శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )

ఇద్దరి విరహ వేదనతో ,నారద మహర్షి ప్రవేశం తో రెండవ ఆశ్వాసం పూర్తయింది .మూడవ దానిలో మహర్షి లక్ష్మీ నారసింహ స్తోత్రం తో కద ప్రారంభ మౌతుంది .ఆయన బాధకు కారణం అడుగుతూ ‘’మానసికంపు  వ్యాధులకు మందు మరొక్కటి లేదు ,నీ లోన చెలంగు నట్టి యపు రూపపు బాధ ‘’చెబితే సాయం చేస్తానంటాడు జరిగిందంతా వివరిస్తాడు దేవ దేవుడు .చివరికి ‘’నీవే తల్లివి దండ్రివి ,నీవే నా పతియు గతియు నీవే గురుడవౌ ‘’అని ఉబ్బేసి ఎలాగైనా చెంచులక్ష్మితో కల్యాణం చేయించమని కొడుకైన నారదుడి ని తండ్రి నరసింహ రూప విష్ణు మూర్తి ప్రార్ధించాడు .చెంచు గూడెంవేల్లాడు .స్వాగత సత్కారాలందుకొన్నాడు .నెమ్మదిగా అసలు విషయం కక్కాడు .ఆయన ఎవరోకాదు ‘’మహాయత బలశాలి యైన యా  హరియే ‘’అని వివరించాడు .చెంచులక్ష్మిని ఆయన కిచ్చి కల్యాణం చేయమని హితవుచేప్పాడు .వెరగు వెరపు తో భిల్ల రాజు ‘’ఒల్లను పిల్లను ఇయ్యగా –ఎల్లా కుదురుద్ది మనువు ?ఎవరో అతడహో ‘’అని అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు .అప్పుడు క్షీర సాగర మధనం దగ్గర నుంచి కద అంతా చెప్పి ,లక్ష్మీ దేవి సముద్రుని కుమార్తె అని ఆమెను శ్రీ హరికి ఇచ్చి వివాహం చేశాడని తనను పెళ్ళికి పిలవ లేదని దూర్వాస మహార్ద్షి కోపం తో వచ్చి తండ్రి ,కూతురు కలిసి చెంచు గూడెం లో భిల్ల రాజు గా భిల్ల కన్యగా జన్మించమని శాపం  ఇచ్చాడని  కాళ్ళా వేళ్ళా పడితే మరుసటిజన్మ లో హరి నరసింహావతారం ఎత్తి ఇక్కడికి వస్తాడని ఆయనకిచ్చి పెళ్లి చెయ్యమని చెప్పాడని పాత కధంతా చెప్పాడు .అప్పుడు చెంచు రాజు’’ఔరా!ఇంత కతుందా-మజ్జ్హారే ఎంత బాగ్గేము –కలిగే నాకిప్పుడహో ‘’అని సంబర పడ్డాడు .పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని ,ఈ అడవిలో పుట్రాత పురుగూ బారి పడకుండా కాపాడేట్లు అల్లుడితో చెప్పమని ,ఒక కోటి బంగారు నాణాలిచ్చి ‘’లచ్చి గైకొ మను –ఇంతకన్నా ఇంకేటిది కోరు కొందు ‘’అని మనసులో మాట బయట పెట్టాడు .సరే నరసిమ్మయ్య తో మాట్లాడతానని నారద నిష్క్రమణ తో మూడో ఆశ్వాసం పూర్తీ అయి శ్వాస హాయిగా పీలుస్తాం .

నాలుగవ అధ్యాయం లో  చెంచు రాజు అడిగిన కన్యా శుల్కాన్ని గురించి చెప్పి అంగీకారం పొందాడు నారదుడు .ఇక పెళ్లి సన్నాహాలు శురూ అయాయి .వధువుకు సాంప్రదాయ చెంచు దుస్తులు వేశారు .నెమలి  కోడీకల తురాయి పెట్టారు .ఆనందాల మధువే అయిందట వధువు .మరి స్వామి రత్న కిరీటం పెట్టుకొనే వాడికి నెమలి పించం పెట్టారు .మణి హారాలు పెట్టుకొనే వాడికి తులసి పూసల పేర్లు వేశారు .పట్టు పీతాంబర దారికి పసుపు కొమ్ముల పంచె కట్టారు .అంచుల ఉత్తరీయం వేసుకొనే వాడికి’’ బెట్లాకు టంగీని ‘’కట్ట బెట్టారు తిరుమణి బొట్టున్న వాడికి అడవి ఆకుల బాసికం కట్టారు .చందన చర్చలుందే వాడికి పునుగు జవ్వాది పూతలు పూశారు .తరువాత కవిగారు చెంచులక్ష్మీ నారసింహుల కళ్యాణ కమనీయ ఘట్టాన్ని వర్ణించారు .చదివిమ్పుల్లో ‘’పుట్ట తేనే ,కుందేళ్ళు చిట్టి పొట్టి పావురాళ్ళు ,జింకల్ని చదివించారు బంధుగణం .

