు రు1,75,000,75000,30,000రూపాయల నగదు బహుమతిని అందజేశామని ,ఎవ్వరిని నిరుత్సాహ పరచ రాదనే ఉద్దేశ్యం తో ప్రబంధ రచనలు పంపిన వారందరికీ ప్రోత్సాహకం గా రు 10,000చొప్పున నగదు బహుమతి ప్రదానం చేశామని అగ్రి గోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు ,’’నది ‘’మాస పత్రిక సంపాదకులు శ్రీ వీ .ఆర్..రావు అవ్వాస్ తెలియ జేశారు .
ఇంతకీ ఈ సోది అంతా ఎందుకంటె ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాన్ని గుంటూరు లో ఉంటున్న డా.రామడుగు వెంకటేశ్వర శర్మ గారికి పంపాను. అందినట్లు ఫోన్ చేసి చెప్పి ,తన ప్రబంధానికి ద్వితీయ బహుమతి వచ్చిందని ,తనకిచ్చిన కాపీలు అయి పోయాయని ,స్వంత ఖర్చుతో మళ్ళీ ద్వితీయ ముద్రణ తెస్తున్నానని రాగానే నాకు పంపిస్తానని చెప్పారు .అనుకోన్నట్లే వారు పంపగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అందింది .ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాను .చదివి అభిప్రాయం రాయమని కోరారు .పండిత ప్రకాండుల కవిత్వాన్ని బేరీజు వేసే శక్తి సామర్ధ్యాలు నాకు లేవని పూర్తిగా తెలుసు .కాని ఆప్త వాక్యం గా ఏదో రాయాలని ఈ పోటీల గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చునని ,కనుక ఆలోటు పూడ్చినట్లవుతుందని అందులో నాకు నచ్చిన అంశాలను మీతో పాటు పంచుకొందామని రాస్తున్నాను .
డా.రామడుగు వారు తెలుగు ఏం ఏ .పి.హెచ్ డి .భీమవరం ,తాడికొండ ఒరిఎంతల్ కళాశాలలో ఆంధ్రోపన్యాసుకులుగా ఉద్యోగించి పదవీ విరమణ చేశారు .తొలకరి మెరుపులు ,శ్రీ హనుమదింద్ర కంటి సాహిత్య సమగ్రావలోకనం ,శ్రీ కాశీ కవితా సమారాధనం ,జ్ఞాన తులసి ,తెలుగు సామెతల శతకం ,సాహిత్య వ్యాస మణి మాల,శ్రీ పెంచల కోన నృసింహ శతకం రచించారు. సాహిత్య సేవే పరమావధిగా జీవిస్తున్నారు .తన జీవితం లో అందుకున్న తోలి అవార్డు ‘’నది ‘’వారిచ్చిన దే నని సంతోషం ప్రకటించారు .
దాదాపు అరవై ఏళ్ళ క్రితం బడులలో వార్షికోత్సవాలకు ‘’చెంచులక్ష్మి ‘’వేషం వేయించటం ఉండేది .చెంచు భాషలో చెంచీత మాట్లాడటం ఉండేది .చెంచు లక్ష్మి సినిమా మనకు తెలిసిందే .పెంకి పెల్ల్లాం సినిమాలో ఒక సీను కూడా ఈ కద తో ఉందాని జ్ఞాపకం .’’చెట్టులెక్క గలవా ఓ నరహరి పుట్టలెక్క గలవా ?’’పాటచెవుల్లో ఇప్పటికీ రింగు మంటూనే ఉంది .మేము సుమారు అరవి అయిదేళ్ళ కిందట ఒక సారి హిందూ పురం నుండి మా చిన్న నాయనమ్మ వాళ్ళను చూడటానికి గుంటూరు వెడితే వాళ్ళ ఇంటి పక్క పిల్లలు ఏంతో హృదయం గా వేషాలు వేసి ఈ చెంచీత పాటలు పాడటం నాకు గుర్తుంది .అదే కధను తీసుకొని శ్రీ శర్మ గారు ప్రబంధ రచన చేశారు .వారి రచన చదివితే నాకు వారు ‘’raw(రా) ‘’మడుగు కాదు ‘’రసమడుగు ‘’అని పించింది .చాలా మంచి పద్యాలున్నాయి .చెంచు జీవితం యాస, వేషం ,అలవాట్లు అన్నీ పకడ్బందీగా రాశారు .అయిదు ఆశ్వాసాల ప్రబంధం గా తీర్చి దిద్దారు .మొదట ఇష్ట దేవతా స్తుతి చేశారు .దేవుళ్ళందరికి మొక్కారు .గురు పూజ ,మాత్రు పితృ వందనం భక్తిగా చేసుకున్నారు .నివేదన తో పాటు కృతజ్ఞతా నివేదననూ సమర్పించారు .
ప్రధమాశ్వాసం లో ప్రహ్లాదుని తండ్రి హిరణ్య కశిపుడు హరి స్థంభం లో ఉన్నాడా అని అడిగితె ఉన్నాడని చెబితే గదతో స్తంభాన్ని మోదితే అందులోనుండి
‘’స్తంభోద్భవు డయ్యెను హరి –గంభీర మహాద్భుతైక ఘన తర భయదో –జ్జ్రుంభణదానవ పర్వత –దంభోళిగ నృహరియై ఉదాగ్రోగ్రాత్మన్ ‘’అని ప్రహ్లాద వరదుడు నరసింహ స్వామి అంత భీకరంగా ప్రత్యక్షమై ,కశిపుని కసి తీర సంహరించాడు .చందం అనే మాటతో ఇక్కడ అద్భుత పద్య నీరాజనం ఇచ్చారు కవి .
‘’చందముల కంది,పద్య –చ్చండంబుల కందనంత సంరంభ స్వ-చ్చండ నిరవద్య పద్య గద్య –గ్రంధ ప్రాబంధిక ప్రకాశుం డయ్యెన్ ‘’చందాలంటే వేదాలు వేదాలకే అందుతాడు పరమాత్మ .మామూలు ఛందో బద్ధ పద్యాలకు చేరువ కాడు.కాని ఆ పద్య వేగం తో ఒక ప్రబంధం వచ్చినంత వేగం గా ఆయన కదలిక ఉంది..చిన్న మాటలతో గంభీర భావన .దేవతలంతా వచ్చి జగదాశ్చ ర్య మూర్తిని తిలకించి స్తుతించినా ఆరౌద్రం ఆగలేదు .ప్రహ్లాదుడు భక్తీ స్తుతి చేస్తే ఉగ్ర నరసింహుడు కొంత శాంత నృసింహుడయ్యాడు .వాత్సల్యం తో ప్రహ్లాదుని శిరసుపై చేయి ఆన్చి ఆశీర్వ దించాడు.కాని ‘’రోషం బిసు మంతైననువీడక ‘’గుండెలు పగిలిపోయే గర్జనలు చేస్తూ గరుడాచలానికి వెళ్ళాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-14-ఉయ్యూరు