సొంత తమ్ముడికంటే ఎక్కువగా అభిమానిస్తుంది’

బర్త్‌డే స్పెషల్
గాయని చిత్ర గురించి నాగూర్‌బాబు
కళామతల్లికి చిత్ర స్వరం.. కిరీటం. సౌమ్యం.. సింధూరం!
చిత్ర పాడిన పాటలు.. అమ్మ చేతి గోరుముద్దలు. వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. బావా మరదళ్ల సరసాలు.. స్నేహితుడితో చెప్పుకొనే సర్వస్వాలు.. అన్నిటినీ మించి సుతిమెత్తగా లోకాన్ని తెలియజెప్పే నాన్నల మనసులు… చిత్ర గొంతు ఎల కోయిల. అందుకే తమిళ తంబిలు ‘చిన్న కుయిల్’ అని పిలుచుకుంటారు. మలబారు తీరాన పుట్టిన ఈ స్వరమారుతం చిరునామా కమ్మటి పాట. పదుల భాషల్లో ఎన్నో వేల పాటలను వల్లెవేసిన తేనె ఊట ఆదివారం పుట్టినరోజు జరుపుకొంటోంది. ఆమెతో కలిసి దాదాపుగా మూడు దశాబ్దాల స్వరయానం చేసిన ప్రముఖ గాయకుడు నాగూర్‌బాబు అలియాస్ మనో ‘చిత్ర జ్యోతి’తో ‘చిత్ర’ గురించి ప్రత్యేకంగా సంభాషించారు. పాట కడుపున పుట్టిన ఈ అక్కాతమ్ముళ్ల అనుబంఽధాన్ని చదవండి…
‘‘నిండు కుండ తొణకదు. వడ్డించిన విస్తరి ఎగిరెగిరి పడదు. చిత్ర కూడా అచ్చం అలాంటి వ్యక్తే. ఎంతో నిండుగా ఉంటుంది. ఎంతో హుందాగా ఉంటుంది. ఎక్కడా మాట తొణకదు. ఎవరినీ మాట అని చిన్నబుచ్చదు. కళామతల్లి కిరీటంలో కలికితురాయి ఆమె స్వరం. కళామతల్లి నుదుట బొట్టు ఆమె సౌమ్యం. ఇంతకన్నా చిత్ర గురించి నేనేం చెప్పాలి? 1986లో నేను ఇళయరాజాగారి దగ్గరకు పాడటానికి వెళ్లాను. అప్పటికే చిత్ర అక్కడ ఉంది. పరిశ్రమలో ఆమె నాకు ఆరు నెలల సీనియర్. ఇళయరాజాగారి వద్దకు వెళ్లినప్పుడు నా పేరు నాగూర్ బాబు. తమిళంలో నాగూర్ హనీఫా అనే వ్యక్తి ముస్లిం గీతాలతో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మా ఇద్దరి పేర్లను జనాలు కన్ఫ్యూజ్ అవుతారనుకున్నారేమో నన్ను పేరు మార్చుకోమన్నారు. మనోజ్ అని అనుకుంటుండగా ఆయనే ‘మనో అని పెట్టుకో, మనో, చిత్ర కలిసి పాడారు అనే సౌండ్ వినడానికి బావుంటుంది. మనో చిత్ర అనేది ఒకే పేరులాగా కూడా వినిపిస్తుంది’ అని అన్నారు. ఏ సుముహూర్తాన ఆయన నామకరణం చేశారోగానీ దాదాపు మూడు దశాబ్దాలుగా మేం కలిసి పాడుతూనే ఉన్నాం.’’
5000లకు పై చిలుకే!
