తబస్తీ వెలుగులు – 5

రచన: ఆర్వీ రామారావుహైదరాబాద్‌లోని మక్కా మసీదు కొలను అంచున రెండు రాళ్లతో కూడిన బెంచీల లాంటివి ఉన్నాయి. సందర్శకులు ఆ రాళ్ల మీద కూర్చుని సేద దీరుతుంటారు. అక్కడ కూర్చున్న వారు మళ్లీ హైదరాబాద్ సందర్శిస్తారన్నది స్థల పురాణంలో భాగం. ఆ మాట ఎలా ఉన్నా హైదరాబాద్‌తో సంబంధం ఏర్పడిన వారు ఈ నగరాన్ని మరిచి పోవడం మాత్రం కష్టం అన్నది మాత్రం వాస్తవం. విడిచిపోరు అన్నది అంతకన్నా ఎక్కువ వాస్తవం. చాలా మంది ఇతరేతర ప్రయోజనాల కోసం ఈ నగరాన్ని విడవకుండా ఉంటే మరి కొందరు ఇక్కడి సంస్కృతికి ముగ్ధులై పోతారు. ఇంకొందరు ఈ నగర సంస్కృతికి దోహదం చేస్తుంటారు.శాస్త్రీయ గాయకుడైన పద్మభూషణ్ పండిత్ జస్రాజ్‌కు హైదరాబాద్‌తో అలాంటి బంధమే ఉంది. జస్రాజ్ హర్యానాలోని హిస్సార్‌లో జన్మించారు. కాని గత 42 ఏళ్ల నుంచి ప్రతి నవంబర్ 29 నుంచి డిసెంబర్ ఒకటి దాకా ఇక్కడ సంగీత సమారోహం నిర్వహిస్తున్నారు. జస్రాజ్‌కు నాలుగేళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి మోతీ రాం ఈ నగరంలోనే 1934లో తుది శ్వాస విడిచారు. 1934 నవంబర్ 30న పండిత్ మోతీ రాంను హైదరాబాద్ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నియమించాల్సి ఉండింది. ఆ పని జరగడానికి అయిదు గంటల ముందు పండిత్ మోతీ రాం అంతిమ శ్వాస విడిచారు. మహారాజా కిషన్ ప్రసాద్ పండిత్ మోతీ రాంను చౌమొహల్లా పాలెస్‌కు తీసుకెళ్లాల్సింది. అక్కడ ఆయన సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. కానీ మోతీ రాం స్వర్గస్థులైనందువల్ల ఆ కచేరీ జరగనే లేదు.పండిత్ మోతీ రాం సమాధి హైదరాబాద్‌లోనే ఉంది. పుత్లీ బౌలీ చౌరస్తా నుంచి గౌలీగుడా వెళ్లే దారిని పండిత్ మోతీరాం మార్గ్ అంటారు. ఆ రోడ్డులోనే ధరం సంగీత్ శ్రింగార్ అనే సంగీత వాద్యాలు విక్రయించే దుకాణం ఉండడం యాదృచ్ఛికమే కావచ్చు. పండిత్ మోతీ రాం ఈ నగరంలో మృతి చెందినందువల్ల, బాల్యంలో పండిత్ జస్రాజ్ ఇక్కడ కొంత కాలం ఉన్నందువల్ల జస్రాజ్‌కు హైదరాబాద్ మీద వల్ల మాలిన అభిమానం. తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సంగీత సమ్మేళనం నిర్వహించి మోతీ రాంకు నివాళి అర్పిస్తుంటారు. 1972లో ప్రారంభమైన ఈ సంగీత సమారోహాలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీత కారులు, గాయకులు ఈ సంగీత సమ్మేళనంలో పాల్గొంటూ ఉంటారు. ఈ కచేరీ హైదరాబాద్ సంస్కృతిలో అంతర్భాగమై పోయింది. పండిత్ జస్రాజ్ అన్న పండిత్ మణీరాం కూడా ప్రసిద్ధ గాయకుడే. జస్రాజ్‌కు ఆయనే గురువు. మణీరాం 1986లో మరణించారు. ఆ తర్వాతి నుంచి పండిత్ మోతీ రాం సంగీత్ సమారోహం పండిత్ మోతీరాం, పండిత్ మణీరాం సంగీత సమారోహంగా కొనసాగుతూనే ఉంది.నిధుల కొరత ఉన్నా నిరంతరాయంగా నాలుగు దశాబ్దాలకు పైబడి ఈ సమారోహం నిర్వహించడం మాటలు కాదు. ఇది హైదరాబాద్ సంస్కృతి గొప్పతనమేనేమో. జస్రాజ్ గురు శిష్య పరంపరను కొనసాగించడమే కాకుండా అనేక మంది సంగీతకారులకు ఊపిరులూదిన కళా తపస్వి. ఈ ఉత్సవాలను 2009 నుంచి చౌమొహల్లా పాలెస్‌లో నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఇవి భారతీయ విద్యా భవన్, సీఐఈఎఫ్‌ఎల్, నిజాం కాలేజి లాంటి చోట్ల నిర్వహించారు. ఎక్కడ నిర్వహించినా ప్రవేశం ఉచితం. చలి ఎక్కువగా ఉండే నవంబర్ ఆఖరులో సైతం హిందుస్తానీ సంగీత ప్రియులు ఈ ఉత్సవాలకు హాజరై గానామృతాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు.పండిత్ మోతీ రాం, పండిత్ మణీరాం ప్రసిద్ధ గాయకులే కాదు అపురూపమైన సంగీత దర్శకులు కూడా. ఈ ఉత్సవాలలో హైదరాబాద్‌లోని హిందుస్తానీ సంగీత ప్రియులు ప్రఖ్యాత గాయకుల, వాద్యకారుల, సంగీత విద్వాంసుల కళాభినివేశాన్ని చవి చూసే అవకాశం కలుగుతోంది. అనంద్ శర్మ, అంకిత సర్సుంకర్, రతన్ మోహన్ శర్మ, సంజీవ్ అభయంకర్, మాండోలిన్ శ్రీనివాస్‌లాంటి వారి కచేరీలు చూసే అరుదైన అవకాశం పండిత్ జస్రాజ్ దీక్ష వల్ల సాధ్యమవుతోంది. హరిప్రసాద్ చౌరాసియా, సెల్వ గణేశ్, కేలూ చరన్ మహాపాత్ర సంతానమైన రతీకాంత్ మహాపాత్ర, సుజాత లాంటి వారి ఒడిస్సీ నృత్యాన్ని చూసే అవకాశం కూడా కలుగుతోంది. జస్రాజ్ గానామృతం ఎటూ ఉంటుంది. జస్రాజ్ వినూత్నమైన జుగల్బందీ రూపొందించారు. ఆడ, మగ గాయకులు భిన్నమైన రాగాలలో పాడే ఈ జుగల్బందీని జస్రంగీ జుగల్బందీ అంటారు. జస్రాజ్ శిష్య గణంలో రతన్ మోహన్ శర్మ, సంజీవ్ అభయంకర్, రమేశ్ నారాయణ్, సుమన్ ఘోష్, తృప్తీ ముఖర్జీ, ప్రీతం భట్టాచార్జీ, కళా రాం నాథ్, సాధన సర్గం వంటి ఉద్ధండులు ఉన్నారు. వీరంతా ఏదో ఒక సందర్బంలో హైదరాబాద్‌లో తమ కళా కౌశలాన్ని ఆవిష్కరించిన వారే.
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D