‘’మాయ అనే తెరనే తీయగల సమర్ధుడికి తెరా సెల్లా అడ్డం పెట్టారని చమత్కరించారు .ఇక్కడ వధువు వర్ణన చాలా చమత్కారం గా చేశారు –

‘’సిగ్గుల నిగ్గు నెగ్గ గల చెల్వపు విల్వల కొల్వు దీర్చిమే –లుగ్గిడుతండు దగ్గకయే యూరేడు కన్నె గులాబి సోగ ళే –మొగ్గల బుగ్గలున్న నును మోమున సిగ్గుకే సిగ్గు నేర్పు బాల్ –జగ్గుల కన్నె గంగోనే దెరల్ విడా శ్రీ హరి సంభ్రమబునం ‘’-జీల కర్ర గుడం’’అన్యోన్య శీర్షాల మీద ఉంచారు .వనం లో దొరికే దాల్చినాకు గల మంగళ సూత్రాన్ని ‘’గుణ త్రయ రూపు డైన శ్రీహరి చెంచుమహా లక్ష్మి మెడలో కట్టాడు .వెదురు బియ్యపు తలంబ్రాలు పోయించారు .పెళ్లి సంబరాలను సందర్భానికి తగినట్లు ఉత్సాహ వృత్తాలలో వర్ణించి ఔచితిని పాటించారు .వధూవరుల అన్యోన్యాన్ని సీసం లో పోత పోశారు –

‘’శ్రుతిగానముల గీత గతినాటి రాజిల్ల లయ తాన పల్లవై రగిలే నతడు

నవ రసాస్పద పదార్నవ కాగ నన్నారి –యరద గౌరవ భూషుడాయే నతడు

చిత్ర లేఖన కళా శ్రీ కాగ నాలేమ –హవణిల్లు కుంచె గా నలరే నతడు

దివ్య శిల్పాల మందిరమే యా చెలికాగ-నులికి నూపిరులూద గలిగే నతడు

వనము సులలిత సత్కళా వనమే యగుచు –నూతనోత్సాహ మీదగా సంజా దీప్తి

జంచు లక్ష్మీ వధూ నారసింహవరులు –అక్షర సువర్ణ సృష్టి విహారు లైరి ‘’అని భావుకత రూపుదాల్చిన పద్యాన్ని చేమకూర వేంకట కవి శైలిలో చెప్పారు .ఇక్కడ ఇద్దరూ హాయిగా ఉన్నారు .కద కదలాలి కదా .దానికి ‘’భవ బంధ విమోచన వార్షుక ప్రభా నీరడుడు  వాక్ శారడుడు ‘’అయిన నారదుడు కావాలి .వెంటనే వైకుం ఠం చేరి అక్కడలక్ష్మీ దేవిని దర్శించి ‘’నీకెందమ్మి మో మదేమీ ?కందెను –శ్రీ హరి ఏదండ కందదు గాదె ‘’అని నర్మ గర్భం గా కందం లో అందం గా  అడిగాడు .ఆదిలక్ష్మి తన గోడు వెళ్ళ బోసుకోంది.ప్రహ్లాదుడిని కాపాడిన స్వామి నారసింహుడు అదే పోత పోయి తిరిగి రాలేదని బాధ పడింది .చీమ చిటుక్కుమన్నా అయన వస్తాడని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను జాడ తెలిస్తే చెప్పమని వేడింది .మన ‘’పుడకల స్వామి ‘’చెంచులక్ష్మీ నారసింహ కద చెప్పేశాడు .ఆమె అలక పాన్పెక్కింది .మరి నిప్పురాజేయ్యాలికడా వెంటనే నరసిమ్మ సామికి ఆమెఅలక గురించి చెప్పాడు ఆయన ఆఘ మేఘాల మీద ప్రయాణం అవటం తో నాలుగో ఆశ్వాసం పూర్తీ .