‘‘నేను చిత్ర కలిసి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఒరియా, బెంగాలి, అస్సామీ, తుళు, కొంకణీతో పాటు దాదాపు 10-11 భాషల్లో పాడాం. 3900లకు పై చిలుకు పాటలను సినిమాల కోసం పాడాం. భక్తి గీతాల సంఖ్య వెయ్యికి పైమాటే. చిత్ర గొంతులో సామాజిక స్పృహ ఉన్న గీతాలు ప్రత్యేక హుందాతనాన్ని పొందుతాయి. మన దగ్గరి మనిషి మనల్ని నిలబెట్టి బాగోగులు, మంచీ చెడులు చెబుతున్నట్టే ఉంటాయి. ‘మౌనంగానే ఎదగమని..’ పాటను ఇప్పటికి ఎన్ని సార్లు విన్నా అదే భావనతో గుండె నిండిపోతుంది. మేం కలిసి పాడిన పాటల్లో చాలా హిట్లున్నాయి. ‘చుక్కలు తెమ్మన్నా తెంపుకు రానా..’, ‘ప్రియా ప్రియతమారాగాలు..’ వంటి పాటలను ఇప్పటికి వింటున్నా ఫ్రెష్‌గా మన బాధలన్నింటినీ పక్కకు మళ్లించి కాసింత సేదదీర్చేలా అనిపిస్తాయి. ఆమె పాడిన పాటలన్నీ నాకిష్టమే. ఆ దేవుడిచ్చిన స్వరంతో ఆమె జీవితం ధన్యమైంది.’’
ఆమెకు తెలియదు
‘‘మూడు దశాబ్దాల ప్రస్థానంలో ఆమె కోపాన్ని నేనింత వరకు చూడలేదు. కోప్పడటం అంటే ఏమిటో ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసిందంతా చిరునవ్వే. ఆమెలాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న మనిషిని ఇంకొకరిని నేను చూడలేదు. ఇంత అనుభవం ఉన్న గాయని ఇప్పుడు రికార్డింగ్ స్టూడియోలో అడుగుపెట్టినా కొత్తగా వచ్చిన అమ్మాయిలాగా సంగీత దర్శకుడు చెప్పినవన్నీ వింటుంది. నేర్చుకుంటుంది. ఏవైనా సంగతులు తనకు వెంటనే రాకపోతే పట్టుబట్టి ప్రయత్నించి నేర్చుకుంటుంది. అంతేగానీ ‘ఇది నాకు రావట్లేదు. మార్చేయండి’ అని అడగటం నేనిప్పటి వరకు చూడలేదు. పాటనేది తన వెసులుబాటు కోసం పాడేది కాదని, సంగీత దర్శకుడి దృష్టితో పాడితేనే సార్థకమని నమ్ముతుంది ఆమె. సంగీత దర్శకుడి స్థానానికి ఆమె ఎంత గొప్ప గౌరవం ఇస్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనం.’’
చివరి దాకా
‘‘ఆమెకు సొంత సోదరుడు ఒకరున్నారు. అయినా నన్ను సొంత తమ్ముడికన్నా ఎక్కువగా అభిమానిస్తుంది. సినిమా పరిశ్రమలో అంత గొప్పగా చిత్ర అభిమానం పొందిన తమ్ముడిని నేనేనేమో. ఏనాడూ చిన్న గర్వం కూడా చూపించని వ్యక్తిత్వం ఆమెకు ప్రత్యేక అలంకారం. మేం విదేశాలకు కచేరీలకు వెళ్లినప్పుడు కూడా అంతా పూర్తయ్యేవరకు ఉండి, అక్కడికి వచ్చిన వారితో ఫోటోలు తీయించుకుని, ఆటోగ్రాఫులు ఇచ్చి వెళ్తుంది. అంతేగానీ తన పాట అయిపోగానే అక్కడి నుంచి వెళ్లిపోయే తత్వం కాదు ఆమెది. కుడిచేతిని వాటంగా తిప్పుతూ చిన్నగా కళ్లుమూసుకుని ఆమె పాడుతుంటే ఎంతటి కఠినాత్ములైనా కరగాల్సిందే. అంత గొప్ప స్వరంతో కలిసి దశాబ్దాలు ప్రయాణం చేసినందుకు చాలా గర్వంగా ఉంది.’’