చివరిదైన పంచమాశ్వాసం లో హరి వైకుంఠ పురి ప్రవేశం తో ప్రారంభ మౌతుంది .హుషారు సీనుల్లేవక్కడ .లచ్చిని చెంచు లచ్చిమగడు అనునయించే ప్రయత్నం  చేస్తూతూనంది తిమ్మన గారి పారిజాతాపహరణం లోని ‘’నను భవ దీయ దాసుని ‘’పద్యం ధోరణిలో  ఎత్తుకొని ఓదారుస్తాడు .ఇద్దరి మధ్యా సంవాదం వస్తుంది .మళ్ళీ తిమ్మన గారి పద్యం ‘’ఏమేమీ కలహాశానుండి చటికై  యేతెంచి  ‘’తో మొదలెట్టి కవిగారు సొంతంగా రాశారు .కన్నులు అలసిఉన్నాయేమని అడిగితె జింక కన్నుల కోసం వేటాడి అలశానంటాడు .గంట్లు గాట్లు ఏమిటంటే పొదరింటి తుమ్మెద కుట్టిందని ఉరమున కుంకుమ ఏమిటి అంటే ఏనుగుల్ని పట్టినప్పుడు కారిన రక్తమని ,గంధ పరిమళం ఏమిటి అంటే హంసల్ని పట్టేటప్పుడు అంటిన పుప్పొడి అని చక్కగా బొంకుల గోడ కట్టేశాడు .

ఇంతలో నరహరిని వెతుక్కుంటూ చెంచు లక్ష్మి ఇక్కడికే వచ్చింది .సవతుల మధ్య వాదోపవాదాలు సమర్ధం గా నిర్వహించారు కవి .పానకం లో పుడక లాగా వచ్చావా అని లక్ష్మి అంటే మగని బతుకు పానకమైతే నే  తానూ బెల్లం అంటుంది చెంచు లక్ష్మి .ఆమెను గొగ్గుల  ఖర్జూర పండు అంటే ,’’సామి బతుకు మంట నదెల్ల సల్ల బరప –అడవి ఖర్జూరమైతి- అరవ బోకే ‘’అని చెంచిత .’’శ్రీశుడనేటి మేల్ పండు నారింజ గోరి –నక్క వలే వచ్చితే చెంచులక్క నీవు ‘అని అంటే ‘’అవును నారింజ ఈ సామి -అపుడు నాకు –అక్క !పెద నక్కవే నేను నక్కనైన ‘’అని మాటకు మాట అంటించి నోరు మూయిస్తుంది అడవిజాణ .అపుడు నరసింహుడు ఇద్దరి వాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ‘’మిగుల వాచాల లైతిరి –ఓరినాయనో మద్దెల మోత తొడ మొద్దు బారే నాదు బుద్ధి యంత ‘’అని చెంపలేసుకొన్నాడు .చివరికి ఆది లక్ష్మికి చెంచులక్ష్మి పూర్వ జన్మ కద అంతా వివరిస్తాడు .తనమామ గారైన సముద్రుని వర్ణన తో ప్రారంభిస్తాడు ఇక్కడ కవి గారు చమత్కారం తో ప్రతిగీత  పద్యాన్ని ‘’నాదు మామ గారని నేనంగ  రాదు ‘’తో మొదలెట్టి రాశారు.తమ జన్మ  వృత్తాంతాన్ని వివరించారు.ఆమె విచారించింది .అప్పుడు ధర్మ ప్రబోధం చేశాడు .అన్నికాలాలకు ఉపయోగపడేవే అవి .పంతాలు పట్టింపులు దాంపత్యానికి చేటు కలిగిస్తాయని ,ఇద్దరికీ సహనమే భూషణం అని హితవు చెప్పాడు .చెల్లీ అని చెంచీతను సంబోధించి అక్కున చేర్చింది .’’ప్రేమకు కొత్త భాష్యమును విస్తృత రీతి ని ‘’తెలిపాడు భర్త అని ఆనందాన్ని వెలి బుచ్చింది .’’నువ్వే నేను ‘’అని తెలిసి ఆనందం కలిగిందని చెంచులక్ష్మికి చెప్పింది .ఆమె కూడా కృతజ్ఞతలు చెప్పింది –

‘’ఇందాక కినుక తో నే –నేమోదో కూసి యుంటినే –సెమియించే –డెందం లో దయ ఉంచవే  -ఉందామె ఒక్క టౌచు ఊరే పొగడన్ ‘’అని సహజ శైలిలో అన్నది .నరసింహుడు ఆనందం తో మళ్ళీ ఉపదేశం అనే క్లాస్ తీసుకున్నాడు

‘’రాగ మటన్న గేవల నిరంతర దంపతి భావ దేహ సం –యోగము కాదు అద్ది యొక యోగమే శాస్త్ర మనామయైక శో- భా గరిమంబు గూర్చ గల భాగ్యమే ‘’అని చెప్పి ’’అరవై మూడు అంకె ఎలా ఉంటుందో పరస్పరాభి  ముఖం గా  సౌఖ్య సంపదలతో  నిరంతరం మునిగి తేలాలని బోధించాడు .దీనినే కవిగారు ‘’దాంపత్యోపనిషత్ ‘’అన్నారు .ఈ ప్రబంధం చదివిన వారికి దాంపత్య ప్రభ ,ధర్మ జీవనం , ఆనంద ముక్తి ప్రభ కలుగుతాయి అని ఫల శృతి తో ప్రబంధాన్ని ముగించారు రస మడుగైన రామడుగు వెంకటేశ్వర శర్మ గారు .’వందేళ్ళ తర్వాత ఆంద్ర దేశం లో ’నది ‘’మాస పత్రిక ఈ ప్రబంధ రచనా శ్రోతస్విని ఇంతటితో ఇంకిపోకుండా  ఈ సుకవితా ప్రబంధ ప్రవాహం  ఇక ముందూ ప్రవహిస్తూనే ఉండాలని కోరు కొందాం .రసమడుగైన రామడుగు వారి నుండి మరింత స్పూర్తిదాయక రచనలు వెలువడాలని ఆశిద్దాం ..

ప్రబంధం లో ఉండాల్సిన సూర్యోదయ చంద్రోదయ వర్ణనలు ఇందులో లేవు .ఋతు వర్ణనలూ లేవు .అయితే అన్నీ అన్నీ  ఉండాల్సిన అవసరం లేదేమో ? ‘’మినీ ప్రబంధం’’ అనచ్చేమో .చిన్న చిక్కని చక్కని ప్రబంధం  శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం .శర్మ గారి పాండిత్య ప్రకర్షకు నిదర్శనం .ఈ ప్రబంధానికి ఆశీర్వాదం పలికారు  కుర్తాళం పీఠాధిపతి (కులపతిగారు )శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి వారు .పద్య ప్రియులకు హృద్యమైన ప్రబంధం అని ముదిగొండ శివ ప్రసాద్ గారు ,ఆంద్ర భారతి సిగలో మరో మల్లె పూదండ అన్నారు గరిక పాటి వారు .ఇదొక మధూదయ ముహూర్తం అని రసరాజు గారు,యువతకు భారతీయ దాంపత్య వైశిస్ట్యాన్ని ఉపదేశాత్మకం గా అందించారని మేరిక పూడి సీతా పతిరావు గారు ,నవీన సురుచిర ప్రబంధం అని మాల్యాద్రిగారు ,చెంచుల ప్రాకృతిక జీవనాన్ని రంగ రించు కొన్న సుకుమార మనోహర కావ్యం అని సన్నిధానం వారు ,అభినవ ధూర్జటి అని మెచ్చు కొన్నారు .శర్మ గారి శ్రీహరి నుతితో సమాప్తి చెబుతున్నాను .

‘’పారా వార గబీర భావ జగతీ భారాపహా ,దీపిత –క్షీరాంబోధి  విషాహి శేష శయనా ,శ్రీ చెంచు లక్ష్మీ హృద –

బ్జారామా నట దద్భుతాళి చరితా ,ఆనంద తేజా ,రుచి –స్మేరాలోకన దివ్య మూర్తి ,నృహరీ శ్రీ వత్స చిహ్నాంచితా ‘’

సమాప్తం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.